ప్రబోధానందం నాటికలు/ఎవడు జ్ఞాని-ఏది మతము

ఎవడు జ్ఞాని - ఏది మతము

(తెర తీయగానే మొదటి దృశ్యములో)

ఒక హిందువు, ఒక క్రైస్తవుడు, ఒక ముస్లీమ్‌ ముగ్గురు కలిసి ప్రయాణము చేయుచుందురు. హిందువు గడ్డము పొడవుగా పెంచి తల వెంట్రుకలు ముడివేసి, పెద్ద నామము కలిగివుండును. క్రైస్తవుడు తెల్లని పొడవు అంగీ తొడిగి, అంగీమీద శిలువ డాలర్‌ను కనిపించునట్లు పెట్టు కొన్నాడు. ముస్లీమ్‌ మోకాళ్ళ క్రిందికి జిబ్బా వేసుకొని, మడమలపైకి పైజమా ధరించియున్నాడు. వారిని చూస్తూనే పలానావాడు, పలాన మతమునకు చెందినవాడని తెలియుచున్నది. వారి ముగ్గురికీ జలుబు చేసివుండడము వలన, వారు అప్పుడప్పుడు తుమ్ముచుండెడివారు. హిందువు తుమ్మినపుడు "రామ" అనుచుండెను. క్రైస్తవుడు తుమ్మినపుడు "ప్రభు" అనుచుండెను. అలాగే ముస్లీమ్‌ తుమ్మినపుడు "అల్లా" అనెడివాడు. వారు అలా అనడమునుబట్టి వారు ముగ్గురు మూడు మతాలకు చెందినవారని తెలియుచున్నది. వారు ముగ్గురు ఒకచోట కూర్చొని సేద తీర్చుకుంటూ మాట్లాడుకొంటున్నారు.


హిందువు :- మన ముగ్గురికి జలుబు చేసింది. ముగ్గురికి తుమ్ములు వస్తున్నాయి. నేను తుమ్మినపుడు రామా అంటున్నాను. మీరు ఇద్దరు మొదట హిందూమతములో వుండి, ఇతర మతములలోనికి పోయారు. మతమంటే మార్చుకున్నారు. చివరకు తుమ్మినపుడు కూడ దేవున్ని మార్చి ఒకరు ప్రభు అని, మరొకరు అల్లా అనుచున్నారు. మతము మారిపోతే దేవున్ని కూడ మార్చవచ్చునా?

ముస్లీమ్‌ :- నేను మొదట హిందూమతములోవుండి హిందూమతము కంటే ఇస్లామ్‌మతము గొప్పదని దానిని వదిలివచ్చాను. ఇస్లామ్‌ ధర్మము ప్రకారము మాకు దేవుడు ఒక్కడే. అందువలన మేము అల్లా అనుచున్నాము.

క్రైస్తవుడు :- నేను కూడ మొదట హిందూమతములోని వాడినే. ఆ మతములో 33 కోట్లమంది దేవుళ్ళున్నారు. అందులో ఎవరు నిజమైన దేవుడో చెప్పేదానికే వీలులేదు. క్రైస్తవములో ప్రభువును మించిన దేవుడు లేడని తెలిసిన దానివలన నేను క్రైస్తవుడయినాను. ప్రభువువే దేవుడని అందరికి తెలియుటకు తుమ్మినపుడు కూడ ప్రభూ అంటున్నాను.

హిందువు :- ఒకరికి అల్లా, ఒకరికి ప్రభు, నాకేమో రాముడు, మీకంటే నేనే మేలు. త్రేతాయుగమునాటి రామున్ని పట్టుకొన్నాను. మీరు కలియుగ ములోని వారిని పట్టుకొన్నారు. కలియుగముకంటే ముందు మీరు చెప్పే పేర్లు లేవు కదా! కాబట్టి ముందు నుంచివున్న రాముణ్ణి పట్టుకొన్న నేనే మేలు.

క్రైస్తవుడు  :- మీ దేవుడైన రాముడు త్రేతాయుగము నుండి వచ్చినవాడే కదా! అంతకు ముందు కృతయుగములో లేడు కదా! నీవు కూడ మధ్యలో వచ్చిన వానినే కదా! పట్టుకొన్నది.

హిందువు :- మా రాముడు అవతారపురుషుడు. ముందునుంచివున్న విష్ణువు రామునిగా పుట్టాడు. కావున మా రాముడు ముందునుంచి ఉన్నవాడే.

ముస్లీమ్‌  :- అయితే మధ్యలోవచ్చిన రామునిపేరు చెప్పకుండ నేరుగా విష్ణువు పేరునే మీరు చెప్పవచ్చును కదా! నీమాట ప్రకారము విష్ణువు అవతారమే రాముడైతే, ద్వాపరయుగములో పుట్టిన కృష్ణుడు కూడ విష్ణువు అవతారమే కదా! అలాంటపుడు కృష్ణుని పేరును మీరు చెప్పకుండ రాముని పేరే ఎందుకు చెప్పుచున్నారు?

హిందువు  :- కృష్ణునికంటే రాముని అవతారము ముందు కలదు. కృష్ణుడు ద్వాపరయుగములో పుట్టాడు. రాముడు దానికంటే ముందు యుగమైన త్రేతాయుగములో పుట్టాడు. అందువలన హిందూసమాజమంతా రాముణ్ణి దేవునిగా చెప్పుచున్నది.

క్రైస్తవుడు :- అలాగైతే రాముని అవతారముకంటే ముందు కృత యుగములో నరసింహావతారము కలదు కదా! రామునికంటే ముందున్న నరసింహా స్వామిని దేవునిగా చెప్పవచ్చును కదా!

హిందువు  :- నరసింహస్వామి విష్ణువు అవతారమే, కానీ ప్రజలకు రామున్ని దేవునిగా చెప్పడమే అలవాటైపోయింది.

ముస్లీమ్‌  :- నీకు నరసింహస్వామిని వదలి రాముణ్ణి దేవుడనడము ఎట్లు అలవాటై పోయిందో, మాకు కూడ రాముణ్ణి వదలి అల్లాను దేవుడనడము అలవాటైపోయింది. ఏమి తప్పా?

హిందువు  :- అయితే రాముణ్ణి దేవుడు కాదంటావా?

ముస్లీమ్‌ :- నేను రాముణ్ణి దేవుడు కాదు అనడములేదు. నీ అలవాటు ప్రకారము నీకు రాముడు దేవుడే, నా అలవాటు ప్రకారము నాకు అల్లా దేవుడే అంటున్నాను.

క్రైస్తవుడు :- స్వచ్ఛమైన దేవుడెవరో తెలుసుకోమంటున్నాను. మాకు స్వచ్ఛమైన దేవుడు ప్రభువే.

హిందువు  :- మీకు ప్రభువు స్వచ్ఛమైన దేవుడైతే, శిలువ మీద ములుకులు కొట్టించుకొని రక్తము కార్చి ఎందుకు చనిపోయాడు?

క్రైస్తవుడు  :- పాపులను తన రక్తముతో కడిగే దానికి ఆయన రక్తమును కార్చాడు. ఆయన దేవుడైన దానివలననే అలాగ చేశాడు. చనిపోయి లేచిన వాడే నిజమైన దేవుడు. ఆయనే ప్రభువు.

హిందువు  :- ఆ రోజు ఆయన రక్తముతో ఎవరూ తమ పాపములను కడుగుకోలేదే? ప్రభువును శిలువవేసిన వారు పాపము చేసినట్లే కదా! ప్రభువును చంపించిన యూదా పాపియే కదా! ప్రభువు శిలువ వేయబడిన దినము దగ్గరలోనున్నవారే కడుక్కోలేదు. మిగతావారు ఎవరు కడుక్కొన్నారు, ఎవరి పాపము పోయింది చెప్పగలవా?

ముస్లీమ్‌ :- ఏసుప్రభువు శిలువ మీద చనిపోలేదు. చనిపోయినట్లు నటించాడు. అతను చనిపోయివుంటే అక్కడే కాపలావున్న సైనికుడు ప్రభువు డొక్కలో పొడిచినపుడు రక్తము కారదు కదా! కానీ రక్తము కారింది. చనిపోయిన వానికి రక్తము గడ్డకట్టి పోతుంది. చనిపోయినట్లు నటిస్తున్న ప్రభువును సైనికులు పొరపాటుగా చనిపోయాడనుకొన్నారు. తర్వాత మూడవరోజు సమాధిలోనుండి లేచి పారిపోయాడు. 40 రోజులు బయట తన భక్తులకు కనిపించి తర్వాత ఎటో తెలియకుండ పోయాడు. శిలువ మీద ప్రభువు చనిపోలేదు, చనిపోయినట్లు నటించాడు, తర్వాత పారి పోయాడు. అటువంటివాడు దేవుడెలా అవుతాడు. మా అల్లా ఎవరికి కనిపించలేదు, ఏ మనిషి చేతికి దొరకలేదు. కావున మా అల్లానే నిజమైన దేవుడు.

హిందువు  :- కనిపించనివాడు దేవుడెలా అవుతాడు? మా రాముడు కనిపించాడు, వాళ్ళ ప్రభువు కనిపించాడు. మీ అల్లా ఎక్కడా కనిపించలేదే!

ముస్లీమ్‌  :- సర్వలోక సృష్ఠికర్త అయినవాడు మా దేవుడు. మీ దేవునికి రూపమున్నట్లు మా దేవునికి రూపము, పేరు ఉండవు.

క్రైస్తవుడు :- మీ దేవునికి రూపము, పేరు లేదు అంటున్నావు. అలాగైతే అల్లా అని పేరుపెట్టి ఎవరిని పిలుస్తున్నావు? అంతే కాకుండ మీ హదీసు పండితులు దేవునికి 100 పేర్లున్నాయని చెప్పుచున్నారు. ఇంకా మీ దేవునికి పెద్ద సింహాసనము ఉందని, దేవుడు పై లోకములో ఉన్నాడని, ప్రళయములో అందరిని సమాధులలో నుండి లేపునని, అప్పుడు పాపము చేసిన వానిని నరకమునకు, పుణ్యము చేసిన వానిని స్వర్గమునకు పంపునని చెప్పుచున్నారు కదా! అలాంటపుడు మీ దేవుడైన అల్లాకు రూపము, పేరు, పని ఉన్నట్లే కదా!

హిందువు  :- ఇప్పుడేమంటావు చెప్పు.

ముస్లీమ్‌  :- ఇప్పుడు కూడ మా దేవుడైన అల్లానే గొప్ప అంటాను. మా దేవుని మీద మాకు విశ్వాసమున్నట్లు మీ దేవుళ్ళమీద మీకు విశ్వాసము ఉందా? ముస్లీమ్‌ అంటేనే విశ్వాసి అని అర్థము. మా దేవునికంటే గొప్పవాడు లేడు, మా ఇస్లామ్‌లోవున్న విశ్వాసము ఏ మతములోనూ లేదు. అవునా, కాదా?

క్రైస్తవుడు  :- మా మతములో తన ద్వారా రోగము బాగైన మనిషిని చూచి ప్రభువు నీ విశ్వాసమే నిన్ను కాపాడింది అన్నాడు. కావున మాకు కూడ దేవుని మీద విశ్వాసముంది. దేవుని మీద విశ్వాసముతోనే మేము ప్రార్థన చేయుచున్నాము.

హిందువు  :- మీ రెండు మతాలలో టైమ్‌టేబుల్‌ ఉంది. దానినే ప్రార్థనా సమయము అంటారు. క్రైస్తవులకు ఆదివారము, ముస్లీమ్‌లకు శుక్రవారము ముఖ్యము. ముస్లీమ్‌లు ప్రతి దినము ప్రార్థన మసీద్‌లలో చేసినా దానిని ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము చేస్తారు. శుక్రవారము ఐదు పూటలు చేస్తారు. మాకు అటువంటి టైమ్‌టేబుల్‌ లేదు. అందువలన మా భక్తియే దేవునికి ముఖ్యమైనది.

ముస్లీమ్‌  :- ఆగవయ్యా; మాది టైమ్‌టేబుల్‌ భక్తియా? మీది కాదా? మాకు శుక్రవారము ముఖ్యము, క్రైస్తవులకు ఆదివారము ముఖ్యము, మీకు మధ్యలోనున్న శనివారము ముఖ్యముకాదా! వెంకటేశ్వరునికి మీరు శనివారము కాదా పూజించేది. హిందువులందరు శనివారము ఇల్లువాకిలి శుభ్రపరుచుకొని తలస్నానము చేసి ఇంట్లో పూజలు చేయలేదా? గుడులకు వెళ్ళి పూజలు చేసి రావడము లేదా? ఆంజనేయునికి శనివారము, వెంకటేశ్వరునికి శనివారము, శివునికి సోమవారము అని మీరు టైమ్‌టేబుల్‌ పెట్టుకోలేదా? చెప్పండి.

క్రైస్తవుడు :- ఆదివారము సెలవు దినము, ఆ దినము పనులుండవు కాబట్టి ఆదివారమును గుర్తింపుగా మేము పెట్టుకొన్నాము. మీరు శని వారమును దేనివలన గుర్తింపుగా పెట్టుకొన్నారో! చెప్పండి.

హిందువు  :- మా పెద్దలు అలా నిర్ణయించారు, కావున మేము అలాగే మా సాంప్రదాయముల ప్రకారము చేస్తున్నాము.

ముస్లీమ్‌  :- మేము కూడ మా పెద్దలు నిర్ణయించినట్లే చేయుచున్నాము, అది మా సాంప్రదాయము. మా సాంప్రదాయములను మీరు టైమ్‌టేబుల్‌ అన్నపుడు, మీ సాంప్రదాయములకు కూడ టైమ్‌టేబుల్‌ ఉన్నదనుటలో మా తప్పులేదు కదా!

క్రైస్తవుడు  :- ఎవరు ఏమనుకొనినా! ఏది ఏమైనా! మీ మతములోని దేవుళ్ళు పాపులను శిక్షించుతామని చెప్పారు. మా దేవుడు పాపులను క్షమిస్తానని చెప్పాడు. శిక్షించువాడికంటే క్షమించువాడే గొప్పవాడు. కనుక మా దేవుడే గొప్ప అని చెప్పుచున్నాను.

హిందువు  :- పాపులను క్షమిస్తాను, పాపులకు నావద్ద రక్షణ కలదని మీ దేవుడు చెప్పుటవలన భూమిమీద పాపాత్ములు ఎక్కువైపోవు ప్రమాదము గలదు. ఎన్ని పాపములు చేసినా దేవుడు క్షమిస్తాడను ధైర్యముతో మనుషులు పాపములు చేయుటకు మొదలుపెట్టుదురు. పాపాలు చేసి క్షమించు, రక్షించు అని ప్రభువును వేడుకొంటారు. ప్రభువు క్షమిస్తాడు. నేను మీ కొరకే రక్తమును కార్చానని పాపక్షమాపణ నావద్ద కలదని చెప్పుట వలన దేశములో దుర్మార్గము ఎక్కువై పోతుంది, పాపుల సంఖ్య ఎక్కువై పోతుంది. ఇది మీ తప్పు కాదా!

ముస్లీమ్‌  :- మా దేవుడు అలా చెప్పలేదు. ప్రళయకాలములో సమాధుల నుండి తిరిగి మనిషిని లేపి, అతను చేసుకొన్న పాపమును విచారించి నరకానికి పంపుచున్నాడు. పాపము చేసిన వానిని తడిగుడ్డను పిండినట్లు పిండి ఆరేయగలడు. అందువలన మా మతములో దేవుడు శిక్షిస్తాడను భయముతో ఎవరూ పాపము చేయరు. చేయుటకు భయపడుతారు. మా ఇస్లామ్‌లో దేవుని భయముంది, మీ క్రైస్తవములో దేవుని భయము లేదు. అందువలన పాపములను ఇష్టమొచ్చినట్లు భయము లేకుండ చేయుచున్నారు.

క్రైస్తవుడు  :- మా దేవుడు అందరి పాపములను క్షమిస్తానని చెప్పలేదు. ప్రభువును నమ్మినవారికి మాత్రమే క్షమాపణ కలదు.

హిందువు  :- ఆ మాట చెప్పి మా హిందువులనందరిని మీ మతము లోనికి లాగుకొనుచున్నారు.

క్రైస్తవుడు  :- మేము చెప్పే మాటకాదు. మీ హిందూమతములోని వేదములలోనే పాపక్షమాపణ నిమిత్తము రక్తమును చిందించడము అను మాటవుంది. అలా పాపక్షమాపణ నిమిత్తము రక్తమును చిందించినవాడు మా ప్రభువు ఒక్కడే గలడు. మీ నాలుగు వేదములలో సామవేదమున రెండవ భాగమైన తాండియా మహాబ్రాహ్మణమందు శ్లో॥ ‘‘ప్రజా ప్రతిర్థే వేభ్యం ఆత్మనా యజ్ఞం కృత్వాప్రాయశ్చిత్‌’’ అని వుంది. దీని భావము ఏమనగా! ప్రజలను పరిపాలించువాడు, ప్రజల పాపపరిహారార్థము తన స్వంత శరీరమును ప్రాయశ్చిత్తముగా నలుగగొట్టుకొని యజ్ఞము చేయును. ప్రజాపతి అనగా దేవుడు అని అర్థము. ఈ శ్లోకము ప్రకారము ప్రభువు ప్రజల పాపపరిహారార్థము తన స్వంత శరీరమునే బలి ఇచ్చాడు. అందువలన మీ వేదముల ప్రకారము మా దేవుడే నిజమైన దేవుడు.

హిందువు  :- మీరు మా వేలే తీసుకొని మా కన్నే పొడిచినట్లు, మా వేదాలే తీసుకొని మా దేవుణ్ణే కాదంటున్నారు. మా వేదాలలోని మీకు అనుకూల మైన మాటలను చెప్పుకొంటున్నారు. మీ బైబిలులో మా దేవుణ్ణి సమర్థించే మాటలుకూడ ఉన్నాయి. మీరు నడుచు విధానము తప్పు అని చెప్పు వాక్యములు ఎన్నో ఉన్నాయి. వాటినన్నిటిని మేము కూడ చెప్పగలము.

క్రైస్తవుడు  :- ఎక్కడున్నాయో చెప్పు చూస్తాము.

హిందువు  :- మీ బైబిలులోనే ఉన్నాయి. పలానా చోట అని చెప్పలేను. ఒక్క మారే చదివాను. అందువలన అవి సరిగ జ్ఞప్తికిలేవు.

క్రైస్తవుడు  :- మీ వేదాలలో మాటలను బట్టీపట్టి, శ్లోకాలను వాటి నంబర్లను, వాటి ఆధ్యాయములను మేము చెప్పినపుడు మా పుస్తకములో లోపాలు ఉన్నాయి అవి జ్ఞాపకములేవు అనడమేమిటి? మాకు వ్యతిరేఖమైనవి ఏవైనా ఉంటే మీరు ఊరకనే వదులుతారా? అలా ఉంటే కంఠాపాటము చేసుకొని చెప్పవచ్చును కదా!

హిందువు  :- నేను ఒకమారు బైబిలు చదివి వాటిలో మాకు అనుకూల మైన వాక్యములను, మీ నడవడికి వ్యతిరేఖమైన వాక్యములను చూచాను. వాటిని నోట్‌ చేసుకొని, బాగా చదివి జ్ఞాపకము పెట్టుకొని మీలాంటి వారికి చెప్పాలనుకొన్నాను. అంతలో ఆ పని ఆగిపోయింది. ఎందుకనగా! మా ప్రక్కింటి అతను విశ్వహిందూపరిషత్‌లో పని చేస్తుంటాడు. అతను నేను బైబిల్‌ చదువునపుడు చూచి పోయి భజరంగ్‌దళ్‌ సంఘము వాళ్ళకు చెప్పాడు. అప్పుడు కొందరు భజరంగ్‌దళ్‌ సభ్యులు, కొందరు విశ్వహిందూ పరిషత్‌ సభ్యులు అందరు కలిసి అరవై (60) మందిదాకా వచ్చి, నేను బైబిలు చదువుచున్నందుకు నన్ను కొట్టి, నానాదుర్భాషలాడి ఇక ఎప్పుడైనా బైబిల్‌ ముట్టుకుంటే చంపేస్తామని బెదిరించి పోయారు. అందువలన నేను ఇప్పుడు మీ బైబిల్‌లో ఏ లోపములున్నది చెప్పలేక పోవుచున్నాను.

క్రైస్తవుడు :- (నవ్వుచూ) ఇప్పుడు మీ విశ్వహిందూపరిషత్‌గానీ, భజరంగ్‌దళ్‌గానీ, ప్రత్యక్షముగా మాకు చెడు చేయాలనుకొన్నా, పరోక్షముగా మాకు మంచే జరుగుచున్నది. వారు లేకపోతే మా మతము అంతగా అభివృద్ధి అయ్యేదికాదు. వారున్న దానివలననే మా మతము అందరికి తెలిసినది. మా మీద అందరికి సానుభూతి ఏర్పడినది. చాలా తొందరగా మా మతము విస్తరించి పోయినది. వారు నిన్ను బైబిల్‌ చదవనివ్వని దానివలననే కదా! నీవు ఇపుడు తప్పు పట్టలేక పోతున్నావు. దానివలన వారు మాకు మేలు చేసినట్లే కదా!

ముస్లీమ్‌  :- విశ్వహిందూపరిషత్‌, భజరంగ్‌దళ్‌ వారి వలననే మన దేశములో ముస్లీమ్‌ల ఉగ్రవాదము పెరిగిపోయినది. వారు మా ముస్లీమ్‌లకు కొద్దిగ వ్యతిరేఖత చేస్తే, మా ముస్లీమ్‌లు ఏకంగా ఎంతోమంది హిందువు లను చంపివేయుచున్నారు. ఆ రెండు సంస్థల పనులకు అమాయకులైన హిందువులు ఉగ్రవాదుల చేతులలో బలియైపోవుచున్నారు. ముఖ్యముగా చెప్పాలంటే హిందువులందరూ ఈ రెండు సంస్థలను ఏవగించుకొంటు న్నాయి. హిందూ మతనాశనానికే ఈ సంస్థలు పుట్టాయి అనుకుంటున్నారు.

క్రైస్తవుడు  :- విశ్వహిందూ పరిషత్‌ వాళ్ళు వివేకానందుని పేరును గొప్పగ చెప్పుకుంటుంటారు కదా! వివేకానందుడు ప్రభువును గురించి ఎక్కడా చెడ్డగగానీ, తక్కువ చేసిగానీ మాట్లాడలేదు. హిందూమతములో వివేకానందుని స్ఫూర్తితో ముందుకు పోవు హిందువులు, ప్రభువు మాట వింటూనే ఎందుకు మండిపడుచున్నారు. ఏసుప్రభువు మాటను చూస్తేనే ఎందుకు ఎలర్జివచ్చిన వారి మాదిరి ప్రవర్తిస్తున్నారు. బైబిలును చదువుచున్న నిన్ను ఎందుకు కొట్టారు? బైబిలును చదివిన నీ మీద అంత కోపమును ప్రదర్శించిన వారు ప్రభువును గౌరవించిన వివేకానందున్ని ఎందుకు ఏవగించుకోలేదు. ‘‘స్వామి వివేకానంద సమగ్ర సప్రామాణిక జీవితగాథ’’ పుస్తకము యొక్క రెండవభాగములో 17వ పేజీలో రెండవ పేరాయందు రెండవ లైనులో ‘‘నేను కూడా పాలస్తీనాలో క్రీస్తుతో కలిసి జీవించి ఉంటే ఆయన పాదాలను కన్నీటితో కాదు, నా హృదయరుధిరముతో కడిగి ఉండేవాన్ని’’ అని వివేకానందుడు స్వయముగా ఈ మాట అన్నపుడు వివేకానందున్ని విశ్వహిందూపరిషత్‌వారు ఎందుకు గొప్పగ చెప్పుకొంటున్నారు. వారికున్నది పరమత ద్వేషము తప్ప హిందూమతములోని ధర్మములు ఒక్కటి కూడ తెలియవు. హిందూమతములో దేవుని జ్ఞానము లేదు, దేవతాభక్తి కలదు. అందువలన జ్ఞానజిజ్ఞాసులందరు ఇతర మతము లోనికి పోవుచున్నారు.

ముస్లీమ్‌  :- నేను కూడ మొదట హిందువునే. హిందుత్వమును అడ్డము పెట్టుకొని వినాయకచవితి పండుగలో దౌర్జన్యముగ డబ్బులు వసూలు చేయువారిని చూచి, అటువంటి అన్యాయానికి మద్దతు ఇచ్చే హిందూ సంస్థలను చూచి, ఆ పద్ధతులు నచ్చక ఏకేశ్వరోపాసన గల ఇస్లామ్‌ మతములోనికి వచ్చి నాపేరును కూడ మార్చుకొన్నాను.

హిందువు  :- నిజమే వినాయకచవితి అల్లరి పండగైపోయింది. ఆ పండుగలో చందాలు వసూలు చేయువారు వీధిరౌడీలలాగ ప్రవర్తిస్తున్నారు. హిందూమతము గొప్పదే, కానీ ఇటువంటి వారివలన అప్రతిష్ఠపాలై పోవుచున్నది.

క్రైస్తవుడు  :- మీ మతములో భగవద్గీతను గొప్పగ బోధించు ఒక పెద్ద గురువు మీదనే విశ్వహిందూపరిషత్‌వారు, భజరంగ్‌దళ్‌వారు వేదాలను చెప్పకుండ భగవద్గీతను చెప్పుతావా, వేదాలకంటే భగవద్గీత ముందు పుట్టినదంటావా అని దాడిచేసిన రోజే హిందూమతము ప్రతిష్ఠ మంటలో కలిసిపోయింది. ఆ సంఘటనను చూచిన తర్వాతే హిందూమతములో ఒక గురువునే అవమానపరచు హిందూసంఘములుండుటను చూచి క్రైస్తవ మతములో ఫాదర్‌కు , పాస్టర్‌కు ఎంతో మర్యాదకలదని క్రైస్తవులు వారి గురువులపట్ల వినయ విధేయతలుకల్గి గౌరవభావముతో ఉండుటను చూచి నేను క్రైస్తవునిగా మారిపోయాను.

(అంతలో ఆరుమంది దొంగలు వచ్చి, ఆ ముగ్గురిని కొట్టి వారి వద్ద ఉన్నవన్ని గుంజుకొని అంతటితో ఆగక వారి తలవెంట్రుకలను, గడ్డము వెంట్రుకలను కొరిగి వీరు పలానా మతమువారను గుర్తింపే లేకుండ చేసినారు. వారిలో దొంగలకు పెద్ద అయిన వ్యక్తి ఇలా అన్నాడు)

దొంగ  :- ఇంతవరకు చాటున ఉండి మీ మాటలన్నీ విన్నాను. మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని వాదించుకొంటున్నారు. మీ మతాలు పైకి కనిపించేటట్లు గడ్డాలు, మీసాలు పెంచుకొన్నారు. ఇప్పుడు వాటిని తీసివేసినాము కదా! ఇప్పుడు అందరూ సమానముగా కనిపిస్తున్నారు కదా! మీ శరీరాల మీద ఏదైనా పలానా మతము వాడని గుర్తుందా? చెప్పండి.

హిందువు  :- నీవు దొంగవు. మా మతాల విషయము, దేవుని విషయము నీకేమి తెలుసు?

దొంగ  :- నేను మొదట పెద్ద హేతువాదిని, తర్వాత దొంగను. నాకు తెలియని మతము నాకు తెలియని దేవుడు ఉన్నాడా?

ముస్లీమ్‌  :- దొంగవు మావద్దనున్నది లాగుకొని దొంగతనము చేయ వచ్చును. కానీ ఈ విధముగా మీదాడిని (మా గడ్డమును తీసివేయడము) చేయడము దేనికి? నీవు అట్లు చేయడము వలన మా మతమును, మతాచరణను అవమానించినట్లు కాదా!

దొంగ :- అవును నేను దొంగనే నా దొంగతనము స్పెషల్‌గా ఉంటుంది. నీ దగ్గరున్నదంతా దోచుకొనినా అరవై (60) రూపాయలకంటే ఎక్కువ లేవు. ఆ దొంగతనము ఏమి గిట్టుబాటుకాదు. కనుక మీ వద్దనుండి మరొక అజ్ఞానమును దోచుకోవాలనుకొన్నాను. నేను దొంగ తనము చేసిన తర్వాత నీవద్ద ఏమి మిగలకూడదు. నా మాదిరి దోచుకోనే వాడు దేశములో ఎవడూ ఉండడు. ఇప్పుడు చెప్పు నీ మతము, నీ పేరు ఏది? ఊ ముగ్గురూ చెప్పండి.

ముస్లీమ్‌  :- నాది ఇస్లామ్‌ మతము, నాపేరు వహీద్‌.

క్రైస్తవుడు  :- నా మతము క్రైస్తవము, నా పేరు జాన్‌.

హిందువు  :- నా పేరు శ్రీనాథగుప్త, నాది హిందూమతము.

దొంగ  :- మొదట మీ పేర్లనుండి మొదలుపెట్టుతాను. ఇప్పుడు చెప్పు గుప్త, ఈ పేరు నీదా? నీ శరీరమునదా? అని ప్రశ్నించుకొని చూస్తే నీ శరీరమునదే, కానీ నీది కాదు. నేను అడిగినది నీ పేరును. ఇప్పుడైనా చెప్పు నీ పేరు ఏది? ఇక్కడొక కండీషన్‌ చేయుచున్నాను. మీరు నా చేతిలో ఇరుక్కొన్నారు. కనుక నా కండీషన్‌కు ఒప్పుకొని తీరవలసిందే. ఆ కండీషన్‌ ఏమంటే మీరు నా ప్రశ్నలకు జవాబు చెప్పకపోతే తంతాను. చెప్పినా అది జవాబు కాకపోతే కూడ తంతాను.

హిందువు  :- నా శరీరమునకున్న పేరే నాదని అనుకున్నాను. మిగత విషయము నాకు తెలియదు.

ముస్లీమ్‌  :- శరీరమునకున్న పేరే నాపేరవుతుంది. కదా!

క్రైస్తవుడు  :- శరీరము, నేను ఇద్దరము ఒకటే, కావున నా శరీరము పేరే నా పేరవుతుంది.

దొంగ :- మీరు ఇలా చెప్పుతారని నేననుకొన్నాను. ఇప్పుడు ఆలోచించి చెప్పండి. నీవు చనిపోయినపుడు నీవు లేకుండపోవుచున్నావు. అయినా నీ శరీరము అక్కడ పడుకొని ఉంది కదా! శరీరము, నీవు ఒక్కటే అయితే, నీవు పోతూనే నీ శరీరము కూడ కనిపించకుండ పోవాలి కదా! నీవు కనిపించకుండ పోయినా నీ శరీరము ఉన్నది. కావున నీవు వేరు, నీ శరీరము వేరు అని తెలియుచున్నది. గుప్త అను పేరు నీ శరీరమును చూచి పెట్టినదే. నిన్ను చూచి పెట్టినది కాదు. నీవు కనిపించేవానివి కాదు. నీశరీరమే కనిపిస్తూవుంది. ఇప్పుడు చెప్పు నీవు ఎవరో?

ముస్లీమ్‌  :- శరీరము, నేను వేరు వేరు అయినపుడు, పేరు శరీరమునకే అయినపుడు, నేను ఎవరో తెలియనపుడు, నేను ఎవరని చెప్పాలి. ఇంత వరకు నేను ‘‘వహీద్‌’’ను అనుకున్నాను. ఇపుడు వహీద్‌ పేరు శరీరముదే నాది కాదని తెలియుచున్నది.

దొంగ  :- నీవు ఎవరో నీకే తెలియనపుడు, నీవు ఫలానా మతము వాడినని చెప్పుటకు వీలుందా? వీలులేదు. మతము బయట గ్రంథాలలో ఉన్నది. బయటి గ్రంథాల విషయము తెలిసినపుడుగానీ, లేక బయటి వ్యక్తి గురువుగా ఉండి చెప్పిన మతమును తెలిసినపుడుగానీ, నాది ఆ మతము అంటున్నారు. నీవు ఎవరో నీకే తెలియనపుడు ఇది నా మతము కాదు, అది నా మతము అనడము పొరపాటు కాదా! ఒక చిన్న ఉదాహరణను చూస్తాము; ఒక ఆవు, గాడిద, కుక్క అను మూడు జంతువులున్నాయి. ముగ్గురు వ్యక్తులు ఒకరు ఆవును, ఒకరు కుక్కను, ఒకరు గాడిదను స్వంతము చేసుకొన్నారు. ఆవును పట్టుకొన్నవాడు దాని త్రాడును తన చేతిలో ఉంచుకున్నాడు. ఆవుకున్న త్రాడును తన చేతిలో ఉంచుకొన్నదానివలన ఇది నాది అని చెప్పవచ్చును. కానీ తన అడ్రసే తనకు తెలియనపుడు, తన పేరే తనకు తెలియనపుడు, ఆవు ఏదో, ఆవు త్రాడో ఏదో తెలియనపుడు తాను మతము అనబడు ఆవును పట్టుకొన్నానని చెప్పడము విడ్డూరము కాదా? నీవు ఎక్కడున్నావు? నీ ఆవు ఎక్కడుంది అని అడిగితే చెప్పగలడా? మూడు జంతువులను మూడు మతములుగా పోల్చి చూచితే వాటికి నీవు సంబంధములేదు. ఆవు నీ చేతికి దొరకకుండినా ఆవు నాది అని భ్రమించినట్లు ఆ మతము నాది అంటున్నావు.

ఇప్పుడు నేను బంధించి మిమ్మలను ఇబ్బంది పెట్టుచున్నాను. ఇప్పుడు దేవుణ్ణి కాపాడమని అడిగినా దేవుడు వచ్చి మిమ్ములను కాపాడడు. ఎందుకో తెలుసా నీ అడ్రస్‌ నీకే తెలియదు, నేను పలానా చోట ఉన్నానని చెప్పలేవు. నీ అడ్రస్సే నీకు తెలియనపుడు, దేవుని అడ్రస్సు నీకు ఏమాత్రము తెలియదు. కావున ఆయన ఎక్కడున్నాడని పిలువగలవు? నీ అడ్రస్‌గానీ, దేవుని అడ్రస్‌గానీ తెలియకుండ బ్రతికే నీవు నేను ఫలానా మతమువాడిని, నా దేవుడు ఫలానావాడని చెప్పగలవా? ఒకవేళ నీవు చెప్పినా మేము నమ్మాలా? నీవు వహీద్‌ అనినా, నీది ఇస్లామ్‌ అనినా, నా దేవుడు అల్లా అనినా నేను నమ్మను. నీవు వహీద్‌వే కానప్పుడు, నీ దేవుడు అల్లా అని నేను ఎందుకు నమ్మాలి? చెప్పు గుప్త నీవు దేవుని చూచావా? లేక దేవుని అడ్రస్‌ ఏమైనా నీకు తెలుసా?

గుప్త :- నేను ఇంతవరకు దేవుణ్ణి చూడలేదు. ఆయన ఎక్కడుండేది తెలియదు.

దొంగ  :- నీవేకాదు, జాన్‌కానీ, వహీద్‌కానీ చూడలేదు. దేవుడు ఎట్లుంటాడో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు, ఏమి చేస్తుంటాడో కూడ తెలియదు. దేవుని విషయము ఏమాత్రము తెలియనపుడు దేవునికి ఒక పేరుపెట్టి, మా దేవుడు ఫలానావాడని చెప్పడము అబద్దము కాదా?

ముస్లీమ్‌  :- మా మతములో మా ప్రవక్త చెప్పినట్లు నడుచుకొంటున్నాము. ప్రవక్త చెప్పినట్లు నడుచుకొంటే దేవునివద్దకు పోగలమని మాకు నమ్మకమున్నది.

దొంగ  :- మీ ప్రవక్త చెప్పినట్లు నడుచుకొంటే ఫరవాలేదు. మీ ప్రవక్త చాలా గొప్ప దైవజ్ఞాని, ఆయన చెప్పినట్లు నడుచుకొంటే దేవునివద్దకు పోవచ్చును. ప్రవక్త చెప్పిన విధానమును అర్థము చేసుకోలేనివారు, ప్రవక్త చెప్పినట్లు చేయుచున్నామని అనుచుందురు. కానీ ప్రవక్త చెప్పిన ప్రకారము వారు నడువలేదని వారికి తెలియదు. ప్రవక్త చాలా సూక్ష్మ విషయములను చెప్పగా, కొందరు ముస్లీమ్‌లు ఆ మాటలను అపార్థము చేసుకొన్నట్లు తెలియుచున్నది. ప్రవక్త దేవునివైపు ముస్లీమ్‌లను నడుపాలనుకోగా, ఆయన మాటలను అర్థము చేసుకోలేక కొందరు ముస్లీమ్‌లు సైతాన్‌ (మాయ) వైపు పోవుచున్నారు. ప్రళయములో ప్రతి మనిషిని సమాధినుండి దేవుడు లేపుతాడని, వాని పాపపుణ్యములను విచారించి స్వర్గ నరకములకు పంపుతాడని, అల్లా లేపినపుడు లేపబడిన వాని శరీరము మీద ఒక నూలు పోగు కూడ ఉండదని, అప్పుడు ఏ గుణ భావములుండవని ప్రవక్త చెప్పగా, ఆ మాటలలో ప్రళయము అంటే ఏ ప్రళయమో, ఏ ముస్లీమ్‌కూ అర్థము కాలేదు. సమాధి అంటే సమాధి ఏదో అర్థము చేసుకోలేదు. ప్రతి మనిషిని లేపి విచారిస్తాడనగా ఎలా లేపుతాడో, ఎలా విచారిస్తాడో ఎవరూ అర్థము చేసుకోలేదు. స్వర్గ నరకములకు పంపుతాడనగా ఎక్కడకు పంపుతాడో స్వర్గ నరకములు ఎంత దూరమున్నాయో ఎవరికీ అర్థము కాలేదు. శరీరము మీద నూలుపోగు కూడ ఉండదని ప్రవక్త చెప్పగా, నూలుపోగు ఎందు కుండదో ఎవరూ యోచించలేదు. సమాధినుండి లేపినపుడు ఏ గుణములు ఉండవు, ఏ యోచనలుండవు అని ప్రవక్త చెప్పిన మాటలలోని అంతర్యమును ఎవరూ గ్రహించలేదు. ప్రవక్త చెప్పినది దొంగనైన నాకు బాగా అర్థమైనది. ప్రవక్త చెప్పిన మాటలు ఎవరూ ఖండించలేనివి. ఎంతో సత్యమైనవి. కానీ వాటిని చాలామంది అపార్థము చేసుకొన్నారు. దీనినిబట్టి చూస్తే ప్రవక్త చెప్పిన గొప్ప రహస్యమును ప్రజలు అందుకోలేక పోయారని తెలియుచున్నది.

ముస్లీమ్‌  :- ప్రవక్త చెప్పింది మాకు అర్థము కానిది నీకర్థమైందా? ప్రవక్త చెప్పింది మాకు ఏమి అర్థము కాలేదో ఒక్క దానిని చెప్పు.

దొంగ  :- అట్ల అడిగితే ఫరవాలేదు. ప్రశ్నించినపుడే ఏదైన అర్థమయ్యేది. సరే నేను ఒకమాట అడుగుచున్నాను. నామాటకు సమాధానము సరిగ చెప్పితే, ప్రవక్త మాట నీకు అర్థమైనట్లే, లేకపోతే అర్థము కానట్లే.

ముస్లీమ్‌  :- సరే అడగండి, నా పేరే వహీద్‌, నేనెందుకు చెప్పలేను?

దొంగ  :- వహీద్‌ నీ శరీరము పేరని జ్ఞప్తికుంచుకో. ప్రళయములో దేవుడు మనిషిని తిరిగి లేపుతాడన్నారు కదా! ప్రళయము అంటే ఏది?

వహీద్‌  :- ప్రపంచమంతా నాశనమై పోవడమే ప్రళయము.

దొంగ :- ‘ప్ర’ అంటే పుట్టినది ‘పంచము’ అనగా ఐదు అని అర్థము. ప్రపంచము అనగా పుట్టివున్న ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అని అర్థము. ప్రళయము అనగా పుట్టినవి లయించి పోవడము, లేక నాశనమై పోవడమని అర్థము. బయట కనిపించే ప్రపంచము యొక్క ఆయుస్సు 108 కోట్ల సంవత్సరములు. కనిపించే ప్రపంచము 108 కోట్ల సంవత్సరము లకు ప్రళయము చెందుట నిజమే. కానీ ప్రళయము అనునది మరొకటి కూడ కలదు. పంచ భూతములైన ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి వలన ఏర్పడిన నీ శరీరము కూడ ఒక ప్రపంచమే. నీ శరీరము ఐదు భూతముల వలననే పుట్టినది. నీ శరీరము ఎప్పుడు చనిపోతుందో ఆ దినమును కూడ ప్రళయమే అనవచ్చును. పంచభూతముల వలన పుట్టిన ప్రపంచములు చర, అచర అను రెండు కలవని, అలాగే ప్రళయములు కూడ చర ప్రళయము, అచర ప్రళయము రెండు కలవని దీనివలన తెలియుచున్నది. రెండు ప్రళయములను దేవుడే సృష్ఠించాడు. ప్రవక్త చెప్పింది చలించు చరా ప్రపంచమైన మనిషికిగానీ, అచర ప్రకృతియైన బయట ప్రపంచమునకు కాదు. ప్రవక్త మనిషికి సంబంధించిన విషయములను చెప్పగ, చెప్పిన విషయమును తనకు వర్తింపజేసుకొని చూడకుండ, సంబంధములేని బయటి ప్రపంచమునకు వర్తింపజేయుటను బట్టి ప్రవక్త మాటను మనిషి అర్థము చేసుకోలేదని తెలియుచున్నది. ప్రవక్త చెప్పినవన్ని మనిషికి దగ్గరగానున్న సూత్రములనే చెప్పగా, మనిషి ఆ మహావ్యక్తి చెప్పిన అమూల్యమైన మాటలను అర్థము చేసుకోలేక తప్పుగా అర్థము చేసుకొని తప్పుగా నడుస్తున్నాడు. ఆయన బోధించిన బోధలో ఒక్క ప్రళయము అను మాట అర్థము కాకపోవడము వలన, ఆయన భావమునకు ఎంతో దూరముగా మనిషి పోయాడు. నీ భావము తప్పు అని ఇప్పుడు అర్థమైందా వహీద్‌, దేవుడు చెప్పిన రెండు ప్రళయములో ప్రవక్తగారు చెప్పిన ప్రళయమేదో తెలియనివారు మిగత ఆయన మాటలను సరిగ అర్థము చేసుకొన్నారని నమ్మకమేమి?


దేవుడు సమాధినుండి లేపుతాడని చెప్పిన ప్రవక్తమాట నూటికి నూరుపాళ్ళు నిజమే. అయితే సమాధి అంటే మనిషి శరీరము కనిపించకుండ కప్పియున్నదని అర్థము. శరీరము కనిపించకుండ కప్పియున్నది భూమిలో తీయబడిన గుంత అనుకోవడము సరియైనదో కాదో యోచించండి. ఇలా ఎన్నో విషయములను మనము అర్థము చేసుకోలేక పోయాము. దేవుడు చనిపోయిన సర్వ మానవులకు సమాధిని సమానముగా ఉంచాడు. ఆ సమాధిని ప్రవక్తగారు చెప్పినా మనము అర్థము చేసుకోలేక పోయాము. మీరు అనుకొన్నట్లు భూమిలో పూడ్చిపెట్టిన వానికి సమాధి ఉంటుంది. కానీ అగ్నిలో కాలిపోయిన వారికి గానీ, నీటిలో మునిగిపోయిన వారికి గానీ, సమాధి ఉండదు కదా! ఖురాన్‌లోని దేవుని వాక్యము పొల్లుపోదు. దాని ప్రకారము అగ్నిలో కాలిపోయిన వానిని గానీ, నీటిలో మునిగి కుళ్ళి పోయిన వానిని గానీ చివరిలో దేవుడు సమాధినుండే లేపుతాడు. దీనినిబట్టి దేవుని వాక్యము నూటికి నూరుపాళ్ళు సత్యము.


ముస్లీమ్‌లు ప్రవక్త చెప్పిన మాటలను సరిగ అర్థము చేసుకోలేనట్లు, క్రైస్తవులు ప్రభువు చెప్పిన వాక్యములను అపార్థము చేసుకొన్నారు. అలాగే హిందువులు కృష్ణుడు చెప్పిన భగవద్గీతను ఎంతో తప్పుగా అర్థము చేసు కొన్నారు. అందువలన మీ మూడుమతముల వారికి దేవుడు ఏమాత్రము అర్థము కాలేదు. కానీ దేవుడు మీ అందరికి ఒక అవకాశమిచ్చాడు. అన్ని మతములకు అతీతముగా, ముగ్గురు ప్రవక్తలు చెప్పిన వాక్యములకు సరియైన అర్థము తెలుపు వ్యక్తి ప్రస్తుతము భూమిమీద ఒకే ఒకడున్నాడు. అతనిని ఆశ్రయించినా, అతని బోధలను ఆశ్రయించినా, మీ ప్రవక్తలు చెప్పిన రహస్యములు మీకు వివరముగా అర్థము కాగలవు. ఆయన ఎవరో నాకు తెలిసినా నేను దొంగను కదా! అందువలన నేను చెప్పను. మీరే వెతుక్కొని సత్యమును తెలుసుకొని సరియైన దైవమార్గములో నడవండి.

సమాప్తము
(ఈ నాటికలో ఏ మతస్థునికైనా అర్థము కాని విషయముంటే
సామరస్యముగా అడిగి తెలుసుకోవచ్చును.)

-***-


అసత్యమును వేయిమంది చెప్పినా అది సత్యము కాదు,
సత్యమును వేయిమంది కాదనినా అది అసత్యము కాదు.