ప్రబోధ తరంగాలు/196-244
196. కర్మ తీరకపోతే కాయమే నీవు, కర్మ తీరిపోతే కాలమే నీవు.
197. రాత్రి గూటిలో నిద్రించి పగలు మేతకై విహరించే పక్షిలాంటిది మనస్సు. సుషుప్తిలో ఆత్మ అనే గూటిలో నిద్రించి ఎరుకరాగానే విషయాలకై విహరిస్తుంటుంది.
198. నీకు ఆత్మయే మిత్రుడు, కానీ అజ్ఞానముతో శత్రువుగా మార్చుకొన్నావు. నీకు ప్రకృతియే శత్రువు, కానీ అజ్ఞానముతో మిత్రునిగా భావిస్తున్నావు.
199. ఆకలి లేనివానికి అన్నముబెట్టుట, అయిష్టునకు ఆత్మజ్ఞానము చెప్పుట ప్రయోజనములేని పనియగును.
200. విషయాలకు నీవు దూరమైతే విశ్వేశ్వరుడు నీకు దగ్గరౌతాడు.
201. అహంకారముతో ఆత్మనారాధించకు. అహంకారం వదిలివేసి ఆత్మను ఆరాధిస్తే పరమాత్మను చేర్చగలదు.
202. నీ శరీరం చేసే పనులకూ, నీకూ, సంబంధము కల్గిస్తున్నదేదో తెలుసుకో! అదే అహంకారము.
203. అన్నింటితోనూ సంబంధముపెట్టుకో, కానీ అహంకారముతో మాత్రం వద్దు.
204. గుణాలు ఒక్కొక్కటి ఏనుగంత బలమైనవే కానీ జ్ఞానమనే అంకుశానికి గజగజలాడుతాయి.
205. నీ శరీరములోనుండి నీకు కనిపించకున్న ప్రకృతికి (గుణములు) శరీరం బయట నీకు కనిపిస్తున్న ప్రకృతికి అవినాభావ సంబంధమున్నది. వాటి సంఘర్షణ ఫలితమే నిన్ను సతమతపరుస్తున్నాయి. 206. ద్రవ్యయజ్ఞానికై పెట్టుబడి కర్మను సంపాదించుకొంటున్నావు. కర్మయజ్ఞానికై జ్ఞానం సంపాదించుకో కడతేరుతావు.
207. అన్ని జీవులు పాలాక్షులే, కానీ కొన్ని జీవులకు మాత్రమే ఆ కంటికి చూపుంటుంది.
208. గుణాలు నీతలలోనూ, గుణాల పనులు నీకళ్ళముందున్నాయి గుర్తుంచుకో.
209. అహంకారము నీకు కర్మను కలిగిస్తే ఆ కర్మ సుఖదుఃఖములను కలిగిస్తుంది. గురుసేవ నీకు జ్ఞానమును కలిగిస్తే, ఆ జ్ఞానము నీ కర్మను తొలగిస్తుంది.
210. కర్మ ఎలా కలుగుతుందో తెలుసుకో, ఎలా తొలుగుతుందో సులభముగ తెలుస్తుంది.
211. ఆశలు నీజ్ఞప్తిని అలలుగొట్టించి చలింపజేస్తున్నాయి.
212. జరిగే భవిష్యత్తును గురించి తెలుసుకొనడమువలన నీకు ఒరిగేదేమీ లేదు. జరిగేది నీవు తెలుసుకొన్నా తెలుసుకోకున్నా జరిగి తీరుతుంది.
213. నీకు అపజయం కలిగే శకునాన్ని విజయం చేకూర్చే వరకు ఆహ్వానించు.
214. శరీరం చలిస్తున్నా మనస్సు చలింపకుండా జేయువాడే మహాత్ముడు. శరీరం చలింపకుండా మనస్సును చలింపజేయువాడు మందాత్ముడు. 215. గుణములను విషకోరలుగల మాయయను సర్పము నిన్ను కాటు వేయుచున్నది. ఆ విషయమునకు సరియైన మందు ఆత్మ జ్ఞానమేనని తెలుసుకో.
216. కామరహితమైన దృక్కులచే ప్రకృతిని వీక్షిస్తే అది నీచేత శోధింపబడుతుంది. కామసహితమైన దృక్కులచే ప్రకృతిని వీక్షిస్తే అదే నిన్ను బాధింపజేస్తుంది.
217. ఆశ నీకు తెలియకుండా నీలోని తృప్తిని బలి తీసుకొంటున్న మహాశక్తి.
218. ఆశను తృప్తి పెట్టాలని ఆశించడములోనే నీ ఆయుస్సు హరించిపోతున్నది. కానీ అది మాత్రం తృప్తి పొందడము లేదు.
219. ఆశ తమకాన్ని తీర్చాలంటే ఆత్మోఫలభ్యంతోనే సాధ్యమౌతుంది కానీ మరిదేనితోడను సాధ్యం కాదు.
220. అవకాశం ఉంటే ఆకాశము కన్నా పెద్దదౌతుంది ఆశ.
221. కోరేది ఈ జన్మలో! తీరేది మరు జన్మలో!
222. మాయకు మనస్సుకు మధ్య పోరాటము పెట్టి మనసుచేత మాయను జయింపజేయుట మానవుడు చేయవలసిన యోగసాధన.
223. మనిషి యొక్క జీవన ప్రయాణములో రెండు మార్గములు గలవు. అందులో ఒకటి (ప్రకృతిమార్గము) మాయమార్గము, రెండవది దైవమార్గము (పరమాత్మమార్గము). 224. ఒక కథలో గల మంచి చెడులలో మంచిని గ్రహించు, చెడును విసర్జించు.
225. ఒక మనిషిలో గల జ్ఞాన అజ్ఞానములలో జ్ఞానమును గ్రహించు అజ్ఞానమును విసర్జించు.
226. మనిషి చెప్పు మాటలలో అన్నీ నిజమని నమ్మకు, దేవుడు చెప్పిన మాటలలో అన్నీ నిజమేనని తెలుసుకో!
227. భూమిమీద మిత్రులు శత్రువులున్నట్లు, శరీరమునందు జీవునకు మిత్రులను గుణములు, శత్రువులను గుణములు రెండురకములు గలవు.
228. పులుపుకు ఉప్పు, చేదుకు తీపి ఎట్లు వ్యతిరిక్తముగ ఉన్నవో అట్లే శరీరములో కామమునకు దానము, కోపమునకు దయ, లోభమునకు ఔధార్యము, మోహమునకు వైరాగ్యము, మదమునకు వినయము, మత్సరమునకు ప్రేమ అనునవి వ్యతిరిక్తము.
229. ఉప్పు నీటిలోకరిగి తెలియకుండా ఉండినట్లు, మాయ శరీరములో ఇమిడి ఉన్నది.
230. ఆదేశము అధికారముతో కూడుకొన్నట్లు ఉపదేశము అనధికారముతో కూడుకొన్నదై ఉన్నది.
231. దృష్టికి దేశము ప్రదేశము కనిపించునట్లు, జ్ఞానదృష్టికి ఉపదేశము అప్రదేశము తెలియును.
232. కంటికి దృష్టి గలదు, అట్లే బుద్ధికి జ్ఞానదృష్టి గలదు.
233. రోగానికి ఔషధము, మాయరోగానికి దివ్య ఔషధము అవసరము. 234. ఔషదము వస్తువులతో కూడుకొన్నది కాగా, దివ్యఔషదము జ్ఞానముతో కూడుకొన్నది.
235. రోగము శరీరమునకు, బాధ జీవునకు, మూలుగుడు ఆత్మకు, తటస్థత పరమాత్మకు గలదు.
236. పెద్దదైన ఏనుగు శరీరములో జీవాత్మ, ఆత్మ, పరమాత్మ ఉన్నట్లే చిన్నదైన చీమలో కూడ జీవాత్మ, ఆత్మ, పరమాత్మ గలవని తెలియువాడే నిజమైన జ్ఞాని.
237. నిమ్మకు నీరెక్కినట్లు కొమ్మకు పామెక్కలేదు. అలాగే మనిషికి అజ్ఞానమెక్కినట్లు జ్ఞానమెక్కలేదు.
238. వానకు మాత్రము వానపాము బయటికొచ్చును. నీటికి మాత్రము కప్పలు బయటికొచ్చును. జ్ఞానమునకు మాత్రము జిజ్ఞాసులు బయటకొస్తారు.
239. నేత్రమునకు దృశ్యమున్నట్లు జ్ఞాననేత్రమునకు జ్ఞానమే దృశ్యమగును.
240. భూమిమీద గురువులలో మాయ తిష్టవేసి ఉన్నది జాగ్రత్త!
241. భగవంతుడు చెప్పినది దేవుని జ్ఞానము. మనుషులు చెప్పినది దైవజ్ఞానము కాదు.
242. మాయ భగవంతునివలె జగతిలో ప్రకటితమగుచున్నది.
243. దేవుడు మాయవలె జగతిలో ప్రకటితమగుచున్నాడు.
244. జగతిలో మాయ దేవునివలె, దేవుడు మాయవలె కనిపించుట సహజము.