ప్రసార ప్రముఖులు/మదరాసు కేంద్రం

నిర్వాహకుడుగా 1994లో పదవీ విరమణ చేశాడు. కార్మికులకార్యక్రమ నిర్వాహకులుగా ఈయన పేరు గడించారు. వీరిని ఆమెరికాలో సన్మానించారు. కవి, రచయిత అయిన సలాది విశాఖపట్టణంలో స్థిరపడ్డారు. ' ఆరవి ' గా పేరు పొందిన ఆచంట సూర్యనారాయణమూర్తిగా ఈ కేంద్ర డైరక్టరుగా చక్కటి కార్యక్రమాల రూపకల్పనకు నాందీ ప్రవచనం చేశారు.

ఆచంట సూర్యనారాయణమూర్తిగారు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా హైదరాబాదులో పనిచేసి అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్ గా విశాఖపట్టణం వెళ్ళారు. అక్కడే డైరక్టరుగా పనిచేశారు. తర్వాత హైదరాబాదు వాణిజ్య ప్రసార కేంద్రం డైరక్టరుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం హైదరాబాదులోని థియోసాఫికల్ సొసైటీ సంస్థ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్నారు. వీరు చక్కని రచయిత.

విశాఖపట్టణం కేంద్ర సంగీత విభాగంలో మృదంగ విద్వాంసులు శ్రీ వంకాయల నరసింహం, కొమండూరి కృష్ణమాచార్యులు, శ్రీమతి ఇందిరా కామేశ్వరరావు ప్రసిద్ధులు.

మదరాసు కేంద్రం

1927 జులై 23న బొంబాయిలో అప్పటి వైస్రాయి లార్డ్ ఇర్విన్ ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీకి చెందిన తొలి రేడియో కేంద్రాన్ని ప్రారంభించారు. గత 70 సంవత్సరాలలో రేడియోప్రసారాలు విరాట్ స్వరూపాన్ని పొందాయి. 1936లో ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ 'ఆల్ ఇండియా రేడియో ' గా నామాంతరం పొందింది. మైసూరులొ రేడియో ప్రసారాలు 'ఆకాశవాణి ' గా పేర్కొనబడేవి అదే పేరు "ఆల్ యిండియా రేడియో ' స్వీకరించింది.

ఆకాశవాణి నుండి తొలితెలుగు ప్రసారాలు మదరాసు కేంద్రం నుండి 1938 జూన్ 1 నుండి ఆరంభమయ్యాయి. తొలి తెలుగు అనౌన్సర్ మల్లంపల్లి ఉమామహేశ్వరరావు. ఆయన సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖర శర్మ సోదరులు. మదరాసు కేంద్రం సాంస్కృతిక వారదిగా వ్యవహరించేది. అప్పట్లో సుప్రసిద్దులెందరో కార్యక్రమ నిర్వాహకులుగా పనిచేశారు. సర్వశ్రీ సూరినారాయణమూర్తి, డా.అయ్యగరి వీరభద్రరావు, ఆచంట జానకీరాం, డా. బాలాంత్రపు రజనీకాంతరావు, బుచ్చిబాబు, ప్రయాగ, జలరుక్, జాషువా మొ|| "వాణి" పక్షపత్రిక మదరాసునుండి రెండు దశాబ్దాలపైగా కార్యక్రమ వివరాల పత్రికగా వెలువడింది. అ తరువాత 1972లో విజయవాడ కేంద్రానికి 'రజని'గారి హయాంలో తరలించబడింది. 1985 ప్రాంతాలలో పక్షపత్రిక 'వాణి' లాభదాయకం కాదనే కారణంతో మంత్రిత్వశాఖ మూసివేసింది. అది లేని లోటు తీరనిది.

మదరాసు 'బి' కేంద్రంనుండి తెలుగు కార్యక్రమాలు యిప్పటికీ ప్రసార మవుతున్నాయి. 1948 డిసెంబరులో, విజవాడ కేంద్ర ప్రారంభమయ్యేవరకు తెలుగు ప్రసారాలు మదరాసు నుండే ఒక దశాబ్ది వరకు కొనసాగాయి. అప్పట్లో 'LIVE' కార్యక్రమాలు ఎక్కువ ఉండేవి. నాటకాలు, సంగీత కార్యక్రమాలు అన్నీ యధాతథంగా ప్రసారమయ్యేవి. ఆ తర్వాత గ్రామపోను రికార్డులు 'కట్‌' చేసేవారు. అది శ్రమతో కూడినపని. 'స్పూల్ టేప్‌లు' వాడకం మొదలైన తర్వాత రికార్డింగులో సౌలభ్యం సమకూరింది. కార్యక్రమ నిర్వహకులు ఆర్టిస్టులకు బాగా రిహార్సల్సు యిచ్చి కార్యక్రమాన్ని రూపొందించి 'ప్రొడ్యూస్‌' చేయడానికి శ్రమపడేవారు. అవిభక్త మదరాసు రాష్ట్రంలో ఆంధ్రదేశంలో చాలా భాగం వుండటం వల్ల ప్రసారాలు చాలమంది వినేవారు. 1942-45 మధ్య కాలంలో ఢిల్లీనుండి తమిళ తెలుగు కార్యక్రమాలు దక్షిణప్రాంత వాసులకు ప్రసారమయ్యేవి.

మదరాసు కేంద్రంలో యిటీవలి దశాబ్దిలో పని చేసిన ప్రముఖులలో సర్వశ్రీ యస్. వేణుగోపాలరెడ్డి, యస్. శంకర్ నారాయణ, వి. చంద్రమౌళి, దుర్గాభాస్కర్, వింజమూరి లక్ష్మీ, గొల్లపూడి మారుతీరావు, యిలా ఎందరో చెప్పుకోదగినవారు.

S. వేణుగోపాల రెడ్డి 15-2-40న శ్రీకాళహస్తి తాలూకాలో జన్మించారు. 1963లో ట్రాnస్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా ఆకాశవాణిలో చేరి దార్వాడ్, మదరాసు కేంద్రాలలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా, అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా వ్యవహరించారు. 23-1-85న స్టేషన్ డైరక్టర్‌గా తిరుచునాపల్లి బదిలీ అయ్యారు. 1992-93 మధ్యకాలంలో మదరాసు కేంద్ర స్టేషన్ డైరక్టర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత పాండిచేరి వెళ్ళారు. అక్కడినుండి బొంబాయి కేంద్రం డైరక్టర్ అయ్యారు.

S. శంకరనారాయణ 20-2-37న జన్మించారు. సుప్రసిద్ధ చిత్రకారులు, సంగీత దర్శకులు 'బాపు' వీరి సోదరులు. శంకర నారాయణ ట్రాన్స్‌మిషన్ ఎగ్జి క్యూటివ్‌గా 1963 జనవరిలో విశాఖపట్టణం, మదరాసు కేంద్రాలలో పని చేశారు. 1981 నుండి ప్రోగ్రాం ఎగ్జికూటివ్‌గా వివిధ కేంద్రాలలో పనిచేశారు. అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా, గుల్బర్గా కేంద్రంలో పనిచేసి 1995 ఫిబ్రవరిలో రిటైరయ్యారు. శంకర నారాయణ చక్కటి చిత్రకారులు, సౌమ్యులు.

వి. చంద్రమౌళి 1931 ఆగస్టు 28న జన్మించారు. 1964లో ట్రాంస్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా ఆకాశవాణిలో చేరి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌, అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరు, డైరక్టరుగా వివిధ కేంద్రాలలో పని చేశారు. మద్రాసు వాణిజ్య ప్రసార కేంద్రం డైరక్టరుగా పనిచేసి పాండిచ్చేరి స్టేషన్ డైరక్టర్‌గా 1989లో రిటైరయ్యారు.


మదరాసు కేంద్రంలో పని చేసిన మరో అధికారి కె. ఆంజనేయులు. వీరు 1934 జూన్ 3న జన్మించారు. 1954లో ఆకాశవాణిలో చేరి 1986లో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా నాగర్‌కోయిల్ లోకల్ కేంద్రం బదిలీ అయ్యారు. 1992లో ఆంజనేయులు రిటైరయ్యారు. ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా మదరాసు నుండి తెలుగు ప్రసారాల ప్రయోక్తగా ఆంజనేయులు సుపరిచితులు. వింజమూరి లక్ష్మి, కె. కలి వేలు, రామమోహనరావు, విజయసారధి, పద్మజా నిర్మల ఇలా ఎందరో కార్యక్రమ నిర్వహకులు తెలుగు కార్యక్రమాలు రూపొందించారు.

శ్రీమతి దుర్గాభాస్కర్ 1945 ఫిబ్రవరి నాలుగున ఏలూరులో సుప్రసిద్ధ గాయకులు ఈదర నాగరాజుగారికి జన్మించారు. దుర్గారాణిగా 1963 అక్టోబరులో ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో ట్రాంస్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా చేరారు. ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా మదరాసు కేంద్రంలో పని చేశారు. 1984లో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా అహమ్మదాబాద్ వాణిజ్య ప్రసార విభాగంలో పని చేశారు. అక్కడ నుండి విశాఖపట్టణం, మదరాసు కేంద్రాలలో పని చేశారు. 1993 ఏప్రిల్ నుండి విజయవాడ కేంద్రం తొలి మహిళా డైరక్టరుగా పనిచేశారు. 1995 మార్చిలో మదరాసు కేంద్రం డిప్యూటీ డైరక్టరుగా బదిలీ అయ్యారు. లలిత సంగీతంలో దుర్గాభాస్కర్ చక్కటి గాయని.

పాత తరానికి చెందిన వారిలో జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి, ప్రయాగ నరసింహశాస్త్రి, న్యాయపతి రాఘవరావు, కామేశ్వరి దంపతులు తెలుగు ప్రసారాల బావుటాను విను వీధుల్లో ఎగుర వేశారు. సినీ ప్రముఖులు ఎందరో యిక్కడి నాటక విభాగం నుండి పాల్గొంటున్నారు. నాటక రచయితగా, నటులుగా వారు ఆకాశవాణి ప్రసారాలకు దోహదం చేస్తున్నారు.

గొల్లపూడి మారుతీరావు ఈ కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఆలానే M. S. శ్రీరాం దూరదర్శన్ మదరాసు కేంద్రంలో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా వ్యవహరించారు. శ్రీ టి. వి. రాఘవాచార్యులు తమిళనాడులో అనేక కేంద్రాలలో పనిచేశారు. నెల్లూరుజిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో 1938 డిసెంబరు 24న జన్మించిన రాఘవాచార్యులు 1963 జనవరిలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా చేరారు. వివిధ కేంద్రాలలో పనిచేసి (తిరుచి, మదరాసు) అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా, డిప్యూటీ డైరక్టరుగా దూరదర్శన్ హైదరాబాదు కేంద్రంలో ఆరు సంవత్సరాలు (1987-95) మధ్య పని చేశారు. 95 నుండి బోపాల్ దూరదర్శన్‌లో డిప్యూటీ డైరక్టరుగా పనిచేస్తున్నారు. రాఘవచారి రచయిత. కాంచీపుర క్షేత్రాలను గూర్చి ఒక గ్రంథం వ్రాశారు. ఆధ్యాత్మిక భావసంపత్తి గల రాఘవచారి కంచి కామకోటి పీఠానికి బాగా సన్నిహితులు.

కుమారి S. లీల 1939 నవంబర్ 22న జన్మించారు. M. G. రామచంద్రన్ సరసన సినిమాలలో నటించారు. 1963లో మదరాసులో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా చేరి 1981లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ అయ్యారు. 1989లో స్టేషన్ డైరక్టర్ గా పదోన్నతి పొంది కొద్దిరోజులు డైరక్టరేట్‌లో పనిచేసి ఆ తర్వాత మధురై కేంద్రం డైరక్టర్‌గా చేరారు.

డా. డి. ఆంజనేయులు :

ఆకాశవాణి వార్తా విభాగంలో పని చేసిన ఎందరో ఆంధ్ర ప్రముఖులు జర్నలిష్టులుగా పేరు తెచ్చుకొన్నారు. ధూళిపూడి ఆంజనేయులు గుంటూరు జిల్లా ఎలపర్రులో 1924 జనవరి 10న జన్మించారు. మదరాసు క్రిష్టియన్ కళాశాలలో ఎం.ఏ. పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత లా పట్టా పుచ్చుకున్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో 1948 నుండి 1953 వరకు పనిచేసి 1953 - 1958 మధ్యకాలంలో హిందూ పత్రికలో పనిచేశారు.

వాణి పత్రిక సంపాదక బాధ్యతలను 1959లో మదరాసులో చేపట్టడంతో ఆయన ఆకాశవాణి సంబంధం ప్రారంభమైంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హైద రాబాదు విభాగం అధికారిగా 1971-75 మధ్యకాలంలో పనిచేశారు. 1977 నుండి ఆకాశవాణి వార్తా విభాగంలోను ఆ తర్వాత దూరదర్శన్ న్యూస్ ఎడిటర్ గా పనిచేసి 1981లో పదవీ విరమణ చేశారు.

రచయితగా, గ్రంథకర్తగా, గ్రంథ సమీక్షకులుగా ఆంజనేయులు మదరాసులో పేరు తెచ్చుకొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారికి సి.ఆర్.రెడ్డి జీవిత చరిత్రను, కందుకూరి వీరేశలింగం జీవిత చరిత్రను వ్రాశారు. సోవియట్ యూనియన్, ఐరోపా దేశాల పర్యటన వివరాలతో "Window to the West" అనే గ్రంథం వ్రాశారు. ఆధునిక తెలుగు కవులు దేవులపల్లి, శ్రీశ్రీ కవితల్ని ఆంగ్లంలోకి అనువదించారు. హిందూ పత్రికలో "Between You and me" శీర్షిక ఒక దశాబ్దిపాటు నిర్వహించారు. మూడేళ్ళు మదరాసు ప్రెస్‌క్లబ్ అధ్యక్షులుగా వ్యవహరించారు. తెలుగువారు గర్వించదగిన ఆంగ్ల జర్నలిష్టు. దక్షిణభారతంలో పుట్టి ఆంగ్ల రచయితగా ప్రఖ్యాతి తెచ్చుకొన్న కొద్దిమంది రచయితల్లో ఆంజనేయులు ప్రముఖులు. హిందూ పత్రికతో వీరికి సన్నిహిత సంబంధం వుంది. వీరి సమీక్షలు సాహితీ విమర్శకు నికషోపలాలు. ఆంజనేయులు మదరాసు నగరంలో స్థిరపడ్డారు.

గుర్రం జాషువా (1895-1971) :

గుర్రం జాషువా గుంటూరు జిల్లా వినుకొండంలో 1895 సెప్టెంబరు 28న జన్మించారు. నవయుగ కవి చక్రవర్తిగా కీర్తి గడించారు. 1910 నుండి 15వ సం. వరకు టీచరు వృత్తిని చేపట్టి పేరు తెచ్చుకొన్నారు. 1919 నుండి గుంటూరు ట్రైనింగ్ స్కూలులో టీచర్ గా 10 ఏళ్ళు పనిచేశారు. 1929 నుండి ఉభయభాషా ప్రవీణ పండితులుగా జిల్లాబోర్డు పాఠశాలల్లో పనిచేశారు. కవి కోకిల, కవిదిగ్గజ, మదుర శ్రీవాత బిరుదులతో పాటు కనకాభిషేక గజారోహణాలు పొందారు.

ఆకాశవాణి మదరాసు కేంద్రంలో తెలుగు ప్రసంగాల ప్రొడ్యూసర్‌గా 1956లో చేరారు. (1956-59) నాలుగేళ్ళ పాటు విధి నిర్వహణ చేశారు. ఆయన కవితా కంఠం విలక్షణమైంది. తెలుగుజాతి నుడికారం ఆయన కొల్లగొట్టారు. వీరేశలింగం గారిని రాజమహేంద్రవరంలో కలుసుకోగా వారు చిలకమర్తిని పరిచయం చేశారు. క్రీస్తు చరిత్ర, బాపుజీ, నేతాజీ, గబ్బిలం, ఫిరదౌసి, స్వప్నకథ, స్వయంవరం, కాందిశీకుడు, ముసాఫిరులు, తారాబాయి, మీరాబాయి ప్రసిద్ధ ఖండకావ్యాలు, ఎన్నో నవలలు, నాటకాలు వ్రాశారు.

1910 లో వీరికి వివాహం జరిగింది. అంటరాని తనం పనికి రాదని ఆక్రోశించిన కవి ఆయన. దీపాల పిచ్చయ్యశాస్త్రి, జాషువా జంట కవులుగా పద్యరచనకు పూనుకొన్నారు. 'పిచ్చి జాషువా' 'జాషువాపిచ్చులు' అనే జంటనామం కుదరక మళ్ళీ విడివిడిగా రచనలు చేశారు. హరిశ్చంద్ర నాటకంలో 'కాటిసీమ' పద్యాలు జాషువా గారివే యిప్పటికీ నటులు ప్రదర్శించడం విశేషం. 1915-16 మధ్య కాలంలో మూకీకథా చిత్రాలకు వాచకుడుగా పనిచేశారు. కొంతకాలం నాటక కర్తగా 'చింతామణి నాటకమండలి' వారికి సహకరించారు. 1964లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా గవర్నరు నామినేట్ చేశారు. ఆఆ పదవిలో కొంతకాలం పనిచేశారు. 1970లో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ కళాప్రపూర్ణతో, భారత ప్రభుత్వం పద్మభూషణతో సత్కరించాయి. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు స్వయంగా గండపెండేరం జాషువా కాలికి తొడిగారు. 1964లో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. జాషువా మహాకవి 1971 జులై 24న మరణించారు.

జాషువాగారి కుమార్తె హేమలతా లవణం. వీరు జాషువా శతజయంతి వైభవంగా జరిపి జ్ఞానపీఠ స్థాయిలో ఏటా ఒక లక్ష రూపాయలతో ఒక కవిని సన్మానించే సంప్రదాయం మొదలుపెట్టారు.

ఆచంట జానకీరామ్‌ :

1938 జూన్ 16న మదరాసులొ సీనియర్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా ఆచంట జానకీరామ్‌ పనిచేశారు. సుప్రసిద్ధ సంఘసేవకురాలు, అవిభక్త్ర మదరాసు రాష్ట్రంలో ఆరోగ్యశాఖా మంత్రిణి డా. ఆచంట రుక్మిణమ్మ, లక్షీపతి కుమారులు. జానకీరామ్‌ 1903 జూన్ 16న జన్మించారు. తొలి డైరక్టర్ జనరల్ లైవిల్ ఫీల్డెన్ నియమించిన తొలి తరం వారిలో ఆచంట ఒకరు. సున్నితమైన మనస్సు, తెల్లని దుస్తులు ధరించి కార్యక్రమ రూపకల్పనలో మేటి అనిపించుకున్నారు జానకీరాం.

మదరాసు కేంద్రం నుండి తొలి తెలుగు నాటకం ' అనార్కలి ' జానకీరాం ప్రయోక్తగా వెలువడింది. వాణి ఎడిటర్ గా మదరాసు కేంద్రంలో ఒక దశాబ్దిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. వీరి సతీమణి ఆచంట శారదాదేవి పద్మావతీ మహిళా కళాశాల తెలుగు శాఖ అధ్యక్షురాలిగా పనిచేశారు. జానకీరాం తిరుపతిలో 1961 నుండి విశ్రాంత జీవనం గడిపి 1994లో తనువు చాలించారు. అప్పటి వయస్సు 88 సం.

స్మృతి పథాలు, సాగుతున్న యాత్ర వీరి రచనల్లో ప్రముఖాలు. జానకీరాం సున్నితమైన ఆధునిక చిత్రకళలో ప్రావీణ్యం సంపాదించారు. 170కి పైగా స్వీయ చిత్రాలను ఆంధ్ర మహిళా సభకు బహూకరించారు.

అడయార్ లో బి.యస్.సి.ఆనర్సు చదివారు. అప్పుడు రవీంద్రనాథ ఠాగూర్ దాని చాన్సలర్. రవీంద్రనాథ్, అనీబిసెంటు, జేమ్స్ కజిన్స్ వీరిని ప్రోత్సహించారు.

కొంతకాలం ఢిల్లీలో దక్షిణ భారత ప్రసారాల విభాగంలో పనిచేశారు. తర్వాత తిరుచిరాపల్లి కేంద్రంలో ప్రాగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పనిచేసి మదరాసు చేరారు. 120 పైగా తమిళ నాటకాలు మిత్రుల సాయంతో ప్రసారం చేశారు. ఆంధ్రదేశం నలుమూలల నుండి పండితులను పిలిపించి తెలుగు ప్రసంగాలు ఏర్పాటు చేశారు. 21 సంవత్సరాలు ఆకాశవాణిలో ప్రముఖ పదవులు నిర్వహించారు.

వాణి పత్రిక సహాయ సంపాదకులుగా పనిచేశారు. ఢిల్లీ విదేశ ప్రసార విభాగంలో పనిచేసి 1959లో మదరాసు కేంద్రంలో ASDగా పదవీ విరమణ చేశారు. 1960 ఠాగూరు శతజయంతి సంఘ కార్యదర్శిగా పనిచేశారు. స్వర్ణపీఠ వీరి కావ్యం. చలం ఈ కావ్యం చదివి సంతోషించారు. వీరి జన్మదిన సందర్భంగా 1971లో ఆంధ్ర మహిళా సభవారు Glimpses of Telugu Literature అనే వీరి రచనను ప్రచురించారు.

జానకీరాం కోమల హృదయుడు.

జనమంచి రామకృష్ణ :

తొలి తరం ప్రసార ప్రముఖులలో జనమంచి రామకృష్ణ ప్రముఖులు. మదరాసు కేంద్రంలో స్టాఫ్ ఆర్టిస్టుగా 1948లో చేరి చాలాకాలం అక్కడే పనిచేశారు. ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా సెలక్టు అయి హైదరాబాదు చేరుకొన్నారు. వీరి ఆధ్వర్యంలో నాటకాలు బహుళ జనామోదం పొందాయి. స్వయంగా రచయిత. కొంత కాలం ఢిల్లీ నుండి తెలుగు వార్తలు చదివారు. 1980లలొ హైదరాబాదు కేంద్రంలో పదవీ విరమణ చేసి కొంతకాలం తర్వాత తనువు చాలించారు. ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ శ్రీ రమేష్ పాత్రో వీరి సన్నిహిత బంధువులు.

M. S. శ్రీరాం :

శ్రీరాం సంగీత దర్శకుడుగా చలనచిత్రరంగంలో లబ్ద ప్రతిష్ఠులు. మంచి రోజు, పెళ్ళి రోజు చిత్రాలకు జమున నాయికగా వీరి దర్శకత్వంలో వెలువడ్డాయి. 1977లో UPSC ద్వారా ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా నియమితులై విజయవాడ కేంద్రంలో చేరారు. రెండేళ్ళ తర్వాత కడప బదిలీ అయ్యారు. అక్కడ నుండి మదరాసు దూరదర్శన్ కేంద్రానికి బదిలీ అయ్యారు. అక్కడే అసిస్టెంట్ డైరక్టర్ గా పదోన్నతి పొందారు. అక్కడ పనిచేస్తుండగా హఠాన్మరణం పొందారు. ఈమని శంకరశాస్త్రిగారు వీరికి మేనమామ.

చక్కటి సంగీత కార్యక్రమాల రూపకల్పన చేసిన శ్రీరాం ప్రసార రంగంలో చెప్పుకోదగిన ప్రముఖులు.

ఢిల్లీ తెలుగు వార్తలు

"తెలుగులో వార్తలు - చదువుతోంది కొంగర జగ్గయ్య' అని తన సుమధుర గళంతో వార్తలు వినిపించారు జగ్గయ్య. అది స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళు. ఢిల్లీనుండి తెలుగులో వార్తలు రెండో ప్రపంచ యుద్ధానికి ముందు నుండి ప్రసార మౌతున్నాయి. శ్రీశ్రీ వంటి సుప్రసిద్ధులు తెలుగువార్తలు తొలిరోజుల్లో చదివారు. జగ్గయ్య ఆ తర్వాత సినీరంగం ప్రవేశించి హీరోగా పేరు తెచ్చుకొన్నారు. కొంత కాలం ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా (కాంగ్రెసు) వ్యవహరించారు. కపిల, కాశీపతి, శ్రీ వాత్సవ, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, పన్యాల రంగనాధరావు, వనమాలి ప్రసాద్, జోళిపాళ మంగమ్మ, కందుకూరి సూర్యనారాయణ, తిరుమలశెట్టి