ప్రబోధచంద్రోదయము/ప్రథమాశ్వాసము

ప్రబోధచంద్రోదయము

శ్రీ నిత్యంబుగ నిచ్చు నాహరివిరించి స్తంబపర్యంత మీ
నానాజీవులలోన రత్నములలోనన్ సూత్రముం బోలెఁ దా
లీనుండయ్యు జగత్కరండకనిచోళీభావముం దాల్చు బో
ధానందైకమయుండు శంకరుఁ డనంతామాత్యు గంగయ్యకున్.

1


శా.

సాంగత్యంబునఁ బొందు మూఁడు జగముల్ సక్తత్రివర్ణేక్షణా
పాంగంబే జగదంబ కొంత నటియింపంజేయుమాత్రంబునన్
మాంగళ్యైకనివాసమైన మహిమన్ వర్తించు నాశంభు వా
మాంగస్థాయిని యిచ్చు వైభవ మనంతాధీశు గంగయ్యకున్.

2


సీ.

ఛాయామదము తుండసంవితభోగి తా
                          రకములు కరశీకరవ్రజంబు
వితతశబ్దంబు బృంహిత మాశ్రితానిలం
                          బాలోలకర్ణతాళానిలంబు
సాంధ్యరాగము శిరస్సాంద్రసిందూరంబు
                          జాహ్నవీపూరంబు జన్నిదంబు
ఘనములు గండభృంగము లర్కవిధుబింబ
                          ములు పాణిఫలపూరకలశములును


గీ.

గాఁగఁ బ్రత్యక్షమైన యాకాశతత్త్వ
మూర్తి విఘ్నేశ్వరుండు త్రిమూర్తిసుతుఁడు
కరుణతోడ ననంతయ గంగమంత్రి
శేఖరునికోర్కి సఫలంబుఁ జేయుఁగాత.

3


శా.

ఆకాశైందవకాంతి నుబ్బి విమలంబై యోగసామ్రాణ్మనో
నీకాశంబగు దుగ్ధసాగరమున న్విశ్రాంతి నేకాంతి నా

నా కౌతూహలవృత్తి సల్పుచుఁ జిదానందంబునం బొల్చు ప
ద్మాకంజాక్షులు ప్రోతు రెప్పుడు ననంతాధీశు గంగాధరున్.

4


చ.

అమలమరాళయాన చతురాననభావసువర్ణదేహవి
భ్రమములు నిద్దఱుం దొరసి బ్రహ్మము శక్తియునైన తా రభే
దమున నటించులీల విశదంబుగఁ దెల్పుచు నల్వయు న్వచో
రమణియు నిత్తు రీప్సితవరంబు లనంతయ గంగమంత్రికిన్.

5


శా.

ఆ వాణీపతిపౌత్రుఁడైన యనఘుం డాదిత్యదైత్యాదినా
నావిశ్వంబును గాంచె నీచతురుదన్వన్మేఖలన్ మేదినిం
గావించెన్ దనపేరఁ గాశ్యపి యనంగాఁ దత్త్వవిజ్ఞానఖ
ద్యావర్మైకవిహారి కశ్యపుఁడు తద్బ్రహర్షిగోత్రంబునన్.

6


ఉ.

ఐతనమంత్రి సంజనితుఁడై తనకీర్తి దిగంతనాకచ
ప్రోతనవీనమౌక్తికవిభూషణలీల వహించుచుండఁ బ్ర
ద్యోతనసూనుదానమహిమోన్నతి మించి సునీతిచాతురీ
శాతనఖంబులం దునిచె శత్రుమహామహిమాంకురంబులన్.

7


క.

కనియెం దనయుల నాయై
తన యేవురుఁ గొమ్మవిభుని నౌబళు నన్న
య్యను మాచన నప్పయ్యను
ననఘులు వారలకుఁ బెద్దయగు కొమ్మనయున్.

8


సీ.

శిష్టసంరక్షణ దుష్టనిగ్రహశ క్తి
                          హరి నాల్గుభుజములకరణివారి
వేదవేదంగాదివిద్యల భారతి
                          పదునాల్గుమోములకరణివారి
నర్థికామితపూరణారంభమున దివ్య
                          గవినాల్గుచన్నులకరణివారి
ప్రత్యర్థికుంజరభంజనంబున నింద్ర
                          కరి నాల్గుకొమ్ములకరణివారి

గీ.

సుతుల నల్వురఁ గనియె ధీయుతులఁ బెద్ద
నార్యు నారపమంత్రి ననంతవిభుని
గంగయామాత్యు నుర్వి సాంగంబులైన
పూరుషార్థంబులో యన వారిలోన.

9


క.

చతురామ్నాయప్రౌఢిమ
చతురతచేఁ జతురుపాయసాంగత్యమునకున్
జతురాశాగతవితరణ
చతురుఁ డనంతయ్య సకలసమ్మతుఁ డగుచున్.

10


ఉ.

కాచనమంత్రిశేఖరునిగాదిలిపుత్రి హరిప్రియేశనా
రీచతురాస్యకాంతల సరిన్ గణుతింపఁగవచ్చు పుణ్యశీ
లాచరణప్రభావకరుణాతిశయంబుల మించు బంధుర
క్షాచణఁ దిప్పమాంబఁ గరకల్పలతానికురంబఁ బెండ్లియై.

11


గీ.

మహిమ యెల్లన నెల్లన సహజదాన
కామధుగ్గణ మనఁగ దుగ్గణమ లక్ష్మి
పట్టుకొమ్మనఁ గొమ్మనఁ బరమబోధ
గరిమ గంగయ్య యనఁగ గంగయ్యఁ గనియె.

12


క.

ఆధన్యులలోనం గం
గాధరవిభుఁ డలరుఁ గీర్తికాంతాధవుఁ డై
రాధేయసుధాకరపృ
థ్వీధరగాదాధరీకవితరణసరణిన్.

13


సీ.

మౌద్గల్యగోత్రసంభవుఁ డైన రాజశే
                          ఖరమంత్రి యేసాధ్వికన్నతండ్రి
యశ్రాంతమధురాన్నవిశ్రాణనమున సా
                          క్షా దన్నపూర్ణ యేచంద్రవదన
కాచమ్మ బంధుసంకల్పకల్పనకల్ప
                          వల్లి యేకాంతామతల్లి తల్లి

యనుకరించు ననసూయారుంధతీశ్వేత
                          పతుల నేకళ్యాణివర్తనంబు


గీ.

మానసంబెల్లఁ గరుణ యేమానవతికిఁ
బలుకులెల్లను నమృత మేభాగ్యవతికి
నట్టినారమ్మ పత్నిగా నమరుశాంతి
సంగతవివేక మనఁగ నీగంగవిభుఁడు.

14


చ.

మరగినకామధేనువులమందలు, సిద్ధరసప్రవాహముల్
దొరికినకల్పవృక్షములతోఁటలు, జంబునదీసమూహముల్
సురపతిరత్నపుంజములు, శుద్ధసుధాఘుటికల్ కవీశ్వరో
త్కరముల కీయనంతవిభు గంగనమంత్రి కృపాకటాక్షముల్.

15


సీ.

మాధవవర్మభూమండలేశ్వరవంశ
                          జలధికి నేరాజు చందమామ
యేరా జుదయశైల మెలమి విభేదించెఁ
                          గపటాహితమదాంధకార మడఁగ
గజపతిసురథాణిగడిదుర్గముల కెల్ల
                          నేరాజు వజ్రంపుబోరు తల్పు
మహిమచే నేరాజు మఱపించె నలభగీ
                          రథపృథుమాంధాతృరఘురమణుల


గీ.

నట్టిగుణశాలి తమ్మరాయనికుమార
వీరబసవక్షమాచక్రవిభునిచేత
మన్ననలు గాంచి మించిన మహితుఁ డితఁడు
మనుజమాత్రుండె గంగయామాత్యవరుఁడు.

16


చ.

జలకము మూర్ధ్నచంద్రసుధ షట్కమలంబులఁ బూజధూప ము
జ్జ్వలతరబోధశాసననివాళి సుషుమ్నవెలుంగుసౌఖ్యముల్
తలఁపున నీగి బోనము సదా తననాదము ఘంటగాఁగ ని
ష్కలుషత నీయనంతవిభు గంగన గొల్చు నిజాత్మలింగతన్.

17

సిీ.

సరిలేని నీతిచాతురిచేత రాజ్యతం
                          త్రంబును నడిపిన నడుపుఁగాని
యనిశంబు పుష్పచందనవనితాదిసౌ
                          ఖ్యంబులు నందిన నందుఁగాని
సంగీతసాహిత్యసరసవిద్యావినో
                          దంబులఁ దగిలినఁ దగులుఁగాని
స్వామిహితాసక్తి సదవనాసదను శా
                          సనలీల జరపిన జరపుఁగాని


గీ.

నీళ్ళలోపలి సరసిజినీదళంబు
సరవి నిర్లేప్యుడైన సంసారయోగి
సందియములేదు ప్రత్యక్షశంభుమూర్తి
యీయనంతయ గంగమంత్రీశ్వరుండు.

18


క.

అని శివపూజావసర
మ్మున దీవన లిచ్చి పొగడు బుధులుఁ గవులు ని
ట్లని పల్కిరి కౌతుకమున
ఘనబలశృంగావతీర్ణగంగారభటిన్.

19


ఉ.

ఈదృశవర్తనంబునకు నెక్కుడు బోధమగున్ బ్రబోధచం
ద్రోదయ మాంధ్రభాష నతియోగ్యకవీంద్రులచేత నంకితం
బై దిశలం బ్రసిద్ధముగ నందినఁ గస్తురితావి పైఁడికిన్
మేదురహేమకాంతి ధరణిన్ మృగనాభికిఁ గల్గులాగునన్.

20


సీ.

వివరింప నిది సర్వవేదాంతసారంబు
                          తలఁపగా నిది గట్టితెలివిత్రోవ
యిది భోగమోక్షసంపదలకు మూలంబు
                          మోసలే దిది ఘనంబులకు ఘనము
జ్ఞానకర్మరహస్యసాధనంబును నిధి
                          యిది నవరసముల నీనుసురభి

షడ్దర్మనంబులు నరవి నిందున్నవి
                          సందేహములు దీఱ విందుఁ గాని


గీ.

యిమ్మహారసపాకము నెఱింగినట్టి
జనుఁ డెఱుంగఁడు మఱి తల్లిచన్నుపాలు
దీనిసరి చెప్ప మరిలేవు త్రిభువనముల
దొరక దీకృతి నీవంటిదొరకుఁగాని.

21


క.

అనవుడు ననంతవిభుగం
గన వారలఁ జూచి యిట్టిఘననాటకముం
దెనుఁగునఁ బ్రబంధశయ్యకు
నొనగూర్పఁగ నేర్చుసుకవు లుర్విం గలరే?

22


వ.

అని పలికిన.

23


సీ.

కలరు కౌశికగోత్రకలశాంబురాశిమం
                          దారంబు సంగీతనంది నంది
సింగమంత్రికిఁ బుణ్యశీల పోచమ్మకు
                          నాత్మసంభవుఁడు మల్లయమనీషి
యతని మేనల్లుఁ డంచితభరద్వాజగో
                          త్రారామచైత్రోదయంబు ఘంట
నాగధీమణికిఁ బుణ్యచరిత్ర యమ్మలాం
                          బకుఁ గూర్మితనయుండు మలయమారు


గీ.

తాహ్వయుఁడు సింగనార్యుఁడు నమృతవాక్కు
లీశ్వరారాధకులు శాంతు లిలఁ బ్రసిద్దు
లుభయభాషల నేర్పరు లుపమరులు స
మర్థు లీకృతిరాజనిర్మాణమునకు.

24


అని పలికి వారలం గనుంగొని సంతోషవికసితవదనారవిందుండై మీ
తలంపు నాతలంపు నేకంబయ్యె నిదియ సరిలేని శుభనిమిత్తం బని వచ్చి

మమ్ముఁ బిలిపించిన మేమును రాజ్యలక్ష్మీకటాక్షపరంపరానుకారిమదాళి
మాలికామండితగండమండలభద్రశుండాలమండితంబును, సేవాగతా
నేకదుర్గాధిపచిత్రాందోళికాతపత్రసహస్రావలంబితభిత్తిభాగంబును,
సుభటకోటివివిధాయుధప్రభాధగద్ధగాయమానంబును నగుబహిరంగణంబు
దఱసి సామంతులు పుత్తెంచిన కానుక లందుకొనఁ గ్రందుకొన నందందు
నడయాడుకంచుకీసంచయంబుల విలోకింపుచుఁ గక్ష్యాంతరంబులు గడచి
విద్వత్కవినాయకవాంశికవందివైణవికవైతాళికమర్దళికాదులైన కళా
వంతులు ప్రసంగఁబునం గొలగొల మంచు నంచెలంచెలై నిలిచినకొలువు
చంచలలోచనలమైఁదీగెలం గదంబించుపరిమళంబుల గుబులుకొనుచు
సమీపంబునం గూర్చున్న మన్నెరాజులభూషణరత్నకిరణరాజులచే
విరాజితంబగు కొలువుకూటంబు చొచ్చి తనవైభవరత్నాకరంబున విహ
రించు నంచలొకోయనఁ జామరగ్రాహిణీకనకకంకణక్రేంకియాలంకృతం
బైన వింజామరంబు లిరువంకల రంజిల్ల నయనోత్సవంబుగాఁ గొల్వున్న
తన్మంత్రిశేఖరుం గనుంగొని పరమహర్షంబున నాశీర్వదించిన నతండు.

25


మ.

వినయం బొప్పగ మమ్ము నైజనికటోర్విన్ జిత్రవర్ణాసనం
బున నాసీనులఁ జేసి తత్సమయసంపూజాలసచ్ఛంభుమూ
ర్థనవీనేందుకళాసుధాసురభిగంధంబైన హస్తాంబుజం
బునఁ గర్పూరపువీడియంబు లిడి సంపూర్ణానురాగోక్తులన్.

26


క.

నేరుపరి పోహణించిన
హారము వెల యెక్కులీల నతిశయముగ నా
పేరఁ దెలిఁగింపవలయును
సారపుఫణితులఁ బ్రబోధచంద్రోదయమున్.

27


గీ.

అనిన సౌందర్యలక్ష్మికి యౌవనోద
యంబు దొరికినగతి నీమహాప్రబంధ
మునకుఁ బతివైతి మాకు నపూర్వమైన
కీర్తి కల్గె నటంచు నంగీకరించి.

28

క.

పొరిఁబొరి నొప్ప సలాకల
నొరసిన కుందనపుబూఁదెయును బోలె సభన్
సరసుల సంఘర్షణమున
వరకవికావ్యంబు మిగుల వన్నెకు నెక్కున్.

29


ఆ.

కరభములకుఁ బుష్పితరసాలవాటిక
దిరుగఁ గంటకంబు దొరకనట్లు
కుకవికీటములకు సుకవికావ్యములోన
నెమక వీస మంత నెరసు లేదు.

30


క.

అని సుకవీంద్రులగుణములు
గొనియాడుచుఁ గుకవి సరకుగొనక మహిఁ బురా
తనసుకవులసాహిత్యము
పనుపఱచిన యట్టిసరసభాషాసరణిన్.

31


సీ.

ఎఱుఁగనివారికి నేదేవుఁడు ప్రపంచ
                          మౌ మరీచికలు నీ రైనకరణి
నెఱిఁగినవారికి నేదేవుఁడు జగంబు
                          గాఁడు పగ్గము పాము కానికరణి
నేదేవుఁడు వెలుంగు నాదిశక్తియుఁ దాను
                          నెలయును నిండువెన్నెలయుఁ బోలె
బ్రహ్మనాడ్యాగతప్రత్యక్పరంజ్యోతి
                          నా మించు నేదేవునడిమినేత్ర


గీ.

మట్టి సర్వేశుతోడి తాదాత్మ్యమహిమ
గలిగి పరిపూర్ణభావవిఖ్యాతులైన
దక్షిణామూర్తి దేశికోత్తము నఘోర
శివుల భజియించి యేకాగ్రచిత్తమునను.

32

షష్ఠ్యంతములు

క.

బోధ్యప్రబోధబోధిక
తాధ్యాసీనాత్మతన్మయస్ఫురదరుసా
రాధ్యానుగ్రసంతత
శుధ్యంతఃకరణునకును సుగుణాంబుధికిన్.

33


క.

కరుణావరుణాలయునకు
జరణాభరణాయమానసరసిజచిహ్న
స్పురణాశరణాగతసం
భరణైకగుణానురూపమహిమాఢ్యునకున్.

34


క.

అక్షయకీర్తివిలక్షిత
నక్షత్రేశ్వరధురీణునకు జలధిగ్రా
శిక్షుద్బలరేణునకున్
శిక్షితరిపుకదళిదోరసికరేణునకున్.

35


క.

భువనప్రతిమాపేటికి
భవనాటకసూత్రధారభావనరతికిన్
సవయోరూపవిభూతికి
శివయోగరహస్యరత్నశేవధిమతికిన్.

36


క.

మహితప్రభావఖండిత
బహిరంతశ్శాత్రవునకుఁ బ్రభుచంద్రునకున్
బహుసుగుణమండలాఖిల
మహికి ననంతయ్య గంగమంత్రీందునకున్.

37


వ.

అభ్యుదయపరంపరాభివృద్ధిగా మారచియింపంబూనిన ప్రబోధచంద్రోద
యం బను మహాకావ్యంబునకుం గథాసూత్రం బెట్టి దనిన.

38

కథాప్రారంభము

సీ.

అనుపమజ్యోతిర్మయంపుఁగోటలు చుట్టు
                          రాజిల్లుచుండు నేరాజధాని
సరిలేని యమృతంపుఁబరిఖ లేపట్టణం
                          బున నగాధంబులై తనరుచుండు
మరి సాటిలేని నైర్మల్యంపుమేడ లే
                          వీట మిన్నులకును మీదుమిగులు
ప్రతిలేని సహజసౌరభ్యంపుఁదోఁట లే
                          పుటభేదనంబునఁ బొలుపు మీఱు


గీ.

సంతతరిరంసపరమహంసప్రమోద
కారణమహావికస్వరకమలచక్ర
పూర్ణసదమలసరసు లేపురమునందుఁ
గ్రందుకొనుచుండు నాచిదానందనగరి.

39


క.

పాలింపుచు నఖిలమునకు
నేలికయై రాజు మెఱయు నీశ్వరుఁ డనఁగా
నాలోకవిభుఁడు మాయా
నీలాలకవలన మన సనెడు సుతుఁ గనియెన్.

40


ఆ.

ఆమనోభిధానుఁ డఖిలజగంబులు
గలుగఁజేయఁ దానె కర్త యగుచు
మత్తకాశినులఁ బ్రవృత్తి నివృత్తుల
బ్రేమ వెలయఁగాఁ బరిగ్రహించె.

41


క.

మునుపుగఁ బ్రవృత్తివలనం
గనియెన్ మోహాదిసుతులఁ గలుషాత్మకులన్
వెనుకను నివృత్తివలనం
గనియె వివేకాదిసుతుల గతకల్మషులన్.

43

మ.

అవలేపంబున నన్నదమ్ము లగుమోహాదు ల్వివేకాదులున్
భువనైకాధిపతిత్వకాంక్షఁ దమలోఁ బోరాడి రేకామిషో
ద్భవలోభంబునఁ బోరకుండరు గదా దాయాదులై మున్ను కౌ
రవులుం బాండవులున్ ధరిత్రికయి హోరాహోరిఁ బోరాడరే.

43


వ.

జనకునిపక్షపాతమున సంతతమున్ బలవంతుఁ డైనమో
హునిభుజవిక్రమంబునకు నోర్వఁగలేక వివేకుఁ డాజిలోఁ
దనబలఁగంబుఁ దానును యదాయదలై చని వృత్రు కోడిపో
యిన సురరాజుచందమున నెక్కడనో యణఁగుండె నంతటన్.

44


వ.

బలవదతివ్యూహ దురవగాహ కామ క్రోధ లోభాహంకారాది సహచరస
న్నాహుం డగుచు మోహుండు విశ్వంబునం గలపురంబు లన్నియుఁ
దనవశంబుగా నెదురు లేక సామ్రాజ్యంబు సేయుచు నొక్కనాఁడు
పేరోలగం బుండి తనతమ్ముల విలోకించి వివేకాదు లక్కడక్కడం బొడ
కట్టుట చారులముఖంబున నెఱింగితిమి. యింతట నిందులకుం బ్రతి
చింతన చేసి వైరులపీఁచంబు లడంచుటకు మీకుఁ దోఁచిన యుపాయంబులు
వినిపింపుం డనిన రతిసముత్తుంగకుచాంకితరోమాంచకంచుకితాంతుండును,
మదఘూర్ణితాపాంగుండును సకలజగన్మోహనాకారాభిరాముండునగు
గర్వంబున నిట్లనియె.

45


క.

తగ వెరుసుమాట చెప్పెద
మగువలచంచలకటాక్షమార్గణజాలం
బు గెలువఁ దాఁకినఁ దాఁకవె
జగతిం గోవిదులమతులుఁ జదువులుఁ దెలువుల్.

46


వ.

అదియునుంగాక.

47


మ.

అలిగీతంబులతోడిపుష్పలతలున్, హర్మ్యంబులుం జందనా
చలమందానిలకందళంబులును, వాసంతంబునుం బండువె
న్నెలలుం గాంతలు నాకు నమ్మినబలానీకంబులై యెల్లచో
టుల నుండగ వివేక మెట్టొదవుఁ బుట్టున్ బోధ మెబ్భంగులన్.

48

క.

నావిలు నమ్ములుఁ జూడఁగఁ
బూవులవలె నుండుఁగాని భువనములు మదా
జ్ఞావశులు గాక తక్కిన
దేవాసురవరులనైన ధృతి దూలింతున్.

49


సీ.

తనకన్నకూఁతును దాన పెండ్లాడఁడే
                          వారిజగర్భుండు వావి తప్పి
బలభేది గౌతముభార్య నహల్యఁ గా
                          మించి చేయఁడె నల్లమేఁకతప్పు
కడలేనిరట్టడి కొడిగట్టుకొనియైనఁ
                          గమలారి గురుతల్పగతుఁడు కాఁడె
తపనసూనుఁడు తారఁ దా నాక్రమింపఁడె
                          యన్న ప్రాణములకు నఱ్ఱు దలఁచి


గీ.

మరియు నిట్లు జగంబుల మరులుకొల్పి
యెట్టినియతాత్మకులనైన గుట్టు చెఱిచి
కానిత్రోవల నడిపించుకడిమి నాదు
వాలుఁదూపులగమి కవలీల గాదె.

50


ఆ.

అనుచుఁ గాముఁ డాడుకొనుపంతములు విని
మతి గలంగి పలికె రతివధూటి
యావివేకుఁ డల్పుఁడా యమనియమాది
సచివయుతుఁడు మోహు సరకుగొనునె?

51


క.

తగినసహాయము గలిగిన
పగతునియెడ మొక్కలంపుఁబని గాదనినన్
జిగురువిలుకాఁడు రతి! నను
బెగడించెదు నీవు సహజభీరువ వగుటన్.

52


క.

మానిని! యమనియమాదులు
నా నెనమండ్రును వివేకనరపతిమిత్రుల్

కానిమ్ము వారిపాలికి
మీనవిలోచనలు గారె మృత్యువు లరయన్.

53


క.

తరుణులచూపులు మాటలు
గరగరికలు నగవు బిగువుకౌఁగిటిపొందుల్
పరికింప నేల తత్సం
స్మరణమె చాలదె మనంబు సంచలపఱుపన్.

54


ఆ.

కాన మానసంబు గలఁగిన యమనియ
మాదు లెల్లఁ బోవు నాడనాడ
కమలవనములోన కలహంసపంక్తులు
కలఁకనీరు విడిచి తొలఁగునట్లు.

55


క.

ఉడుపుం త్రోచుఁ డహింసను
సడలింపుదు నేను బ్రహ్మచర్యాదుల ను
క్కడఁగించు లోభుఁ డుద్దతి
నడవొడ లేకుండ సూనృతాస్తేయములన్.

56


సీ.

వినుము విశేషించి మనరాజుదొరలగు
                          మదమత్సరాదుల కెదురు గలదె
యావివేకుని మంత్రులగు యమనియమాదు
                          లెనమండ్ర మోహునియనుఁగుమంత్రి
యైనయధర్ముండె యాక్రమింపఁగలండు
                          నావుడు రతి ప్రాణనాథుఁ జూచి
యొకతండ్రిబిడ్డలై యుండియు నింతేసి
                          పోరాట మేటికిఁ బుట్టె మీకు


తే.

వనిత! పోరాటమాత్రమె వారు మమ్ము
నిందఱను సంహరింపంగ నెత్తికోలు
గొన్నవా రన రతి యెట్లొకో దురాత్ము
లింతగాఁ బ్రాణపర్యంత మెట్టు తెగిరి.

57

వ.

అనవుడుం గాముండు రతిని విలోకించి చంచలలోచనా! వారును మేమునుం
జేటెఱుంగనికూనలమై మీఁద వచ్చు నుపద్రవంబు విచారింపక
దురాశాపాశబద్ధులమై కలహసన్నద్ధుల మయితి మింతియ యిప్పుడు పిడు
గువంటి వార్త యొక్కటి దిక్కుల న్వినంబడుచున్నయది యది యెఱిం
గించెద వెఱవకుము పూర్వంబున నంగరహితుండైన పరమేశ్వరునకుఁ
దద్గృహిణి యైనమాయకుఁ గూటమి లేకయే చిత్రంబుగా సంభవించిన
మనంబునకుఁ దనయుండైన వివేకునకు నుపనిషద్దేవివలనఁ గాళరాత్రికల్ప
యగు విద్య యను రాక్షసి ప్రబోధచంద్రునితోడం గూడ నుద్భవిల్లి తల్లి
దండ్రులను సహోదరులగు మోహాదులు మొదలైన సకలకులంబునుం గసి
మసంగి మెసంగు నీవిద్యాప్రబోధజననంబునకు నా శమదమాదు లెదురు
చూచుచున్నవా రనిన రతిపల్లవాధర యుల్లంబు తల్లడిల్ల నాహాకారపూర్వ
కంబుగా నాలింగనంబు గావించినఁ గాముండు తదీయసంస్పర్శనంబు
నకుఁ జొక్కి యాత్మగతంబున.

58


ఉ.

లోలకనీనికాకులవిలోచనదీప్తులు గ్రేళ్ళు దాటఁగాఁ
జాలభయంబున న్వడఁకుచక్కనిచన్ను లురంబు మోపఁగాఁ
జాల మనోఙ్ఞకంకణభుజాలతలన్ దనుదానె యీగతిన్
బాల కవుంగిలించిన మనంబున దుఃఖము లంటనేర్చునే.

59


క.

అని తలఁచి రతిం గనుంగొని
వనితా! మేమెల్ల జీవవంతులమై యుం
డినయన్నినాళ్ళు నెక్కడ
జనియించును విద్య వలదు శంక యటన్నన్.

60


క.

రతియును దమకులనాశము
మతి నెఱిఁగియు నకట! శమదమప్రభృతులు తా
రతిసాహసమున నీగతి
యతనము చేసెద రదేటి కనఁ గాముఁ డనున్.

61


క.

సహజఖలుం డుదయింపుచు
మహిఁ గులమును జెఱిచి తాను మడియుఁ జుమీ భూ

రుహము లొఱయఁగాఁ బుట్టిన
దహనుం డడవెల్లఁ గాల్చి తాఁ జెడును గదా.

62


వ.

అని యిట్లు రతికాము లాడువాక్యంబులు విని మోహుని సమ్ముఖంబునకు
దుర్గుణుం డనెడిపేరి చారుం డొకండు వచ్చి వినతుండై దేవా! వివేకవిభునకు
నుపనిషద్దేవికి యోగంబు గలుగుట కాదంపతులకు విద్యాప్రబోధచంద్రు
లుదయించుటకు విఘ్నంబు లుద్భవింపక యుండ శమదమాదులు వచ్చి
సకలపుణ్యతీర్థంబులవెంట దేవతాప్రార్థనంబులు సేయ సమకట్టియున్న
వారు చేయకుండ నంకిలిందగఁ గావింపం దగువారిం బనుపు మనిన మో
హుండు మదిలోన నాగ్రహించి.

63


క.

దంభునిఁ జూచి వివేకా
రంభంబున కిప్పు డంతరాయము చేయన్
గుంభిని తీర్థంబులలో
సంభావిత కాశిపురికిఁ జనుమని యనిపెన్.

64


ఆ.

ఇట వివేకుఁ డున్నయెడకు సదాచారుఁ
డనెడుచారుఁ డొక్కఁ డరుగుదెంచి
మోహు చేయు కృత్యముల విన్నవింపంగఁ
జొచ్చె నపుడు పూసగ్రుచ్చినట్లు.

65


వ.

దేవరపంపున మహామోహుని రాజ్యంబునకుం జని వార లాడుకొను
దూరాలాపంబులునుం జేయుకృత్యంబులు నెఱింగితి నది యెట్లంటేని
యప్రతిహతస్వేచ్ఛావిహారులైన రాగాదులచేత భర్త్సితుండై తేజంబు
గోలుపడి సాంద్రనీహారపరంపరాంతరితయైన కాంతితోడి చందురుచం
దంబునం బొనుంగుపడిన మతిసతిం గూడియున్న వివేకుండు మిక్కిలి
కృశాంగు డయ్యును మానధనుండు గావున నసము డింపక యుపనిషద్దేవి
వలనవిద్యాప్రబోధచంద్రులం గన మనలకుం దనకులంబునకు హాని
చేయఁదలంచుచున్నవాఁడఁట! కులక్షయప్రవృత్తు లగుదుర్వృత్తులు తమ
చేటుఁ దలంతురే! ధూమంబు జీమూతపథంబుఁ బొంది నిజసంభవస్థానం

బైనదహనంబు నార్చి తానుం దూలిపోవదే. కావునం బాపకారి యగువివే
కుని నానాప్రకారంబులం జెఱుపవలయునని పెక్కుపాయంబులు వర్తింపు
చున్నవారని విన్నవించిన మెచ్చి తనదేవి మతిం గనుంగొని.

66


మ.

తనతండ్రిం బరము న్నిరంజను జగద్భర్తం గదా కట్టివై
చె నహంకారునిఁ గూడి మజ్జనకుఁ డబ్భేద్యంపుఁబాశంబులన్
మునుపుం దాముఁ దదానుకూల్యపరు లీమోహాదులంచుం జుమీ
తునుమం జూచితి నమ్మ నమ్ముఁ దము నిందున్ దోషి నే నౌదునే.

67


క.

కార్యాకార్యము లెఱుఁగ క
నార్యత వర్తించుగురువునైనను విడువన్
మర్యాద యనుచు వృద్ధా
చార్యులు పలుకుదురు వేదసమ్మత మగుటన్.

68


ఉ.

సారసుఖైకమూర్తియగు సర్వజగత్పతిఁ గట్టిమోహనం
సారపయోధిఁ ద్రోచిన విచారవిహీనులు తారు మంచివా
రైరఁట తత్సదాశివుని నంటిన దుర్దశ మాన్పఁ దమ్ము సం
హారము చేయు మే మఁట దురాత్ములమో కలకంఠి వింటివే.

69


ఆ.

అనిన మతివధూటి యావివేకునిఁ జూచి
ప్రాణనాథ! మోహపాశములను
నిర్ణిరోధమహిమ నిత్యప్రకాశుఁ డా
పరముఁ డెట్లు కట్టుపడియె ననిన.

70


హరిణీవృత్తము.

సదమలనయస్వచ్ఛుడైనం బ్రశాంతి వహించి తా
నొదవు ధృతులఁ బ్రౌఢుఁ డైన న్మహోదయధీకళల్
వదలు హరినేత్ర లీలం దలంపఁగ మాయతన్
బొదువ మఱచె నీశ్వరుండుం బ్రబోధము నావుడున్.

71


ఆ.

మేఘరేఖ యొకటి మిహిరున కడ్డంబు
వచ్చినంత నతనివన్నె చెడునె

మాయ డాయ నతనిమహిమంబు తప్పునే
యబల! యట్ల తప్ప దైన వినుము.

72


క.

వారాంగనవలె మాయ వృ
థారంజకురాలు గానఁ దత్సంగతిచే
నారక్తుం డగుశివుఁడు జ
పారంజిత యైనయట్టిస్ఫటికముఁ బోలెన్.

73


గీ.

అరయ నాతఁడు నిర్లేపుఁ డగుట హాని
బొరయఁ డీమాయ కావించు బూటకములు
పాయ కెప్పుడుఁ బురుషుల భ్రమల నిడుట
సహజ మింతియ నారీపిశాచములకు.

74


సీ.

వన్నెలు పచరించి కన్నుసన్నలు చేసి
                          వెడమాటలను బ్రేమ గడలు కొలిపి
తరితీపునటనలఁ దమకంబుఁ బుట్టించి
                          వట్టిప్రియంబుల గుట్టు తెలిసి
కలికితనంబునఁ గాఁకలు గావించి
                          తోడినీడలువోలెఁ గూడిమాడి
యలుకల నలయించి కలయిక వలపించి
                          బాసల నడియాస పాదుకొల్పి


గీ.

మనసు కరగించి బ్రమయించి మస్తరించి
మిగులఁ జొక్కించి యెంతయుఁ దగులుపఱిచి
పాసి యెడఁబాసి తమబంటుఁ జేసికొనరె
వామలోచన లెంతటివారినైన.

75


వ.

అదియునుం గాక దురాచారి యగుమాయాదేవి కపటకృత్యం బొక్కటి
వినుము. తానును జవ్వనం బెడలిన పెద్దదాన నతండుఁ బురాణపురుషుండు

విషయరసవిముఖుండు గావున నేతత్పరమేశ్వరపదంబునం దనతనయుం
డగు మనంబు నింతటఁ బట్టంబు గట్టెద నని తలంప నమ్మనంబు నమ్మ
యభిప్రాయం బలంబించి తాను జనకునాసన్నవర్తి యగుటం జేసి
తత్పరమేశ్వరత్వంబుఁ గైకొన్నవాఁడుపోలె విజృంభించి నవద్వారంబు
లగుపురంబులు రచియించి యప్పురంబుల నద్వితీయుం డగునాత్మునిం
ద్రుంచివైచిన నతండును దనకులోనై మణిక్రిందివత్తివిధంబునఁ దన
యందు నిజచేష్టితంబులు చూపుచుండ నీడతోడం గూడినదర్పణంబుజాడ
నహంబ్రహ్మీభవించి తల్లికిం దగినబిడ్డయె కలిగె నన మెలంగుచుండు
నట్టిమనంబు పెద్దకొడుకగు నహంకారుండను మనుమనిచేత నాలింగితుండై
పరమేశ్వరుండును.

76


మ.

ఇది నాతల్లి యితండు తండ్రి యిది నాయి ల్లీకళత్రంబు నా
యది నాబిడ్డలు వీరు నాహితులు వీరే వైభవం బెల్ల నా
యది యంచున్ జడమానసోదయుఁ డవిద్యానిద్ర ఘూర్ణిల్లుచున్
సదసద్వస్తువివేకి యయ్యుఁ గను సంసారామితస్వప్నముల్.

77


క.

ఈమాటలకు వివేకుని
తో మతియను నిట్టునిద్ర తొట్టివివేకం
బేమియు శివుఁ డెఱుఁగండఁట!
యేమాడ్కిఁ బ్రబోధచంద్రుఁ డిఁక జనియించున్.

78


క.

అనిన వివేకుఁడు లజ్జా
వనతాననుఁ డగుచుఁ గొంతవడి యూరక యుం
డి నిజాంగనతో నిట్లను
ననునయమధురాక్షరంబు లగువాక్యములన్.

79


క.

చంచలము మానయుతమును
గంచుపదనువంటి దరయఁ గాంతలహృదయం
బంచు నొకమాట యాడఁద
లంచియుఁ జెప్పంగ మదిఁ దలంకెద నన్నన్.

80

క.

అనుమానపడక వల్లభ
వినుమా నామాట వారివీరిబలె నన్
గనుఁగొనకుము కులకాంతలు
పెనిమిటిధర్మమున కెడమ పెనిపెట్టుదురే.

81


సీ.

అనవుడు మతిఁ జూచి యను వివేకుఁడు నీవు
                          విషయరసాస్వాదవిముఖురాల
నగుచు నవస్థాత్రయం బనుసంకేత
                          నిలయంబు చేరక నిమిషమాత్ర
మిన్నకుండినఁ జాలు మున్ను నాతోడుతఁ
                          గలహించి చిరవియోగమునఁ బొరలు
నుపనిషద్భామిని నొకభంగి బోధించి
                          హరిభక్తిశాంత్యాదు లైనచెలులు


గీ.

పొసఁగ నాతోడఁ గూర్పఁ బ్రబోధచంద్రుఁ
డుదయమై ఘోరభవపాశయూధనిబిడ
బంధమోక్షంబు మనవంశకర్త కొసఁగుఁ
గొమ్మ! నీ విందులకు నియ్యకొంటివేని.

82


శా.

నాయుగ్రంపుఁబ్రతిజ్ఞ యొక్కటి సుమీ నాళీకపత్రాక్షి! దో
షాయత్తతత్వమతిం బురంబులఁ ద్రిలోకాధీశ్వరుం గట్టరే
దాయాదు ల్గడుబ్రహ్మహంత లగుచున్ దర్పించి ప్రాణాంతిక
ప్రాయశ్పిత్తము చేతు నాఖలులకున్ బ్రహ్మంబు భిన్నంబుగన్.

83


వ.

అని మతికాంత నొడంబఱిచి విష్ణుశాంత్యాదులం బిలిచి మీర లుపని
షద్దేవి ననూనయించి తోకొంచురండని పంచె నిటమీఁది వృత్తాంతం
బాకర్ణింపుము.

84


శా.

గౌరీనాయకపూజనా కలితహత్కర్పూరనీరాజనా
సౌరఖ్యాయతనాయమాన బహుతేజశ్ఛన్నదూర్వాసనా

పారంపర్యతమోనిజాశ్రితజనా! పాండిత్యదీభాజనా!
వీరారిస్థితిభంజనా! నిఖిలపృథ్వీమండలీరంజనా1

85


క.

గుణగణమణిగణరోహణ
ఫణినాయకనిర్విశేషభాషణ! జలజే
క్షణసుతసన్నిభశుభల
క్షణ! శివభక్తిస్ఫుటప్రసవషట్చరణా!

86


మాలిని.

అకలుషనయసీమా! యంగసౌందర్యకామా!
వికసితరుచిసోమా! విశ్వసంస్తుత్యనామా!
సకలభుననరాజీ! శారదావస్తులీలా!
శుకదమలయశోవిస్ఫూర్తిసౌభాగ్యధామా!

87

గద్య. ఇది శ్రీమదుమామహేశ్వరవరప్రసాదలబ్ధసారసారస్వతాభినంది నంది
సింగయామాత్యపుత్ర మల్లయమనీషితల్లజ మలయమారుతాభిదాన
ఘంటనాగయప్రధానతనయ సింగయకవిపుంగవ ప్రణీ
తంబైన ప్రబోధచంద్రోదయం బనుమహాకావ్యం
బునందుఁ బ్రథమాశ్వాసము