ప్రభావతీప్రద్యుమ్నము/పంచమాశ్వాసము

శ్రీరస్తు

ప్రభావతీప్రద్యుమ్నము

పంచమాశ్వాసము

—————



ఫలతులసీసక్తుఫ
లాఫుల్లజ్జాతివిచికిలప్రముఖద్ర
వ్యాఫల్గుకృతేశ్వరపూ
జాఫలచిద్గణ్యు నమరసచివవరేణ్యున్.

1


వ.

మన్మథు నుద్దేశించి యాకన్యకాతిలకంబు.

2


ఉ.

భూనుతలీల రుక్మిణికిఁ బుట్టి మనోభవ మత్ప్రియత్వమున్
బూనినవాఁడ వీవయఁట పూర్వపునీయతనుత్వధర్మమున్
మానక యేఁచుచున్న నది మామకభాగ్యము ని న్నె టాడఁబోఁ
గా నెటు వచ్చునో తడవఁగా వెఱతున్ గరము ల్మొగిడ్చెదన్.

3


వ.

అని పలుకుచున్నప్పు డంతకంతకుం బెల్లయిన మాయల్లక
భరంబునం బెల్లగిల్లునుల్లంబుతాల్మి నిల్వరింపం జాలక
యబ్బాలాలలామంబు.

4


తే.

నాఁడె చనకుండ లేఖఁ బ్రాణములు నిలిపి
యంత భరపడి వచ్చి నేఁ డాత్మవీక్ష
నోర్వరానినాతమికి న ట్లొనరఁ బలికి
ప్రియుఁడు తుద నిట్లు విడిచె నన్నియును వృథగ.

5

మ.

అనుచున్ ఱెప్పలు తేలవైచుచు విశుష్యత్కంఠయై రుక్మిణీ
తనయా మీఁదట నైన నీవ పతివై తధ్ధర్మ మీడేర్పుమీ
యనుప ల్కించుక నాలుకన్ దడుపుచుం బ్రాణార్తి దీపింపఁ జ
య్యనఁ బూఁబాన్పున వ్రాలఁ బోవుటయు మీనాంకుండు చిత్రంబుగన్.

6


వ.

సంభ్రమంబునఁ గర్ణోత్ఫలంబు వెలువడి నిజరూపంబుతోడ.

7


క.

హా తాలిమి వదలెదు సు
మ్మేతెంచియె యున్నవాఁడ నిదె నీపతి న
న్నోతరుణి చూడు మని తా
నాతల్పమునందు నిలిచి యక్కునఁ జేర్చెన్.

8


మ.

అతిశీఘ్రంబున నాలతాంగియుఁ దదీయాలింగనస్పర్శనా
మృతసేకంబున మూర్ఛదేఱుచునె యున్మీలన్మహానందమూ
ర్ఛిత యయ్యెన్ మగుడన్ బదంపడి మదిం జేష్ట ల్జనింపంగఁ దా
బతిఁ గన్ఱెప్పలు విచ్చి చూచి భయకంపస్వేదలజ్జాత్మయై.

9


క.

చిరకాంక్షితనిజపరిరం
భరసస్థితిఁ జొక్కి యున్నపతిచేతులు స
త్వరత విడిపించుకొని యో
వరిలోనికిఁ బాఱిపోయె వనజాక్షి వడిన్.

10


వ.

ప్రద్యుమ్నుండును శుచిముఖీరాగవల్లులం జూచి యి
ట్లనియె.

11


ఉ.

సర్వయువాధికుం డనుయశం బెసఁగు న్నను నేలికొన్న మ
త్పూర్వసమస్తపుణ్యఫలభూమిక మీచెలి యీవిలంబమే
నోర్వమిఁ జూడ కి ట్లరుగుటొప్పునె తోడ్కొనిరండు పోయి గాం
ధర్వవివాహలీలకు ముదమ్మున మీరలె పెండ్లిపెద్ద లై.

12

వ.

అనిన విని రాగవల్లరి నవ్వుచు నతనిం జూచి.

13


చ.

తనవిరహాసహిష్ణుతవిధం బఖిలంబును నీవు వింటి గా
యనయము నాడుకోఁగ నిపు డంచు మనంబున నెత్తుసిగ్గునన్
మునుఁగుచుఁ గుందుచున్నదియె ముద్దియ నీతమకం బెఱింగి ని
ల్వనితెఱఁ గొక్కతప్పుగఁ దలంచెదు సూ చతురుండ వన్నిటన్.

14


వ.

అని పలుకునంత నతనికి శుచిముఖియు ని ట్లనియె.

15


ఆ.

నీవు సకలనాయికావిశేషస్వభా
వములు నెఱిఁగినట్టివాఁడ వైన
నాకుఁ దోఁచినంత యాకన్యచిత్తంబు
విధము నీకు విన్నవింతు వినుము.

16


ఉ.

తాఁ గడు వేగిరించెఁ గద తద్గతి నీవు నెఱుంగ సిగ్గునన్
లోఁగుచు నింతనుండి యిఁక లోనుగ నొల్లక పట్టఁబట్టఁగా
నేఁగుచుఁ గోరు నీ బలిమి నీప్సితసిద్ధిగ వీఁపు గాన రా
డాఁగుట దీనిపేరు నిబిడం బిది బాలిక కెల్ల నాత్మలోన్.

17


వ.

కావున నప్పడుచు త ప్పేమి గలిగిన నదియు నొక్కయను
రాగవిలసనవిశేషంబకా నెఱుంగుకొని యనుగ్రహంబు వద
లక పరిగ్రహింతుగాని వే ఱొండుగఁ దలంచెదు సుమీ
యేము పోయి యాముద్దియకు బుద్ధి చెప్పి యెత్తుకొని
వచ్చెద మని రాగవల్లరియుఁ దానునుం దత్సమీపంబునం
దెరమఱంగుననుండి తమపలుకు లాలకించి వినుచున్న
యన్నెలఁతపాలికిం బోయి యల్పస్వరంబున ని ట్లనియె.

18


ఆ.

తలిరుఁబోఁడి మంచిదానవు గలిగి తి
ట్లరుగుదెంతురమ్మ యధిపుమనసు

విరస మయ్యెనేని వెర పెద్ది మఱి చక్కఁ
జేయ నీవ చింత చేసి చూడు.

19


వ.

అనిన శుచిముఖకి రాగవల్లరి యి ట్లనియె.

20


క.

అప్పటి క ట్లరుదెంచుట
త ప్పన రా దంత మనము దండ నునికిఁ దా
నప్పడుచుఁదనము మానక
యిప్పడఁతుక యంత వెఱ్ఱియే యిఁకఁ జేయన్.

21


వ.

అని ప్రభావతి నవలోకించి.

22


క.

వరుఁడు సమాగమకాంక్షన్
ద్వరితపడుచు నుండ నిచటఁ దడయుట తగ దో
వరవర్ణిని రార మ్మొక
సరవిని దమి యుండ దెల్లసమయములందున్.

23


వ.

అని కేలు పట్టి తివియఁబోయి యాలజ్ఞావతి చేత విదుల్పులం
బడి నగుచు ని ట్లనియె.

24


క.

ఏరీతిం బెనఁగిన నె
వ్వా రెఱుఁగరు నీదుగుట్టు వనితామణి రో
ళ్లారోఁకండ్లం బాడిన
కూరుము లిపు డింత దాఁచుకొన్న నడఁగునే.

25


వ.

అని వెండియు నతిప్రయత్నంబున.

26


సీ.

విభుఁడు దండనె యిది వినుచున్నవాఁ డెంత
            గబ్బినే యిది లజ్జక్రమమె యనియు
నతఁ డిది సరకు సేయమిగ భావించిన
            నపు డేమి యగుదు వీ వబల యనియు

రసికశేఖరుఁడు సర్వజ్ఞుఁడు ప్రియుఁడు నీ
            కొలఁదిన నడుచు భీతిలకు మనియు
సతిగోప్య మీశుభావాప్తి దీనికి నింత
            తడయు టొప్పమి యెట్లు దలఁప వనియు


తే.

మఱియు నెన్నియొ బిసిబిసిమాట లమరఁ
బ్రియము చెప్పియు నదరవైచియు హితాను
వృత్తిఁ దెలిపియు నొకకొంత మెత్తఁబడఁగఁ
జేసి కేల్వట్టి తిగిచె నాచెలువఁ గదల.

27


సీ.

తిగిచిన రాక యీడిగిలం బడుచును ల
            జ్ఞాలసత్వమున మల్లాడి యాడి
నిలునిలు మొకమాట గల దని నిలిపి ప
            ల్కుట కేమియును లేక గ్రుక్కి గ్రుక్కి
యడుగడుగునకు నత్యంతనిర్బంధంబు
            సలిపెడునందాఁక నిలిచి నిలిచి
తెరువున నర్గళాదిక మేది చేతి కం
            దినఁ బట్టువిడువక పెనఁగి పెనఁగి


తే.

యిందుబింబాస్య కడు నలయించెఁ జెలిని
విసివి పోదుగదా యనువెఱుపు నొదవ
విభుని నూతనసంగమవేళఁ గరము
వక్రములు లో పడంతులవర్తనములు.

28


క.

ప్రకృతిజ్ఞయు హితనిర్వా
హికయు నగుట నల్ల నల్ల నేనుఁగుఁ గంబా
నకుఁ దిగిచినట్లు యత్నా
ధికతం జెలి తెచ్చె నాసతిం బతికడకున్.

29

వ.

ఇట్లు తెచ్చి.

30


క.

అనయము చేరిక యగుతఱి
ననివార్యవ్రీడ భయభరాకులగతి యై
తనవెనుక నొదుగ నొదుగఁగ
వనితామణిఁ దేర్చి తేర్చి వల్లభుఁ జేర్చెన్.

31


వ.

ఇట్లు దగ్గఱఁ దెచ్చి యజ్జలజాక్షి యత్యూర్జితసముజ్జిహాస
దుర్జయలజ్జాసముద్వేగ వగయు నుద్దామరోమహర్షణస్వేదో
ద్భేదసాదితప్రకృతిమకరికాపత్రాంగరాగయుఁ బురస్స్థితిపరి
త్యాగయత్నసంక్షోభసంచలీభవదుత్తరీయపార్శ్వపునఃపునరా
లక్ష్యమాణవక్షోజకుంభతటవిజృంభణాభోగయు నగ్రదృష్టి
ప్రసారపరిహారనియమనియతకటాక్షసంచారచారుకర్ణగోళకూ
లంకషలోలలోచనద్రాఘిమశ్లాఘనీయముఖపరావృత్తిపౌనః
పున్యధన్యాయితోభయోపాంతభాగయు నైనయెలనాఁగం
జూపుచు నాపురుషరత్నంబుం గటాక్షించి.

32


చ.

పడఁతులచర్య లిట్టివి నృపాలకుమారక నేఁటిదాఁక గు
ట్టెడలఁగ నీదుకూటమియపేక్షఁ బడం గలపాటు లెల్లఁ దాఁ
బడి యిపు డిష్ట మబ్బుతఱిఁ బాఱుచుఁ దాఱుచు నేక్రియం బెసం
గెడుఁ గనుఁగొంటే యంచుఁ జెలికే ల్గదియించె రతీశుచేతితోన్.

33


క.

ప్రమదంబున రాకొమరుఁడు
కమలాక్షిఁ బరిగ్రహించె గాంధర్వవివా
హముచే నయం ముహూర్త
స్సుముహూర్తో౽స్తంచుఁ గెలన శుచిముఖి నవ్వన్.

34

క.

అపు డించుకతడ వన్యో
వ్యపాణిసంస్పర్శసంభృతానందస్తం
భపరీతాత్మత నుండిరి
ప్రపంచ మంతయును మఱచి పతియు న్సతియున్.

35


వ.

తదనంతరంబ.

36


క.

తనరెడులజ్జాభయవా
సన లుద్బోధమునఁ దనర సతి కనుఁగొని మె
ల్లన నిలుఁ డని యాన లిడన్
జని రొక్కొకనెపముఁ జెప్పి సకియ లిరువురున్.

37


వ.

అప్పుడు ప్రద్యుమ్నుండు.

38


క.

నిలువక యటు పోచున్నా
రలికుంతల చెలుల నేల యానపొడిచె దేఁ
జెలికాఁడఁ గానె యనిపై
దలి చెవిలోఁ జెక్కు చెక్కుఁ దొర్కొనఁ బలికెన్.

39


వ.

అప్పుడు.

40


చ.

ఉవిద తదుక్తి కంత చెవి యొగ్గక పోఁ బెనఁగ న్విభుండు కే
ల్దవిలిచి చుట్టు నించుకయెడన్ భుజము ల్వల గొల్పి పొమ్మనన్
సువదన వెల్వడం దిరుగ శ్రోణిభుజస్తనవేణికాభర
శ్రవణకపోలము ల్పతిని సారెకు సోఁకుచుఁ దేల్చె నింపులన్.

41


వ.

అంత.

42


చ.

నళినదళాక్షి సిగ్గరితనంబు గదా యని యింత చెల్లునే
యలయఁ బెనంగి తంచు విభుఁ డంగనహస్తము పట్టి నిల్పి చె
క్కిలి మిగులం జెమర్పఁ బులకింపఁగ ఘర్మకణావళు ల్నఖం
బులఁ గొని పాఱ మీటుచును బొల్పుగ మే నిమిరెం గరంబునన్.

43

సీ.

మఱియుఁ గపోలచుంబనసమీపతయాస
            రిత్తమంతనము సారెకు వచించి
యభివీక్షణేచ్ఛ నమ్రాననం బెగనెత్తి
            కొనగోళ్లఁ బలుమఱుఁ గురులు దువ్వి
చనుగుబ్బ లంట ముచ్చట పడి మాటికిఁ
            బయిఁటపై నెరసులు పాఱ మీటి
గనయంబు ముట్టుటకును జేరికలుగ వే
            మాఱును మొలనూలిమణులు దుడిచి


తే.

బెద రుడిపి వ్రీడజాడ్యంబు వదలఁ జేసి
కాంత నొగి మెత్త మెత్తనఁ గౌఁగిలించె
నీవి తనయంతటనె జాఱె నెయ్య మెఱిఁగి
పాణిఁ జెక్కిలి నొక్కి చుంబనము చేసె.

44


వ.

తదనంతరంబ.

45


ఉ.

శౌరిసుతుండు బాలికను శయ్యకుఁ దార్చి యదీర్ఘయత్నత
ద్వారణసంప్రబుద్ధరసతం దరితీపుగ మించుబాహ్యనా
నారతభోగలీలల మనంబునఁ జొక్కుచుఁ జొక్కఁజేసెఁ బో
తారత మల్పమల్పముగఁ దన్మతియోర్పుకొలందిఁ జేయుచున్.

46


తే.

సౌరభమె చిక్క లోనికి జాఱె నొక్కొ
రాయిడికిఁ గాక బహిరంగరాగ మెల్ల
ననఁగ నినుమడించుచు నంతరంగరాగ
మలరఁ బెనఁగిరి దంపతు లతులరతుల.

47


వ.

ఇవ్విధంబున.

48


చ.

స్వకుతుకపూర్తిగాఁగ రతి సల్పి సుషుప్తి వహించి రంత నా
యికయును నాయకుండుఁ దమయిద్దఱియంగములు న్విమిశ్రభా

వకలనఁ జిక్కుజీరుపడ వైచినచంపకనీలకంజమా
లికల తెఱంగునం బరఁగ లేఁజెమట ల్నునుగాలి నాఱఁగన్.

49


వ.

అంత.

50


క.

అరుణాంశుపటలి యనువా
సరరాజపురోధృతధ్వజంబుకొనన్ వి
స్ఫురిత మగురత్నమో యన
సురపతిదిశయందు వేగుఁజుక్క వెలింగెన్.

51


చ.

యదుకులచూళికాభరణ మంతట మేల్కని నిద్ర చొక్కునన్
వదలిన కౌఁగిలి న్మెలపునన్ బిగియించుచుఁ జెక్కు చెక్కిటన్
గదియఁగ నొత్తియొత్తి తనకాంతను మేల్కొలిపెన్ మృగాక్షియున్
నిదుర దొఱంగి చూచుచునె నేత్రము లెప్పటి మూసె సిగ్గునన్.

52


సీ.

అంతఁ గామిని కన్ను లరవిచ్చి సురతసం
            క్షుభితవేషము పతి చూడకుండఁ
దనదుచెక్కిలి మొగంబున కడ్డముగఁ జేర్చి
            పొరిఁ బొరి నది దాన పులకితముగఁ
గెంగేల నతనికౌఁగిలి యాఁగి యెడగొంచుఁ
            జేలాంచలము పెఱచేతఁ దడవి
తెచ్చి పాలిండ్లమీఁదికిఁ జొనుపుచు నితం
            బావృత్తి యరపి రెండవ చెఱంగు


తే.

కటితటం బెత్తి యెత్తి క్రిందటికిఁ బరపి
లోనుగా దానిపైయంచుతో నమరఁగఁ
బొక్కిలి గదించి పట్టి మూపున నరవిరి
వదలుతురు మానుకొనుచు లేవంగఁ గడఁగె.

53

క.

ఈచాడ్పునఁ బానుపుపై
లేచుచుఁ గడు నింపు గులుకులేమవిలాస
శ్రీచేఁ జిత్తము గరఁగఁగ
నాచెలువుఁడు మగుడఁ దిగిచి యక్కునఁ జేర్చెన్.

54


వ.

తదనంతరంబ కార్యాంతరచింత చిత్తంబునఁ బొడమఁ దన
వదనంబు ముదితచెవిం గదియించి యోయువిద యిది
మొదలుగ మాపు లెల్ల నిచ్చటికి వచ్చెదఁ గాని ఱేపులు
దప్పకుండ మావిడిదిన యుండకున్న రహస్యభంగంబు
పుట్టిన మనమనోరథంబు ిఘ్నాకులం బగుంగావున నిక్కడ
నుండి మదీయనివాసంబు దాఁక భూవివరంబు గల్పించు
కొని పోయెదఁ దద్ద్వారం బన్యుల కెఱుకపడకుండునట్లుగ
సంవరణంబు గావింపు మని చెప్పి యప్పలుకులకు నాలజ్ఞా
వతి యంగీకారసూచనంబుగాఁ దల యెగురవైవ నుక్త
ప్రకారంబున నిజనికేతనంబున కరిగెఁ బ్రభావతియుఁ దద్బి
లంబు తగు తెఱంగున సంవృతంబు గావించె నంత.

55


మ.

సమయాభిజ్ఞతఁ గుక్కుటంబు 'వివిధచ్ఛందస్త్రియామాంతరం
తిమయామో భగవా నృషిః కుసుమధన్వీ దేవతా మానినీ
రమణాయాం వినియోగ' యంచు నిది యారంభించెఁ గాఁబోలు నా
నమరెం దద్ధ్వని మానినుల్ రతికిఁ దా మై నాథులం బైకొనన్.

56


వ.

మఱియు నాసమయంబున వాసరప్రత్యాసక్తినిమిత్తవిరహ
శంకాసమంకురితసంతాపంబున లోపలిపట్టు వదలి వెలికి
నిర్గమించునిఖిలకాముకద్వంద్వసముదయహృదయంబుల
చలువలం ద్రోవ యడ్డగించి గడ్డురికి యాక్రమించెనో

యనఁగఁ దనరారుచు హారమౌక్తికంబు లత్యంతశైత్యం
బునం బ్రవర్తిల్లె నచిరభావియైన భావజవశంవదస్త్రీపురుష
పరస్పరపరిరంభవిశ్లేషఖేదవేదనాప్రాచుర్యంబు సూచించు
భంగి నొండొంటియంటు విడిచి బిరుసెడలినదళంబులతో
నతివిరళం బగుచు మేల్కట్టుపువ్వుదండలుం దమయంతర్గు
ణంబులకొలది విశదంబుగాఁ దెలిపె నన్యోన్యసన్నిధిం
జెన్ను మీఱ దంపతు లింపుసొంపున నాదరింపం బెంపొందు
సౌభాగ్యవైభవంబు నేఁటి కిదియకదా యనుహృదయౌ
త్సుక్యవిలసనవిశేషంబునం బోలెఁ దాంబూలంబు లచలి
తంబుగా రుచులప్రచురతం బచరించెఁ బ్రచురసురతంబులఁ
జరించు నుద్దామయౌవనమదమదనమత్తమత్తకాశినీమణుల
మణితరణితంబులజోక లేక సంతన గ్రహించి యంచిత
ప్రేక్షాదక్షతం బరీక్ష యిచ్చుభావ మావహిల్ల గృహ
శారికాకీరపారావతకులంబులును గలకలితలయలలితకలకాకు
భావంబు దులకించుకులుకుటెలుంగుఁ గలకలికిపలుకుల
వికలంబులుగా గులుకరింప దొరకొనియెఁ బ్రతికలనవనవా
యితప్రౌఢి యుపమిథునరతిపరిమళంబులఁ గలపడం బయి
పొలు పెసఁగ వికసనారంభశుంభదంభోజముకుళసుకుమారసౌ
రభంబు సారెకు వెదచల్లుచు నల్లనల్లన సంచరించు చల్లకరు
వలిబలంగములు తెరువరులతనువుల సవిరళముగఁ దల
కొనం బులకాంకురంబులు మొలపించుగతదివసావసాన
సమయంబున జిగీషితదేశాంతరుండైన భాస్వంతుచేత నాత్మ
తేజస్సమర్పణానల్పలాలనాపురస్సరంబుగా నియోగింపంబడి
యుం దమతమయున్నభవనంబుల నివసించు కొంచెపుఁజీఁకటు

లనేకాని నానాతమోనీకంబులం బోకార్ప లేనితప్పు
గలిగియున్నయవి గావున నావేళ కాసన్నం బయిన యా
వాసరాధీశురాక యాకర్ణించి కార్యవైకల్యంబున నాకుల
త్వంబు నొందెనో యన నేపు దఱిగి దీపకళికలు వెల
వెలంబాఱె విక్రమవిహారంబు ముగియించి గవుసెనఁ
బొదివిన కుసుమకోదండువెండిజలపోఁతదళుకుటరిగ
తెఱంగున మెఱుం గడంగి యుడురాజమండలంబు
మాఁగుడువాఱి కానిపించెఁ దొల్లి నిజసంతతిహితార్థిని
యై సురభి ప్రార్థింప నిలింపవిభుం డమృతం బిడుట
ప్రత్యక్షం బయ్యెనో యనునట్లుగా దట్టం బగుచు శాద్వల
ప్రదేశంబులం బ్రకాశించుముక్తాఫలస్థూలప్రాలేయబిందు
బృందంబు పశ్చిమరాత్రిగోచరప్రచార్యమాణపశువిసరం
బులచేతఁ గనవుతోఁగూడ గ్రసింపంబడుచు నుండ గగన
ముకురపరిదృశ్యమానతదీయప్రతిబింబవిభ్రమదృఢీ
కారపారీణంబు లై తారకంబులు క్రమంబునం బలు
చగాఁ దొడంగెఁ బ్రాబోధికంబు లైనభూపాలదేవగాంధారి
ప్రముఖరాగాభోగసౌగంధ్యబంధురగాంధర్వనాదమేదుర
మృదువాద్యవిశేషపోషితసూతమాగధాదిక్రియమాణ
స్తుతిపాఠరవంబులు ప్రభుద్వారంబులఁ దోరంబు లై సొంపు
మీఱె నపరరాత్రస్వాధ్యాయాధ్యయనశబ్దస్థానంబుల నైన
యాదేశంబులుంబోలె నిర్భరక్షీరభారభిద్యమానపీనాపీన
స్మార్యమాణతర్ణకోపసరణరణరణకసంభ్రమసముదితసముత్థాన
ధైనుకగంభీరహంభారవంబులు విజృంభించెఁ జంద్రాస్తమయ
సంభవక్లేశభవపరిఘూర్ణార్ణవధ్వానంబు పెక్కువను వెక్కి

రించినట్లు మిక్కిలి నక్కజపుబాహుళ్యంబు నెరపుమహా
సందోహదోహనిస్వానసాహచర్యసమధికదధిమథనవిధివిహీత
ఘుమఘుమఘోషంబులందు గండూషితదిక్కంబు లగుచుఁ
బిక్కటిల్లె నప్పుడు.

57


సీ.

మును విలూనం బైనదినపాదపము మొదల్
            మగుడఁ జిగిర్చినచిగు రనంగ
గతనిద్రశక్రేభకర్ణతాళానిలే
            రితకుంభసిందూరరేణు వనఁగ
ధ్వాంతజాలముమీఁద దండెత్తు భానుమం
            తునివెలిగొల్లెనతోఁ పనంగ
మార్తాండపథరోధిమందేహబలపదో
            ద్ధుతపూర్వనగధాతుధూళి యనఁగ


తే.

వనజరంగస్థలిని నాట్యమునకు వచ్చు
సిరికిఁ బట్టిన కెంబట్టుతెర యనంగఁ
బ్రాద్ధిశాలిప్తఘుసృణాంగరాగ మనఁగ
మెఱసె నరుణోదయపుదీప్తి మింటికెలన.

58


చ.

అనుదితసూర్యహోము లగుయజ్వలప్రజ్వలదగ్నిదీప్తులొ
ద్ద నమరుసోమిదమ్మలమిథఃకషణోల్లసితస్తనంబులన్
దనరుచు గేలి చేసెఁ గడుఁ దత్సమయాత్తపరస్పరోపగూ
హనరసరంగదంగకరథాంగపతంగతతారుణద్యుతిన్.

59


ఉ.

ఏఁ గలలోన నొం డెఱుఁగ నీవె విభుండవు సందియంబు నా
పైఁ గలదేని చూడు మని ప్రాగ్దిశ గౌతమదారజారునిన్
దాఁ గడు నమ్మఁ జేయుటకుఁ ద్రాగఁగ నెత్తెడునట్టియెఱ్ఱగాఁ
గాఁగినమడ్డుచంద మెసఁగం గనుపట్టె నినుండు నుష్ణతన్.

60

వ.

అప్పుడు.

61


సీ.

బిగువుఁగౌఁగిళ్లచేఁ బ్రియుబాహుపురు లొత్తి
            కుమ్మెలు వోయినకుచతటములు
వరుమేన నొఱసి పోవఁగఁ జిట్లినట్టిగం
            ధపుఁబేంట్లతో నొప్పునఖపదములు
రమణుకుండలపీడనముల రేఖలు మాయ
            కలరుచున్న కపోలఫలకములును
బ్రాణేశదశనకోరకశిఖాసంసర్గ
            మునఁ గందినట్టి కెమ్మోవిసిరులు


తే.

నిలువుటద్దాలచేరువ నిలిచి నిలిచి
పలుమఱును జూచుకొనుచు నాబాగు సడలఁ
జేయఁ జాలక తడసె దైతేయకన్య
ప్రాతరుచితాంగసంస్క్రియాపరత లేక.

62


వ.

అంత నచ్చటికి శుచిముఖీరాగవల్లరు లరుగుదెంచి యాచంచ
లాక్షి యున్న చెల్వు దవ్వుదువ్వుల నవలోకించి నవ్వుచు.

63


ఉ.

పుక్కిటితమ్ములం బుమియు ప్రొద్దును గాదొకదమ్మ నేఁడు మా
యక్కకు నిప్పు డి ట్లిటఁ బ్రియంబునఁ జూడఁగఁగల్గెఁ జాలు మా
కిక్కడి కేఁగుదెంచుట నభీష్టరతి న్వసివాళ్లు వాడునీ
చక్క_నిరూపము న్నిదుర చాలనికన్నులుఁ జిట్లుగందమున్.

64


వ.

అనుచు డగ్గఱ నేతెంచి.

65


సీ.

పలుగఱ సేయక పసుపును నలిపించు
            కొనక మొగంబుమజ్జనము లేక
పరిశుద్ధవస్త్రంబు ధరియింపక కచంబు
            లొగిఁ జిక్కు పుచ్చి క్రొత్తగ ముడువక

ప్రత్యగ్రతిలకధారణ మొనర్పక నవీ
            నముగఁ గాటుక లోచనముల నిడక
తగునట్టిసొమ్ములు దాల్పక దినముఖ
            నియమపుణ్యంబు లెవ్వియుఁ జలుపక


తే.

నీవు తడయుట చోద్య మోనీరజాక్షి
ఘనము గాఁబోలు శ్రమ మట్లు గాక రతుల
చిన్నె లింపునఁ జూచుకొం చున్నదాన
వేమొ విఘ్న మై వచ్చితి మెఱుఁగ కేము.

66


వ.

అని పరిహాసగర్భంబుగాఁ బలుకుచు లజ్జారోషభూషితంబు
లయినయాయోషారత్నంబు చేతియదరువ్రేఁతలు తమకు
నూతనోత్సవంబు లగుచుఁ గౌతుకం బొనరించుచుండఁ
బ్రవరిల్లుచున్నంతఁ జంద్రవతీగుణవతు లటమున్ను నిజవల్లభ
సమాగమంబునకు నుపాయంబు గానక శుచిముఖతోడి
విచారంబు గోరుచు నుండుటంజేసి యమ్మరాళిఁ దమనిల
యంబున కెలయించుకొనిపోవుటకు నుద్యోగించి బ్రభావతీ
దర్శనమిషంబున.

67


క.

లలితప్రియసంభోగా
కులవేషము చక్కదిద్దుకొన నెడ లేమిం
గళవళపడుచుఁ బ్రభావతి
యలుక నతర్క్యగతి వచ్చి రచటి కిరువురున్.

68


సీ.

ఈతెఱంగున వచ్చి యాతరుణీమణి
            చందంబునకుఁ గొంత సందియంబు
మదిలోనఁ గందళింపఁగఁ గ్రమంబున విమ
            ర్శించి తదాకారచేష్టితముల

కతమునఁ బురుషసంగతికల్మిఁ బదిలంబు
            గా నిశ్చయించి యక్కాంతమీఁద
భావసంసూచనపాండిత్యగంధివి
            లోలకటాక్షావలోకనముల


ఆ.

కలిమి మొలకనగవుతళుకుతోఁ బలుమఱు
నగుచు నొకరొకళ్ల మొగము చూచి
యంతఁ గనినయర్థ మాప లే కి ట్లని
పలికి రాసఖి విన జలజముఖులు.

69


ఉ.

ఎంతయు మేన వింతపస లేర్పడుచున్నవి యప్ప గంటె య
త్యంతము నిద్ర చాలమియు పక్షులు తెల్పెడు రాత్రి యెద్దయో
కొంతవిశేష మబ్బినది కోమలికి న్మముబోంట్లకుంగడున్
సంతసమేకదా తనదుజవ్వన మెవ్వలన న్ఫలించినన్.

70


వ.

అని మర్మంబు దాఁక నాడుచు నావ్రీడావతిమొగంబుఁ
జూచి.

71


క.

ఏమైన నయ్యె నిక నే
లా మీఱినపనికి నిట్టియంతిపురములో
నోముద్దరాలు యేగతి
నీమహిమ గడించుకొంటి విది వెఱఁగు కడున్.

72


సీ.

అని యుల్లసము దోఁప నాడుమాటలకు వె
            ల్వెలఁ బాఱుచును దైత్యవిభుతనూజ
కలఁగి రహస్యభంగభయంబుచేతఁ బ్ర
            త్యుత్తరం బేమియుఁ దోఁప కునికి
నిట్టటు గ్రుక్కుచున్న ట్టిలా గరసి యా
            యతివకుఁ దనచెలియండ్రగుట్టు

బయలు సేయక యున్నఁ బాయ దీవెడఁగుఁబా
            టనియు వారికి నిది యభిమతార్థ


ఆ.

సిద్ధిహేతు వనియుఁ జిత్తంబులోపల
నీతిసరణిఁ బరిగణించి చూచి
యాసునాభసుతల కంచపడంతి యి
ట్లనియె నుచితఫణితి యతిశయిల్ల.

73


క.

ఇది యెంత పేర్చెదరు మీ
చదివినయాకుననె తానుఁ జదివినయది మా
సుదతియు మొదలు ఫలించెన్
దదభీష్టము పెద్దపిన్నతనములవరుసన్.

74


వ.

అనుటయుఁ దెలి వొందినమొగంబుతోఁ బ్రభావతి యా
విహంగిం జూచి.

75


క.

ఎట్టెట్టూ మును వీరల
గుట్టులు నీపోఁగునకుఁ దగుల్పడినదియే
యె ట్టుండె నట్టె చెప్పుము
గట్టిగ నావుడు మరాళకామిని నగుచున్.

76


వ.

తను నధికభయలజ్ఞాసమాకులచిత్త లగుచుం గనుసన్నల
వారించుచున్న చంద్రవతీగుణవతులవంకం గనుంగొని
చెప్పం గొంచించుటయు నక్తంచరరాజనందనయుం దన
విూఁద నాన లిడుచు నడిగినం బులుఁగుపడంతి తదనుజల
విలోకించి.

77


ఆ.

మీర లూర కుండ రీరు దువ్వఁగఁ బేను
వచ్చు ననుట వినరె వనితలార

యాన పెట్టి యడుగ మాన రా దిఁకఁ జెప్ప
వలసె మీరహస్యవర్తనములు.

78


వ.

అని పలికి ప్రభావతితోడం బ్రద్యుమ్నలేఖాహరణం బొన
ర్చిన చిలుకసుద్ధులు మొదలుకొని వారిప్రయత్నంబు సక
లంబుసుం జెప్పిన నవ్వుచు నాపువ్వుఁబోఁడి వ్రీడావనతవదన
లైసయముద్దియల నీక్షించి.

79


క.

మునిముచ్చులార మీచే
సినపని యటు గట్టిపెట్టి చేకొని యేలా
ననుఁ దఱిమితి రిఁక నేమియు
ననకుఁడు నాతోడిదొంగ లైతిరి మీరున్.

80


వ.

అనిన నాయింతికి శకుంతకాంత యి ట్లనియె.

81


తే.

లలన యెంతటివారు గావలయు నెందు
నైన నీతోడివారు గా నంత కిపుడు
ప్రియునితోఁ జెప్పి నీవు రప్పించ కున్న
వీరలకు నెక్కడిది నిజవిభులరాక.

82


ఉ.

ఎల్లియు నేఁడు నీకు హృదయేశ్వరు నెద్దియుఁ బల్క సిగ్గుచే
సుల్లము గొల్పదేని వికచోత్పలలోచన యేన నేఁడు నీ
వల్లభుతోడఁ జెప్పెద నవశ్యము నీచెలియండ్రకోర్కి సం
ధిల్లెడునట్లు గాఁగ భవదీయనియోగమహత్త్వశక్తిచెన్.

83


వ.

అని తన్నయనచేష్టావిశేషంబున నంగీకారంబు వడసినదియై
సునాభతనయల నభివీక్షించి యీప్రభావతికిం బతి యైన
వాఁ డతిలోకమహిమమహనీయుం డైనయొక్కదివ్యపురు
షుండు గావునఁ దదను గ్రహంబునందక్కఁ దక్కినయుపా
యంబుల నీయంతఃపురంబు మీవరులకుం జొర నలవి

గా దని తలపోసి యిట్టినీతి నిశ్చయించి పలికితి నని పలికి
యి ట్లనియె.

84


క.

మది తహతహ విడిచి యిఁకన్
ముదమున సతులార కొంగు ముడి వేసికొనుం
డిదె నేఁటిమాపటికిఁ గూ
ర్చెద వాలాయముగ నేను బ్రియులను మిమ్మన్.

85


క.

అని హంసి మృదుస్మితశో
భనలజ్జావనతవదనపద్మంబులతోఁ
గనుపట్టు వారి నిండ్లకు
ననిపించె నిశాచరేశ్వరాత్మజచేతన్.

86


వ.

ఇవ్విధంబున నవ్వధూమణుల నమ్మించినది యై యంచబోటి
నాఁటిరాత్రి యాదవులవిడిదికిఁ బోయి యేకాంతంబునఁ
బ్రద్యుమ్నగదసాంబుల మువ్వురం గూర్చి.

87


క.

సాకల్యంబున మీప్ర
త్యేకపుఁబను లైనఁ గాని యెద్దియు నాకున్
బై కార్యము దెలియదు నా
కౌకస్స్వామికిని జెప్పి యనుపుట కనుడున్.

88


ఉ.

అందఱకుం దలాయొకటి స్వార్థము గల్గుట దోఁపఁ బల్కె సం
క్రందనకార్యవర్తనము గాకయు నాకును బోలె నెవ్వియే
నిందు నిజార్థము ల్కడమయిద్దఱకుం గలవేమొయంచు నా
త్మందలపోఁత పూనిరి సమంబుగ నప్పుడు వారు మువ్వురున్.

89


వ.

శుచిముఖయు వారిభావంబు భావించి.

90


క.

మీమీప్రత్యేకార్థము
లేమియు నొక రొక రెఱుంగ రేమొ వినుం డం

చామువురకు మువురకుఁ గల
ప్రేమవతులతెఱఁగు వారిప్రేమలుఁ దెలిపెన్.

91


వ.

తెలిపి ప్రద్యుమ్నుం జూచి.

92


క.

నీ వొకఁడవు మాయావివి
గావునఁ బ్రియపొందుఁ గంటి గాని యితరు ల
త్యావిలధృతి నున్నా రి
ష్టావాప్తికిఁ ద్రోవఁ గాన కాత్మలలోనన్.

93


వ.

కావున వీరలయభిమతసిద్ధియు భవదధీనంబ యిందులకుఁ
దగినయుపాయం బూహింపు మనియె నప్పు డామువ్వురుం
బరస్పరరహస్యకార్యప్రకటనంబునకు నవ్వుచు సుహృద్భావ
సుభగంభావుకనర్మసంవర్తితవచనంబులతో నొండొరు మొగం
బులు గనుంగొనుచు.

94


క.

నీవచ్చుఠీవి గని యౌ
రా వాసవకార్యపరత యనుచుంటిఁ గటా
నీ వీతెఱఁగే యన మఱి
నీవో యన నీవొ యనఁగ నిగిడె న్నగవుల్.

95


వ.

అంతఁ బ్రద్యుమ్నుండు శుచిముఖిం జూచి నీవు సునాభ
తనయలకడకుం జని తమహృదయేశ్వరు లిదె వచ్చెద రని
యూఱడింపు మని పనిచి తానును గదసాంబుల కిష్టసిద్ధి
యగునట్లుగ నాత్మకల్పితభూవివరద్వారంబున దానవేశ్వర
కన్యాంతఃపురప్రవేశంబు గలిగించి నిజాంగనం గూడి రమి
యించుచుండె నప్పుడు.

96


సీ.

ఆననాంభోజవ్యపావర్తనాముహు
            ర్విఘ్నితాధరపానవిలసనంబుఁ

గరకృతాంతర్థిభంగురితకపోలచుం
            బనరణరణకసంభ్రమభరంబుఁ
బ్రసభాపహృతకుచప్రావరణాంశుక
            స్థానాభిషిక్తదోస్స్వస్తికంబు
సముపోఢజఘనవస్త్రప్రయోజనసమా
            దిష్టోరుయుగమిథోవేష్టనంబు


తే.

నగుచుఁ దనసిగ్గు పెక్కువ యవిరతంబుఁ
గరకరి యొనర్ప రాయిడిఁ గరముఁ గౌరలు
నతనురాగవేగంబున నతిశయిల్లు
రమణురతి నొప్పె నొకకొన్నిరాత్రు లబల.

97


వ.

అంత.

98


ఉ.

సిబ్బితి మాని నేఁటినిశఁ జిత్తములోపలికాంక్ష దీఱఁ జ
న్గుబ్బల నొత్తి యేనె మును గ్రుచ్చి కవుంగిటఁ జేర్చెద న్విభుం
గొబ్బునఁ బట్టి దంతశిఖ నొక్కెద మోవియు నంచుఁ గోరునా
గుబ్బెత రేపు లెల్లఁ దఱిఁ గొంకు నిరంకుశలజ్జపెంపునన్.

99


క.

యాదవుఁ డంతట రతులవి
భేదములు గ్రమక్రమాభ్యుపేతములుగ నా
పైదలికిఁ గఱపి చిత్రా
పాదిసురతరాజ్యమునకుఁ బట్టము గట్టెన్.

100


వ.

అందు.

101


క.

ఏవిధిఁ బతి వేఁడినఁ బుం
భావాదిని లజ్జఁ దొట్రుపడుఁ గాని తుదన్
యౌవనపుంజిందఱ గొని
భావజుసివ మెత్తి యతివ ప్రౌఢిమ నెరపెన్.

102

ఉ.

ఆచనువ్రేఁగు నట్టిజఘనాతిభరంబు విరోధి గాక తో
డై చపలాక్షి కిం పొసఁగె నప్డు సముద్గమవేగనున్నమై
ఖేచరచక్రసామ్యధృతికిం దగ నొక్కటి మీఁదికిం దివన్
భూచరచక్రసామ్యమును బొందెఁ దదన్యము క్రింది కీడ్చుచున్.

103


వ.

తదనంతరంబ.

104


సీ.

గుబ్బపాలిండ్లు గన్గొనువేడుకను మించు
            గాఢపరీరంభకౌతుకంబు
గాఢపరీరంభకౌతుకంబును మించు
            జఘనలోలుపహస్తచాపలంబు
జఘనలోలుపహస్తచాపలంబును మించుఁ
            దిలక మంటినకురు ల్దిద్దుతమియు
దిలక మంటిన కురు ల్దిద్దుతమిని మించు
            వాతెఱచవు లానువలపుపెంపు


ఆ.

వాతెఱచవు లానువలపుపెంపును మించు
రతులరహియు రతులరహిని మించు
నధరరసము విఘటితాన్యోన్యముగఁ దత్త
ఱిలుచుఁ బతి రమించెఁ జెలువఁ గూడి.

105


వ.

ఇత్తెఱంగున నమ్మత్తకాశిని హృదయేశుచిత్తంబు రంజిల్ల
నుల్లసిల్లెఁ జంద్రవతీగుణవతులుం బతులచేత నతులానురాగ
పూర్వకనివర్తితగాంధర్వవివాహ లగుచుం గ్రమప్రవర్ధమాన
నానారతిప్రాగల్భ్యనిర్భరంబు లగువిహారంబుల నతిశయిల్లి
రివ్విధంబున.

106


సీ.

అతియత్నరుద్ధలబ్ధాశ్లేషచుంబన
            కుచపీడనాద్య మై కొన్నినాళ్లు

మందమందక్రియమాణనానాప్రాతి
            కూల్యాభిరామ మై కొన్నినాళ్లు
కృతకప్రమాదానుమతసముల్లసదసం
            కుచితక్రియాక మై కొన్నినాళ్లు
విరళత్రపాతిరస్కరిణీపరిస్ఫుర
            త్కుతుకసంరంభ మై కొన్నినాళ్లు


తే.

ప్రకటముఖరితమేఖలారణితగుణిత
మణితఘంటారవాఘోష్యమాణమసృణ
కుసుమసాయకౌద్ధత్య మై కొన్నినాళ్లు
రతి జరుగఁ జల్పి రతివలు పతులసేవ.

107


వ.

అందు నొక్కనాఁడు.

108


శా.

ప్రద్యుమ్నుండు ప్రభావతీరతివిహారప్రౌఢిసారస్యసం
పద్యుక్తిన్ గడుఁజొక్కి దక్కితి రతీ మత్ప్రణమా నీకు నం
చుద్యత్ప్రేమసమృద్ధిఁ బల్కె నది యాయోషాలలామన్ శ్రవ
స్సద్యఃపాతనిశాతశూలసమ మై చాలంగ నొంచె న్వెసన్.

109


క.

ధాత్రిఁ జిరార్జితతాదృ
క్చిత్రమిథఃప్రేమ నుల్లసిలుచో బెరు కే
మాత్రము లే కెనసినప్రియు
గోత్రస్ఖాలిత్య మోర్వఁ గోమలివశమే.

110


ఉ.

ఏ మని చెప్ప నప్పు డసురేంద్రసుత స్సకలాంగసంపదు
ద్దామరతోత్సవానుపమ తత్ప్రథమక్షణసంభవత్సుఖ
శ్రీమయ మూర్ఛఁ జేడ్పడఁగఁ జేసెను దుఃఖపుమూర్ఛ యై కడున్
భామల కట్టిచో సవతినామము మారణమంత్ర మౌఁ జుమీ.

111

తే.

ఆప్రభావతి కొంతసే పవ్విధమున
మానదుఃఖనిశ్చేష్టిత యైనవెనుక
నుస్సు రనుచును వేఁడినిట్టూర్పు నిగుడ
వగలఁ బొగులుచుఁ బొరలె మార్మొగము గాఁగ.

112


తే.

అరిగె శయ్యాంతరమునకు నంత లేచి
యతివరో యిది యేమి నాయందుఁ దప్పు
గలిగెనో యంచుఁ దోన రాఁ గడఁగువిభుని
నట్లు రాకుండ ఘనమైనయాన వెట్ట.

113


క.

ప్రద్యుమ్నుఁడు తా నటు చను
నుద్యోగము దక్కి యుస్సురుస్సు రనుచు నా
హృద్యతరాంగినియోగము
సద్యఃపరితాప మొసఁగ సందేహమునన్.

114


వ.

తనకుఁ గొంతసమీపంబున నొక్కపర్యంకంబున నవ్వలి
మొగంబుగా శయనించి యున్నయాప్రభావతికిఁ గర్ణగో
చరం బయ్యెడుపాటి పరిమితస్వరంబున ని ట్లనియె.

115


ఉ.

తామరసాక్షి నావలనఁ ద ప్పొక టెయ్యదియైనఁ గంటివో
నామదితాల్మి చూడఁగ మనంబునఁ గోరియొ యల్గి కూడినం
బ్రేమలు వింతయింపు సవరించునటంచునొ యల్కచొప్పుగా
కేమయిన న్నిమిత్త మొకయించుక కల్గెనొ లేచిపోవఁగన్.

116


క.

అనుటయు ఘనదుఃఖవశం
బున నొకయుత్తరము నీక పొలఁతుక నిట్టూ
ర్పు నిగిడ్చి యూరకుండిన
దనుజారిసుతుండు ప్రచలితం బగుమదితోన్.

117

శా.

నాయం దేయది తప్పు దోఁచినది యోనారీమణీ నీకు దుః
ఖాయత్తత్వము చూడ నిక్క మిది మత్ప్రాణంబ వీ వెందునుం
జేయన్నేర్తునె తప్పు నీకు నిది నీచిత్తంబు రాఁ దెల్పుకో
డాయన్వచ్చెద నాకు రాముదల పెట్టంగాఁ దగు న్సత్కృపన్.

118


వ.

అట్లుం గా దేని.

119


తే.

వనిత యిటు వచ్చి నీవు నీవలయుసోదె
గొనుము దప్పున్న మఱి నాకుఁ బెనఁగఁ జోటు
గలదె నీమొలనూలునఁ గట్టుపడుదుఁ
బూనుదును నీవు మెడఁ బెట్టుపొగడదండ.

120


క.

నావుడును గంఠగద్గది
కావికృతి యడంచుకొంచు ఘనయత్నత వ
ర్ణావలి యేర్పడఁ బలికెఁ బ్ర
భావతి చెవి యొగ్గి తనదుపతి యాలింపన్.

121


చ.

అనఘుఁడ నిన్ను సోదెగొను నంతటిదాననె యేను దప్పులే
దును దలపోయ నీవలన దోసమె యాత్మను బాయకున్నవా
రిని బలు కొక్కమా ఱనుసరించుట మేన దివించునేఁ దొఱం
గని పెనుదప్పు నాయదియ కాక పదింబది గాఁగ నెంచినన్.

111


ఉ.

అట్టిమదీయ మైనవపురాశ్రయలోభమహాపరాధమే
గట్టిగ లేచి వచ్చుటకుఁ గారణ మైనది నాకు దోసముల్
గట్టెడునీమృషాచటువికారముఁ జూడఁగఁజేసి యిప్పుడున్
దిట్టును రట్టు నర్హ మగు దీనికి ని న్ననఁ జెల్ల దేమియున్.

123


తే.

దూఱఁదగు నిన్ను నొకటికిఁ దొంటియట్ల
కల్లకూరిమి నెరపువాక్యముల నన్ను

నిప్పుడును బయ లీఁదించె దిదియ కాదె
కుటిల తడిపాఁతఁ గుత్తుక గోయు టనఁగ.

124


ఉ.

వట్టిప్రియోక్తు లెందుఁ దగవా మిముబోంట్లరసజ్ఞ కాత్మను
న్నట్టివ కాక యిప్పు డివి యట్టివయైనను నీకు మోహపుం
బట్టపుదేవి యైనరతిభ్రాంతిన పల్కెదవేమొ నాథ యే
గట్టిగ నారతిప్రమదఁ గాను బ్రభావతి యండ్రు న న్నిలన్.

125


క.

అని మానదుఃఖ ముద్దీ
పన మొందఁగ నవ్వధూటి ప్రక్క లెగయ నే
డ్చెను వెక్కి వెక్కి లోలో
ననె యకటా! యిదియు జీవనమె నా కనుచున్.

126


క.

నాయకుఁడును దాను మును ర
తీ యని తద్రతులసంగతిన పల్కినప
ల్కాయింతికిఁ గోపము రాఁ
జేయుట తద్వచనరీతిచేఁ గని నగుచున్.

127


క.

రమణీ యిందాఁకను దెలి
యము నీయల్కకు నిమిత్త మదియే భవదు
త్తమరతి నేఁ గరఁగుచు మె
చ్చమరఁగ న ట్లంటిఁ గాని నది తప్పగునే.

128


క.

అనుటయు భవదుత్తమరతి
యనుపలు కొక్కటియె యాత్మ నంటె సతికి నా
థునిపలుకులలో రతి యీ
సున దృఢవాసిత మితరముఁ జొరనీదు మదిన్.

129


క.

ఉవిదయు భవదుత్తమరతి
భవదుత్తమరతి యటంచుఁ బతిపలు కీర్ష్యా

వివశతఁ బలుమఱుఁ దడవుచు
నవివేకంబునఁ దదర్థ మరయుచుఁ దనలోన్.

130


క.

నాకంటె నకట యుత్తమ
యాకె యగుట చెప్పవలయునా యీగతి నీ
వాకున నీ దగుప్రేమో
త్యేకమె చాటంగ ననుచుఁ జింతిలుచుండెన్.

131


వ.

ఇట్లు తద్దయుం బ్రొద్దు చింతా క్రాంత యై యున్నప్రభావ
తికిం బ్రద్యుమ్నుం డి ట్లనియె.

132


క.

పలుక వొకింతయు నాతోఁ
జిలుకవు కరుణామృతంబుచిను కొకటియు లో
నులుకవు నాదగుదైన్యపుఁ
బలు కవగణనమున వినుచుఁ బద్మదళాక్షీ.

133


క.

చేరక యుండఁగ నాకొక
ఘోరపుటాన యిడి నీవుఁ గూరిమి కెడ యై
కారుణ్య మెడలి నావెత
చేరువనే వినుచు నునికి చిత్రము తరుణీ.

134


క.

దానవునకు నుదయించిన
దానవు గావున లతాంగి దయ చాలదు నీ
మానసమున నీవిలఁ బ్రథ
మానసమస్తోరుగుణసమంచిత వైనన్.

135


ఉ.

నీవిపు డింతపేరలుక నెట్టుకొనన్ ధరియించి యున్కి నా
కోవనజాక్షి మందపవనౌషధినాయకముఖ్యు లుగ్రతా
పావహు లౌట చిత్రమె నిజాత్మ యనంగుఁడు నొందుచున్నవాఁ
డేవిధిఁ బ్రేమపాత్రుఁ గినియించినవారికి శత్రు వాత్మయున్.

136

తే.

అన విడువు మచ్చటికి నే నరుగుదెంచి
యలుక తీర్చెదఁ గాదేని జలరుహాక్షి
యాస విడువు మిచ్చటికి నీ వరుగుదెంచి
నీదు మధురంపుమోవితేనియలు నాకు.

137


వ.

అని యంతకంతకుఁ బెరిఁగెడు పరిరంభరాగతత్పరతావశంబున.

138


ఉ.

రాఁగదె యోసుధాంశుముఖి రాఁగదె యోకఠినోన్నతస్తనీ
రాఁగదె యోవిలాసవతి రాఁగదె యోకలకంఠభాషిణీ
రాఁగదె యోకళావిదుషి రాఁగదె యోకలహంసగామినీ
రాఁగదె యోగుణైకనిధి రాఁగదె యోలలితాంగి డగ్గఱన్.

139


క.

కలికీ రాఁగదె చిలుకల
కొలికా రాఁగదె లతాంతకోదండునిపూ
ములికీ రాఁగదె యూరక
యలికీరార్భటుల నేల యలఁచెదు నన్నున్.

140


వ.

అని వేఁడుకొనుచున్నంతం బట్టణంబులోనం దనవిడిదివా
కిటం బ్రాబోధికంబు లైన వాద్యస్వనంబులు వినంబడు
టయు వజ్రనాభుపడవాళ్లు పిలువవచ్చువేళ యయ్యెఁ
గావలయు నింతటం బోక యున్నఁ గార్యంబు తప్పు ననుచు
లేచి యాత్మకల్పితభూవివరద్వారంబునకై చనియె నప్పుడు.

141


క.

వెఱపింపఁబోయి వెఱచిన
తెఱఁగునఁ దా వేఁడుకొనఁ బతి న్వెనుకొనియెం
చెఱవ తనయల్క కడుఁ గీ
డ్పఱచి విజృంభించువిరహపరితాపముచేన్.

142

క.

తనరమణి యిట్లు తను వెను
కొనుట యెఱుంగఁడు మురారికొడు కపుడు ప్రయో
జనవశత జనియె నతిరయ
మున నాత్మనివాసమునకు భూవివరమునన్.

143


క.

ఆవనితయు వడివడిని బి
లావధిగా నరిగి యంత నవ్వల నరుగం
గా వెఱచి తిరిగి వచ్చెను
భావము గలఁగంగ విభునిపానుపుకడకున్.

144


వ.

అట్లు వచ్చి.

145


చ.

తనవిభుపాదసంగతిని ధన్యము లైనసువర్ణపాదుకల్
చనుఁగవ నొత్తుకొంచు మఱి శయ్యను రాలిన తద్విలిప్తచం
దనలవము శరీరమునఁ దాల్చుచుఁ దత్పరిభుక్తముక్తమా
ల్యనికర మక్షియుగ్మమున నద్దుచు నించుకసేపు రంజిలెన్.

146


చ.

తదనుభవోదితశ్రుతికతంబున నవ్విభురామణీయకా
భ్యుదయము చర్చ సేయు సురతోత్సవచాతురి యెంచుఁ బ్రేమసం
పద గణియించు లాలనలభంగులు భావన సల్పు మిక్కిలిన్
హృదయమునందు రాగిలుచు నింద్రవిరోధితనూజ మాటికిన్.

147


ఉ.

అక్కట యిట్టివల్లభునియందును గోపము పుట్ట నాకుఁ ద
ప్పొక్కటి యేల తోఁచె నదియు న్మఱి మద్రతిఁ గూర్చి యంటఁగా
దక్కఁగఁ దెల్పె వల్లభుఁడు దానికి నర్థము నిప్పు డేను వే
ఱొక్కటిగాఁ దలంచి విడ నొల్లన కోపము దైవవంచనన్.

148


ఉ.

ఆయనఘుండు దాఁ దొలుత నంపినపత్రికలోన నున్న య
త్యాయతరాగభంగు లరయంగ ననన్యసమానభాగ్యఁ గా

నాయది చూడ నాదయినయల్కయమూలము కాకయున్న నా
నాయకుఁ డట్లు ప్రార్థన మొనర్పఁగ నే వినకున్కి యొప్పునే.

149


క.

మగవాఁడుఁ దుమ్మెదయు సరి
జగతి నదియుఁ గాక నాఁటిచాటూక్తులప్రే
మ గురుత్వము నలపత్రిక
యు గణింపఁగ నతనియందు నొదవునె తప్పుల్.

150


వ.

అని విరహవేదనం బొరలుచుండఁ బ్రభాతం బగుటయుఁ
బ్రభావతి తనగృహదేవతయుం బోలెఁ బూజ లందుచు
ననన్యవిదితగుప్తంబై యున్న యాపత్రికం బుచ్చుకొని
శృంగారపుందోఁటలోనికిఁ జని యొక్క వివిక్తస్థలంబునం
గూర్చుండి మున్ను రాగవల్లరి చదువఁగా మిగిలినపత్రికా
భాగంబు తనచేత నటమున్ను బహువారపఠితం బయ్యు
నవోత్కంఠఁ గలుగంజేయుచుండ నల్పస్వరంబునఁ దనలో
ని ట్లని చదువం దొడంగె.

151

ద్విరదగతి రగడ

ఓహంసి నీచేత నున్నయది నాబ్రదుకు
నాహృదయ మింతిడెందము నేకముగ నదుకు
కరుణ నిది పదివేలుకమ్మలుగఁ గైకొనుము
పరఁగ సతితోడ నాపలుకుగా ని ట్లనుము
విద్యున్నిభాంగిరో వినుము నీకృప గన్నఁ
బ్రద్యుమ్నుఁ డనుపేరు ఫలిత మగు నా కెన్నఁ
ద్రైలోక్యనిత్యసామ్రాజ్యవైభవ మైనఁ
బోల దొకలేశమును బొలఁతి నీకృపలోన
గరిమ నెల్లెడల నీకనుసన్నలో వత్తు

హరిమధ్య యేబాస యైన దీనికి నిత్తు
నేణాక్షి విను నీయుపేక్ష నాచెవిఁ బడినఁ
బ్రాణము హరించు విరు లావార్త వెంబడిన
నీమోవిచిగురుతేనియలు గ్రోలెడియాస
నీమొలకనవ్వువెన్నెలచలువ గొనునాస
నీమృదుకపోలసన్నిధిని మో మిడునాస
నీమోహనశ్రోణి నిమురఁ గలిగెడు నాస
నీదుపాలిండ్ల నానెడు వక్ష మనునాస
నీదుశృంగారకళనెలవు లంటెడియాస
నీదుమణితామృతము నింతుఁ జెవి ననునాస
నీదులలితోరువు లెమ్మి నొత్తెడియాస
నొడలిలోఁ బ్రాణవాయువులు నా కిందాఁక
వెడలకుండఁగ నిట్లు విన్నవించెదఁ గాక
యీకమ్మపూఁదోఁట యీతేనియలజళ్లు
నీకోమలపుగాడ్పు లీవెన్నెలబయళ్లు
తను వైదుపాళ్లు నింతక పంచి లోఁ గొనవె
యనయంబు నివి విరహి కపకారు లన వినవె
నిండుచందురుఁడు నీనెమ్మొగంబు సుహృత్తు
గండుఁగోయిలఫణితి కలభాషలకుఁ దొత్తు
మెఱుఁగుఁదీఁగెలు నీదుమృదుతనూలతయంట్లు
కఱకుఁబాయపుఁదేంట్లు కచభరశ్రీబంట్లు
కెంజిగురుచాయ నీకెమ్మోవికిని దాసి
కంజవైభవము కన్గవకు నంతేవాసి
యివి యెల్ల నాకింపు లిల నీవు చేపట్ట

నివియె పెనుమృత్యువు లొకింత నీ వెడ పెట్ట
నని తన్నుఁ గూర్చి నే నాడుట చెవిఁ జొనుపు
వనిత యే మనియె నది వ్రాసి వేగమె యనుపు
మోరాజహంసి నీయుల్ల మెందు నహేతు
కారుణ్య మని గట్టిగాఁగ నారసి చూతు
నని చదువుకొన వినియె నటమున్న యేతెంచి
వెనుక నుండి తదీయవిభుఁ డాత్మ హత్తించి.

152


వ.

ప్రభావతియు నిట్లు లేఖ చదువుకొని తదర్థంబు మఱియు
మఱియు భావంబునం బరామర్శించుచు.

153


మ.

ఇవి యాదిం గల ప్రేమభంగు లిఁక నాయేతెంచుయత్నంబున
ట్టివిధి న్నన్నుఁ బరిగ్రహించుట నిరూఢి న్నేఁటిదాఁకన్ రతో
త్సవసౌహార్ధరతుల్ శతోత్తరత మించం జల్పు టాభవ్యుప్రా
భవరూపాదిగుణవ్రజం బరయ నాభాగ్యంబె భాగ్యం బిలన్.

154


క.

ఈరాత్రి యకారణపుం
బేరలుకఁ దదాత్మ కెడసి పిరువీఁ కగుచొ
ప్పారయ భాగ్యవిహీనులు
లే రెవ్వరు నవనిమండలి న్ననుఁ బోలన్.

155


వ.

అని చింతించుచుండ.

156


తే.

రాగవల్లరి యంత నారమణికడకు
నరుగుదెంచి యాసఖివెన్క నచలవృత్తిఁ
బొంచి యున్నట్టిప్రద్యుమ్నుఁ గాంచి యతని
యక్షిసంజ్ఞచేఁ గాననియట్ల యుండె.

157


వ.

తదనంతరంబ యాయంబుజాక్షిచందం బభివీక్షించి.

158

చ.

పయిదలి నేఁ డిదేమి ముఖపాండిమ యున్నది మీఱి ప్రత్యుషః
క్రియలఁ బరాకు మార్చినది కృష్ణచతుర్దశినాఁటిచంద్రరే
ఖయు బలె మేను చిక్కినది కాటుకక ప్పదె యొప్పెడుం గుచ
ద్వయిఁ బికరాజిమ్రోఁతఁ గయి వ్రాలెదు సోలెదు చల్లగాడ్పులన్.

159


ఉ.

లోలతరాక్షి యాపయిఁటలోనిది యెక్కడిలేఖ యల్లనాఁ
డేలిక యంపినట్టిదియె యెయ్యది యైనను సిగ్గు లేక నేఁ
డాలిఖితార్ధ మేమయిన నట్టిటు గెంటినఁ జూచెదేమొయౌఁ
బోలిక చూడ నట్ల యధిపు లస్తులందును సత్యసంధులే.

160


క.

అని నడుమ నడుమఁ బ్రద్యు
మ్నునివదనముఁ జూచి నగుచు ముద్దియ తల్లో
చనసంజ్ఞాప్రేరణమున
దనుజేశ్వరసుతకు మఱియుఁ దా ని ట్లనియెన్.

161


క.

ఈరేయి రమణుఁ డెంతయు
గారించినవాఁడు నిన్ను గట్టిగఁ దెలిసెన్
నారీమణి మానునె మదిఁ
గూరిమి దాఁచుకొని యలుగఁ గూడదు నీకున్.

162


క.

నీ వలిగెడుదాఁకను లే
దోవనితా యాట మాని యొడ్డించుకొనం
గా వలసె విభునియలుకల
చే విరహాకులిత వై కృశించితి విదిగో.

163


ఉ.

తానటు లల్క దెచ్చుకొని ధైర్యబలంబున రాక తక్కె నీ
దైనవియోగతాపమృదితాకృతి చూడఁగ నప్పు డిష్ట మో

మానిని తాను నోర్వఁ డతిమాత్రవియుక్తికి నిప్డ మాన్చునీ
కానెఱజాణయోగ్యకరుణామృతవృష్టి నయోగఖేదమున్.

164


వ.

అనిన రాగవల్లరికిఁ బ్రభావతి యి ట్లనియె.

165


సీ.

అట్టియసత్యంపుటలుకలు కల్పించు
            కొని వియోగవ్యథఁ గుందఁ జేసి
కాంతలయారూపు గనుఁగొను వేడ్కలు
            రాగుండెతోడి నిర్దయులయందు
సంభవించునొ కాని సత్కృపారాశి మ
            త్ప్రాణేశుఁ డేవినోదమున కైన
ననుఁ జిన్నపుచ్చి కన్గొనఁజాలఁ డొకనిమే
            షార్థమాత్రంబు నోయంబుజాక్షి


తే.

నేఁటిరాత్రి తెఱంగు నానేరమున జ
నించె నది యొక్కమాట కే నెమ్మనమున
నలిగి తేఱన యే నెన్నిప్రార్థనముల
దానిచే నెంత యెడసెనో ధవునిమనము.

166


చ.

అనవిని రాగవల్లరి సమంకురితస్మితకోమలావలో
కనముల నాప్రభావతిని గన్గొనునట్ల తదీశ్వరుం గనుం
గొని బళి గోపపుత్రరసికుండవు నీదగుధౌర్త్య మింతిపై
ఘనమసమానవీనసుధ గాంచి చవుల్ గొనుగోర్కి కోర్కియే.

167


క.

నా విని యోసితుటారి ద
యావారిధి నధిపుఁగూర్చి యనకు మొకటియున్
నావెఱ్ఱికినుక యింతకుఁ
దావల మని చెప్ప వినవె తరుణీ యనియెన్.

168

వ.

అని యోరాగవల్లరీ నీవు నాకు బహిఃప్రాణంబవు గాని
సఖిమాత్రంబవు గావు నీకు దాఁపురంబు సేయనేల మా
తెఱంగు వినిపించెద విను మని తనకోపనిమిత్తంబును బ్రి
యుండు తనతోడన రాకుండ నాన పెట్టి తాను శయ్యాంత
రంబున కరుగుటయు మొదలుకొని ప్రియనిర్గమపర్యంతంబుగాఁ
దమవృత్తాంతంబు సకలంబును జెప్పఁదగినప్రకారంబును
జెప్పి యి ట్లనియె.

169


క.

కాంతుం డాగతి నాయ
త్యంతకఠోరతకు నాత్మయందు విఱిగియో
వింత యగువిరహదశ కుప
శాంతి యరసికొననొ లేచి చనియెం బెలుచన్.

170


క.

తఱి నంత వేఁడుకొన విన
నెఱుఁగనినానిష్ఠురతకు నేడువిరుగులన్
విఱిగె నొకొ ప్రియునిచిత్తము
విఱుగక యున్నం ద్యజించి వెస నేల చనున్.

171


ఉ.

క్రీడకు మానసంపదకు వెల్తిగదా యిది యంచు నెంచ కే
గూడఁగఁ బాఱిపట్టుటకు గొబ్బున నప్పుడ సాహసించితిన్
జేడియ దాఁప నేర కిది చెప్పెదఁ బ్రాణము నీవు గావునన్
గూడఁగ లేక యంతఁ గడుఁగుందితి ఘోరవియోగవేదనన్.

172


ఉ.

ఆపరిపాటి కంతఁ గడు నల్గుచు నట్టివిభున్ దథావిధా
లాపవిచిత్రతం దురపిలంగ వియోగదవాసహత్వమున్
జూపుచుఁ జేర వేఁడు వివశుం గయికోక కఠోరవృత్తిఁ బె
న్పాపముఁ గట్టుకొన్నగతభాగ్యకు నా కివి పాట్లు నెచ్చెలీ.

173

సీ.

నెఱప కేలున్నవి నెత్తలిరీటెలు
            తమవాఁడి యెల్ల నాతనువుమీఁదఁ
బఱప కేలున్నవి పరభృతశ్రేణులు
            శ్రుతులలోఁ దమపల్కుసూదు లెల్ల
నుఱుప కేలున్నవి నెఱయధైర్యంబును
            గందంపుమలకోడెగాడ్పుగములు
విఱుప కేలున్నవి వెస నంటఁ బొదివి వ
            పుర్మహాశఁ బరాగముర్మురములు


తే.

నన్ను నొకభూమిలోపలినాతిగాఁగఁ
దలఁచి వే చంప కి ట్లోర్పు దాల్చినవియొ
తెగితెగనిచిఱుగత్తికోఁతగ వధించు
టుచిత మని యోలి ని ట్లేఁచుచున్నయవియొ.

174


చ.

అని విరహంబుఁబేరలఁత నాశ్రితచంద్రశిలాతలంబువిూఁ
ద నొరుగుచున్ సఖిం దిగిచెఁ దన్వి శిరోదిశకై తదంకముం
దనకుఁ దలాడగాఁ గొనఁగఁ దజ్ఞత బోటియుఁ దత్క్రియాప్రవ
ర్తనకుఁ దదీశు దాకొలిపి తాఁ దనయింటికిఁ బోయె నవ్వుచున్.

175


తే.

ప్రాణసఖి యిట్లు పన్నిన పన్నుగడలు
తెలియమింజేసి యపుడు దైతేయకన్య
తనకు సంకోపధాన మ ట్లనువుపఱిచి
యాలతాంగియ యున్నది యనుతలఁపున.

176


ఉ.

ప్రాణసఖీ నిను న్నెరయఁ బాసి చనన్ దఱి వచ్చె నాకుఁ గ
ల్యాణి తలంపుమీ సుసమయంబుల నన్ననిప్రేమపెంపునన్
బాణి మెడం దగిల్చి తనపైకిఁ దదాస్యము వంపఁ బూని సు
శ్రోణి నిజేశుమో మగుట చూచి త్రపాద్భుతమోదమగ్నతన్.

177

క.

ఒక్కింతతడవు చేష్టలు
దక్కి కనంబడియెఁ జిత్రతనువును బోలెన్
మిక్కిలిఁ గమనీయత సతి
దక్క కురుస్తంభసంగతత్వముకతనన్.

178


వ.

అప్పుడు ప్రభావతికిఁ బ్రద్యుమ్నుం డి ట్లనియె.

179


చ.

వెఱఁగుపడంగ నేల యలివేణి భవత్పతిఁ గానె యేను నీ
విరసత మాన్పలే కపుడు వేఁగుచు నంతటిలోఁ బ్రయోజనాం
తరమతి నేఁగి నేఁటికిని దానిప్రసంగము లేమి వచ్చితిన్
దిరిగి వసించితి న్వెనుకదిక్కున నీవిధమెల్లఁ జూచుచున్.

180


చ.

అని యిరుకేలఁ గ్రిందటిగ నాసతిబాహులు పట్టి యెత్తి వె
న్వెనుకకు రా వెసం దిగిచి వేడుక నంకకృతోపవేశఁ జే
సె నెఱులు దువ్వెఁ జెక్కిటను జెక్కిలి జేర్చెను మోవిచుంబనం
బొనరిచెఁ జన్ను లంటెఁ గవయుగ్మము ప్రక్కలఁ బాఱఁ జొన్పుచున్.

181


మ.

సుముఖీ యెన్నఁడు నింక నల్గ నను మంచు న్నొక్కి తట్టె న్నఖా
గ్రముల న్దంతశిఖ న్గుచాధరము లాకాంతుండు తత్కాంతయున్
సుముఖా యెన్నఁడు నల్గఁ జేయనను మంచు న్మోవి తా నట్ల నొ
క్కి మనోనాథువరిష్ఠనిష్ఠురకుచక్లిష్టాంగుఁ జేసెం దుదన్.

182


చ.

అలుక యొకింతకాలము మహత్తరసేతువురీతి నాఁగి భే
దిలి తొలఁగన్ సహస్రముఖతీవ్రత చూపెను దొంటికంటె వా
రలయసమానమానితపరస్పరకేళిరసప్రవాహ మ
గ్గలికఁ దదుత్తరంగరతికర్మవిచిత్రతఁ జెప్ప శక్యమే.

183


వ.

ఇవ్విధంబునఁ బ్రద్యుమ్నుండు ప్రభావతిం గూడి బహుకా
లంబు యథేష్టభోగంబు లనుభవించుచు నప్పటప్పటికి వజ్ర
నాభుని నపూర్వవర్తనప్రవర్తనంబుల వశవర్తిం జేసికొనుచుఁ

బ్రవర్తిల్లె గదసాంబులును జంద్రవతీగుణవతులతోడఁ గూడి
రాత్రు లెల్ల రమియించుచు నాట్యసమయంబులఁ బ్రద్యుమ్ను
నకు విదూషకపారిపార్శ్వకాదికృత్యంబుల సహాయత్వంబు
నడపుచు దైత్యవిభునిచిత్తంబు వడసి రంత.

184


వ.

రమణ దలిర్పఁగా ఋతువురాకలు దక్కె నొడళ్ళు చిక్కె చి
ట్టుము లుదయించె వేవిళులనూనత మించెఁ గపోలసీమఁబాం
డిమ గనుపట్టెఁ జన్మొనల నీలిమ పుట్టె వలగ్నముం గురు
త్వము పొరసెన్ వళు ల్విరిసె దానవకన్యలకుం గ్రమంబునన్.

185


క.

నవమాసానంతరమునఁ
బ్రవిమలశుభదినమునం బ్రభావతి గాంచెన్
శివ గుహునిఁ గాంచుకైవడి
నవనిఁ బ్రభావంతుఁ డనఁగ నమరెడుతనయున్.

186


క.

ప్రణుతగుణ చంద్రవతి దిన
మణినిభుఁ జంద్రప్రభుం గుమారునిఁ గాంచెన్
గుణవతియుఁ గాంచె నిరువుర
గుణవంతుం గీర్తిమంతుఁ గోర్కులు పొదలన్.

187


వ.

ఇట్లు గాంచినకుమారు లుదయించుచుం దోడన పరిపూర్ణ
యౌవనులును సకలవేదవేదాంగపారగులును ధనుర్విద్యా
సంపన్నులు నగుచుం గన్యాంతఃపురంబునఁ బ్రవర్తిల్లుచు
న్నంత నొక్కనాఁడు తద్రక్షణాధికారులవలన వారలయు
నికి నిశ్చితంబుగా విని వజ్రనాభుం డాగ్రహోదగ్రుం డగు
చుఁ దనసభాసదులఁ గలయం గనుంగొని.

188


ఉ.

కంటిరె కాలవక్రతప్రకారము దానవముఖ్యులార నా
యింటికి ద్రోహముం దలఁచి యిష్టసుఖాప్తికి మ్రుచ్చు లిట్లు నూ

ల్కొంట దలంప శేషఫణికోఱల వ్రే లిడి గోఁగుకోఁగ ము
క్కంటివెలుంగుకంటఁ జణకంబులు వేఁచుకొనంగఁ బూనరే.

189


తే.

వాండ్రు సురవంశభవులైన స్వర్గమునకుఁ
బ్రళయసమయ మిప్పుడు నాగకులజులైన
నాశకాలంబు తద్భువనమున కిదియ
నరు లయిన నంత్యదశ నేఁడ ధరణి కెల్ల.

190


తే.

ప్రాణములతోడ నిట వాండ్రఁ బట్టి తెచ్చి
తెలిసి తల్లోకమును గడతేర్పవలయు
నీవు చని పట్టి తెమ్మని నిజపురంబు
పెద్దతలవరిఁ దాఁ బంచె భీమబలుని.

191


తే.

వాఁడు చని తిరుగక యున్న వరుస దండ
నాయకోత్తములను దళవాయిఁ బనిచె
వారుఁ దిరుగకుండినఁ దదవస్థఁ దెలిపె
నరులు కోటకొమ్ములఁ గట్టినట్టితలలు.

192


వ.

వజ్రనాభుండు తా నత్యంతకోపాటోపదీపితముఖుం డగుచుఁ
దనతమ్ముఁడు సునాభుండును సకలమిత్రామాత్యవర్గం
బులును రథతురంగమాతంగపదాతివ్రాతపాదఘాతంబుల
చేత భూతలంబు వడవడ వడంక నద్భుతోత్సాహంబునం
జేర్చి కొలువ నలువు మిగిలి కన్యకాభవనప్రాకారంబు
చుట్టు ముట్టుకొనియె నప్పుడు తమవిడుదుల నున్న ప్రద్యు
మ్నగదసాంబులు మన మింతట నంతఃపురప్రవేశంబు సేయక
తడసిన నీబెడిదంపురక్కసునియక్కజంపువిక్రమంబు
కుమారులకు నోర్వ శక్యంబు గా దని పూర్వవిహితమహీ
వివరద్వారంబున నాక్షణంబ ప్రవేశించి భీతివశంబున

నొక్కచోటనే చేరియున్న తమకళత్రంబులయుత్తలపాటు
దీర్చి తత్పూర్వకృత్తదైత్యగాత్రంబుల నెత్తుటం జొత్తిల్లిన
యాయుధంబులు తమచేతులన యుండ సంభ్రమంబునం
జనుదెంచి మ్రొక్కియున్నకుమారుల సంశ్లాఘావచనంబుల
నలరించి రట్టియెడఁ బ్రద్యుమ్నుండు ప్రభావతిం జూచి
యి ట్లనియె.

193


ఆ.

మగువ వినుము మిగులఁ దెగి విక్రమింప మీ
తండ్రి కదలి వచ్చె దర్ప మెసఁగ
మనకు వచ్చుఁ గడుఁబ్రమాద మే మింతట
యుద్ధమునకుఁ దెగక యూరకున్న.

194


క.

కుడుములవ్రేట్లాటలు గా
వుడు రాజానన రణంబు లూహించినవెం
బడి రా వే మటు తొడరినఁ
దొడిఁబడ నెవ్వాఁడు బిట్టు ద్రుంగునొ మాచేన్.

195


ఉ.

చేడియ నీమనంబునకుఁ జింత యొకింత జనించెనేని నేఁ
జూడఁగఁ జాల నీజనకుచొప్పు దలంప హతుండు గాక తాఁ
గీడుచలంబు మానఁ డనికిం జొర కొండొకత్రోవ ద్రొక్కఁగాఁ
గూడద యేమి సేయుదును ఘోరవిచారము పుట్టె నాత్మలోన్.

196


చ.

అని తనుఁ గూర్చి దానవకులాగ్రణిపైఁ దెగలేనిచింత సే
యునధిపుఁ గోట లగ్గలకు నుగ్రత డగ్గఱుభూరిసైన్యుఁ దం
డ్రినిఁ బరికించి యింతి విభునిం దముఁ గాచికొనంగ వేఱత్రో
న నెమకి కాన కంతఁ బితృవత్సలభావముఁ బాఱనూకుచున్.

197


క.

తాన చని మూలనున్న య
నూనతదీయాసిఁ దెచ్చి యొసఁగి గెలువుమీ

దానవపతిఁ దక్కినయను
మానము మాను మని పలికె మానవతి పతిన్.

198


చ.

పలికిన సంతసిల్లి హరిపట్టి గదాదుల నార్వురన్ వధూ
నిలయములోని కావలికి నిల్పి రయంబున నొక్కరుండుఁ దా
వెలువడి కోట కుగ్రబలవేష్టనము న్విడిపించుచున్ నిర
ర్గళగతిఁ జుట్టునుం దిరిగె ఖడ్గవిహారపటుత్వదీప్తుఁ డై.

199


ఉ.

కాంచనదీప్తిచేఁ బసిఁడిగట్టుతెఱంగు నగళ్లకోట సూ
చించఁగఁ దాను భాస్కరునిచెన్ను వహించెను దానిఁ జుట్టి రా
సంచరణం బొనర్చుచును శౌరితనూజుఁడు కోటచుట్టునున్
డించిన దైత్యసైన్యము వడిం దమమున్వలె విచ్చిపాఱఁగన్.

200


క.

లగ్గలకు నట్లు కోటకు
దగ్గఱుతనమొనల నెల్లఁ దఱిమి తఱిమి పే
రగ్గలిక చూపుమరుపో
టగ్గించుచు వజ్రనాభుఁ డతని నెదిర్చెన్.

201


వ.

ఎదిర్చి యి ట్లనియె.

202


ఉ.

ఎవ్వఁడ వీవు నాముదల యించుక లేక చొరంగరాదు వీఁ
డెవ్వరికైన బ్రహ్మవర మిట్టిది యేగతిఁ జొచ్చి తీవు తా
నివ్విధి నాకుఁ గల్లవర మిచ్చిన బ్రహ్మకు శిక్ష చేసెదన్
గ్రొ వ్వడఁగించి ని న్నిపుడ కొట్టెద నీకులమెల్ల రూపఱన్.

203


వ.

అనుటయు నతండు.

204


క.

నిను నేఁడు తిరిగి చన ని
చ్చినఁ గద బ్రహ్మకును శిక్ష సేయుదు వీదు
ర్జనతలె కావే మిముఁ జెఱి
చినవి యసత్యోక్తి బ్రహ్మజిహ్వకుఁ గలదే.

205

క.

మొదలను బురిఁ జొచ్చితి నీ
ముదలన భద్రనటవేషమున హరిసుతుఁడన్
యదుకులజుఁడఁ బ్రద్యుమ్నుఁడ
మదిచ్ఛఁ గైకొంటి నీకొమారితపొందున్.

206


ఉ.

కోరికఁ దావకానుజునికూఁతులకుం బతు లైనవారు మా
వారలె నాకు వారికి నవార్యబలు ల్సహజాతయౌవనో
దారులు గల్గి రాత్మజులు తల్లులరక్షకు నున్నవారు ప్రా
కారములోన నీదొర లగణ్యు లఁబల్వు రఁదిన్నమృత్యువుల్.

207


తే.

హరికి దేవేంద్రునకు నీవు శరణు చొచ్చి
తేని నీప్రాణముల కెందు నేను దెగను
శరణు చొరవేని నావాలు కరుణ గిరుణ
యెఱిఁగినది కాదు నీ వది యెఱిఁగె దిపుడ.

208


తే.

అనిన విని యోరి నీ వేమి యనినఁ జెల్లు
నేను నాదృష్టియెదుర ని న్నింతతడవు
పెట్టుకొని యుండుటకు నని బెట్టిదంపు
టంపవానలు గురిసె భయంకరముగ.

209


క.

తనవాలునఁ దచ్ఛరములు
దుసుముచుఁ బ్రద్యుమ్నుఁ డతనిఁ దునుముకడంకన్
ఘనరయమునఁ జనఁ దాఁకిరి
సునాభముఖ్యు లగురాక్షసులు బలములతోన్.

210


క.

అది యంతయుఁ గని మనముల
గదసాంబులు గినిసి కోటగవకులు దెఱపిం
చి దురాధర్షాటోపత
నెదిర్చిరి సునాభముఖుల నింద్రాహితులన్.

211

శా.

అంతం గేశవుఁ డంచవేగరులచే నాదైత్యుసంగ్రామవృ
త్తాంతంబు న్విని తార్క్ష్యవాహకుఁడు చక్రాద్యాయుధప్రోల్లస
త్కాంతిక్రాంతదిగంతరుం డయి వడిన్ దా వచ్చె నచ్చోటికిన్
సంతోషంబున వజ్రి సత్వరగతి న్సంధించి సేవింపఁగాన్.

212


వ.

అప్పు డింద్రుండు ధనురాదిసకలహేతిసమేతంబును మా
తలిసారథికంబును నైన తనదివ్యరథంబు ప్రద్యుమ్నునకు
ననిపి గదసాంబులకు ననన్యదుర్జయంబు లైనదివ్యస్యంద
నంబులఁ బనిచె దాన నపూర్వోత్సాహంబునం బొదలియు
యదుకుమారులు ప్రతిభటుల మించంజాలక సత్వరంబునఁ
బోరుచుండి రయ్యవసరంబునఁ గృష్ణుండు.

213


క.

సాహసము నాహతప్ర
త్యాహతనైపుణము నొక్కయంతగ సుతుతో
నాహవ మొనరించుమహో
త్సాహనిధి న్వజ్రనాభదైత్యునిఁ జూచెన్.

214


తే.

చూచి యిట్లైన నెన్నండు సులభ మగును
విజయ మని మరుచేతికి విష్ణుఁ డనిపెఁ
దనదుచక్రము నతఁడును దత్ప్రయోగ
మునను ఖండించె వజ్రనాభునిశిరంబు.

215


క.

గదసాంబులు తద్విజయా
భ్యుదయముఁ గని పొంగి బహువిధోగ్రాస్త్రములన్
జిదురుపలుగ నొనరించిరి
కదిసి సునాభాదిదనుజగణదేహంబుల్.

216


వ.

అప్పుడు.

217

శా.

మందారద్రుమపుష్పవృష్టితతులున్ మంద్రస్ఫురద్దేవతా
దుందుభ్యారవసంప్రవర్తనలు నస్తోకాప్సరోనర్తనా
మందోల్లాసము దివ్యగాయకుల సన్మాధుర్యగానంబు నా
నందోత్సేకము నిచ్చె లోకులకు మింటం జాల దీపించుచున్.

218


వ.

అంత నచ్యుతుం డనాథత్వదైన్యదశాపన్ను లగుపౌరజనుల
ననేకవిధలాలనాచాతుర్యశీతలవచనామృతంబున నపగ
తాశేషశోకపరితాపుల నపూర్వసంభృతానందవిశేషులఁ
గావించి వజ్రనాభునిరాజ్యంబు సర్వంబును జతుర్భాగంబు
లుగా విభజించి తదాధిపత్యంబునకుఁ బ్రభావంతునిఁ జంద్ర
ప్రభుని గుణవంతునిఁ గీర్తిమంతునిం బట్టాభిషిక్తులం
గావించి కొడుకులం గోడండ్రనుం దమ్ముని మఱఁదలిని
నత్యంతవిభవంబు మెఱయం దోడ్కొనుచు ద్వారకానగ
రంబున కరుగుదెంచి దేవేంద్రునిం దదీయస్థానంబున కనిచి
సకలసామ్రాజ్యవిభవంబు లనుభవించుచు నిరంతరకరు
ణావలోకనంబుల భక్తజనంబుల నవలోకించుచు మహానం
దంబునం బొలుపొందుచుండె నప్పుడు.

219


క.

వావిరిఁ బ్రద్యుమ్నుండు ప్ర
భావతితో నిష్టకేళిపరిపూర్ణత నిం
పావహిలఁగ వర్తిల్లెను
శ్రీవరుఁ దమతండ్రిఁ దగ భజించుచు ఘనుఁ డై.

220


తే.

అఘహరణహరివంశకథాశ్రయంబు
నాత్మపుత్త్రగుణస్తవనాంకితంబు
నైనయీకావ్యమునకు మహాప్రసిద్ధి
నిచ్చుఁ గావుతఁ గరుణ లక్ష్మీశ్వరుండు.

221

శా.

శ్రీరాజేంద్రగురూత్తమాన్వయజనుర్విఖ్యాతసౌభాగ్య సో
మారాధ్యప్రభుసత్కృపాచతురమత్యానీతఫాలాక్షష భ
క్త్యారబ్ధవ్యుపగూహనాతిసుఖితాత్మాప్తక్షమాశాంతిస
ద్వైరాగ్యోదయబోధముఖ్యబహుసంతానప్రసిద్ధుం డిలన్.

222


క.

వరచామరమిషవృతది
క్కరటిశ్రుతకీర్తిసామ్యకామ్యత్కృతిగో
చరితాఖిలవిద్వత్కుం
జరకర్ణుఁడు కర్ణుఁ డీగి చాతుర్యమునన్.

223


వనమయూరము.

భృత్యజనపోషణుఁడు పింగళిపురాంకా
మాత్యకులభూషణుఁడు మార్దవమహీయ
స్సత్యశుచిభాషణుఁడు సాధుజనతాసం
పత్యుదయపోషణుఁడు భవ్యకృపపేర్మిన్.

224


గద్యము.

ఇది నిఖిలసూరిలోకాంగీకారతరంగితకవిత్వవైభవ
పింగళి యమరనార్యతనూభవ సౌజన్యజేయ సూరయ
నామధేయప్రణీతం బైనప్రభావతీప్రద్యుమ్నం బనుమహా
ప్రబంధంబునందుఁ బరిపూర్ణభావభాసురంబైన పంచమా
శ్వాసము.

ప్రభావతీప్రద్యుమ్నము

సంపూర్ణము

—————