ప్రభుత్వము/శాసననిర్వహణస్వరూపము

క్స్వాతంత్ర్య పత్రికాస్వాతంత్రములున్న దేశములలో చక్కని యాందోళనమూలకముగ వీనిఫలమును సాధించుట కవకాశమున్నది. ఇట్టి కొత్తఏర్పాటు కావలెనని సభలుపెట్టి తీర్మానములుచేసి వ్యాసములు వ్రాసి ఇనిషియేటివునందువలె గవర్నమెంటువారిచేత క్రొత్తచట్టము చేయింపవచ్చును. శాసనసభలలో విచారణకు రాగల సంగతులనుగురించి విస్తారప్రజాభిప్రాయమును పురికొల్పి రెఫరెండముఫలము సాధింపవచ్చును. ఏప్రతినిధిచేయునట్టి పనినైనను గట్టిగా విమర్శింపించి అతడు విసిగి రాజీనామానిచ్చునట్లు చేయవచ్చును. మొండికివేసుకుంటే మరల ఎన్నికలో రాకుండచేసి రీకాల్ ఫలమును పొందవచ్చును. అయిన నేటిలోకమున ఒకవైపు డిక్టేటరులచేతులలోని ఫేసిస్టు ప్రభుత్వములవంటి ఏకపక్ష ప్రభుత్వములును ప్రజాపక్షములేయైనను రుష్యాలోని సోవియట్టువంటి ఏకపక్ష ప్రభుత్వములును ఏర్పడి యింతచక్కని ఫలప్రదమగు వాక్స్వాతంత్ర్య, పత్రికాస్వాతంత్ర్యము లరికట్టబడుచుండుట గమనింపదగియున్నది.

_________


5

శాసననిర్వహణస్వరూపము

(అధికారశాఖ)

ఇదివరలో వ్రాయుటయందు అర్థసౌకర్యార్థము శాసననిర్మాణము, శాసనవివరణము, శాసననిర్వహణము, అనుక్రమమున వ్రాసితిమి, నేటి ప్రజాపరిపాలితరాష్ట్ర ములలో శాసననిర్వహణాధికారము నేరుగా శాసననిర్మాణాధికారులకే సంక్రమించుచుండుటచేత శాసనవివరణమునకు ముందుగా శాసననిర్వహణమును గురించి యాలోచించుటే యవసరమగు చున్నది.

ప్రాచీనకాలములయం దేమి, నిన్న నేటివర కేమి శాసననిర్వహణాధికారము సామాన్యముగా రాజులకును, వా రేర్పరచుకొనిన సహాయకులకును, వారు నియమించిన యధికారులకును చెందుచు వచ్చినది. అనేకరాష్ట్రములలో- రాజు నిరంకుశుడుగానుండినట్లు కానవచ్చు రాష్ట్రములలో సయితము — స్థానికవిషయములయందు ఆయాప్రాంతములప్రజలు తమకార్యములను తామే నిర్వహించు కొనుచు వచ్చినది నిజమే. కాని మొత్తముగా రాజ్యమునకు సంబంధించిన కార్యనిర్వహణమునందు రాజును, ఆతనిచే నియమితులైనవారును మాత్రమే ప్రవర్తించుచు వచ్చిరనుట సత్యము.

ఉత్తమాధికారి

ఎప్పుడును కార్యనిర్వహణమునకు పదుగురయధికారము పనికిరాదు. కాబట్టి నేటిదినమును ఎల్ల రాష్ట్రములలోను శాసననిర్వహణము ప్రప్రధమముగా నొక్క యుత్తమాధికారియందు నిక్షిప్తమయి యున్నది. పూర్ణ ప్రజాసత్తాకములలో కొన్నిటియందు వోటర్లందరునుచేరి ఉత్తమాధికారి నెన్నుకొని అతనికి అధికారకాలపరిమితి యున్నంతవరకు నాలుగేండ్లో, ఎక్కువయో నిరంకుశాధికార మిచ్చి వేయుటగలదు. అట్టి ప్రజాసత్తాకములను 'కేంద్రీకృతప్రజాసత్తాకము' లన్నారు. ఇంగ్లీషులో వీనికి 'సెంట్రలైజ్డు రిపబ్లిక్కు' లందురు. దక్షిణఅమెరికాలోని “ పెరూరాష్ట్ర మిట్టిది. మధ్యఅమెరికాలోని 'నికరాగుఆ'యు నిట్టిదియే. దక్షిణ అమెరికాలోని 'పెరూగ్వే'యు నింతియే. నేటిదినము శాసనము లనంతములు, కార్యజాలము బహుళతమము. అందుచేత ఆయుత్తమాధికారి నంటికొని రమారమి ఆతనితో సమానముగా జవాబుదారీలను పంచుకొనునట్టి యధికారులు కార్యనిర్వాహకులు కొంద రేర్పడియున్నారు. వీరే మంత్రివర్గము. పూర్వపురాజు, ఆతనిమంత్రులు - నేటి యుత్తమాధికారి, అతని మంత్రివర్గము, (లేదా, ఆతని కార్య నిర్వాహకవర్గమునకు) సరిపోవుచున్నారు. తరువాత రాష్ట్రములోని పరిపాలనశాఖల యుత్తమాధికారులును వారిచేతిక్రింద పనిచేయునట్టి యధికారి పరంపరయు శాసననిర్వహణాధికారధూర్వహు లగుచున్నారు. మనదేశపు పరిభాషలో జెప్పదలచితి మేని గవర్నరుజనరలు మొదలుకొని పోలీసుకనిస్టేబిలు, నీరుగట్టు తలారులవరకును శాసననిర్వహణాధికారులు.

శాసననిర్వహణాధికారమును వీరు బహువిధముల ప్రచారమునకు దెచ్చుచున్నారు. ఎల్ల రాజకార్యములకు, ఇతరకార్యములకు వలెనే, ద్రవ్యము మూలాధారము. రాజ్యమునకు ఈద్రవ్య మనునట్టిది పన్నుల మూలకమున సమకూరుచున్నది. శాసనకర్తలు పన్నులు ఏయేరీతుల విధింపవలసినది మున్నగు సూత్రములను చేయుచున్నారు. అధికారవర్గమువారు ఎంతెంతమొత్త మెవ్వరెవ్వరివద్ద నుండి రాబట్టవలసినదియు నిర్ణయించి, వసూలు చేయు చున్నారు. ఇతరరాష్ట్రములతోటి సంబంధబాంధవ్యములను జరుపుటయు అధికారవర్గమునకు చెందిన స్వాతంత్ర్యమేయగును. సైనికవర్గమును, నావికవర్గమును, ఆకాశ విమానదళమును ఆయత్తపరచి వినియోగించుట, దేశములోని పోలీసు కార్యములను నిర్వహించుట, రైళ్లురోడ్డులు ఇత్యాది సౌకర్యములను ప్రజలకు చేసియిచ్చుట, యజమానులకును పనివారలకును కలుగునట్టి సంబంధములను సమపరచినడుపుట ఇత్యాది కార్యములన్నియును అధికార వర్గమువారు శాసనకర్తల ప్రతినిధులుగా చేయునట్టి కార్యములై యున్నవి. మన దేశమునకు ఈవర్ణన పూర్తిగా నన్వయించునని యనుకొనరాదు. స్వయంపరిపాలన సంపూర్ణముగా గల రాజ్యములకే యిది యన్వయమగును. శాసనకర్తలు పరిమితాధికారము కలవారుగా నున్నంతకాలము మనమీవర్ణనను ఆదర్శప్రాయముగా మాత్ర మంగీకరింపవలసి యుందుము. శాసనకర్తలు సంపూర్ణాధికారము కలవారయియుండు స్వపరిపాలితరాష్ట్రములలో గూడ అధికారవర్గమునకు శాసనకర్తల యధికారమునకు మించిన యధికారము కొన్ని కలవు.

అధికారవర్గశిఖరమున నేకవ్యక్తి యుండుట కార్యసాధనకు ముఖ్యాధారమంటిమి. ఈఏకవ్యక్తి యాజమాన్యము రమారమిగా నేటి నాగరకరాష్ట్రము లన్నిటను కాననగును. అయిన కొన్ని చోట్ల నీఏకవ్యక్తి పేరునకు మాత్రము అధికారవర్గశిఖరము నధిష్ఠించుటయు, మరికొన్నిచోట్ల నిజముగా సర్వాధికార ధూర్వహుడగుటయు చూడవచ్చును. అమెరికాసంయుక్తరాష్ట్రాధీశ్వరుడగు నధ్యక్షుడు సర్వాధికారధూర్వహుడు. అతడు ఎవ్వరి సలహానైనను తీసికొనవచ్చును. ఎందరితో నైనను సంప్రతించుకొనవచ్చును. అధికారులతోను, అనధికారులతోను ఆలోచించు కొనవచ్చును. కాని ఎవ్వరి మాట ననుసరించియు నతడు నడచుకొనవలయునను నిర్బంధములేదు. తన యిచ్చకువచ్చిన రీతిని ప్రవర్తింప వచ్చును. ఎల్లయధికారమును ఆతని దే. ఎల్లజవాబుదారియు నాతనిదే. ఇంగ్లాండు, ఫ్రాంసు ఈదేశములలో సర్వరాజనీతియు ఉత్తమాధికారి నిర్ణయించుటలేదు. ఇంగ్లండులో ఉత్తమాధికారి రాజు. కాని అధికారనిర్వహణము అతని చేతులలో లేదు. మంత్రివర్గ మెట్లు చెప్పిన న ట్లత డంగీకరించి కావలెను. నిజముగా ముఖ్యమంత్రియే సర్వాధికారి, అయిన శాసనబద్ధముగ ముఖ్యమంత్రి యధికారముగాని, మంత్రివర్గముయొక్క యధికారముగాని యెచ్చటను సూచితము కాలేదు. బహుకాలాగతమగు నాచారమే వీరికి శరణ్యము. ఫ్రాంసులో ఉత్తమాధికారి అధ్యక్షుడు. కాని అతడును మంత్రుల యాలోచన లేక యెక్కువ స్వతంత్రించుటకు రాదు.

సివిలు సర్విసు

ఇట్లగుటచేత అధికారనిర్వహణ వర్గమును గురించి యాలోచించు చోట ఉత్తమాధికారి సర్వాధికార ధూర్వహుడా, ఇతరాధికారుల యధికారముచే పరిమితుడా యని యాలోచించుట యవసరము కావచ్చును. కాని సర్వాధికారధూర్వహుడై నను కాకున్నను నొక్కమాట మాత్రము నిజము. రాజ్యకార్యములను గడుపుట కేర్ప డిన దగిన యధికారుల పరంపరను నియమించునట్టి ముఖ్యాధికారము పూర్తిగ నతనిదైనను నగును. లేదా అతడును, అతని పరిసరవర్తులును నిర్వహించునట్టిది యైనను నగును. ఈయధికారము నుపయోగించుటయందు నక్రమములు అనేకదేశములలో పొడగట్టినవి. ఆకారణముచేత “సివిలుసర్వీసు” లనుపేరిట నెన్నటికిని మారనియట్టి అధికారవర్గము లేర్పడియున్నవి. పరీక్ష లేర్పరచి తన్మూలముగా నుత్తీర్ణులగువారలను నేరి నియమించుటచేత ఉత్తమాధికారి ఇష్టానిష్టములతో నక్కరలేని యధికారవర్గ మేర్పడునను నమ్మకము ఈసివిలుసర్వీసుల యుత్పత్తికి మూలాధారము. స్వపరిపాలితరాష్ట్రములలో నొక కక్షివారిప్రాబల్యము పోయి మరియొక కక్షివారి ప్రాబల్యము సమకూరినప్పుడు కార్యనిర్వాహకు లెల్లరును మారుచుందురేని కార్యనిర్వహణ మనునదియే సున్నయగును. ఇంగ్లండు చరిత్రమునందు కొలదిమాసములకంటె నెక్కువగా అధికారమందుండని యట్టి ప్రజాప్రతినిధిసభ లెన్నియో కానవచ్చుచున్నవి. యుద్ధకాలమునందు ఇటలీ, గ్రీసు ఈరాష్ట్రములును, ఫ్రాంసును పడిన పాట్లుచూచిన యెడల నీవిషయము ఇంకను స్పష్టముగా నర్థముకాగలదు. నేటి జర్మనీచరిత్రమును దీనికి నిదర్శనము, 1919-వ సంవత్సరము మొదలు 1928-వ సంవత్సరలోపల 15 మంత్రివర్గములు మారిపోయినవి. అనగా నొక్కొక మంత్రి వర్గమునకును 8 నెలల సరాసరి జీవితమని యర్థము. నేడొక మంత్రివర్గము, రేపొక మంత్రివర్గము, మూడవనాడు మరియొక మంత్రివర్గము. ఈమంత్రివర్గము లొక్కొ క్కటియు పట్టణాధికారులు, గ్రామాధికారులు మున్నగు నెల్లనౌకరులను మార్చుచుండిరేని పరిపాలన ఎట్లు జరిగి యుండునో చదువరులే యోచించుకొన గలరు. కాబట్టి 'సివిలుసర్విసు'ల పద్ధతి. దీనినే ఆంధ్రమున "పౌరసేవోద్యోగపద్ధతి”యని వ్యవహరించుట కలదు– ప్రజాపరిపాలితరాజ్యములలో స్థిరపడి యున్నది.

అయిన నీ 'పౌరసేవోద్యోగ' పద్ధతి ప్రజాస్వామ్యము పూర్తిగా లేనిచోటులను, బొత్తుగా లేనిచోటులను అనర్థదాయక మయినదనుటకు సందియములేదు. ప్రజాస్వామ్యము కలచోట పౌరసేవోద్యోగులు నానాడు అధికారమున నుండునట్టి కక్షివారియొక్క ఇష్టము ననుసరించి, అనగా, దేశమున నానాడు ప్రబలియుండు అభిప్రాయప్రాబల్యము ననుసరించి, కార్యములు నడుపవలసిన వారగుచున్నారు. ప్రజాస్వామ్యము లేనప్పుడు ఈ యవసర మేర్పడదు. పౌరసేవోద్యోగులకు స్థానము స్థిరము. క్రింది యుద్యోగస్థుల పరంపరను నియమించువారు తామేయగుట పలుకుబడియు స్థిరము. ఎవ్వరికిని జవాబు చెప్పవలసిన యవసరములేనప్పుడు ఇక వీరి కత్తికి అడ్డమేమున్నది? అందులోను పౌరసేవోద్యోగులు ఒక్క దేశములో రమారమి ఒక్కటే తరగతికి చేరిన జనులలోనుండి నియమితులై ఇంకొక్క దేశమున, దూర దేశమున, అందులోను తమభూమికి అంకితమైనదేశమున అధికారము వహించువారగుదురేని వారి నిరంకుశత్వము ఒక్క రాజు నిరంకుశత్వమునకంటె వేయిమడుంగులు దుస్సహమగు ననుట నిర్వివాదాంశము : మన భారతభూమిలో బ్రిటిషు ప్రభుత్వము క్రింద తటస్థించిన దిదియే. ఒక్కనికి బదులు పెక్కురు, ఒక్క స్థానముననుండిగాక దేశమంతటిని నావరించి, గ్రామగ్రామమందును తమయంశమును నిలిపి నిరంకుశత్వమును వహించుటనుజేసి ప్రజాపరిపాలితరాష్ట్రములలో నెయ్యది యనుకూలపరిస్థితియో అయ్యదియే యిచ్చట ప్రతికూలపరిస్థితియై దానికి లోబడిన ప్రభుత్వపద్ధతి మంత్రివరుడైన మాంటెగ్యూచే ప్రళయమునకు పూర్వపు నాటిపద్ధతియనియు, మానవరసవిహీనపద్ధతి యనియు వర్ణితము కావలసివచ్చినది. ప్రజాప్రభుత్వము నెలకొనుకొలదిని 'సివిలుసర్విసు' ఇతర దేశములందువలెనే మనదేశము నందును ప్రజలసేవకు సహజోపకరణమగునుగాక యని నమ్మనగును. కాంగ్రెసు మంత్రివర్గముల పరిపాలన యారంభమయినపిదప ఇందు కొంతనిజ మున్నదనుట స్పష్టమయినది. సివిలుసర్విసులవారు తాము లాతీదెబ్బలు కొట్టించిన వారికిగూడ భక్తులుగా పనిచేయుచున్నారు.

అతీత ధర్మములు :

అధికారవర్గము శాసననిర్మాణాధికారులచే నియమితమైన కార్యజాలమును నడుపునట్టి ప్రతినిధివర్గము మాత్రమైయుండినయెడల అథికారశాఖాప్రాబల్యము ప్రభుత్వమున నెక్కువగా నుండియుండదు. అధికారశాఖకు "శాసననిర్వహణము” ముఖ్యధర్మమైనను దాని కతీతమైన ధర్మములను కొన్నిటి నీశాఖ వహించుచున్నది. రమారమి యెల్ల నాగరికరాష్ట్రములలోను ఇట్టిశాసనము అవసరమని, శాసనముల నుపక్రమించునట్టి స్వాతంత్ర్యము సర్వసామాన్యముగా అధికారవర్గమునకే చెంది యున్నది. మహోదారమైన పద్ధతులు వెలసియుండు ఆంగ్లరాజ్యాంగసభలో సయితము ప్రభుత్వమున నుండు కక్షివారు రాజ్యాధికారుల మూలముగా ప్రవేశపెట్టుశాసనములే మెండు. అనధికారియగు శాసనసభ్యుడు ప్రవేశ పెట్టునట్టి శాసనము ఎప్పుడో యొకప్పుడుగాని కాన్పించదు. ఇది తప్పనిసరి. దినదినమును రాజ్యకార్యములను నడుపునట్టి వానికే రాజ్యవిషయములలో గల లోపాలోపములు చక్కగా బోధపడును. అతనికే ఎక్కడ నేసంస్కార మవసరమో సులభముగా తెలియవచ్చును. ఆకారణముచేత నేశాసనము చేయవలసినదియు నిర్ణయించుకొనుటకు అతనికే యుత్తమావకాశ మున్నది. దీనిని బురస్కరించుకొనియే మనదేశములో శాసనోపక్రమాధికారమంతయు ప్రభుత్వాధి కారుల చేతులలో నిడబడినది. ప్రజాపరిపాలిత రాష్ట్రములలోనే యీస్వాతంత్ర్య మధికారవర్గమునకు ప్రబలాయుధమనిన ప్రజాపరిపాలనకు నింకను పూర్తిగ దగ్గరజేరని హైందవభూమివంటి రాష్ట్రములలో దీని ప్రభావము వర్ణింపనక్కరయే లేదు.

అధికారశాఖకుగల మరియొక స్వాతంత్ర్యము శాసననిరోధము. శాసనకర్తలయి నట్టి వారొక శాసనమును చేసినను ఉత్తమాధికారిశాసనము నంగీకరించుట లేదని శాసనమును నిరోధింపవచ్చు ననుట యొకసిద్ధాంతము. ఈసిద్ధాంతము క్రమక్రమముగా కొన్నికొన్ని దేశములలో బలవిహీన మగుచున్నది. ముఖ్యముగా నాంగ్ల భూమిలో నుత్తమాధికారియైన రాజునకు గల యీస్వాతంత్ర్యము నేటిదినము సంపూర్ణముగా నష్టమయియున్న జనరలు ఇచ్చకువచ్చిన మేరకు ప్రజలయొక్క స్వాతంత్ర్యములనే నిరోధించు శాసనమునైనను ఆరుమాసములు అమలులో నుండునట్లు చేయవచ్చును. ఆరేసిమాసముల చొప్పున ఆకాలవ్యవధిని పెంచుకొనవచ్చుచుండ నగుననియునుగూడ ఇటీవలిచరిత్రచేత స్థిరపడినది.

అధికారశాఖయొక్క ప్రాబల్యము ఇంతటితో తీరిపోయిన దనుకొనరాదు. ఉత్తమాధికారి శాసనసభలను నుపక్రమించుటయందును, చేర్చుట యందును, వాయిదాలు వేయుటయందును, ఆపివేయుటయందును, రద్దుచేయుటయందును కొన్ని కొన్ని యధికారములు కలవాడై యున్నాఁడు. జర్మనీ, అమెరికా సంయుక్తరాష్ట్రముల వంటి రాష్ట్రములలో ఉత్తమాధికారితో సంబంధము లేకయే శాసనసభ సామాన్యముగా ఈనాడు, ఈ సమయమున, ఈరీతిని చేరవలసినదను కట్టుబాటుకలదు. ప్రత్యేకముగా విశేషసమావేశము జరుపవలసి యుండిననే అధ్యక్షుడు కలుగజేసికొనవలసి యుండును. ఇంగ్లండులో ఈ పద్ధతి లేదు. శాసనసభలు చేరవలసి యున్నప్పుడు రాజు (మంత్రుల సలహామీద) సభ్యులందరు చేరవలసినదని యుత్తరువీయవలసి యున్నాడు. అతడు నియమించిననాడు సభ చేరవలసియున్నది. ప్రత్యేకము అందుకని జాగ్రత్తగా సిద్ధముచేసిన ఉపక్రమోపన్యాసమును రాజు సభకు పంపుచున్నాడు. దానిని రాజుపేరట చదువుచున్నారు. సభ యుపక్రమమగుచున్నది. ఇంత యట్టహాసము పైకి కాన్పించినను సర్వమైన పనులును రాజుపేరుపెట్టి చేయువారు ప్రజానిర్వచితులగు మంత్రులేయైనందున ఆంగ్లరా మాత్రము అధికారశాఖచేసిన నిర్ణయములను అమలులో పెట్టు సదుపాయములు శాసనసభలవారు చేయ వలసి యుందురేకాని ఇతరవిధముల నానిర్ణయములను చెనకుటకు రాదు. ఇందుకు కారణము లేకపోలేదు. ఆంగ్లభూమిలో ఇట్టి నిర్ణయములను చేయునట్టివారు మంత్రివర్గము. రాజు యంగీకారము రమారమిగా నామకార్థము. మంత్రివర్గము శాసనసభలచే నియమితము. ఏనాడు శాసనసభలకు మంత్రివర్గముపై విశ్వాసము లేక పోవునో ఆనాడు ఆమంత్రివర్గము రాజీనామాయిచ్చి తీరవలసియున్నది. అమెరికా సంయుక్త రాష్ట్రములలో పద్ధతి భిన్నముగా నున్నది. అచ్చటి యధ్యతుడు ప్రజానిర్వచితుడే. కాని ఒక్క పరి నిర్వచితుడైనపిదప అతనికి నియమితమైయుండు అధికారకాలమంతయు నతడు నిరంకుశుడు. కాబట్టి అచ్చటి శిష్టసభవారు ఇతరరాజ్యములతోటి అతడు కల్పించుకొను సంబంధములలో జోక్యము కలుగచేసికొనుటకు అవకాశము పెట్టుకొనినారు. వా రంగీకరింపనిచో నతడు చేయు నొడంబడికలు చెల్లవు. అతడు చేసికొనిన యొడంబడికలను వారు ఒప్పుకొనిన నొప్పుకొనవచ్చును. మార్చిన మారువవచ్చును. త్రోసివేసినను త్రోసివేయవచ్చును. ప్రజాప్రతినిధిసభకును కొంత యిట్టి యధికారము కలదు. కావున నే అమెరికా సంయుక్త రాష్ట్రాధ్యక్షుడు విల్సను ఐరోపియను రాష్ట్రములతో చేసికొనిపోయిన యొడంబడికలు అమెరికా శాసనసభలలో తీక్ష్ణవిమర్శకు పాల్పడవలసి వచ్చినవి.

యుద్ధములింకను లోకమునుండి తుడువబడిపోలే దు. నలుగురు ఉప్పు కారము వేయుట కధికారముకల వారైన యెడల వంటయైనను చెడిపోవునను నప్పుడు యుద్ధ సమయములలో పదుగుర యభిప్రాయము పనికిరాదనుట వేరుగ జెప్పబనిలేదు. ఐరోపామహాసంగ్రామము ప్రారంభమైనప్పుడు ఆంగ్లభూమిలో, విషయములు పదుగురాలోచించి రమారమి బహిరంగపరచి పనిచేయుటవలన కొన్నిదొసగులు పొసగినవని యెల్ల రెఱుంగుదురు. అట్టిస్థితి కలుగునని యెదురుచూచియే యెల్లరాజ్యములలోను భూసైన్య నావికాసైన్యాధికారములను సంపూర్ణముగా నుత్తమాధికారియధికారముననే యుంచియున్నారు. వీనికి తగిన యధికారులను నియమించుట యుద్ధావసరములలో నేయేపని యెట్లెట్లు నడుపవలయునో యెల్లయు నిశ్చయించుట యేకముఖముగా అతనిమూలకముగా జరుగుచున్నవి.

యద్ధ ముపక్రమించు నధికారమును నుత్తమాధికారికి ఆంగ్లభూమిలో సంక్రమించియున్నది. ఉత్తమాధికారియనిన నిజమునకు మంత్రివర్గమేయైనందున నిదియు ప్రజలయధీన మనుకొనవలసినదే. ఫ్రాంసుభూమిలో నధ్యక్షుడు యుద్ధమునకు బోనెంచినప్పుడు శాసనసభల రెంటి యుత్తరువును పొందవలెను, అమెరికాసంయుక్తరాష్ట్రముల యధ్యక్షుడు ప్రజాప్రతినిధిసభ యనుమతిని పొందిన చాలును. ప్రజాసత్తాకములలో నంతటను కొద్దికొద్ది భేదములతో ఈయధికారము కొంతవరకు ఉత్తమాధికారికే సంక్రమించుచున్నది.

యుద్ధము ఉపక్రమించుట, సంధి ఇత్యాదివిషయ ములను గురించి మనదేశములో నిప్పు డాలోచింపవలసిన పనిలేదు. మనము బ్రిటిషు సామ్రాజ్యమున కంకితులము. బ్రిటిషు అధికారులు ఏమిచేసిన నది మన మంగీకరింపవలెను. వారికి లోబడి కొద్దిగా గవర్నరుజనరలున కధికారముకలదు, ఆయధికారమెంత, యేమి, యెట్లుపయోగ పడుచున్నది యని విచారించు స్వాతంత్ర్యము మన శాసనసభలకు నేటిశాసనము మూలకముగా కలుగలేదు.

అధికారశాఖకుగల ఇంకొక్క స్వాతంత్ర్యమును గురించి వ్రాయవలసియున్నది. నేడేర్పడియుండు శాసనములు, న్యాయస్థానములు, సాక్ష్యములు, విచారణలు వీనిమూలకముగా నొకొకప్పుడు నిరపరాధులు సాపరాధులుగా దండింపబడుచున్నారనుట సిద్ధాంతముగా నంగీకరింపబడినది. నిజ మాలోచింప ఒకొకప్పుడుగాక సామాన్య ముగా నిరపరాధులే దండింపబడుచున్నారాయను ననుమానము దోచకపోదు. కాబట్టి అన్ని రాజ్యములలోను ఉత్తమాధికారికి 'క్షమా'థికార మొసంగబడి యున్నది. అధికారులు గొప్పనేరములు చేసినప్పుడు ఉత్తమాధికారి యాస్వాతంత్ర్యము నుపయోగింప వచ్చునను నవకాశమున్నచో ననర్థములు వాటిల్లుననుట స్వయంప్రకాశము. అతని యుత్తరువులేకనో అతని యెరుకతోనే యెరుకలేకయో వారుచేయు దౌర్జన్యములను, దౌష్ట్యములను క్షమించుట కతనికి అవకాశము కలుగును. అట్లు కలుగకుండుటకై ఈ 'క్షమా'ధికారము గొప్పయధికారులు చేయు నేరములపట్ల వినియోగ పడరాదని కొన్ని కొన్ని రాష్ట్రములలో నియమ మేర్పడియున్నది. ఎట్లైనను, పైనవ్రాసినవిషయములన్నిటిని ఆలోచించినయెడల నిజముగా స్వపరిపాలితరాష్ట్రముల లోనే అధికారశాఖకు సహజపరిస్థితులనుబట్టి యెంతటి ప్రాబల్యముండునదియు నర్థము కాకపోదు. ఉత్తమాధికారి యీ శాఖ కంతటికిని తలమానికము. పరిపాలనయనునట్టి బహుశాఖాన్వితమహా కార్యమున కాతడు జీవకళ. శాసనసభ ప్రతినిధిగా ఈకార్యమునంతయు నిర్వహింప దక్షత కలవాడు. శాసనసభలో ప్రత్యక్షముగనో మరియేరీతినియో శాసనోపక్రమణము చేయుట యందతనికి తగినంత స్వాతంత్ర్యము కలదు. శాసనసభలలోకల పలుకుబడిచేతను, శాసనములను రద్దుచేయు సధికారముచేతను, తాత్కాలిక శాసనములనుచేయు స్వాతంత్ర్యముచేతను, శాసనసభలను కూర్చుట వాయిదా వేయుట రద్దుచేయుట ఇత్యాదివిషయములలోగల యధికారముచేతను, ఇతరరాష్ట్రములతో సంధిసంబంధములు నిర్ణయించుటలోగల యధికారముచేతను, సైన్యాదికముల సర్వాధిపత్యముచేతను దోషస్థు లనుకొనినవారిని సయితము క్షమించుబలము కలవాడగుటచేతను అత డసమానశక్తి కలవాడగుచున్నాడు.

ఉత్తమాధికారి నియామకము

కాబట్టి యీయుత్తమాధికారిని నియమించుటలోను, వశవర్తినిచేసికొనుటలోను నాగరకరాజ్యములు బహు జాగరూకతతో నియమనిబంధనలను కావించుకొనియున్నవి.

ఉత్తమాధికారి నియామకము ఎల్లరాష్ట్రములలోను ప్రజలయాధీనము నందులేదు. కొన్నిరాజ్యములలో ఇప్పటికిని పరంపరాగతముగా నేర్పడురాజులు గలరు. కొన్ని రాజ్యములయందు స్త్రీలు సింహాసనమునకు రానర్హులుకారు. పురుషసంతతిలోనివారే రాజ్యాధికారనిర్వహణమునకు నర్హులు. స్త్రీలో పురుషులో ఎవ్వరు అధికారము వహించు వారై నను నేటిదినము నాగరికరాష్ట్రములలో పరంపరాగతప్రభువుల శాయశక్తులు మిక్కిలి సంకుచితములై యున్నవి. ఆంగ్లభూమిలో రాజు కలడు. అతడే మన చక్రవర్తి. కాని యూతనికి ఏవిధమగు నధికారమునులేదు. అతనికి రాజకీయవిషయము లలో ప్రత్యేకవ్యక్తిత్వమేలేదని చెప్పవచ్చును. రాజ్యములోని సర్వాంగములును మంత్రుల యధీనమునం దుండును. రాజుకి కన్ను, కాలు, చేయి, మెదడు సర్వమును ఈ మంత్రివర్గమే. మహాసంగ్రామము నందోడి తలదాచుకొనువరకును జర్మనీలోను సామ్రాట్టుండినాడు. అతడును సామ్రాజ్యములోని శిష్టసభకు సంపూర్ణముగా నంకితుడు. కాని అందులో చేరిన ప్రష్యాదేశమునకు నతడు నిరంకుశు డైన ప్రభువుగానున్నందున శిష్టసభలో నతనికి పలుకుబడి యెక్కువ. ఇదిగాక సామ్రాజ్యముఖ్య మంత్రిని నియమించుకొను నధికారమును అతనికి కలదు. ఆముఖ్యమంత్రి ప్రజలకు జవాబుదారీ పడువాడుగాడు, చక్రవర్తికే జవాబుదారీపడువాడు. ఈకారణములచేత జర్మనీ కేయిజరుయొక్క శాయశక్తులు మహాద్భుతముగా నుండినవి. నిరంకుశమగు నధికారవర్గమును నియమించి అతడు సామ్రాజ్యమును ఇష్ట ప్రకారము పరిపాలించుచుండినాడు. నేడు జర్మనీలో కెయిజరులేడు. అతనికి తరువాత నేర్పడిన యుత్తమాధికారియు లేడు. ప్రజాప్రతినిధి ప్రభుత్వము 1933–వరకు అన్ని దేశములందువలెనే సాగినది. ఆసంవత్సరము నందు హిట్లరు పార్టీవారు- వారే నాజీలు- ప్రభుత్వమునకు వచ్చిరి. సర్కారు ఉద్యోగములలో, వ్యాపారములలో, వృత్తులలో అన్నిటను యూదులకు, లిబరలులకు, సోషలిస్టులకు తావులేకుండ జేసిరి. 1933-లో, 1934-లో ప్రజలు పదింట తొమ్మిదిపాళ్ళు వోట్లువేసి యీపార్టీయందు తమకు విశ్వాస మున్నదని ప్రకటించిరి. 1934 ఆగస్టులో అదివరకు అధ్యక్షుడుగా ఉండుచుండిన హిండెంబర్గు చనిపోయెను. ఆ స్థానమును భర్తీచేయకుండ హిట్లరు తనహోదాలో దానిని లయముచేసివేసెను. నాటినుండి జర్మనీలో హిట్లరు 'నాయకుడు'గా - వీనినే ఫూరరనుటయుకలదు. ఏకపక్షనాయకుడై , సర్వాధికారధూర్వహుడై పనిచేయుచున్నాడు.

ఇప్పటికిని ఇటలీలో పరంపరాగతప్రభు వున్నాడు. కాని అచ్చటను ముస్సోలినీ 'డ్యూస' నే పేరుతో ఏకపక్ష నాయకుడయి సర్వాధికారధూర్వహుడై యేలుచున్నాడు. నిజమునకు హిట్లరుకు ముస్సోలినీ గురువు. ఇతడే నేటి ఫేసిస్టు విధానమును 1922–వ సంవత్సరమున ఇటలీలో ప్రవేశపెట్టెను. పెట్టుబడిదారులు కర్మకరులు పోరాడుకొని జాతీయసౌభాగ్యమును చెడుపుదురను సిద్ధాంతమును ఆధారముచేసి సమభాగములుగా వారును వీరును అధికారమునకు వచ్చునట్లు చూచునుద్దేశమును ముందిడుకొని యితడు సంస్కారము లారంభించెను. వీరిద్దరకు తగవుతీర్చే యధికారిగా తనపార్టీని నియమించెను. శాసనసభలు రెంటి యెన్నికలలోను ఈపార్టీ మొత్తము మెంబర్లనుపేర్కొని జాబితాచేయును. వోటరులు ఈ జాబితాను మొత్తముగా అంగీకరింపనైనను అంగీకరింపవలెను. తిరస్కరింపనైనను తిరస్కరింప వలెను. ఇతని పార్టీ బలమున్నంతసేపు అంగీకరింపకుండుటకు వీలెక్కడిది!

పరంపరాగతపద్ధతి యింకను జపాను, పర్షియా, బెల్జియము, బల్గేరియా, డెన్మార్కు, ఈజిప్టు, మెసొపొటేమియూ, ఇటలీ, హాలండు, రుమేనియా, సయాము, యూగోస్లేవియా మున్నగు స్వతంత్రరాష్ట్రములలోను బ్రిటిషువారికి, ఫ్రెంచివారికి మున్నగు అయిరోపియను రాష్ట్రములకు లోబడిన సామంతరాజులు ప్రభువులుకలచోట్లను కొంతకుకొంతయో పూర్ణముగానో ప్రచారమందున్నది. ఇందు కొన్నికొన్నిట ప్రజాపరిపాలన వేరునాటి పరంపరాగతపద్ధతియొక్క నిరంకుశత్వము మట్టు పడినది. కొన్నిట ఇంకను మట్టుపడలేదు. మహాసంగ్రామము కారణముగా రుష్యా, యిత్యాది రాజ్యముల ప్రభువులు పలాయితులయినారు. ప్రజాధికారము స్థాపితమగుటకు మహత్తరమయిన యల్లకల్లోలములు జరిగినవి, జరుగుచున్నవి.

ప్రజలు ఉత్తమాధికారిని నిర్వచించుకొను చోట్ల విధానములు భిన్నములుగా నున్నవి. శిష్టసభలకు ప్రతినిధులను నెన్నుకొనుటకు నేర్పడి యుండు ప్రత్యక్షపరోక్ష నిర్వచనపద్ధతులు రెండును నీయుత్తమాధికారినిర్వచనమునందు వినియోగపడుచున్నవి,

ఉత్తమాధికారిని ప్రజలే నేరుగా నెన్నుకొనుపద్ధతి అముఖ్యములైన కొన్ని రాజ్యములలోమాత్రము వ్యాప్తి యందున్నది. దక్షిణఅమెరికాలోని పెరు, బ్రెజిలు ఇత్యాది రాజ్యములయందుమాత్రము ఈ పద్ధతి యవలంబింప బడుచున్నది. అమెరికాసంయుక్త రాష్ట్రమునందు పేరునకు పరోక్షపద్ధతి యనుసరించు చున్నారు గాని నిజమున కది ప్రత్యక్షపద్ధతియే యని చెప్పవలసియున్నది. ప్రజలు ప్రత్యేకముగా నిర్వాచకులను నెన్నుకొనుచున్నారు. వారు అధ్యక్షుని నెన్నుకొనవలసి యుందురు. ఇది సంయుక్తరాష్ట్రములకు నేర్పడియుండు విధానము. ఈ విధముగా పరోక్షనిర్వచనపద్ధతి అచ్చటనేర్పడి యున్నను అచ్చట ఈపరోక్షనిర్వచనపద్ధతి నిజముగా పరోక్షపద్ధతి మాత్రముకాదు. ఏలయన, అమెరికాసంయుక్తరాష్ట్రములలో 'కక్షలు' పరిపూర్ణముగా నేర్పడియున్నవి. ఒక్కొక్క కక్షికిని మండలము మండలములోను, గ్రామము గ్రామములోను తప్పక సంస్థలు నెలకొనియున్నవి. నిర్వచనాధికారము కలవాడొక్కడును ఈసంస్థలలో నేదో యొక సంస్థకు చేరనివాడులేడు. ఎప్పుడు అధ్యక్షుని నియామకము కావలసియున్నను ఈ కక్షలవారు గొప్పసమావేశములలో, అనగా రాష్ట్రీయసమా వేశములలో చేరి ఎవ్వ డధ్యక్షుడుగానుండ నర్హుడో అతనిని బేర్కొనుచున్నారు. తరువాత ఆకక్షికి చేరిన వారందరును ఆతనినే అధ్యక్షుడుగా నిర్ణయించి కావలెను. అందుచేత నామకార్థముఅధ్యక్షక నిర్వాచకులుగా నేర్పడు మధ్యవర్తులగు ప్రత్యేక నిర్వాచకులును కక్షిచే నియమితుడగు వానినే నిర్వచింపకతప్పదు. ఈకారణముచేత ఇటీవల అమెరికా సంయుక్తరాష్ట్రములలో నొకక్రొత్తయుద్యమము ప్రారంభ మయినది. అధ్యక్షపదవికి పరోక్షనిర్వచనము పనికిరాదు. ప్రత్యక్షనిర్వచనమే యేర్పడవలెను, అనుటయే యీ యుద్యమముయొక్క సారాంశము. పరాసుభూమిలో పరోక్షనిర్వచనమే ఉత్తమాధికారి నియమనమున కాధారమై యున్నది. శాసనసభలు రెండును ప్రజలచే నిర్వచితములు. ఈరెండు సభలును చేరి అధ్యక్షుని నియమించుచున్నవి. ఈపద్ధతి ఫలప్రదమని వాదించునట్టివారు రెండు కారణములను నిరూపించుటగలదు. అధ్యక్షకపదవియం దుండువారు చేయవలసినకార్యముల కొక ప్రతిభ కావలయుననుట నిక్కువము. అట్టిప్రతిభ యెవ్వరికి పూర్తిగా గలదని నిశ్చయించుటకు ప్రజాసమూహమునకు తగిన శక్తి చాలదు శాసనసభల ప్రతినిధులకు అనుభవముపైని ఆశక్తి కలిగి యుండగలదు. ఇది మొదటికారణము. ఇక రెండవ కారణమో, కార్యనిర్వహణమునందు ఒద్దికతో పనిచేయవలసియుండువారలు రాష్ట్రాధ్యక్షుడు, రాష్ట్ర శాసనసభ. రాష్ట్రశాసనసభవారు అధ్యక్షుని నెన్నుకొందురేని వారికిని, ఈతనికిని చక్కని పొందు పొసగగలదు. అవును కాని, శాసననిర్మాతలే శాసననిర్వాహకుని నేర్పరచుట సంభవించుచున్నదే. ఇది నష్టదాయకముకాదా అనువారు కొందరున్నారు. అంతియేగాక అధ్యక్షునియెన్నికలు రభసముతో జరుగవలసియున్నప్పుడు శాసనసభలోనిసభ్యులు అందులో నిమగ్నులయినయెడ అవసరమగు శాసననిర్మాణముగతి యేమగును అని మరికొంద రడుగుచున్నారు. అధ్యక్షుడు కాదలచుకొనినవాడు తన యధ్యక్ష కాధికార కాలమునందు శాసనసభసభ్యులలో పలుకుబడికలవార లకు రాష్ట్రములో నధికారమిత్తునని వాగ్దానముచేసి వశవర్తులను చేసికొనుటకు వీలుండదా అని ఇంక కొందరు ప్రశ్నించుచున్నారు. ఇంతియగాదు. ఏకొలదిమందికో అధ్యక్షనియామకశక్తిని ప్రసాదించినచో ఆ యధ్యక్షుడు ఆకొలదిమంది చెప్పునట్టి మాటలకు చెవియొగ్గవలసిన వాడగును. ముఖ్యమగు విషయములలో స్వతంత్రుడుగ ప్రవర్తింపలేడు. మన జిల్లాబోర్డు మునిసిపాలిటీల అధ్యక్షుల స్థితిగతులే ఇందుకు తార్కాణములు. కార్యనిర్వహణము కావింపవలసిన యధ్యక్షుడు మహాజనముచే ప్రత్యక్షముగా నెన్ను కానబడునేని ములహాయిజాపెట్టి తన నిర్వాచకులను తనవశవర్తులుగా చేసికొనుటకుగాని నిర్వాచకులు కార్యాచరణమున నతని స్వాతంత్ర్యమును నిరోధించుటకుగాని వీలుండదు.

నిర్వచితుడైనను తనయధికారము శాశ్వతమనుకొనునేని నిరంకుశుడు కాకపోడు. అందుచేతనే ఉత్తమాధికారిని నిర్వచించుకొను రాష్ట్రములన్నియును అట్టియధికారి యధికారమునకు కాలపరిమితి ఏర్పరచియున్నారు. అమెరికాసంయుక్తరాష్ట్రముల యధ్యక్షునకు అధికారము నాల్గుసంవత్సరముల కాలము. తరువాత అతడు మరల నిర్వచితుడుకావచ్చును. అగునను నమ్మకముమాత్రము లేదు. పరాసుభూమిలో, అధ్యక్షున కధికారము ఏడేండ్లు. అతడును మరల నియమితుడైనకావచ్చును. చిలీదేశపు టధ్యక్షునకు కాలపరిమితి యైదేండ్లే. అతడు మరల నిర్వచితుడు కానేకాడు. ఈ తీరుగా నిర్వచితులైన ఉత్తమాధికారులుండు రాష్ట్రములంతటను వారియధి కారకాలము నాల్గుసంవత్సరములకు తక్కువగాక ఏడుసంవత్సరములకు నెక్కువగాక కాన్పించు చున్నది. ఇందులకు కారణము సులభముగా నూహ్యము. అధికారకాలపరిమితి మిక్కిలి తక్కువగా నున్న దనుకొందము. ఒక్కసంవత్సరమే యని తీసికొందము, అప్పు డథికారమున నుండు నాత డేమిచేయగలడో యాలోచింపుడు. చుయ్యిమని పెనముమీద అట్లుపోసినట్లుగా రాచకార్యములు చేయుటకు రాదు. కొంతవ్యవధియుండిననే గాని యుపక్రమితమయిన కార్యమును ఫలోన్ముఖము చేయుటకురాదు. సంవత్సరములోపుగా ఫలోన్ముఖత్వమును చూపుమనిన నేయధ్యక్షుడును చూపగలవాడుకాడు. మరి, సంవత్సరకాలమే యధికారకాలమందు రేని ఆయధికారికి కార్యములపట్ల, యభిప్రాయములపట్ల దార్ఢ్యముగూడ శూన్యమే యగును. ఈ నాడుండి రేపు పని వదలిపోవువార మేగదా మనకేల యీగొడవ, ప్రజలలోని మూక మనల మననీయదు, “ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కామాట లాడి యన్యులమనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ !" యను వెఱ్ఱి వేదాంతములకు దిగవచ్చును. ఇక నధికారపరిమితి చాల యెక్కువాయెనా-పదేండ్లు ఇరువదేండ్లయి శాశ్వతత్వమువంకకుములునూపెనా— వచ్చినదే లాభము, చే జిక్కినదే ఫలము, అధికారమున్నంత దనుక ననుభవింతము అను దురాశ జనించి దానిపనిని అదిచేసికొన వచ్చును. ఈ యెల్ల సందర్భము లాలోచించియే నాగరకరాష్ట్రములు అధికారము నిడుపునుగాక, కుఱుచయును గాక యుండు నట్లుగా కాలపరిమితిని నియమించి యున్నవి.

ఒక్క సారి ఉత్తమాధికారమునకు వచ్చినవాడు మరల మరల వచ్చుచుండుటకు అవకాశము ఉండతగిన దేనా యనుప్రశ్న కొందరకు దోచవచ్చును. అధ్యక్షుడుగానుండి ప్రతిభావంతుడై దేశసేవ బాగుగా చేసినయట్టి యాతడు మరల తత్సేవకు నర్హుడు కాకపోవుట దేశమునకు లాభదాయకము కాదనుట నిజమే, అయిన మరల నధికారము వహించుట కర్హుడు అను నాధారముండెనేని అధికారమునకువచ్చినవాడు అధికారమును మరల సంపాదింపవలయునను నాశమై ప్రజలలో నెక్కువమందికి రుచికరముకాని కార్యము తనకు న్యాయమని తోచినప్పటికిని చేయక మానివేయ వచ్చునుగదా ! చేయరాని కార్యములును చేయవచ్చును గదా! అయిన పునర్నిర్వచనము అఖండముగా నెచ్చటను నేర్పడలేదు. అమెరికాసంయుక్తరాష్ట్రములలో పునర్నిర్వచనమువిషయమై రాజ్యాంగ శాసనములలో నేమియు చెప్పబడియుండలేదు. కాని అచ్చట ఆచారమున నొక సిద్ధాంత మిప్పటి కేర్పడి యున్నది. మొదటి యధ్యక్షుడు పునర్నిర్వచనమునందెనుగాని రెండుపర్యాయముల కంటె నెక్కువగా నధ్యక్షకపదవియం దుండనని నిరాకరించెను. అది నేటికి సూత్రమయినది. రెండు పర్యాయములకంటె నేయధ్యక్షుడును నిర్వచితుడగుటలేదు. పరాసుభూమిలో అధ్యక్షుడు పునర్నిర్వచితుడు కాకూడదను సిద్ధాంతములేదు. పునర్నిర్వచితుడు కాదలచుకొనిన కావచ్చును. కాని అచ్చట నట్టి పునర్నిర్వచనముజరిగినదే లేదు. ఒక్క మెక్సికోలో మాత్రము అధ్య క్షుడు పునర్నిర్వచనము పేరుపెట్టుకొని 1884 నుండి 1916 వరకు అనగా 32 సంవత్సరములు రాజ్యమేలుట సంభవించినది. ఇతనిపేరు 'పొర్‌ఫిరియోడయజ్'. ఇతని పరిపాలన ప్రజలకు శాంతిప్రదముగానే యుండినది. ఇతనికి తదనంతరము మెక్సికోలో అంతఃకలహములు ప్రతిదిన చర్యలైపోయెను. 1921 నుండి 1930 లోపల పదునొకండుగురు అధ్యక్షులు మారిపోయిరి. ఇప్పటి కింకను 'మెక్సికో'కు స్థిమితములేదు. దీర్ఘ కాలము రాజ్యమేలునట్టి యధ్యక్షులందరును 'డయజ్ 'వలె సమర్థులుకారు. మనసంస్థల స్థితిగతులెరింగిన వారికి ఈ విషయ మొక కొంచెము ఎక్కువగా నర్థము కావచ్చును. పేరు నిర్వచనము. కాని నిర్వచించుటయందు పలుకుబడికలవారు పరమమిత్రులు. ఎల్ల మార్గములును అనుసరణీయములు. పదవి ఏదైనను, సామాన్యసభ యొక్క కార్యదర్శిత్వమైనను సరియే, పట్టణపాలకసంఘాధ్యక్షాదిక పదవులలో నొకటియైననుసరియే- నిర్వచితుడైనవాడే నిర్వచితుడగుచున్నాడు. పని చేయనీ, చేయకపోనీ ఆగొడవతో నక్కరయే లేదు. సంస్థనిలువనీ నీల్గనీ అదియును నాలోచనలోనికి రాదు. ఇట్టిస్థితి మాత్రముతగదు.

ఉత్తమాధికారినియామకమందు పైసూత్రములన్నిటికిని భిన్నముగా ప్రవర్తించు చిత్రమగు చిన్న రాష్ట్ర మొకటియున్నది. అది “సాన్ మెరినో”. అందు 12000 ప్రజలున్నారు. వారు 60 మంది శాసనకర్తల నెన్నుకొందురు. వారిలో నిద్దరిని 'రీజెంటులు' గా, పరిపాలకులుగా నిర్వచింతురు. వీరొక్కక్క రారు మాసములు రాజ్యమేలవలెను. ఒక్క యారుమాసములేలిన పిదప మూడేడు లావ్యక్తి మరల అధికారము వహింపరాదు. ఇటలీ ఈమునిసిపలురాష్ట్రానికి సంరక్షణకర్త.

ప్రజాప్రబోధ మెక్కువగా కలదేశములయందు నామకార్థ మొక యుత్తమాధికారియున్నను నిజముగా నధికారమును నిర్వహించువారు ప్రజాప్రతినిధులేయగుటయు సంభవించియున్నది. ఆంగ్లభూమిలోను, పరాసుభూమిలోను, ఇట్టి పరిస్థితి ప్రముఖముగా కాననగుచున్నది. కాబట్టి కదలలేని మూలవిరాట్టుకుబదులు కదలికగల యుత్సవవిగ్రహములు సర్వాధికారమును తల ధరించుచున్నారు. అందుచేత నీయుత్సవవిగ్రహముల వర్ణన యవసరము. ఈ యుత్సవవిగ్రహముల కే మంత్రులని పేరు. వీనివర్గమునకే మంత్రివర్గమని పేరు.

ఉత్సవ విగ్రహములు

నేటి 'మంత్రివర్గ' పద్ధతికి ఆంగ్లభూమి పుట్టినిల్లు. ఈమంత్రివర్గము పేరు ఏశాసనములోనులేదు. కాని మంత్రివర్గమునకుగల బలము మరి రాష్ట్రములోని ఏయధికారికిని కానరాదు. ఇంతటి శక్తివంతమగు సంస్థ యెట్లేర్పడినదా యను శంకయక్కర లేదు. ఆంగ్లప్రజలు శతాబ్దములుగా దీనిని కట్టుకొని వచ్చినారు. ఆచరిత్ర వ్రాయగడంగిన నది యొకగ్రంథమగును. నేడుమంత్రివర్గ మెట్లేర్పడుచున్నదో యిచ్చట వర్ణించిన చాలును. ఆంగ్ల ప్రజలు ప్రతినిధిసభను ఎన్నుకొను చున్నారు. అందులో నేదో యొక కక్షికిచేరినవారు ఎక్కువ సంఖ్యాకులుగా నుందురు, ఆకక్షికి చెందినవారిలోనుండి యొక్కరను రాజు ముఖ్యమంత్రిగా నియమించుకొనవలెను. రాజ్యములోని యుత్తమాధికారియగు రాజున కింతకంటె నెక్కువ యధికారములేదు. ముఖ్యమంత్రి యేర్పడినతోడనే అతడు తనతో నుండి పనిచేయదగిన మంత్రు లెవ్వరో వారిని తన కక్షిలోనుండి నియమించుకొనుచున్నాడు. ఈమంత్రులే ముఖ్యమంత్రితో గూడ మంత్రివర్గ మగుచున్నారు. వీరు ఎల్లరును ప్రజాప్రతినిధులు. ప్రజలకు నేరుగా జవాబుదారి కలవారు. ఎప్పుడు ప్రజలకు వీరియెడల విశ్వాసము లేదో అప్పుడే వీరు రాజీనామా యియ్యవలసిన వారు. అందుచేత ఆంగ్లభూమిలోని సర్వాధికారమును వీరియందు కేంద్రీకృతమగుచున్నది. ప్రజలలోని ఎక్కువ సంఖ్యాకుల యనురాగము వీరిపక్షమున నున్నంతకాలము వీరే ప్రజాప్రతినిధి సభకు నాయకులు. అందుచేత శాసనములు ప్రవేశ పెట్టుట, శాసనములను విమర్శించుట, శాసనములను నిరోధించుట ఎల్లశక్తులును వీరియందు నిక్షిప్తములయి యున్నవి. ఇంతియగాక ఈమంత్రివర్గమునందలి యొక్కొక్కరును ప్రభుత్వశాఖ యొక్కొక్కింటికి సధ్యక్షులుగా నేర్పడుచున్నారు. కాబట్టి ఆంగ్లభూమిలో ప్రజల యనురాగమును పెట్టుకొనిన యంతకాలము మంత్రివర్గము శాసన నిర్మాణనిర్వహణముల రెంటను నుత్తమాధికారి.

ఆంగ్ల \భూమిలో బహుకాలముగా రెండుకక్ష లే ఏర్పడి యున్నవి. ఇప్పుడు బలవంతమగు మూడవకక్షియు నేర్పడినది. ఈకక్షులలో స్వల్ప భేదములును నున్నవి. కాని విశేషభేదములు చాలకాలముగా గాని, చాలయెక్కువగా గాని లేకపోవుటచేత 'మంత్రివర్గము' లకు కొంతకు కొంత దీర్ఘాయువు సమకూరుటకలదు. ఇంగ్లీషువారికి వివేచనశక్తి మెండు. యుద్ధము సంప్రాప్తమయినప్పుడేమి, మహాప్రళయమువలె ఆర్ధిక దైన్యము లోకమును ముంచివేయుచున్ననాడేమి ఇంగ్లీషువారు ఉన్న కక్షలనుజంపుకొని సర్వ శక్తలను కేంద్రీకరించిపనిచేయు నభ్యాసముచేసినారు. ఆ కారణముచేత దేశ కార్యములు దీక్షతో జరుగుటకు అవకాశముదొరకి 'మంత్రివర్గము' యొక్క బలము స్థిరపడుటకు వీలైనది. పరాసుభూమిలో నిట్టిపరిస్థితి దొరకినది కాదు. అచ్చటను 'మంత్రివర్గ ' పద్ధతి పూర్ణముగా నెలకొనియున్నది. 'మంత్రివర్గ' పు టనుమతిలేనిది అధ్యక్షు డేమియు చేయుటకు రాదు. ప్రజలవిశ్వాస మున్నంత కాలము 'మంత్రివర్గము' నిలుచును. వారి విశ్వాసము లేనప్పుడు వారు రాజీనామాఇచ్చి తీరవలసియున్నారు. అన్ని కట్టుదిట్టములును ఆంగ్లభూమీలో వలెనే ప్రచారమందున్నవి. కాని 'మంత్రివర్గము' పరాసుభూమిలో ఆంగ్లభూమిలోవలె అంత బలవత్తమము కాలేదు. కారణ మేమందురా, పరాసుభూమిలో కక్షులు ఎక్కువ. ఒక్క కక్షి,కైనను నిశ్చయమగు పలుకుబడిలేదు. నేడీ కక్షిలోనివాడు రే పింకొకకక్షి, ఎల్లుండి మరియొకకక్షి. మూడవనాడు నాల్గవకక్షి, ఇట్లగుటనుచేసి మంత్రివర్గములోనే యొకకక్షివా రుండుటలేదు. ఏవో సమాధానములుచేసికొని పలువిధముల యభిప్రాయములవా రొకసమూహముగా చేరి పనిచేయుచుందురు. ఈవిధమగు నైక్యము బహుకాలము పొసగదు. కాబట్టి మంత్రివర్గము మాటికి మాటికి - సంవత్సరములోపుగ ననియే చెప్పవచ్చును. — మారుచుండట కలదు, అదియే పరాసుభూమిలోని మంత్రివర్గపు బలహీనతకు ముఖ్యకారణము.

ఇటలీలోను పరాసుభూమిలోని స్థితిగతులే చాలకాలము కానవచ్చినవి. అసంఖ్యాకములగు కక్షలుండినవి. ఈకక్షలైనను పరాసుభూమిలోవలే తమ విభేదములు పోగొట్టుకొని తాత్కాలికముగానై నను నేకమగు మార్గమును కానరాదు, ఎవ్వరికి వారు నిర్ధారించుకొని పనిచేయుట ఆ దేశమునందు ఆచారమైయుండినది. అందుచేత అచ్చట మంత్రు లేకీభవించి యొకవర్గముక్రింద నేర్పడుటే కష్టముగా నుండినది. ఒక్కొక్కరికి పొత్తుపొసగక యుండుటను బట్టి వీరి నేకముఖమునకు దెచ్చుకొను పని రాజుదే యయిపోయి అతనికి మంత్రులమీద నెక్కున పలుకుబడి యుండుచు వచ్చినది. మంత్రులను నియమించుట యందును అతని కెక్కువ యధికారమే కలిగినది. ప్రపంచ యుద్ధానంతర మిటలీలో ప్రాతరాజకీయనాయకుల యలసత ప్రజలకు విసుగుపుట్టించినది. సీన్యియరు ముస్సోలినీ ముఖ్యమంత్రియైనాడు. దేశసౌభాగ్యమును దీర్చుటకు గట్టిగా పనిచేయ నెంచినాడు. ఇదివరలో సంక్షేపముగా వర్ణితమైన ఫేసిస్టువిధానము నమలులో పెట్టినాడు. ఇటలీరాజు కార్యదక్షుడగు నీ మంత్రికి ప్రోత్సాహకుడుగ నున్నాడు. మొన్న హిట్లరుకు స్వాగతమిచ్చి నప్పుడు ముస్సోలినీకి అగ్రమున రాజేయుండుట గమనింపదగినది.

మంత్రివర్గముపద్ధతి ఐరోపాఖండమునం దెక్కువ ప్రచారముననున్నది. బెల్జియము, హాలండు, నార్వే, స్వీడను ఈరాజ్యములనెల్లను ఈపద్ధతియే నెలకొనినది. నేడు క్రొత్తగా నేర్పడుచుండు రాష్ట్రములలోను ఐరోపాలో నీపద్ధతియే ప్రాబల్యము చెందవచ్చును. దీనిని పార్లమెంటరీ పద్ధతియని వర్ణింతురు.

అమెరికాఖండమునందు 'అధ్యక్షక ' పద్ధతి యెక్కువ వాడుకలోనున్నది. దీనిని డెమొక్రాటికు పద్ధతియన్నారు. దీనికంటెను మంత్రివర్గపద్ధతియే ప్రజాధికారానుకూలమని అమెరికారాజనీతి వేత్తలుగూడ నంగీకరింప నారంభించినారు. ఈపద్ధతియే మనదేశమునను నెన్నటికైనను నెలకొననున్నది. ఇప్పటికి మంత్రులు కోస్త్రాలలో నేర్పడి రాజ్యమేలుచున్నారు. ఇండియారాజ్యాంగ శాసనములో నేమివ్రాసియున్నను, కాంగ్రెసువారి అపార దేశభక్తి త్యాగములు కారణముగా, మంత్రులు నడుపునట్టి అనుదినపరిపాలన కార్యక్రమమునందు గవర్నరులు తమ ప్రత్యేకాధికారములు వినియోగించికాని యితరవిధములనుగాని అడ్డమురామని యంగీకరించి అట్లే నడచుకొనుచున్నారు. ఆచారబలము శాసనబలమును రద్దుపరచునను సిద్ధాంతముతో పనులు జరుగుచున్నవి.

మంత్రిగానిండు, అధ్యక్షుడుగానిండు, డిక్టేటరుగానిండు, ఎవ్వరైనను ఉత్తమాధికారిగా నేర్పడువాడు చేయవలసిన పని యనంతమనుట ఇదివరలో సూచితమైనది. కాబట్టి ఆయుత్తమాధికారి తనపనిని శాఖలక్రింద విభాగించి ఒక్కొకశాఖకును నొక్కొకయధికారిని ప్రత్యేకముగా నియమించుచున్నాడు. అతని ననుసరించి క్రింది యధికారులెల్లరును పనిచేయవలసియుందురు. మంత్రివర్గపద్ధతి కల చోట శాఖలకెల్ల మంత్రులే అధికారులగుచున్నారు. వారి యుత్తరువుల ననుసరించి రాజ్యకార్యములు నడుచుచున్నవి. అధ్యక్షకపద్ధతికలచోట అధ్యక్షుడు శాఖాధికారులను నియమించుట కలదు. వారు అతని యుత్తరువుమేరకు ప్రవర్తింపవలసి యుందురు.

పరిపాలనయే నేడు ముఖ్యతనుము

నేటిరాజ్యములలో ఆర్థికదృష్టితప్ప ఇతరదృష్టులన్నియు నశించినవని చెప్పవచ్చును. 'నారాజ్య మేమేమి యుత్పత్తిచేయుచున్నది? ఎంతెంత? నాప్రజలలో ఎందరకు పనిలేదు? వీరికి పనికల్పించుట యెట్లు? నాదేశపు ఎగుమతులెంత? దిగుమతులెంత? ఎగుమతు లెక్కువయగుచున్నవా? దిగుమతులెక్కువయగుచున్నవా? వ్యవసాయము, పరిశ్రమలు, వ్యాపారము ఇందులో నా దేశము ఇతరదేశములతో తులతూగుచున్న దా? తగ్గిపోవుచున్నదా? ఇతర దేశములు ఇందులో నన్ను వెనుకకునెట్టకుండ నుండవలెనన్న నేనెన్నియెన్ని ఉపాయములు చేయవలెను? దిగుమతుల నరికట్టవలెనా? ఎగుమతుల నరికట్టవలెనా ? సుంకములు పెంచవలెనా? సైన్యములు పెంచుకొన వలెనా? నావికాబలము పెంచుకొనవలెనా? ఆకాశవిమానబలము పెంచుకొనవలెనా? చేతికిచిక్కిన ప్రాంతము లాక్రమించుకొని ముడిసరకులు- వ్యవసాయముచేత తయారగునవి, ఖనిజములు - సరఫరాచేసుకొనవలెనా? నా దేశము తయారుచేసినవస్తువులకు వానిని విక్రయాంగణము చేసికొనవలెనా?” ఇట్టివియే నేడు ప్రతిరాష్ట్రములోను రాష్ట్రకార్యనిర్వాహకులు — అధ్యక్షులు కానిండు, మంత్రులుకానిండు, డిక్టే టరులుకానిండు- తీర్చవలసిన ప్రశ్నలుగా నేర్పడినవి. అన్నిచోట్లను సర్వప్రజలది ప్రభుత్వమని యేర్పడుట చేత సర్వప్రజల కూటికి, నీటికి, సౌఖ్యమునకు కావలసిన యెల్లయేర్పాటులు తమవియేయని పరిపాలకులు బాధ్యత వహింపవలసి వచ్చుచున్నది. వ్యవసాయము, పరిశ్రమలతో గూడ స్వాధీనముచేసికొని — పనిచేయువారు ప్రజలే యైనను— ప్రజలలోని యేవ్యక్తియు ఇదినాయాస్తియని యనుటకు వీలులేనట్లు విత్తడము, నాటడము, ధాన్య మమ్మడము, ఇనుము కాయడము, బండ్లకమ్ములుచేయడమువగైరా అన్నిపనులును సర్కారుద్వారానే జరుపుచుండడము ఈదినము రుష్యాలో జరుగుచున్నది. 1932-లో రెండుకోట్లటన్నుల గోధుమ దేశములో పండినది. 1933 లో ఇంకొక 80 లక్షల టన్నులు హెచ్చుచేయవలెనని సంకల్పించినారు. సాధించినారు. ఇనుము కోటి ఇరువదియొకలక్షటన్నులు తయారైనది. కోటి ఏబదిలక్షలు కావలెనన్నారు. చేసినారు. ఇవి ఉదాహరణములు. ఐదేసి సంవత్సరములకు ఒకపర్యాయము ఒక్కొక్కవస్తువును గురించి ప్లాను వేయడము ఉత్పత్తి పెంచుచుపోవడము అచ్చటి గవర్నమెంటుపద్ధతి. దేశాభిమానమని ప్రేరేచి పనివారిచేత పనిచేయించడము వారికర్తవ్యము. నిండుకడుపు పెట్టనీ అరకడుపుపెట్టనీ ఆదేశములో పనిలేని మగవాడుగాని ఆడదిగాని లేదనిపించినారు. ఇంతపని జరుగవలెను కాబట్టి సోమరిపోతులనుగాని, పనికితగిన చదువు, శిక్షణలులేనివారినిగాని దేశములో ఉండనిచ్చుటకు వీలులేదు. అందువలన పుట్టిన ప్రతిశిశువు చదువు, శిక్షణ, పోషణ లన్ని టిని గవర్నమెంటే భరించినది. పని పూర్తిచేయించవలసిన బాధ్యతగల అధికారి పూర్తిచేయించ లేకపోతే ప్రాణ దండనలు విధించినారు.

ఇంత సంపూర్ణముగా కాకపోయినను ఏకొద్దిభాగమైనా ఇటువంటిపని అన్ని దేశములు చేయవలసినదిగా నున్నది. అమెరికాదేశములో ప్రెసిడెంటు రూజ్విల్టు 'న్యూ డీలు' అని నేడు ప్రసిద్ధమైయుండు నూతనవిధానము ననుసరించి పదులలక్షలకొలది పనిలేనివారికి జీవనము కల్పించినాడు. ఇంకను ప్రయత్నించుచున్నాడు.

ప్రజల కూటికి, నీటికిసంబంధించిన ఉద్యమముల కంటే ఈవిషయములందు దేశదేశానికి కలిగియుండే పోటీచేత దేశసంరక్షణకని ఒక్కొక్క ప్రభుత్వమువారును సృష్టించుచుండేపరిశ్రమ అపారముగానున్నది. ఆకాశవిమాన నిర్మాణము, యుద్ధనావలనిర్మాణము, ఫిరంగుల నిర్మాణము,. మందుగుండ్ల నిర్మాణము, సైనికులకు కావలసిన ఇతర వేయిన్కొక్క వస్తువుల నిర్మాణము, తుదకు వారితిండితీర్థముల సరఫరా ఈభాగమంతయు ప్రతిదేశములోను ప్రభుత్వముద్వారా జరుగకతప్పదు. ప్రభుత్వములు ఈదినము దీనికై పెట్టుచుండేకర్చు మరిదేనికిని పెట్టడములేదు. అందులోను ఈకార్యములో అంతటను కొంతరహస్యముండి తీరవలెను. ఈకార్యసాధనకు ప్రభుత్వాలకు ఏనిమిషమున కానిమిషము దేశద్రవ్యముమీద అధికారముండవలెను. దేశములోని ఫేక్టరీలమీద అధికార ముండవలెను. అందులో పెట్టుబడి పెట్టువారిని బలవంతపెట్టవలసివచ్చును. పనిచేసేవారిని బలవంతపెట్టవలసివచ్చును. ప్రత్తి, అల్యూమినియము వంటివస్తువుల ఉత్పత్తి మొదలుకొని. “అవి దేశములో నుండవలెనా? బయటికి పంపవచ్చునా? ఎంత పంపవచ్చును? ఎంత నిలపవలెను?”అనే విషయాలతోకూడా నిర్ణయాలు చేసే అధికారము గవర్నమెంటు నడిపేవారి కుండవలెను. ఇన్నివివరాలకు జవాబుదారివహించి నడుపవలసిన పనివిషయమయి శాసనసభ లెంతవరకని నిర్ణయములుచేయగలవు? 365-దినములును 24-గంటలును కూర్చొనినను ఏశాసనసభయు ఈకార్యభారమంతయును వహింపలేదు. రుష్యాలో స్టాలిను అతనిపార్టీయనుచరులు రమారమి డిక్టేటరులుగానే పనిచేయుచున్నారు. అమెరికాలో ఎన్నికయయిన తరువాత అధ్యక్షునిదే సర్వాధికారము కాబట్టి రూజ్విల్టు నిరంకుశముగానే పనిజరిపినాడు. తుదకు సుప్రీముకోర్టు అతడు తీసికొనినచర్య కొంతశాసనవిరోధమని కూడ తీర్మానించినను లక్ష్యముచేయని యంత చొరవతో ప్రవర్తింపవలసివచ్చినది. తాత్కాలికముగా శాసనములుచేసికొనే అధికారము ప్రజాపరిపాలితరాష్ట్రాలలోకూడ పరిపాలనలోని ఉత్తమాధికారికి ఇచ్చుచున్నారు. ఫ్రాంసులో ఇట్టిఅధికారములులేనిది. పని జరుగదని ప్రధానమంత్రి బ్లుముకోరినాడు. శాసనసభలవారు అవకాశమివ్వ లేదు. అతడు రాజీనామాయిచ్చినాడు. శాసనసభవారు పరిపాలకులకు తగిన స్వతంత్రాధికారము లిచ్చువరకు స్తిమితమగు మంత్రివర్గము లేర్పడవనుటకు ఫ్రాంసుచరిత్రయేసాక్షి. అచ్చట మూడుమాసముల కొక మంత్రివర్గము మారుచున్నది. మొత్తముమీద ఇంగ్లీషువాళ్ళు గడుసు వాళ్లు. వీరు శాసనమువ్రాసి సభవారి అనుమతి పొందినట్లే ఉంటుంది. కాని అందులో నాలుగుమూలల చెక్కుబందీ తప్ప ఇంటిప్లానేఉండదు. ప్లానంతా సర్కారువారుచేసే నిబంధనలను అనుసరించి నడవవలసిందని వ్రాసిఉంచుతారు. పై పెచ్చు రాజుగారికి ఆర్డరు ఇన్ కౌన్సిలను ఒక అధికారముంచి ఆద్వారా జరుపవచ్చునంటారు ఆ ఆర్డరు ఇన్ కౌన్సిలు వ్రాసేవారుకూడ ఈనిబంధనలు వ్రాసేవారే. అందుచేత ప్రజలవోటు తెచ్చుకొన్నంతసేపు ఇంగ్లండులో మంత్రివర్గము దేశమునకు తనకు మేలనితోచినది చేయ గలుగుచున్నది.

మనదేశ మింకను మెషీనుయుగములోనికి పూర్తిగా ప్రవేశించలేదు. మహాత్ముడు గాంధిపుణ్యమని మన పరిశ్రమాభివృద్ధికూడ గృహపరిశ్రమలకే ఉన్ముఖమయి యున్నది. అయినను మనకుగల స్వాతంత్ర్యములు చాల తక్కువ. రాష్ట్రములలో అనగా మద్రాసువంటి కోస్తాలలో ప్రభుత్వమునందు మనకు స్వాతంత్ర్య మిచ్చినా మన్నారు. ఏబదియైదేండ్లుగా మనదేశీయమహాసభ అహ రహము పోరాటము పెట్టుకొని 'వందేమాతరము', 'హోమురూలు' వంటి మహోద్యమములు బయలుదేరి తుదకు కడచిన 18 ఏండ్లుగ గాంధిమహాత్ముని నాయకత్వమున అసహోద్యమము, ఉప్పుసత్యా గ్రహము, శాసనతిరస్కారములు, సత్యాహింస లాధారముగా దేశముకై కొని లక్షలుగ ప్రజసామాన్యము జైళ్ళకు నడచి లాఠీదెబ్బలుతిని మహాత్యాగములుచేసిన పిదప ఈవాక్యము వెడలినది. గవర్నరుల ప్రత్యేకాధికారములని దానికిని దిగ్బంధనములు శాసనములో పెట్టినారు. కాంగ్రెసువారు ఎన్నిక లలో ఏడురాష్ట్రములయందు అఖండముగా దిగ్విజయము పొందికూడ ఈదిగ్బంధములకులోబడి మంత్రిత్వము లంగీకరించడములేదని గట్టిగా తిరస్కరించిరి. గవర్నరులు నడమంత్రపు మంత్రుల నేర్పరచుకొని రాజ్యమేలిరి. అది సుసాధ్యముకా లేదు. అప్పుడు కాంగ్రెసు సమాధానముచేసికొని అనుదినపరిపాలనలో గవర్నరులు తమ ప్రత్యేకాధికారములు వినియోగించుట లేదని మాట యిచ్చిరి. కాంగ్రెసు మంత్రివర్గము లేర్పడెను. అటుపిమ్మటను రెండు తరుణములలో తగాయిదా కలిగినది. రాజకీయఖైదీల విడుదల విషయమున మంత్రులు అందరిని విడువవలెనని, వ్యక్తుల కేసులు పరిశీలించి విడువవలెనని గవర్నరులు 'బీహారులోను, సంయుక్తపరగణాలలోను విభేదపడుచుండి హరిపురము కాంగ్రెసునాటికి కుదురక కాంగ్రెసు కార్యనిర్వాహకవర్గమువారితో సంప్రతించి మంత్రులు రాజీనామాలిచ్చిరి. గవర్నరులు ఆరాజీనామా లంగీకరింపక నిలిపి తమకు తగినంత వ్యవధి లేకపోయిన దనుచు అందరు ఖైదీలను విడుదలచేయుట కంగీకరించి మంత్రులు మరల ప్రవేశించుట కవకాశము కలిగించిరి. మరల ఒరిస్సాలో నిటీవల నొక విషమస్థితి కలిగెను. గవర్నరు సెలవుమీద పోనెంచెను. అతనిస్థానమున బ్రిటిషు ప్రభుత్వమువారు అచ్చటనే నౌకరీలోనున్న ఐ.సి.ఎస్ . ఆఫీసరును నియమించిరి. మంత్రులవద్ద నౌకరీచేయు ఉద్యోగి, మరల ఆనౌకరీలోనికి రావలసివచ్చినా రావలసినవాడు, మంత్రులకంటె పై హోదాలో, వారి కార్యాలోచన సభ కధ్యక్షుడుగా, వారికి యజమానిగా, కూ ర్చోడము మంత్రుల ఆత్మగౌరవమునకు భంగమని నిర్ణయించి కాంగ్రెసుమంత్రులు రాజీనామాలివ్వ సిద్ధపడిరి. విషమస్థితికలిగినదని అందరును దిక్కులుచూడ నారంభించిరి. సెలవుతీసికొనిన గవర్నరు సెలవు రద్దుచేసికొని గండముతప్పించెను. పార్లమెంటరీ శెక్రటరీలని శాసనసభ్యులలో కొందరిని మంత్రులకు సహాయకులుగా నేర్పరచినారు. కాని ఇండియారాజ్యాంగశాసనము ప్రకారము జీతములు, బత్తెములు, సెలవులు, పెన్‌షన్‌లు విషయములలోను తుదకు హెచ్చరికచేసేటంత మాత్రపు దండన విషయములందు సహా పరిపూర్ణముగా సంరక్షణపొంది ఇప్పటికిని శెక్రటరీ అఫ్ స్టేటువల్ల నియమితులగుచుండు ఐ. సి. ఎస్ మున్నుగాగలవారు, నిన్నటివరకు రమారమి ముప్పది డిపార్టుమెంటులను నిరంకుశముగా ఏలినవారు, మంత్రులనుకాదనికూడ గవర్నరులదగ్గరికి ప్రత్యేకముగా కాగితములు తీసికొనిపోవుటకు, ఉత్తరువులు చేయించుకొనుటకు ప్రస్తుతపు ఆక్టుక్రిందను అవకాశము కలవారు, గవర్నమెంటు శెక్రటరీలుగా ఉండి రాజ్యాంగశాసనములో పే రేతల పెట్టని పార్ల మెంటరీ శెక్రటరీలకు కాగితములు పంపుట వారి యభిప్రాయములు కనుగొనుట జరుపుదురా? విషమస్థితి యెట్లు ఎప్పుడుకలుగునో చెప్ప వీలులేదు. త్వరలో కలుగకపోవచ్చును. అయినను ఇంత పట్టుదల యేల యుండవలెనను వారుందురు. కారణము ఇంతవరకు చెప్పినదియే. శాసనసభ లెన్ని ఉండనీ మంత్రు లెందరుండనీ అనుదినరాజ్యచర్య జరపడములో చాల యెక్కువ పలుకుబడి, రుచి యున్నవి. మన మద్రాసు కోస్తాలో ఎన్నివిధముల ఉత్తరువులు వేయడానికి అధికారులకు అవకాశములున్నవో వ్రాయబోయిన గ్రంథమగును. సర్కారువారు ప్రతి సంవత్సరమును శాసనసభ యెదుట పెట్టే బడ్జెట్టు తీసికొంటే వారు అడిగే వ్యయముల శాంక్షనులు 37 వర్గములక్రింద ఏర్పరచినారు. ఈవర్గాలపేళ్లు క్రింద ఉదాహరించడ మయినది. [1]ఇందులో ఒక్క రివిన్యూ తీసికొంటే అందులో అంతర్భాగాలు రివిన్యూ శెక్రటేరియట్ , రివిన్యూబోర్డు, జిల్లాసిబ్బందీ, సర్వేసెటల్మెంటు రికార్డుఅఫ్ రైటులు, ఇందులో ఒక్క సర్వేమాటే తీసుకొన్నా కేంద్ర సర్వేఆఫీసు, సర్వేపార్టీలు, ఎస్టేటుసర్వేలు, మునిసిపల్ యూనియన్ సర్వేలు ఇన్ని కలవు. ఇన్నిటికి ఒక్కొక్క శాఖమీద ఒక్కొక్క అధి కారి. నేటిదినము జరిగే రివిన్యూచట్టము అనగా బోర్డు స్టాండింగు ఆర్డరులు 3000 పేజీలు—ఈ రీవిన్యూలో ఉండే పై అధికారులు వ్రాసి అమలు జరుపుతుండేదేకాని వేరులేదు : సర్వేరాతికి పావలా ఏ సందర్భాలలో వసూలుచేయవచ్చును, ఏసందర్భాలలో వసూలు చేయరాదు అనేవిషయముతో ఆరంభించి నంజీనిపుంజీ పుంజీని నంజీగా మార్చేవరకు, గ్రామనౌకరుల సెలవు మొదలుకొని కలెక్టరుల అధికారాలవరకు, నిర్ణయించే సర్వ వ్యవహారము ఈబోర్డు స్టాండింగు ఆర్డరులలో ఇమిడినది. ఇర్రిగేషన్ మాట ఆలోచించినచో దాని బడ్జెట్టు గ్రంధమే వేరేగా ప్రకటించెదరు. దీనినిబట్టి చూడగా 21 లక్షల రూపాయలు సిబ్బందివ్యయము మాత్రమున్నది. ఇర్రిగేషను పనుల మాన్యూలు, నిబంధనలు, ఏశాసనసభవారును వ్రాసినది కాదు. అంతయు అధికారులు సిద్ధపరచునదే. ఒక్క రివిన్యూ ఇలాఖాలో కోస్తా పెత్తనదారులు సుమారు ఇరువదిమంది యున్నారు. ఇర్రిగేషన్ ఇలాకాలో పెత్తనదారులకు లెక్క లేదు. చీఫ్ ఇంజనీరులు, గవర్నమెంటు ఆర్కిటెక్టు, ఎలెక్ట్రికల్ ఇంజనీరు, సూపరింటెండింగు ఇంజనీరులు, ఎక్సెక్యూటివు ఇంజనీరులు వీరు పెట్టినదేభిక్ష. ఇట్లే ఒక్కొక్క డిపార్టుమెంటునుగురించియు, వ్రాసికొని పోవచ్చును. ముఖ్యముగా పరిశ్రమలు, విద్యుచ్ఛక్తి నిర్మాణము, సేవకు, అధికారానికి, శాసనానికి చాల అవకాశమిచ్చునవి మనకోస్తాలో ఉన్నవి. ఇన్నిటిమీద పెత్తనదారులందరిని మంత్రులవశము చేయవలసినదని కాంగ్రెసువారు కోరి నారు. కాని బ్రిటిషువారు చేసిన చట్టములో అదిలేదు. అనుదినచర్యలో ఐ.సి.ఎస్ లతో సహా మంత్రులమాట జవదాటనట్లు కనిపించినా శాసనము ప్రకారము వీరు తమకు లోబడినవారు కాదు. కాబట్టి మంత్రులుకూడ తగిన జాగ్రత్తతోనే మెలగుచున్నారనుకొనదగును.

కోస్తాప్రభుత్వాలలో ఈతీరుగానుండ ఇండియా ప్రభుత్వము విషయములో బ్రిటిషు ప్రభుత్వమువారు అసలు శాసనసభలలోనే ఎన్నికలతో సంబంధము లేకుండ శిష్టసభ మొత్తము 260 గురలో 104 గురను, అసెంబ్లీ మొత్తము 275 గురలో 125 గురను స్వదేశసంస్థానాధిపతులు ప్రతినిధులను నియమించునట్లు విధించినారు. శిష్టసభలో 65 దింటిని, అసెంబ్లీలో 164 టిని ప్రత్యేక స్థానములుగా నియమించి కాంగ్రెసువంటి బలవత్తమ ప్రజాపార్టీ ఎక్కువరాకుండ జూచుకొన ప్రయత్నించినారు. ఎన్నికలుపెట్టే స్థలములకు అప్రత్యక్షపు టెన్నికలు నియమించి కోస్తాల శాసనసభ్యులే వోటరులుగానుండు నట్లేర్పరచినారు. ఇన్ని కోస్తాలలో కాంగ్రెసువారింత ఉద్దండముగా జయించెదరని వారనుకొనలేదని తోచును. కాని కాంగ్రెసువారు గెలిచినారు. గవర్నరుజనరలుకు ఎనిమిది ప్రత్యేకాధికారాలిచ్చుటేగాక దేశసంరక్షణ, విదేశములతోటి సంబంధము, ఇంగ్లీషు మత విచారము వీటిని శాసనసభల జోలినుండి తొలగించినారు. దేశసంరక్షణ అంటే అందులో భూసైన్యములు, నావికాసైన్యములు, విమానసైన్యము, తత్సంబంధపరిశ్రమలు అన్నియు చేరిపోయినవి. పదుగురు మంత్రుల కవకాశముచేసి వారికి నిలిపిన విషయములలో రైల్వేలకు ప్రత్యేకము రైల్వే అధారటీ అని శాసనబద్ధసంస్థను నియమించి నారు. రైల్వేలకు సంబంధించిన సర్వకార్యనిర్వహణాధికారము ఫెడరలు రైల్వేఅథారటీది. దీని అధ్యక్షుని గవర్నరుజునరలు నియమించును. ఏడింట మూడువంతులకు తక్కువ గాక సభ్యులను అతడే నియమించును అని శాసనములో నున్నది. ఈషెడ్యూలులో ఇందులో సభ్యు లేడ్గురుందురు. ఏడ్గురను గవర్నరుజనరలు నియమించును అని యున్నది. షెడ్యూలుమార్చవలసి యున్నను గవర్నరుజనరలు ఒప్పుకొనిన పిదప శాసనసభలలో బిల్లుతేవచ్చును. మంత్రిగా ఏర్పడేవాడు రైల్వే అధారటీకి కార్యనీతి సలహాచేయవచ్చును. అక్కడను తగవుకలిగితే గవర్నరుజనరలుది తీర్మానము. ఈ విషయమై యిక వ్రాయనేల! రైల్వేల విషయములోవలే ఆర్థికవిషయములలోను ప్రత్యేకాధి కారములతో రిజర్వుబ్యాంకు అఫ్ ఇండియాను ఏర్పరచినారు. దీనికి సంబంధించిన చట్టమును 1935 వ సంవత్సరపు గవర్నమెంటు అఫ్ ఇండియా ఆక్టుకు ముందే 1934 లో ఇండియాశాసనసభలలోనే అంగీకరింపించినారు. దానిమేరకు ఇండియా నాణ్యెములు, మన ద్రవ్యమునకు ఇతర దేశముల ద్రవ్యములతోగల సంబంధము మొదలగు విషయముల పరిపాలనయంతయు రిజర్వుబ్యాంకుకు చెందిపోయినది. ఈరిజర్వుబ్యాంకి గవర్నరును ఇద్దరు డిప్టీ గవర్నరులను ఇండియాగవర్నరుజనరలు నియమించును, నలుగురు డైరెక్టరులను అతడు నియమించును. ఒక్క గవర్నమెంటు ఆఫీసరునుకూడ రిజర్వుబ్యాంకి బోర్డుకు గవర్నరుజనరలే నియమించును. ఎనమండ్రైరి. రిజస్టరులకాని మెంబరుల వర్గాలవారు ఎనిమిదిమంది డైరెక్టరులను ఎన్నుకొందురు. వారిలో ఒక్కరు గవర్నమెంటుపక్షమైనా గవర్నమెంటు మాట మెజారిటీతో నెగ్గును. లేదా కాస్టింగువోటుతో నెగ్గును. ఇక ఈ శాసనమును ఇండియాశాసనసభ వారు చేసినా దీనిని సవరించవలెనని నను, మార్చవలెననినను గవర్నరు జనరలుగారి యనుమతి మొదటనే పొందవలెను. రిజర్వుబ్యాంకును ఏకారణము చేతనై నను రద్దుచేయదలచినను అతడే చేయవలెను. దానికి ప్రత్యామ్నాయ మేమియను నిర్ణయముకూడ అతనిదే. ఇండియాశాసనసభవారు చేసిన శాసనానికి ఇన్ని దిగ్బంధనములుచేసి వారికి దానిమీద మరల అధికారములేకుండ చేయుటకు గవర్నమెంటు అఫ్ ఇండియా ఆక్టు ఉపయోగపరచికొనినారు,

శాసననిర్మాణవిషయము లట్లుండగా పరిపాలనవిషయములో ఇన్ని మినహాయింపులు, ఇన్ని ప్రత్యేకాధికారములు, ఇందరుప్రత్యేకాధికారులను కల్పించి సంస్థానముల సంగతిలో ఇండియానేలే ప్రతినిధులనుపంపే అధికారము వారికిచ్చి వారివ్యవహారాలలో గవర్నరుజనరలుకుకూడ అధికారాలీయక రాజప్రతినిధియనుపేరితో అతనికి వారితో సంబంధముకల్పించిన ఈ ఇండియా ప్రభుత్వవిధానమును ( ఫెడరేషనును) మొదలంట కాంగ్రెసువారు ప్రతిఘటించుచున్నారనిన అందులో వింతయేమియులేదు. శాసనాధికార పరిపాలనాధికారములు రెండును ప్రజలకు సంక్రమించిననే స్వరాజ్యమున కర్థముకలదు. పైనజెప్పిన అన్ని విషయాలనుబట్టి నిజమునకు శాసననిర్మాణమనేపేరుతో చేసే శాసననిర్మాణముకొద్ది శాసననిర్వాకులని మనము వ్యవహరించే దేశపరిపాలకులుచేసే శాసననిర్మాణము చాలయెక్కువ అనడముస్పష్టము, అది కారణముగానే బహుళసంఖ్యాకులయిన ప్రజల ప్రతినిధులచేతులలోనే పరిపాలన ఉండవలెననీ దూరమెక్కువయైనలదీ అట్టిప్రతినిధులకుకూడ జవాబుదారీతగ్గి నిరంకుశత్వం పెరగడానికి అవకాశమున్నది. కాబట్టి సాధ్యమైనంత ఎక్కువగా పరిపాలన కార్యములను స్థానిక సంస్థల చేతులలోనే పెట్టవలసినదనీ, విధిలేని సమిష్టికార్యములకు విస్తారతరసంస్థలనుఉపయోగించు కొనవలసినదనీ లోకమంతటను అభిప్రాయము ప్రబలినది. రుష్యాచరిత్రకు మహాప్రాముఖ్యము కలగడానికి అచ్చటి సర్వరాజ్యసౌధాని కీ సోవియెట్టు– అనగా మనపంచాయతివంటి గ్రామసంస్థ - బునాదిగా ఏర్పడడమే. పరిపాలకులు నిరంకుశులు కాకుండా ఉండడానికి రుష్యాలో ఇతరోపాయములుకూడ అవలంబించినారు. కార్మికుల కర్షకులసంఘాలు ఎప్పటివలెనే పనిచేసికొనడానికి వాక్స్వాతంత్ర్య రచనాస్వాతంత్ర్యములనిచ్చి నిలిపినారు. ధనవంతులు, పెట్టుబడిదారులు పూర్తిగా అదృశ్యులై రాజ్యము కార్మికులదీ కర్షకులదీ యైనప్పటికీ ప్రభుత్వము నడిపేవారు తమతోకొద్దిగా భేదపడేవారున్నా వారిప్రచారాలను అరికట్టి తమప్రచారాన్ని సాగించుకొని ఎదుటిముఠాలనణచిపెట్టి తమముఠాలను బలపరచుకొని నిరంకుశులయ్యే ప్రయత్నముచేయ వచ్చును. తాత్కాలికముగానై నా మహాజనము తమకు వ్యతిరేకులు కావచ్చు నని తోచినప్పుడు ప్రజలయభిప్రాయము తమకడ్డురాని ఆలోచనలన్నీ చేసి ప్రజలనోళ్లు మూయింప వచ్చును. రుష్యా యంతటి పూర్ణప్రజాప్రభుత్వాలు జర్మనీచీనాలు అయినా కాకపోయినా హిట్లరు షియాంగ్ కేషెక్కుల చరిత్రలు ఈవిషయములో నిదర్శనముగా తీసికొనవచ్చును.

హిట్లరు ప్రజనిర్వచితుడే. వర్సేయిల్సు సంధి కారణముగా జర్మనీపొందిన దురవస్థలను తుడిచివైచే పరమోత్సాహముచూపి పై కెగసినాడు. బీదల కార్థికస్వాతంత్ర్యములీయక పెట్టుబడిదారులు యూదులని బలవంతులపలుకుబడి నశింప జేయడానికి వారిని తరిమి కొట్టి, వారి జీవితములను హరించి ఆర్థికాధికారము తాను బాచుకొనినాడు. అధ్యక్షుడుగానున్న హిండెంబర్లు చనిపోతే ఆహో దానే రద్దుచేయించి ముఖ్యమంత్రియయిన తానే ఆయధికారమును వహించినాడు. మంత్రివర్గము లోని యితరులను నామకార్థముంచుకొని సర్వాధికారములు తానువహించినాడు. సర్వసైనికాధి కారము తనదే చేసుకొనినాడు. ఆస్ట్రియూసందర్భమున చేసినపని యాలోచింపుడు. షూస్నిగ్గు ప్రజలయభిప్రాయము తీసికొన నేర్పరచుచుండగా తాను సైన్యాలతో ప్రవేశించి దేశమాక్రమించి వోటింగు పెట్టించి అందరూ తానుచేసినపనిని అంగీకరించినారనినాడు. జర్మనుప్రజల ఏకీభావమును పెంపొందించి బలపరచే యుద్దేశముతో 'రీఖ్' అనే ఆదేశప్రభుత్వములో నిమిడ్చిన కొద్దిపాటి నిరంకుశత్వమును అందులో పరిపాలకవర్గాని కేర్పరచిన కొద్దిపాటి ప్రత్యేకత్వపుహక్కును ఇంతనిరంకు శత్వాన్ని తానుపెంచుకోడాని కతడు వినియోగించుకొని ప్రపంచమునే కబళించెదననుచున్నాడు. చీనాదేశచరిత్ర యందును 'కోమింటారిగ' నే మన కాంగ్రెసు బోటిసంస్థ సర్వాధారము కావడము మొదట సోషలిస్టుగానున్న షియాంగ్ కేషెక్కు, జపానుకు మిత్రుడుకావడానికి తరువాత నిరంకుశుడయి ప్రజలరాజ్యాన్ని ప్రజలచేతిలో పెట్టకుండా తనచేతిలోనే పెట్టుకొని చీనాలోని సోషలిస్టులను అణచి దేశబలాన్ని కృంగదీయడానికి జపాను పై బడివచ్చినప్పుడు చేసినతప్పు దిద్దుకొని గోరితోపోవుపనికి గొడ్డటితో ప్రయత్నింపవలసిన ఆవశ్యము సంభవించడానికి ఇన్నిటికీ దారిదీసినది.

ఇట్టియనుభవాలు లోకమునకు కలిగియున్నందుననే సర్వసన్యాసులు ప్రజాప్రభుత్వములోనే పరిపాలకులయ్యే సందర్భము కలిగినా వారుచెందిన పార్టీసంస్థగాక ప్రజలసంస్థలు రైతుసంస్థలు కార్మికసంస్థలు వగైరాలు ప్రచారములో ఉండడానికి సంపూర్ణావకాశా లుండవలెనని లోకమున నభిప్రాయము ప్రబలిపోయినది. ప్రభుత్వాంగనిర్ణయము చేయవలసివచ్చినప్పుడు ఇట్టిసంస్థల యభిప్రాయప్రకటన నై జరీతిని జరుగడానికి ఎన్నికల కీసంస్థలనే ప్రాతిపదికములుగా తీసికోవలసిన దని కోరువారును కలరు. ఇదివరలో వర్ణితమైన 'ఇనీషియేటివు', 'రెఫరెండము' వగైరా అధికారములు రాజ్యంగమునందు ప్రజల కేర్పడియుండి స్థానికపరిపాలన సమగ్రముగానుండి కార్మిక కర్ష కాదిసంస్థల వాత్స్వాతంత్ర్య, రచనాస్వాతంత్ర్య, సమావేశస్వాతంత్ర్యములు అరికట్టబడక యున్నయెడల ఇట్టి ప్రత్యేకసంస్థలకు ప్రత్యేక ప్రాతినిధ్యము ప్రసాదితము కానున్నను నష్టముండదను వాద మాలోచింపదగినదే. కాని కుశలుడగు మానవుడు మహాజనోత్సాహమును తనవై పు త్రిప్పుకోగలడను అవిశ్వాసము ప్రజలను అక్షరానభిజ్ఞులుగా నుంచినంతకాలము తప్పదు. అందుచేతనే అంతటను పంచాయతీపరిపాలననే యేర్పరచినా దానికి బునాది ప్రజలేకాక వారి మాతృభాషయు కావలసినదని గట్టి యభిప్రాయ మేర్పడియున్నది. రష్యాలోను భాషాధారకరాష్ట్రము లేర్పరచియున్నారు. మన కాంగ్రెసు మహాసభవారు దేశభాషాధారక రాష్ట్రాలను కాంగ్రెసు కార్యక్రమమునకు అంగీకరించియున్నారు. ఆంధ్రోద్యమమునకు, ఆంధ్రరాష్ట్ర వాంఛకు గూడ మనరక్తములో నిమిడియుండు నుత్సాహమునకు కారణమును ఇదే. రాజ్యాంగ నిర్వహణము నేడు కాంగ్రెసువారి హస్తగతమయినది కాబట్టి నేటినుండే పంచాయతిపరిపాలన, భాషాధారక రాష్ట్రనిర్మాణము వీరు సాధింపవలెను. సాధింపగలరని దేశమెదురుచూచును, ఇంతేకాదు. కార్మిక, కర్ష కాది ఉద్యమములను సరియైనరీతిని ప్రోత్సహించి సార్వజనికవిద్యను అచిరకాలమున సాధించి ఈ యెల్ల బలమును సంపూర్ణ స్వాతంత్య్రసంపాదనకు సమకూర్చు కొనడమే గాక ముందుకు నిరంకుశత్వము ప్రబలకుండ నిరోధించుటకును తోడ్పడుదురనియు ప్రజ లాశింతురు,

ఎంత జాగ్రత్తతో మెలగినను యంత్రయుగప్రభావముచేత మహానగరములలో కోట్లకొలది వస్తువుల నొక నమూనా మేరకు ఉత్పత్తిచేసికొనవలసిన దురదృష్టమును మహాయుద్ధముల విపత్తునకు సిద్ధమయియుండ వలసిన దురదృష్టమును, మహాయుద్ధముల విపత్తునకు సిద్ధమయి యుండ వ్రాసిన దుర్దినమును రష్యాకు తప్పనందున స్టాలినుబోటివానికి గూడ ఏకాధిపత్యదుష్కీర్తి సంభవించినది. లోకమునందు యంత్రయుగముపై కల్గిన జుగుప్స కొలది ఆయుగప్రాబల్యము తరిగి గృహపరిశ్రమ లెక్కువగా నాధారపరచుకొని శాంతిజీవసము నడుపుకొను దినములు లోకమునకు కలిగినప్పుడు సోవియెట్టు లేదా పంచాయతిరాజ్యములో నిరంకుశుడు లేక దాసుడు లేక అందరును సమానులుగా ప్రజోపయోగకార్యకరణదక్షులుగా సుఖపడగలరు. మన భారతభూమికిగల మితజీవనదృష్టి, అహింస, సత్యాన్వేషణపరత్వము, వీనితో మనమును ఈ పరిణామమునకు తోడ్పడవలసియున్నది. తోడ్పడగలము.

_________

శాసనవివరణస్వరూపము

(న్యాయ విచారణశాఖ)

భాషయొక్క స్వభావము ననుసరించియే శాసన వివరణ మవసరమగుచున్నదని ఇదివరలో వ్రాయబడియెను. సంఘముయొక్క స్వభావమును ఇందునకు అనుకూలమగుచున్నది. మానవుడు మానవుడుగా నున్నంతకాలము స్వార్థపరత్వము పూర్ణముగా భువిని వీడి చను ననుటకల్ల. ఉత్తమప్రకృతులలోనే స్వార్థపరత్వము కార్యకారణమగుచుండుట తప్ప లేదు. అట్టి సందర్భమున

  1. 1. ల్యాండు రెవిన్యూ, , 2. ఎక్సైసు, 3 స్టాంపులు , 4. ఫారెస్టు, 5. రిజిస్ట్రేషను, 6. మోటారుపన్ను, 7 ఇర్రిగేషను, 8. రాజధానిలో సిబ్బంది, 9. శాసనసభలు, 10 జిల్లాపరిపాలనవగైరా, 11. న్యాయవిచారణ, 12. జెయిళ్లు, 13 పోలీసు, 14 ఎలెక్ట్రిసిటీ, 15. విద్య, 16. వైద్యము, 17 ప్రజారోగ్యము, 18 వ్యవసాయము , 19 పశుచికిత్స, 20 సహకారము(కోఆపరేషన్), 21 పరిశ్రమలు, 22 చేపలు, 23 చిల్లరడిపార్టుమెంటులు, 24 కట్టడములు (సివిలు వర్క్సు), 25 సివిలువర్క్సు (సిబ్బందిన గైరా), 26 సివిలువర్క్సు (సహాయగ్రాంటులు), 27 క్షామము, 28 పెన్‌షనులు , 29 స్టేషనరీ ప్రింటింగు, 30 చిల్లర, 31 ఇర్రిగేషను మీద పెట్టుబడి, 32 పరిశ్రమలమీద పెట్టుపడి, 33 ఎలెక్ట్రిక్కు స్కీములమీద పెట్టుబడి, 34 సివిలువర్క్సుమీద పెట్టుబడి, 35 పెన్‌షన్‌ల పెట్టుబడి మదింపు (కమ్యుటేషన్ ).