374. ద్రవ్యయజ్ఞములో నాలుగు రకములైన ద్రవ్యములు కాలిపోవుచుండగ వాటిని కాల్చునది జఠరాగ్ని. అలాగే జ్ఞానయజ్ఞములో ఐదు రకములైన ఇంద్రియ జ్ఞానములు కాలిపోవుచున్నవి. వాటిని కాల్చు అగ్ని జ్ఞానాగ్ని.

375. శరీరములో జరుగు రెండురకముల యజ్ఞములలో ద్రవ్యయజ్ఞము ఆత్మకు సంబంధించినది. జ్ఞానయజ్ఞము జీవాత్మకు సంబంధించినది.

376. ద్రవ్యయజ్ఞము ఆత్మకుపయోగపడునది కావున ఆత్మ ద్రవ్యయజ్ఞ మును సక్రమముగ నెరవేర్చుచున్నది.

377. జ్ఞానయజ్ఞము జీవునకుపయోగపడునది కావున జీవాత్మ జ్ఞానయజ్ఞము చేయవలెను. కాని జీవాత్మ జ్ఞానయజ్ఞము చేయడము లేదు.

378. ద్రవ్యయజ్ఞము ప్రతి జీవరాసియందు జరుగుచుండగ, జ్ఞాన యజ్ఞమును కోటికొక్కడు కూడ చేయడము అరుదుగా ఉన్నది.

379. జ్ఞానులు, స్వాములు, పీఠాధిపతులు, లోపలి జ్ఞానయజ్ఞమును గురించి తెలియక, బయటి అగ్నితో పుల్లలను కాల్చు యజ్ఞములు చేయుచున్నారు.

380. ద్రవ్యయజ్ఞము ద్వార సంప్రాప్తమగునది పాప పుణ్యములనబడు కర్మకాగా, జ్ఞానయజ్ఞము ద్వార సంప్రాప్తమగునది పరమపదమనబడు మోక్షము. 381. శరీరములోని ఐదు జ్ఞానేంద్రియముల వలన సంభవించునది కర్మ కాగా, కర్మ మూడు విధములుగ గలదు.

382. ప్రారబ్ధ, ఆగామి, సంచితములనబడు మూడు కర్మలలో ప్రారబ్ధము ఈ జన్మలో పుట్టినప్పటి నుండి చనిపోవువరకు జరుగునది.

383. ఆగామికర్మ అనగా పుట్టినప్పటి నుండి చనిపోవువరకు క్రొత్తగ వచ్చునది.

384. జీవితములో సాధారణ మనిషి చేయుచున్న పనిలో ప్రారబ్ధము ఆగామికము రెండు గలవు. ఎలాగంటే ప్రారబ్ధము అయిపోవుచున్నది. ఆగామికము తయారగుచున్నది.

385. జన్మ జన్మలకు అనుభవించగా మిగులుచు వస్తూ కుప్పలాగా పేరుకుపోవుచున్నది సంచితము.

386. శాస్త్రములు ఆరు, పురాణములు పదునెనిమిది కాగ అజ్ఞానులు భక్తిమార్గమున ప్రవేశించుటకుపయోగపడునవి పురాణములు, జ్ఞానులు మోక్షమార్గమున ప్రవేశించుటకుపయోగపడునవి శాస్త్రములు.

387. పదునెనిమిది పురాణములలో భక్తికి భాగవతము ముఖ్యము కాగా, ఆరు శాస్త్రములలో దైవజ్ఞానమునకు ముఖ్యమైనది యోగశాస్త్రము.

388. నూటికి నూరుపాల్లు యోగశాస్త్రమైనది భగవంతుడు చెప్పిన భగవద్గీతయే. 389. పురాణము పుక్కిడినుంచి, శాస్త్రము బొడ్డు దగ్గర నుండి వచ్చునను నానుడి కలదు. అందువలన అసత్యములతో కూడుకొన్నది పురాణము. సత్యములతో కూడుకొన్నది శాస్త్రము అని చెప్పవచ్చును.

390. శాసనములతో కూడుకొన్నది శాస్త్రము, కల్పనలతో కూడుకొన్నది పురాణము.

391. విషయమును మననము (జ్ఞాపకము) చేయునది మనస్సు.

392. మనస్సును చంచలమైన క్కుతో, నీచమైన పందితో , బలమైన ఏనుగుతో పోల్చి కొందరు పెద్దలు చెప్పినారు. కావున మనస్సు ఒక విషయము మీద నిలకడ లేనిది. నీచాతి నీచమైన విషయములను ఆలోచించునది, మరియు కట్టడి చేయాలనుకొన్న వానికి లొంగక బలమైనది.

393. మనస్సు మెలుకువలో ఒక ఆకారమును, నిద్రలో మరొక ఆకారమును కల్గి ఉన్నది.

394. మెలుకువలో శరీరాకృతిని పోలిన మనస్సు నిద్రలో ధూళి కణమంతయిపోవుచున్నది.

395. మనస్సు అజ్ఞానులలోకంటే సాధన చేయు వారిలో ఎక్కువ వేగముగ చలించుచుండును.

396. శరీరములో మనస్సు రెండు విధముల పని చేయుచున్నది. ఒకటి విషయములను జ్ఞాపకము తేవడము, రెండు బుద్ధి చెప్పిన దానిని బయటి ఇంద్రియములకు చేర్చడము, బయటి ఇంద్రియములు చెప్పిన దానిని లోపలి బుద్ధికి తెలుపడము. 397. మనిషికి నిద్ర మెలుకువలు మనస్సును బట్టియే ఉండును. శరీరమంతా మనస్సు వ్యాపించినపుడు (సూర్య చంద్రనాడులలో ఉన్నపుడు) మెలుకువ అని, బ్రహ్మనాడిలో అణగిపోయినపుడు నిద్ర అని అంటాము.

398. మనిషి మనస్సును జయించితే బ్రహ్మయోగము (జ్ఞానయోగము) అగును.

399. మనస్సుకు నేత్రమూ దృష్ఠికలదు. దానినే మనోనేత్రమనీ మనోదృష్ఠి అని అంటుంటాము.

400. మనస్సుకు చివరి మరుపునే మరణము అంటాము.

401. మనస్సుకు బుద్ధికి, బుద్ధికి మనస్సుకు నిత్యము అనుబంధముండును.

402. బుద్ధి గుణములకు అద్దములాంటిది.

403. ప్రతి గుణమును రెండు విధముల యోచించునది బుద్ధి.

404. శరీరములో జీవునితో సంబంధము గలది, కష్టసుఖములను అందించునది ఒక బుద్ధియే.

405. శరీరములో అన్నిటికంటే గొప్పది బుద్ధియే.

406. శరీరమందున్న ఆత్మవిషయమును జీవాత్మకు తెలియజేయునది బుద్ధి మాత్రమే.

407. జీవునికి అత్యంత సవిూపములో ఉన్నది బుద్ధి మాత్రమే.

408. బుద్ధికి ఆకారముగలదు. ఒక్కొక్క శరీరములో ఒక్కొక్క మందము గల గుండ్రని పొరగ బుద్ధిగలదు. 409. ఆసక్తిని బట్టి బుద్ధియొక్క పని తీరుండును. అందువలన ఒక విషయములో పనిచేసినట్లు మరొక విషయములో పనిచేయలేదు.

410. మహిమ గలది మంత్రము. కాని దాని పూర్తి విధానము తెలియని వారు మంత్రములే లేవనుచున్నారు.

411. ప్రతిమాట ఒక మంత్రమను నానుడి గలదు. అందువలన ఉచ్చాటనను బట్టి మంత్రము మహిమగలదగును.

412. మాటలోని అక్షరములను బట్టి మంత్రములోని మహిమ ఉండును. మాటను క్రమబద్దీకరిస్తే మంత్రమగును.

413. మంత్రశక్తి సూక్ష్మమైనది అయినప్పటికి అది స్థూల సూక్ష్మముల రెండిటి విూద పనిచేయును.

414. కనిపించు ఏనుగును క్షణములో లేకుండ మాయము చేసిన మాంత్రికున్ని, కనిపించని జంతువును క్షణములో కనిపించునట్లు చేసిన మాంత్రికున్ని చూచినపుడు ఆ పనులు మంత్రమహిమ అని చెప్పక తప్పదు.

415. ధర్మము దైవసంబంధమైనది. దానము ప్రపంచసంబంధమైనది.

416. దానమడుగు ప్రతివాడు ధర్మము చేయండి అనడములో ధర్మమును ఆచరించమని చెప్పడమే అగుచున్నది.

417. దానము చేస్తే పుణ్యము వస్తుంది, పుణ్యమువస్తే మరుజన్మ వస్తుంది. అందువలన దానము చేస్తే నేను తెలియనని గీతయందు భగవంతుడు చెప్పాడు. 418. ధర్మము చేస్తే పుణ్యము రాదు, మరు జన్మరాదు. అందువలన ధర్మమును ఆచరించమని గీతయందు భగవంతుడు చెప్పాడు.

419. దానధర్మముల వ్యత్యాసము తెలియనివాడు దైవమార్గమును తెలియలేడు.

420. ఆత్మకున్న విధానములు ధర్మములు, దైవమును తెలియుటకు ఆచరించవలసినవి ధర్మములు. అందువలన ధర్మములు జ్ఞానముతో కూడుకొన్నవి.

421. ఎచట అజ్ఞాన విధానములున్నవో అచట అధర్మములున్నవని తెలియవచ్చును.

422. అణువణువున వ్యాపించియున్న పరమాత్మను తెలియక మరి ఏ విధానమును ఆచరించినా, ఏ దేవతలను ఆరాధించిన అది అధర్మమే అగును.

423. భగవద్గీతలో శరీరము ధరించిన భగవంతునిగ మరియు శరీరమే లేని పరమాత్మగ (విశ్వరూపములో) ఒక ముఖ్యమైన ధర్మము తెలియజేశాడు. అది ఏమనగా! "బాహ్యయజ్ఞముల వలనను, దానముల వలనను, వేదాధ్యాయనముల వలనను, ఉగ్రమైన తపస్సుల వలనను నేను తెలియబడను" అన్నాడు.

424. వేదపారాయణము, యజ్ఞములు చేయుట, దానములు, తపస్సులు ధర్మయుక్తములు కావని భగవంతుని మాటలలో తెలియుచున్నది.

425. పనిచేయు ప్రతివాడు తనది ధర్మమే అనుకొనుచున్నాడు. అసలు ధర్మమంటే ఏమిటో ఆలోచించలేదు. 426. వేదములు చెప్పువాడు వేదములలోనే ధర్మములున్నవని అంటున్నాడు, యజ్ఞములు చేయువాడు వాటిలోనే ధర్మములున్నవి అంటున్నాడు. కాని దేవుడు ఆమాటను అనలేదు.

427. ధర్మమునకు దైవమార్గము తెలుపు సామత్యమున్నది. ధర్మము పవిత్రమైనది, కానీ మాయ ప్రభావము వలన అధర్మములు ధర్మములుగ, ధర్మములు అధర్మములుగ గోచరించుచున్నవి.

428. ధర్మమునకు ముప్పుకల్గితే వాటిని దేవుడే రక్షిస్తానన్నాడు. మానవుడు ధర్మములను ఆచరించుటకు యోగ్యుడే కాని రక్షించుటకు యోగ్యుడు కాదు.

429. ధర్మమంటే ఏమిటో తెలియకనే వాటిని గురించి వక్రీకరించి చెప్పితే అది దైవవ్యతిరేఖమగును.

430. ధర్మమెచట గలదో అధర్మము అచటనే పుట్టినది. వేదాంత మెచట గలదో వేదములచటే గలవు. వేదాంతము గుణాతీతము కాగ వేదము గుణమయమయినది.

431. ధర్మమునకు వ్యతిరిక్త పదము అధర్మము కాదు. జ్ఞానమునకు వ్యతిరేఖ పదము అజ్ఞానము కాదు.

432. ధర్మమునకు వ్యతిరేఖము గుణములు, జ్ఞానమునకు వ్యతిరేఖ పదము మాయ, పరమాత్మకు వ్యతిరేఖ పదము ప్రకృతి.

433. ధర్మము, జ్ఞానము పరమాత్మమయమైనవి. గుణములు, మాయ ప్రకృతిమయమైనవి. 434. జ్ఞానము ధర్మయుక్తమైతే, ధర్మము పరమాత్మయుక్తమైనది. అన్య దేవతలను గురించి బోధించు వారు, వేదముల గురించి బోధించువారు ప్రకృతి యుక్తులే అగుదురు.

435. పురుషార్థములు నాలుగని అంటుంటారు. అది అసత్యము పురుషార్థములు రెండు మాత్రమే గలవు.

436. పురుషార్థములలో ఒకటి స్థూలార్థము నిచ్చునది, రెండవది సూక్ష్మార్థము నిచ్చునది.

437. కనిపించు తండ్రిని చూపునది తల్లి, తల్లి వలననే తండ్రి తెలియును కనుక తల్లి-తండ్రి అనుమాట ఒకటి.

438. కనిపించని తండ్రియైన దైవమును తెలుపువాడు గురువు. గురువు వలననే దైవము తెలియును. గురువు-దైవము రెండవది.

439. తల్లీ-తండ్రీ, గురువూ-దైవము అర్థక్రమమే, కానీ వరుస క్రమము కాదు. కొందరు ఈ మాటను వక్రీకరించి మొదట తల్లిని పూజించవలెనని, తర్వాత తండ్రిని పూజించవలెనని, తర్వాత గురువని, ఆ తర్వాత దైవమని చెప్పుచుందురు.

440. సర్వ ప్రపంచమునకు అధిపతి ఆదికర్త అయిన దైవమును చివరికి తోసి, కనిపించు మనుషులకు మొదటి పూజలివ్వడము అజ్ఞానమగును.

441. అవధి లేని పరమాత్మను తెల్పువాడు అవధూత, కానీ బజారులో తిరుగు తిక్కవాల్లు అవధూతలు కాదు.