ప్రసార ప్రముఖులు/మరికొందరి జీవిత రేఖలు

ప్రభుత్వ మహిళా సంక్షేమశాఖలో ఒక దశాబ్దానికిపైగా పని చేశారు. 75 నుండి 91 వరకు జానకీరాణి ప్రొడ్యూసర్ గా పని చేశారు. 91 92లో అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టరుగా పదోన్నతి పొందారు. జానకీరాణి రూపొందించిన రూపకం 89లో జాతీయస్థాయిలో బహుమతి పొందింది. నవలా రచయత , కథా రచయత రూపక రచయత అయిన జానకీరాణి గృహలక్ష్మి ‘స్వర్ణ’ కంకణ బహూకృతిగా పొందారు. అనేక విశిష్ట సన్మానాలు స్వీకరించారు.

డైరెక్టర్లుగా పని చేసిన కొందరి జీవిత రేఖలు

సి.రాజగోపాల్:

1941 జూన్ 3న జన్మించారు. M A:B.L; పట్టా పొందారు. ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా హైదరాబాదు లో చేరారు. ASDగా 1982లో UPSC ద్వారా నియుక్తులై అదిలాబాదు, విశాఖపట్టణాలలో పనిచేసారు. 1987లో డైరెక్టరుగా మంగళూరు కేంద్రంలో పని చేసి అక్కడ నుండి నాలుగేళ్ళు ధార్వాడలో డైరెక్టరుగా వ్యవహరించారు. 1992లో బొంబాయిలోని Central Sales యూనిట్ డైరెక్టరుగా పదవీ భాధ్యతలు స్వీకరించారు.

M.N. రావు:

నిత్యానందరావుగారు ఏలూరు వాస్తవ్యులు. 1936 జూన్ 18న జన్మించారు. M.A ఎకనామిక్స్ లో పట్టా పొంది ప్రభుత్వకళాశాలల్లో లెక్చరర్ గా పనిచేసారు. 1983లో UPSC ద్వారా అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టరుగా నేరుగా త్రివేండ్రంలో చేరారు. అక్కడ నుండి 1984 లో హైదరాబాదు కేంద్రానికి బదిలీ అయ్యారు. డైరెక్టరుగా నిజామాబాదు కేంద్రంలో పనిచేసి 1994 జూన్ లో పదవీ విరమణ చేసారు.

కబీర్ అహమ్మద్ :

కబీర్ అహమ్మద్ హైదరాబాదులో 1940 జులై 30న జన్మించారు. ఎం.ఏ పట్టబద్రులు. 1967లో జాతీయస్థాయిలో జరిగిన పోటీలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్ లిస్టులో దేశంలో మొట్టమొదటి స్థానం సంపాదించారు. ఆ తరువాత ప్రొడ్యూసర్ గా దూరదర్శన్ లో పనిచేశారు. 1982 లో అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. కొత్తగూడెం, CBS హైదరాబాదు తదితర ప్రాంతాలలో పనిచేశారు. శ్రీనగర్ రేడియో కేంద్ర డైరక్టర్ గా 1994లో నియుక్తులయ్యారు. ఉర్దూలోను, ఆంగ్లంలోను చక్కటి ప్రవేశం ఉంది. వీరు 1996 నవంబరులో హైదరాబాదు కేంద్రం డైరక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

P. గోవర్ధన్ :

1940 మార్చి 9న జన్మించారు. ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా 1963లో ఆకాశవాణిలో చేరారు. 1986లో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్ అయ్యారు. ప్రొగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా మదరాసు, హైదరాబాదు, గ్యాంగ్‌టాక్‌లలో పనిచేశారు. కొత్తగూడెం కేంద్రంలో, కర్నూలు కేంద్రంలో ASDగా పనిచేశారు. 1998 లో డైరక్టర్‌గా ప్రమోట్ అయి కర్నూలులోనే పనిచేశారు. 1995లో హైదరాబాద్ వివిధ భారతి కేంద్ర డైరక్టర్ గా పదవీబాధ్యతలు స్వీకరించారు.

శంకరమంచి సత్యం :

S. సత్యనారాయణరావు గుంటూరుజిల్ల అమరావతిలో జన్మించారు. బి. ఏ. బి. యల్, పట్టాపుచ్చుకొన్నారు. ఆకాశవాణిలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా చేరి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా విజయవాడలో పనిచేశారు. అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్ గా 1978లో బొంబాయి వెళ్ళారు. అక్కడ నుండి డైరక్టర్‌గా రాజస్థాన్‌లోని ఉదయపూర్ లో నాలుగేళ్ళు పనిచేశారు. 1988 లో ఢిల్లీలోని విదేశీ ప్రసార విభాగంలో చేరారు. అదే సంవత్సరం అనారోగ్యంతో ఆయన ఢిల్లీలో మరణించారు. సత్యం శంకరమంచి "అమరావతి కథలు" కథాసంపుటి బహుళజనామోదం పొందింది. ఆంధ్రజ్యోతి వారపత్రికలో ధారావాహికగా వెలువడి కేంద్రసాహిత్య అకాడమీ బహుమతిపొందింది. ఢిల్లీ దూరదర్శన్ నేషనల్ ఛానల్‌లో ఆ కథలు ప్రసారమయ్యాయి. అమరావతి పరిసరాల వాతావరణాన్ని ఆయన చక్కగా శబ్దచిత్రంలో చూపారు. ఆయన విజయవాడ నుండి ప్రసారం చేసిన హరోంహరహర ఇతర నాటకాలు శ్రోతల మన్ననలు పొందాయి.

అహమ్మద్ జలీస్ :

జలీస్ 1939 అక్టోబరు 21న హైదరాబాదు నగరంలో జన్మించారు. 1975లో UPSC ద్వారా ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా చేరి మంచి కార్యక్రమ రూపకల్పనలో పేరుతెచ్చుకొన్నారు. హైదరాబాదు 'నయీరంగ్‌' ఉర్దూ కార్యక్రమంలో వెయ్యికార్యక్రమాలు ధారావాహిక ప్రసారం చేసి శ్రోతల మెప్పుపొందారు. రేడియో కాశ్మీర్‌లో పనిచేశారు. 89-91 లో బెంగుళూరు CBSలో ASDగా చేశారు. కడప కేంద్రంలో 91-93 మధ్యకాలంలో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్ గా చేశారు. 1993 మార్చిలో డిప్యూటీ డైరక్టర్‌గా బెంగుళూరు దూరదర్శన్ కేంద్రంలో చేరారు. దురదృష్టవశాత్తు హృద్రోగంతో 1996 మే 10న బెంగుళూరులో కన్నుమూశారు.

డా. కె. బి. గోపాలం :

గోపాలాచార్యులు 1956 జూన్ 15న తెలంగాణాలో జన్మించారు. యం. యస్. సి. పట్టభద్రులై, పి. హెచ్. డి. పట్టా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పొందారు. ప్రైవేట్ కళాశాలల్లో కొంతకాలం సైన్స్ లెక్చరర్‌గా పనిచేశారు. 1986 జనవరిలో ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో సైన్స్ ఆఫీసర్‌గా చేరారు. శాస్త్రీయ కార్యక్రమాల రూపకల్పనలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. హైదరాబాదులో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా పనిచేశారు. 1993 జూన్ 15న స్టేషన్ డైరక్టర్‌గా అదిలాబాద్ కేంద్రానికి బదిలీ అయ్యారు. సైన్సు వింతలు - విశేషాలు తెలియజేస్తూ అనేక వ్యాసాలు వివిధ పత్రికలలో వ్రాశారు. అనేక గ్రంథాలు ప్రచురించారు. సులభంగా పాఠకులకు సైన్సు విశేషాలు తెలియచేయడం ఆయన ప్రత్యేకత.

డి. ప్రసాదరావు :

ప్రసాదరావు 1951 ఆగస్టు 14న విజయవాడలో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం. ఏ. పట్టభద్రులయ్యారు. 1978లో ఆకాశవాణి కడప కేంద్రంలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా చేరారు. UPSC ద్వారా ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ అయి జగదల్ పూర్, హైదరాబాదు కేంద్రాలలో పనిచేశారు. 1991 లో UPSC ద్వారా స్టేషన్ డైరక్టర్‌గా సెలక్టుఅయి జగదల్ పూర్ కేంద్ర అధిపతి అయ్యారు. అక్కడనుండి 1993 లో విశాఖపట్టణ కేంద్రానికి బదిలీఅయ్యారు. బహుళజనామోదం పొందే కార్యక్రమాల రూపకల్పనలో ప్రసాదరావు సిద్ధహస్తులు.

ప్రసార రథం లాగుతున్న యువత

హైదరాబాదు కేంద్రంలో కార్యక్రమ నిర్వాహకులుగా పనిచేస్తూ సాహిత్య సాంస్కృతిక రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులు ఎందరో కీర్తి ప్రతిష్ఠలు గడించారు. ఆకాశవాణిలో పనిచేసే సదవకాశం వారి ప్రతిభను చాటుకొనేందుకు అవకాశాలు కల్పించింది.

పి. మధుసూదనరావు :

1950 డిసెంబర్ 10 న మధుసూదనరావు తెలంగాణాలోని వరంగల్ జిల్లాలో జన్మించారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం. ఏ. చేశారు. కొమర్రాజు లక్ష్మణరావు రచనలపై పరిశోధన చేసి పి. హెచ్‌డి. పట్టా పొందారు. ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా చేరి, ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా హైదరాబాదు, మదరాసు కేంద్రాలలో పనిచేశారు. 1992లో వరంగల్ కేంద్రానికి అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా వెళ్లారు. రాష్ట్రప్రభుత్వ నంది అవార్డుల కమిటీలో మదుసూదనరావు 94 సం.లో సభ్యులుగా వ్యవహరించారు.

P. S. గోపాలకృష్ణ :

పాతాళభేది గోపాలకృష్ణ 1949 జూలై 1న తిరుపతిలో జన్మించారు. M. A. పట్టభద్రులై మదరాసులో పత్రికలలో పనిచేసి ఆకాశవాణిలో 1977లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా మదరాసులో చేరారు. మదరాసు, హైదరాబాదు కేంద్రాలలో పని చేశారు. మైసూరు విశ్వవిద్యాలయం నుండి పి. హెచ్‌డి. పొందారు. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రాంతీయ కార్యదర్శిగా మదరాసు, ఢిల్లీలలో 1983-85 మధ్య కాలంలో పనిచేశారు. A. S. D. గా విజయవాడ, మదరాసు, హైదరాబాదు కేంద్రాలలో 1992 నుండి అనుభవం గడించారు. గోపాలకృష్ణ మంచి విమర్శకుడు, రచయిత.

రమణ :

వెంకటరమణ గుంటూరుజిల్లా నరసారావుపేటలో 1941 జూన్ 27న జన్మించారు ఎం. ఏ. పట్టభద్రులై ఆకాశవాణిలో 1968 జూలైలో చేరారు. విజయవాడ కేద్రంలో పనిచేసి మదరాసు బదలీ అయ్యారు. 1977లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా యువవాణి కార్యక్రమాలను విజయవాడ కేంద్రంలో రసవత్తరంగా నిర్వహించారు. హైదరాబాద్ బదలీ అయి 1993లో అసిస్టెంట్ డైరక్టర్‌ అయ్యారు. 1995లో బెంగుళూరు దూరదర్శన్‌కు బదలీ అయ్యారు.

S. రమామోహనరావు :

రమామోహనరావు 1941 నవంబరు 10న జన్మించారు. 1967 నుండి ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా బెంగుళూరు, విజయవాడ, మదరాసు, కంద్రాలలో పనిచేసి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ (1976) అయ్యారు. ఆయన స్వయంగా మృదంగ విద్వాంసులు. అసిస్టెంట్ స్టేషన డైరక్టర్‌గా పదోన్నతి పొంది తిరువనంతపురం, బెంగుళూరు కేంద్రాలలో పనిచేశారు.

N. C. నరసింహాచార్యులు :

నల్లాన్ చక్రవర్తుల వంశంలో 1947 జనవరి 2న కృష్ణాజిల్లాలో జన్మించారు. ఎం. ఏ. తెలుగు పట్టభద్రులయ్యారు. 1967 నవంబర్ లో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా విజయవాడలో చేరారు. 1979లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా పదోన్నతి పొంది కడప, హైదరాబాద్ కేంద్రాలలో పనిచేశారు. 1993లో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా పదోన్నతి పొంది మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో పనిచేశారు. 1996లో కొత్తఢిల్లీలోని ఆకాశవాణి కేంద్రానికి బదిలీ అయ్యారు. కోఆర్డినేషన్‌లో నరసింహాచార్యులు సిద్దహస్తులు.

బి. జి. యస్. రావ్ :

బందకవి గిరిజా శంకరరావు గోదావరి జిల్లాలో 1945 జూన్ 23న జన్మించారు. ఎం. ఏ. పట్టభద్రులై ఆకాశవాణిలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా 1967 సెప్టెంబరులో చేరారు. కడప, లే,జమ్ము, హైదరాబాదు కేంద్రాలలో 1976 నుండి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. 1993 లో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా హైదరాబాద్ కేంద్రంలో పదోన్నతి పొందారు. ఆంగ్లంలో డెక్కన్ క్రానికల్‌లో చాలా వ్యాసాలు వ్రాశారు. డైరక్టరేట్‌లో పనిచేస్తున్న బి. ఆర్. పంతులు వీరికి సన్నిహిత బంధువులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సీనియర్ ఐ. ఏ. యస్. అధికారి బి. వి. రామారావు వీరి అగ్రజులు.

చల్లా ప్రసాదరావు :

ప్రసాదరావు కృష్ణాజిల్లాలో 1937 ఆగస్టు 19న జనించారు. విజయవాడ కేంద్రంలో ప్రోగ్రాం సెక్రటరీగా 1957లో చేరారు. క్రమంగా ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్ అయి 1976లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ అయ్యారు. హైదరాబాదు కేంద్రంలో A. S. D. గా రెండేళ్ళు పనిచేసి 1995 ఆగస్టులో పదవీ విరమణచేశారు.

E. L. నారాయణ :

లక్ష్మీనారాయణ కృష్ణాజిల్లాలో జన్మించారు. వ్యవసాయ పట్టభద్రులై రాష్ట్రప్రభుత్వ వ్యవసాయశాఖలో డిమాన్‌స్ట్రేటర్‌గా పనిచేశారు. 1975 లో ఆకాశవాణి కడప కేంద్రంలో వ్యవసాయ విభాగంలో రిపోర్టర్‌గా చేరారు. 1980 లో ఫారమ్‌రేడియో ఆఫీసర్ అయ్యారు. 1984లో హైదరాబాద్ బదిలీ అయ్యారు. వ్యవసాయ కార్యక్రమ రూపకల్పనలో నేర్పరి. 1993లో అసిస్టెంట్ స్టేషన డైరక్టర్ గా హైదరాబాదులో పదోన్నతి పొందారు. మరో అసిస్టెంట్ డైరక్టర్ K. మల్లికార్జునశర్మ చక్కని రచయిత.

Y. రాఘవులు :

రాఘవులు చక్కటి గాత్రం గల నటుడు. పౌరాణిక పాత్రలలో నటించాడు. కొంతకాలం రాష్ట్ర మంత్రి శ్రీ టి. వి. రాఘవులు వద్ద పి. ఏ. గా పనిచేశారు. ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో చేరారు. 1983 లో ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో నాటక విభాగం ప్రొడ్యూసర్‌గా చేరారు. నిజామాబాదులో కొంతకాలం పని చేశారు. 1993లో కొత్తగూడెం కేంద్రానికి అసిస్టెంట్ స్టేషన డైరక్టర్‌గా పదోన్నతిపై వెళ్ళారు.

యం. జనార్దనరావు :

1945 అక్టోబరు 10న జనార్దనరావు కాళహస్తిలో జన్మించారు. పట్టభద్రులై ఆకాశవాణిలో 1968 డిసెంబరులో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా చేరారు. 1979లో పదోన్నతిపై ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా దూరదర్శన్ హైదరాబాదు కేంద్రంలో చేరారు. 1993లో పదోన్నతిపై అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా అక్కడే చేరారు.

శ్రీమతి ప్రయాగ వేదవతి :

ప్రయాగ నరసింహశాస్త్రిగారి కుమార్తె వేదవతి. వేదవతి 1951 మే 5న మదరాసులో జన్మించారు. ఎం. ఏ. తెలుగు, ఆంగ్లంలో పట్టభద్రులు. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో ప్రొడ్యూసర్‌గా చేరారు (1971లో). U. P. S. C. ద్వారా ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ అయి విశాఖపట్టణం; విజయవాడ కేంద్రాలలో 1980 నుండి పనిచేస్తున్నారు. 1993లో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా పదోన్నతి పొందారు. వీరు 1996 నుండి నిజామాబాద్‌లో అసిస్టెంట్ డైరక్టరుగా వ్యవహరిస్తున్నారు.

M.S.S. ప్రసాద్ :

మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గుంటూరు జిల్లా రేపల్లెలో 1954 ఆగస్టు 20న జన్మించారు. ఎం. ఏ. పట్టభద్రులయి 1975 ఆగస్టులో U. P. S. C. ద్వారా ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ అయి విశాఖపట్టణం, కడప కేంద్రాలలో పనిచేశారు. వయొలిన్ వాద్యంలో శివప్రసాద్ ప్రావీణ్యం సంపాదించారు. 1993లో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా పదోన్నతి పొంది విజయవాడ బదిలీ అయ్యారు.

K. V. హనుమంతరావు :

జానపద సంగీత ప్రయోక్తగా హనుమంతరావు కీర్తి గడించారు. హైదరాబాదు, విజయవాడ కేంద్రాలలో జానపద సంగీత ప్రయోక్తగా ఒక దశాబ్దిపైగా పని చేశారు. 1984లో వీరు రూపొందించిన 'లయ', కృష్ణవేణి రూపకం (85) జాతీయ స్థాయిలో బహుమతి పొందారు.

1984లో వీరి లయ హోసబ క ఫౌండేషన్ జర్మనీవారి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. హనుమంతరావు మార్కాపురం కేంద్రం అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా 94-96 మధ్య పనిచేశారు. 96లో దూరదర్శన్ ఇంఫాల్ కేంద్రానికి బదిలీ అయ్యారు. కృష్ణవేణి, శ్రమఏవ జయతే రూపకాలు కూడా జాతీయ బహుమతులు పొందాయి.

ప్రహరాజు పాండురంగారావు :

పాండురంగారావు 1940 జూన్‌లో నరసాపురంలో జనిమించారు. ప్రోగ్రాం సెక్రటరీగా ఆకాశవాణిలోచేరి ట్రాన్సిమిషన్ ఎగ్జిక్యూటివ్‌గా విజయవాడ కేంద్రంలో నాటక విభాగంలో పనిచేశారు. పాండుగారు నటుడుగా హాస్యవల్లరి కార్యక్రమాలు రూపొందించడంలో సిద్దహస్తులు. పాండురంగారావు సమర్పించిన నీలినీడలు 1980లో జాతీయ బహుమతి పొందింది. పాండురంగారావు 94 నుండి నిజామాబాద్ ఆకాశవాణిలో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా పని చేస్తున్నారు.

Y. హనుమంతరావు :

హనుమంతరావు 1938 ఫిబ్రవరిలో కృష్ణాజిల్లాలో జన్మించారు. వ్యవసాయ శాస్త్రంలో బాపట్ల కళాశాలలో పట్టభద్రులై రాష్ట్ర వ్యవసాయశాఖలో పది సంవత్సరాలు డిమాన్‌స్ట్రేటర్ గా పని చేశారు. 1970 ప్రాంతాలలో ఫారం రేడియో రిపోర్టర్‌గా చేరి తర్వాత ఫారం రేడియో ఆఫీసర్‌గా రెండు దశాబ్దాలు విజయవాడ కేంద్రంలో పని చేశారు. మధ్యలో ఆదిలాబాదు, మార్కాపురంలలో కొంతకాలం పనిచేశారు. 1992లో మార్కాపురం కేంద్రం ప్రారంభమయినపుడు తొలి అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా రెండేళ్ళు పనిచేశారు. అక్కడినుండి 94 నుండి 96 ఫిబ్రవరి వరకు విజయవాడలో పనిచేసి 96 ఫిబ్రవరిలో పదవీ విరమణ చేశారు. ఈనాడు టి. వి. అన్నదాత కార్యక్రమాల ప్రయోక్తగా హైదరాబాద్‌లో చేరారు. హనుమంతరావు కౌలాలంపూర్ సందర్శించారు. వీరు రూపొందించిన మధుర క్షణాలు, కాంతిరేఖలు రూపకాలు జాతీయస్థాయి బహుమతి పొందాయి.

డా. పుట్టపర్తి నాగపద్మిని :

సుప్రసిద్ద కవి డా|| పుట్టపర్తి నారాయణచార్యుల పుత్రిక నాగపద్మిని. కడపలో 1953 ఆగస్టు 2న జన్మించారు. ఆకాశవాణి కడపలో 1978లో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా చేరి వివాహానంతరం హైదరాబాదు కేంద్రానికి బదలీ అయి వెళ్ళారు.1988లో UPSC ద్వారా ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. జానపద వాఙ్మయంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి Ph.D. పొందారు. అనేక వ్యాసాలు, కవితలు, రూపకాలు ప్రచురించారు. మూడు గ్రంథాలు ప్రచురించారు. నారాయణాచార్యుల శివతాండవ రూపకాన్ని ప్రసారం చేసి 1993లో జాతీయ స్థాయిలో బహుమతి పొందారు.

జీడిగుంట రామచంద్రమూర్తి :

కథకుడుగా, సినీ రచయితగా పేరుపొందిన జీడిగుంట రామచంద్రమూర్తి 1970లో హైదరాబాదు కేంద్రంలో రచయితగా చేరారు. చాలాకాలం కుటుంబ సంక్షేమ విభాగానికి అనుబంధంగా పనిచేశారు. 1988లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా కడపలో ఒక సంవత్సరంపైగా పనిచేసి 1989లో హైదరాబాదు బదలీ అయ్యారు. 1991 నుండి 6 సంవత్సరాలు నాటక విభాగాన్ని నిర్వహిస్తూ చక్కటి నాటకాలు రూపొందించారు. నవలా రచయితగా జీడిగుంట ప్రసిద్ధులు. చక్కటి వ్యాఖ్యాత.

సుధామ :

అల్లంరాజు వెంకటరావు 1951 నవంబరు 25న జన్మించారు. చిన్నతనం నుండి (1966 నుండి) బాలబంధులో రచనలు ప్రచురించారు. కార్టూన్ చిత్రకారుడుగా ప్రసిద్ధుడు. యువభారతి సాహితీ సంస్థద్వారా సేవలు చేశారు. 80-81 ,అధ్యకాలంలో తెలుగు అభ్యుదయ కవిత్వంలో భావవీచికలు M. Phil పట్టాకోసం సమర్పించారు. 1983లో ఆకాశవాణి జాతీయ కవి సమ్మేళనంలో తెలుగుకవిగా పాల్గొనడం విశేషం. 1978లో ఆకాశవాణిలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా హైదరాబాదు కేంద్రంలో చేరి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా 91లో విజయవాడ బదలీ అయ్యారు. తిరిగి 95లో హైదరాబాద్ వెళ్ళారు. వీరి సతీమణి ఉషారాణి కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్. సుధామ కళాకరుడు, రచయిత, కార్టూనిస్టు. 1990 లో వీరు ప్రచురించిన అగ్నిసుధ గేయకావ్యం ప్రొద్దుటూరులో ఉమ్మిడిశెట్టి కవితా అవార్డు పొందింది. ఉషారాణి 1958 జులైలో జన్మించారు. 1951 నుండి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా విజయవాడ, హైదరాబాద్‌లలో పనిచేస్తున్నారు.

ఇంకా మంత్రవాది మహేశ్వర్, వసుమతి దంపతులు, శేషం రామానుజాచార్యులు, కలగా కృష్ణమోహన్ కృష్ణమాచారి, రావు చౌదరి, విద్యాలంకార్, అస్లం ఫర్‌షోరి, డా|| కె. విజయ, డా|| ప్రసన్న, శైలజామూర్తి, డా|| P. V. శారద, వినయమణి యింకా ఎందరెందరో ఆ యా రంగాలలో పనిచేసి ఖ్యాతి గడించారు.

అనౌన్సర్లలో డా|| పండా శమంతకమణి సాహితీ రంగంలో కృషిచేశారు. వీరు రచించిన తెలుగులో రామకథకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. జ్యోత్స్న, ఇలియాస్ అహమ్మద్, రతన్‌ప్రసాద్, చిన్నక్క' వట్టం సత్యనారాయణ, (బాలయ్య) మట్టపల్లి రావు, ఇందిరా బెనర్జీ, ఉమాపతి బాలాంజనేయశర్మ, రాజగోపాల్ రెండు దశాబ్దాలుగా చక్కటి కార్యక్రమాలు రూపొందించి శ్రోతల ప్రశంసలందుకొన్నారు.