ప్రబోధచంద్రోదయము/తృతీయాశ్వాసము

ప్రబోధచంద్రోదయము

తృతీయాశ్వాసము

క.

శ్రీవాణీనాయకసమ
భావజ్ఞ సతీసమూహభావభవ యశో
భావి మలీకృతపూర్ణ
గ్లౌవంశ యనంతిమంత్రి కమలజగంగా.

1


వ.

అవధరింపు మిట్లు మహామోహునిపనుపున మిథ్యాదృష్టి క్రమక్రమంబున
శ్రద్ధతోడం జెలిమి చేసి తొడలపైనిం బెట్టి తేలింపుచు లేనిధర్మమోక్షం
బులు కల్పించి శాస్త్రంపుఁబల్లఱపులు శరీరసుఖంబులకుం జెఱపనచేటలు
గాని నిజంబులు కావనియును మోక్షంబు గలిగెనేని యది విషయానంద
విముక్తంబు గావునఁ గొఱగాదనియును జెవి నిల్లు కట్టుకొని చెప్పి వేద
మార్గోపనిషత్తులతోడ శ్రద్ధను విరుద్ధపఱిచి చెవియుం జెక్కు నెఱుంగ
కుండ వేదబాహ్యపాషండవశంవదం జేసెఁ దమతల్లిం గానక శాంతి
విభ్రాంతి నొంది విలపించుచు.

2


సీ.

ఏజెంత బోధించెనే నిన్ను నా తల్లి
                          కాన! పాషండసంగతుల మెలఁగ
నేబోడి గావించెనే యింతవిరిపోటు
                          తల్లి! నీ కుపనిషత్తురుణితోడ
నేముండ యెడఁబాపెనే నిన్నుఁ దల్లి! మా
                          మీఁద హత్తినకూరిమియును గృపయు
నేరండ బ్రమయించెనే నిన్నుఁ దల్లి! ధ
                          ర్మంబు మోక్షం బబద్ధంబు లనుచు

గీ.

నంచు దుఃఖించుఁ గన్నీరు నించు దిశలు
గలయ వీక్షించుఁ గానక కళవళించు
నించుకించుక గమనించుఁ జంచలించుఁ
దల్లి దొఱఁగుడు వేయిచందముల మఱియు.

3


సీ.

మృగములు తమలోన పగలేక మెలఁగ ఋ
                          ష్యాశ్రమవనము లుద్యానములుఁగఁ
బావననదులు సంభవ మైన కులధరా
                          ధరములు కేళిసౌధములు గాఁగఁ
గలుషహరంబులై కనుపట్టు పుణ్యతీ
                          ర్థములు విహారస్ధలములు గాఁగ
నిరవద్యబహుతపోనిష్ఠగరిష్ఠులు
                          వైఖానసులు బంధువర్గములుగ


గీ.

మనెడు నీవింకఁ జండాలమందిరమున
దవులఁ బడియున్న కపిలధేనువును బోలి
యకట యేరీతి బ్రతికెదవమ్మ వేద
బాహ్యపాషండహస్తసంప్రాప్త వగుచు.

4


కుడువవుగా నేఁ బొత్తునఁ
గుడువక నేఁ బ్రక్కలేక కూర్కవుగా యే
యెడ నన్నుఁ బాసి నీ వర
గడియయు నిలువంగలేవుగా యోజననీ!

5


క.

అని శాంతి ప్రలాపించుచుఁ
దననెచ్చెలిఁ గరుణఁ జూచి తథ్యం బిఁక మ
జ్జననియు నింతక తీఱును
జనియెద నే నగ్నిఁ జొచ్చి జననిం గూడన్.

6


శా.

వేవేగన్ సొద పేర్పవే యనిన నావిర్భూతభాష్పాంబుధా
వావిప్లావితవక్త్రయై కరుణ నాప్రాణంబు లెట్టుండునే

నీ వీలాగున దుస్సహప్రళయువహ్ని క్రూరవాక్యంబులన్
నావీనుల్ చుఱుచూర్లు చూఁడఁగ మదిం ధైర్యంబు గీలింపవే?

7


చ.

మొదలనె ముద్దరా లగుట మోహుభయంబునఁ జేసి శ్రద్ధ యే
నది దరిఁ బుణ్యతాపసవనంబులలోపల దాఁగియున్నదో
వెదకుద మంతిదాఁక గరవేదన మాను మటన్న శాంతియున్
బెదవులు వేఁడియూరుపుల బీఁటలు వాఱఁగ గద్గదోక్తులన్.

8


మ.

చెలియా యింతకు మున్ను మౌనివిసరక్షిప్తోచ్ఛషష్ఠాంశసం
కులనానాతటినీ విశాలపులినక్షోణీసమీపంబు లు
జ్జ్వలస్రుగ్దర్భనమిచ్చషాలచమనవ్యాప్తాధ్వరాగారముల్
గలయం జూచితిఁ దల్లి నేకడ వీనం గానంగ లే నక్కటా.

9


గీ.

అనిన శాంతివంక గనుఁగొని కరుణ యి
ట్లనియె నట్టిపుణ్య మైనశ్రద్ధ
కిట్టిహాని యెట్లు పుట్టెనే యన శాంతి
వినుము గడువరాదు విధికృతంబు.

10


సీ.

చాపచుట్టఁగఁ జుట్టి చంకఁ బెట్టుక పోఁడె
                          ధరణి హిరణ్యాక్షదానవుండు
వేదత్రయాకాంత వెస మ్రుచ్చిలింపఁడె
                          చూఱపట్టినయట్లు సోమకుండు
సాక్షాన్మహాలక్ష్మి జనకభూపాలనం
                          దనఁ జెఱపట్టఁడే దశముఖుండు
కొసరక యమ్మదాలసఁ గొనిపోఁడె పా
                          తాళకేతుఁ డను నక్తంచరుండు


గీ.

గాన నింతేసివారముగా యనంగ
రాదు పో యెట్టిపుణ్యవర్తనుని కైన

సహజవక్రంబు గాన సజ్జనులమేలు
చూడఁజాలక విధి తప్పజూచెనేని.

11

జైనమతము

వ.

అవి యట్లుండనిమ్ము కరుణా! మదీయజననిం బాషండసదనంబుల వెదు
కుదము గాని పదమనుచుఁ గతిపయపదంబుల ముందటఁ గరుణ యొక
వికృతవేషునిం గని బెగడి శాంతిం బేర్కొని యోయక్క! రక్కసుం
డిక్కడికి నెక్కడనుండి వచ్చెనో యనిన శాంతియుం జెలికత్తె వెఱపు
దెలుపుచుం దల యెత్తి చూచి గళన్మలపంకపిచ్చిలబీభత్సదేహంబున దొన
దొన ముసురునీఁగలం జేతినెమలిపురికుంచెం గొని చోపుకొనుచుం గేశో
ల్లుంభనంబునం బురపురమను బోడితల నిమురుకొనుచు దిసమొలయుం
దానును జూడ నిస్సిస్సియై వచ్చువీఁడు పిశాచంబు గాని రక్కసుండు
గాఁడనినం గరుణ యిట్టిపట్టపగలు పిశాచంబు లెట్టు పొడకట్టవచ్చునే
యిప్పుడు నరకకూపంబు వెలువడి వచ్చుమహానరకస్థుండు కాఁబోలుఁ
గాక యని శాంతి చింతించి యౌ నెఱింగితి నెఱిఁగితి వీడు మహామోహు
పంపునం జనుదెంచు జైనదిగంబరసిద్ధాంతుండు వీనిం జూడఁ గూడదని
పెడమొగంబై నడచినం గరుణ నెచ్చెలీ! నిలునిలు మిచ్చట శ్రద్ధం బరి
కింత మనుచు వారలిద్దరు నిలిచి రప్పు డాదిగంబరసిద్ధాంతుం డప్పటికి
“నమోర్హతే” “నమోర్హతే" యనుచు శ్రావకులం బేర్కొని.

12


క.

తొమ్మిదిగవనులు గల్గు పు
రమ్మున సతతంబు నాత్మ భ్రాజిలుచుండున్
నెదిలో నిది యెఱిఁగినఁ
గ్రమ్మన సిద్ధించు సౌఖ్యకైవల్యంబుల్.

13


క.

మలమయపుంగల పిండము
కలజలధుల నీళ్ళునెల్లఁ గడిగినఁ దా ని
ర్మల మగునే యాత్మ సదా
మలరహితము ఋషులసేవ మఱవకుఁ డెపుడున్.

14

క.

వినుఁడు! ఋషిసేవ దవులం
గని మ్రొక్కఁగ వలయు వారు కాంక్షించిన భో
జన మిడవలె వారలు దమ
వనితల రమియింప నీర్ష్య వలువదు చేయన్.

15


క.

అని పలికి శ్రద్ధఁ దలచినఁ
జనుదెంచెను శ్రద్ధ వానిజాడను దోడై
దినమును నెప్పుడు శ్రావక
జనముల వెంబడిన నీవు చరియింపు మనన్.

16


ఉ.

స్వామి! మహాప్రసాదమని శ్రద్ధయు శ్రావకసంగమంబునన్
బ్రేమ వహింప శాంతిగని భీతిలి యక్కట! యిట్టులయ్యె ని
చ్చో మముఁ గన్నతల్లి యని సొమ్మసిలం గరుణావధూటి నీ
వేమిటి కింత చింతిలెదవే యిది "తామసి" యంచుఁ దెల్పినన్.

17


జౌ నానెచ్చెలి నామదిఁ
బొనఁగొనెడు దురాశకతనఁ బేరొకటైనా
వీనులు సోఁకె నమంగళ
దీనికి మాతల్లిసవతు దిటచెడి పడితిన్.

18


గీ.

అది యటుండనిమ్ము మదిలోన మనికితం
బించుకయును మాసె నిపుడు మనము
బౌద్ధమందిరముల శ్రద్దఁ జూతమటంచుఁ
గరుణ శాంతిఁ గూడి తిరుగునపుడు.

19


పొడవును బోడియునై యిల
నడతాడిం బోలి కరమునం బుస్తకపుం
దడక ధరియించి కటిఁ జిం
పుడువల్కము దూల బుద్ధముని శిష్యునితోన్.

20


వ.

మున్ను మహానుభావుండు సుగతుం డానతిచ్చిన వాగమృతంబులు పుస్త
కంబు విప్పిచెప్పెద వినుండు పదార్థంబులన్నియు నిరాత్మకంబులు

ప్రతిక్షణక్షయశీలంబులు లోపల సత్తును వెలుపల నసత్తును నగుధీపరంపరల
వలన నీభావంబులు తోఁచుచుండు. నిట్టిధీపరంపరయు వాసనారహితంబు
గావున విషయానుభవదోషంబులు లేవు. భోగమోక్షంబులు గలయది
సౌగతధర్మంబు తక్కినధర్మంబులఁబోలె వనవాసంబుల బ్రహ్మచర్యాది
ప్రయాసంబులఁ గుందక మనోహరమందిరంబుల వసియింపుచు, మృదుల
శయనంబుల శయనింపుచు, నచ్చపువెన్నెలరేలు వృథపుచ్చక నిచ్చలు
నిచ్చకు వచ్చుమెచ్చుల కొమరుముచ్చెకంటులఁ బచ్చవిల్తులీలం దేలింపుచు
సుఖియింపవచ్పు; ముక్తియుఁ బడయవచ్చు. సర్వసంస్కారంబులు క్షణి
కంబులు నాత్మ యస్థిరంబు గావున భిక్షుకులు తమదారల నాక్రమించిన
నుపాసకులకు నీసడింపరాదు చిత్తమలం బగునీర్ష్య కొఱగాదు లోపల
సుగతియు దుర్గతియు నాకు నిప్పుడు దివ్యదృష్టిఁ గానిపించి యున్నయవి
యని పల్కి బౌద్ధశ్రద్ధ నాకర్షించి భిక్షకుల నుపాసకుల నాలింగనంబు
చేయు మనిన మహాప్రసాదం బనుచు నది యట్లు గావించిన శాంతి విలోకించి
కరుణా! యిదియు నల్లప్పటి దిగంబరసిద్ధాంతశ్రద్ధం బోలిన తామసియ
సుమీ యని భయంబు దెల్పనవసరంబున జైనసిద్ధాంతుడు బౌద్ధసిద్ధాంతుం
గనుంగొని పేర్కొని యిట్లనియె.

21


మత్తకోకిల.

ఓరిభిక్షుక! చెప్పురా నిను నొక్క శాస్త్రరహస్య మే
జేరి వేఁడెదనన్న బౌద్ధుఁడు చిఱ్ఱుముఱ్ఱు మటంచు నో
రోరి జైనపిశాచ నగ్నుఁడ యోరి దుర్మలభాండ నీ
కూర కేటికి శాస్త్రగర్వము లోరి కాఱులు మానరా.

22


క.

అని కోపించిన బౌద్ధుని
గనుఁగొని జైనుండు శాస్త్రకథ యడిగిన నీ
కినుకేల యెఱిఁగితేనియు
నొనరఁగ నావాక్యమునకు నుత్తర మీరా.

23


ఆ.

క్షణవినాశి వౌదుగద నీవు మరి నీకు
నిట్టివ్రతము లెల్లఁ బట్టనేల

రెండింటికిని జెడిన రేవఁడవై వృథా
బోడవైతి వెందుఁ గూడవైతి.

24

బౌద్ధమతము

సీ.

అనవుడు సౌగతుం డాజైనుఁ గనుఁగొని
                          యస్మదీయుం డెవ్వఁడైన నొకఁడు
క్షణికవిజ్ఞానవాసన గట్టి యగువాఁడు
                          ముక్తుఁడౌ నన నోరి మూర్ఖబుద్ద
మంచి దొకానొకమన్వంతరమున మీ
                          వాఁడొక్కరుఁడు మోక్షవంతుఁడైన
నెఱయ బౌద్ధుండైన నిజమౌనె నీకథ
                          నీకు నీధర్మంబు నేర్పినట్టి


గీ.

యొజ్జ యెవ్వఁడురా యన నోరి జైన!
వినుము సర్వజ్ఞుఁ డగుబుద్ధమునివరుండు
మాకు నానతి యిచ్చె నీమతరహస్య
మనిన బుద్ధుఁడు సర్వజ్ఞుఁ డగుట యెట్లు?

25


క.

క్షపణక! చెప్పెద వినురా
యపగతసంశయ మగుం దదాగమమే బు
ద్ధపతికి సర్వజ్ఞత్వం
బపరిమిత మటంచుఁ దెలుపు నన జైనుండున్.

26


గీ.

అవుర! యాతని యఱపులె యతనిమహిమఁ
దెలిపెనే నేను సర్వంబుఁ దెలిసినాఁడ
నాకు ముయ్యేడుతరములనాటనుండి
లెంక వీ వన బౌద్ధుఁ డహంకరించి.

27


ఉ.

పంచమలానులిప్తజినభండ! మహీనరకస్వరూప! న
న్నెంచక నీకు లెంక నని యేటికిఁ బ్రేలెద వన్న జైనుఁడున్

గొంచక యోరి సౌగతుఁడ! కోయిలతొత్తులమారికాన మా
మంచిమతంబుఁ గైకొనుము మానుము నీమత మన్న బౌద్ధుఁడున్.

28


సీ.

ఏమిరా! తాఁ జెడ్డకోమటి వెనకయ్య
                          చేతికి వెసల యిచ్చినవిధమున
మమ్ము మీమతముఁ గైకొమ్మని చెప్పెదు
                          ప్రాణికి మీమతం బర్హ మగునె?
స్వర్గవైభవము విసర్జించి యెవ్వఁడు
                          జనదూష్య మైన పైశాచవృత్తి
నీవలెఁ దాల్చురా నిర్భాగ్య! యన నోరి
                          సౌగత! నక్షత్రచంద్రభాస్క


గీ.

రోపరాగాదికథనమే చూపి చెప్పె
జనుల కర్హత సర్వజ్ఞ మనిన జైన
యెపుడుఁ గల్గినగ్రహచార మెఱుఁగుటయు మ
హత్వమని కష్టమతవృత్తి వైతి వకట!

29


క.

అంగమితాత్మున కింద్రియ
సంగము లే కెట్లు తెలియు సర్వజ్ఞానం
బుం గడపలోనిదివ్వె వె
లుంగుచుఁ దెలుపునే గృహంబులోని ఘటములన్.

30


గీ.

కాన లోకద్వయవిరుద్ధమైన జైన
మతముకంటెను మాబౌద్ధమతమె లెస్స
యనుచు వారలు వాదించునవసరమున
నచట కేతెంచె సోమసిద్ధాంతుఁ డొకడు.

31

కాపాలికమతము

సీ.

పుట్టింప రక్షింపఁ బొలియింపఁ గర్తయౌ
                          భైరవేశ్వరుఁడు మాపాలివేల్పు

ప్రమదనటద్భూతభయదశ్మశానశృం
                          గాటకంబులు మాకు నాటపట్లు
నక్షత్రపటలీవళక్షంబు లైన న
                          రాస్థిఖండములు మాహారతతులు
నీహారకరబింబనిభమానవశిరఃక
                          పాలముల్ మాభుక్తిభాజనములు


గీ.

గాఁ జరింతుము తమలో జగంబు లెల్ల
వేరు వేరైన శివునితో వేరుగా వ
టంచుఁ జూతుము సిద్ధయోగాంజనప్ర
దీపితం బై నసుజ్ఞానదివ్యదృష్టి.

32


క.

అని పలికెడు కాపాలికుఁ
గనుఁగొని క్షపణకుఁడు పలిఁకె గాపాలికుఁడా!
వినవలయును నీసౌఖ్యం
బును మోక్షము మతరహస్యమును జెప్పు మనన్.

33


శా.

శస్తబ్రహ్మకపాలపాత్రసుర యాస్వాదింపుచున్ వహ్నిలో
మస్తిష్కాకవసాభిపూరితమహామాంసంబులన్ వేల్చుచున్
హస్తోద్యత్కరవాలఖండితమనుష్యశ్రేష్ఠకంఠోపకం
ఠాస్తోకక్షతజోపహారబలిచే నర్చింతు నే భైరవున్.

34


గీ.

అనెడిమాట విని భయంబున బౌద్ధుండు
చెవులు మూసికొనియె జినుఁడు నప్పు
డహహ! జోగి యెవ్వఁ డర్హంత యర్హంత
మోస పుచ్చె నీయభాసు ననిన.

35


క.

కాపాలికుఁ డనుమాటకుఁ
గోపించుచు జైన! నరకకూపమ! పాషం
డా! పశువ! బోడి! చండా
లా! పరమేశ్వరుని దప్ప నాడఁగఁ జనునే.

36

క.

పదునాలుగుభువనంబులు
నదనం బుట్టించు నిల్పు నడఁపి నుపనిష
ద్విదితప్రభవుఁడు కాశీ
హృదయేశ్వరుఁ డతనిమహిమ యిదె చూపుదునా.

37


సీ.

హరిహరబ్రహ్మల నాకర్షణము చేసి
                          పాత్ర లాడింతుఁ జప్పట్లు కొట్టి
గగనస్థలభ్రమద్గ్రహచంద్రసూర్యుల
                          హా! పోకు మంచు బిట్టాన పెట్టి
యీజగజ్జాలంబు నేకోదకము చేసి
                          చెల్లఁ గ్రోలుదుఁ బుడిసిళ్ళఁ బట్టి
బ్రహ్మాండ మనుచిప్పఁ బ్రాణికందుకముల
                          నాలి యాడుదు నొంటివ్రేలఁ బట్టి


గీ.

యనుచుఁ గాపాలికుఁడు పల్క విని జినుండు
మేలురా నీకు నేయింద్రజాలికుండు
నేర్పె నీమాయ లన నోరిరినీచుకాన!
యైంద్రజాలికుఁ డంటివె హరుని ననుచు.

38


ఉ.

జొత్తిలునేత్రకోణములఁ జూచుచు నోరి దురాత్మ! కత్తి నీ
కుత్తుకఁ గోసి బుద్భుదవిఘూర్ణితఫేనిలమైన నెత్తుటన్
బుత్తి మొనర్తు దుర్గకుఁ బ్రభూతడమడ్డమరూరుఢాంక్రియో
ద్యత్తనురోమహర్షనటనారభటీపటుభూతవర్గకున్.

39


వ.

అనుచు రౌద్రరసాభిలం బగు కరవాలంబు నొఱ వెడలఁ దివిచి కవిసినఁ
గాపాలికుం జూబి బెగడి గడగడ వడంకుచు నోయి మహానుభావ!
"యహింసా పరమో ధర్మ" యనుచు నాక్షపణకుండు భిక్షునకు మఱుంగు
చొచ్చిన భిక్షకుండు "నహింసా పరమో ధర్మ" యని కాపాలికుం బేర్కొని
యోయి! మహాత్మా! వినోదప్రవృత్తం బైనవాగ్వాదంబునకు నీదిగంబరుని
మీఁద నింత తెగం బని లేదని ప్రియంబు చెప్పినఁ గాపాలికుండు పట్టెం

బొఱలోపలఁ బెట్టిన జైనుండును గొంత గుండెపట్టుకొని యోయి సోమ
సిద్ధాంతా! శాంతుండవై భవదీయదర్శనంబున భోగమోక్షంబులు
గలతెఱఁ గెఱింగింపు మనిన.

40


సీ.

విషయానుషక్తితో విరహితం బైనట్టి
                          సుఖ మించుకైనను జూడ మేందు
నానందభోగవిహీనోపలావస్థ
                          యైన ముక్తికి నేల యాస పడఁగఁ
బార్వతీవనితఁగా భావన చేసి చ
                          క్కనిచకోరేక్షణఁ గౌఁగిలించి
తన్ను సదాశివాత్మకునిగా భావించి
                          క్రీడించు నతఁ డిందుచూడమూర్తి


గీ.

యగుచు విలసిల్లు నని శివుం డానతిచ్చె
ననెడు కాపాలికునిమాట లాలకించి
శాంతి యిట్లనుఁ గరుణతో సకలవేద
గురుఁడె హరుఁ డిట్లు చెప్పునే ఘోరమతము.

41


క.

అపు డాసిద్ధుని భిక్షు
క్షపణకు లిట్లనిరి దేహసహితునకును రా
గపరిమితాత్మునకును మో
క్షపదము గల దనుట విన నసంగత మనినన్.

42


క.

కాపాలికుండు తనలో
నీపాపాత్మకుల కఠినహృదయము లశ్ర
ద్ధాపంకిలము లని పిలిచిఁ
గాపాలిక శ్రద్ధ నదియు గ్రక్కున నెదుటన్.

43


చ.

విరిసిననల్లగల్వలకు విందు లనన్ దనలోచనంబులున్
నరధవళాస్థిహారకలనం గడు నొప్పెడుగుబ్బచన్నులున్

గురుకటిభారమంధరమనోహరయానము నిండుచంద్రుతో
సరియగునెమ్మొగంబుఁ గల చక్కఁదనంబున వచ్చి నిల్చినన్.

44


ఆ.

కరుణ శాంతిఁ జూచి కంటివె రాజస
శ్రద్ధ ననుచుఁ బల్కె సిద్ధుఁ డపుడు
మానినీవృధాభిమాని బౌద్ధునిఁ గౌఁగి
లించు మనినఁ గౌఁగిలించె నదియు.

45


క.

జవరాలగు కాపాలిని
కవుఁగిట దనమేను గజరుగజరులు వోఁగా
నవిరళసుఖమున హృదయం
బివతాళింపంగ బౌద్ధుఁ డిట్లని తలఁచెన్.

46


క.

వెనుకను నెందర రండల
ఘనకఠినస్తనుల రతులఁ గౌఁగిటఁ జేర్పన్
గన నెన్నడు నీకాపా
లినికౌఁగిటిసుఖములోనిలేశం బయినన్.

47


శా.

ఈకాపాలికధర్మనంబునకు లేదీ డెందు నూహింపఁగా
నీకున్ శిష్యుఁడనైతి బౌద్ధమతము న్నేఁడాదిగా మానితిన్
నాకున్ శాంభవదీక్ష యిచ్చి కడుధన్యత్వంబు నొందించు మం
చాకాపాలికుమ్రోల సౌగతుఁడు సాష్టాంగంబుగా మ్రొక్కినన్.

48


ఆ.

క్షపణకుండు చూచి సౌగత యీజోగు
రాలిఁ గూడి తంటరాకు మన్న
బాపజాతిజైనపాషండ! నిర్భాగ్య
యీసుఖంబు దయ్య మీదు నీకు.

49


క.

సిద్దుం డప్పుడు నైజ
శ్రద్ధంగని బౌద్ధుచాటు చాలించి వృధా
బద్ధము లఱచెడి జైనుని
సిద్ధాంతము వీడుకోలు చేయు మటన్నన్.

50

వ.

అదియు మహాప్రసాదంబని మురిపంపునడకల జైనుడగ్గఱంజని కలకల
నవ్వుచుఁ గలికిచూపుమెఱుంగుల ధైర్యతిమిరంబు విరియించి కాంచన
చషకధగద్ధగాయమానదోర్మూలరోచులవీచులు వెల్లివిరియ ఘల్లుఘల్లున
గంకణఁబులు మొరయ హస్తమస్తకసంయోగంబు చేసి వదనమదిరామో
దంబునం దదీయదుర్వాసన వీసరపుచ్చం గర్ణంబునం బిసపిస నసమశర
మంత్రంబు చెప్పి గొప్పచనుగుబ్బలు ఱొమ్మున గాడిపాఱ బిగియఁ గౌఁగి
లించిన వాఁడు నంచనంచలై రోమాంచంబు ముంచుకొన నంతఃకరణంబు
గిలిగింతలు వోవ "నర్హంత" “యర్హంత" యనుచు నంతకంతకు
నింద్రియవికారంబు బలవంతంబై సంధిల్ల నల్లల్ల నెమలిపించియంబునం
గప్పుకొనుచు నొప్పులకుప్పయగు నప్పడంతిఁ బేర్కొని నాకోర్కిసఫలం
బుగాఁ బునఃపునరాలింగనంబు గావింపుము శ్రావకీజనంబులు నీకాలి
గోరునం బోరు నీదర్శనంబుగదా సౌఖ్యమోక్షసాధనం బని పలికి కాపా
లికుం గనుంగొని యోకాపాలికచర్యా! నాకు మహాభైరవమతం బుపదే
శింపు మనిన సిద్ధుండు బౌద్ధక్షపణకులం గూర్చుండఁబెట్టుకొని కరతలం
బున నున్న కపాలభాజనంబుఁ దప్పకచూచి బైరవధ్యాననిమీలితనేత్రుం
డైనమాత్రంబునఁ దత్పాతంబు మదిరారసంబున నిండినఁ దా గొంత
యాస్వాదించి శేషంబు బిక్షుక్షపణకుల కిచ్చుచు.

51


క.

ఇది పశుపాశచ్చేదక
మిది భవరోగౌషధం బమృత మిది పూతం
బిదిగొని కృతార్ధు లగుఁ డన
నది గ్రక్కునఁ గానక వార లనుమానముతోన్.

52


గీ.

అర్హదనుశాసనమున కనర్హమైన
కల్లు త్రాగుట కాదని క్షపణకుండు
జోగియెంగిలి రోఁతని సౌగతుండు
మొగమొగంబులు చూడ సిద్ధగురువరుఁడు.

53


చ.

శ్రద్ధా! చూడు పశుత్వదోషమున నీజైనుండు బౌద్ధుండు న
శ్రద్ధన్ ద్వన్ముఖపీతశేషసుర యాస్వాదింప రీవీసురన్

శుద్ధింబొందగఁ జేయు మన్న నదియున్
శోణప్రవాళాధరో
ద్యద్ధారాళసుధాపవిత్రితము తత్పాత్రాసవం బిచ్చినన్.

54


ఆ.

"స్త్రీముఖం సదాశుచి" యటంచు బౌద్ధుండు
తత్ప్రసాదమధువు త్రాగి చొక్కె
దర్శనములలోనఁ దలపఁ గాపాలిక
దర్శనంబు సుఖనిదర్శనముగ.

55


చ.

ఇటకిత మెన్నితోయముల నిందుముఖీముఖశేషమద్యమున్
గుటుకునఁ గ్రోల నీకుటిలకుంతల యెంగిటిమాధ్విఁ గల్గు వి
స్ఫుటమధురత్వవాసనలు చూడరుగాక దివౌకసుల్ సుధా
ఘుటికలలోనిమేలు మఱి కోరుదురే యిది క్రోలగల్గినన్.

56


సీ.

జైనుఁ డీగతి మెచ్చుసౌగతుఁ బేర్కొని
                          యోరీకాపాలి నీచారువదన
శేషమద్యము నీవ చెల్లఁగ్రోలక నాకు
                          నించు కిమ్మనవుడు నియ్య గ్రోలి
క్షపణకుఁ డాహా! సుగంధ మహాచవి
                          యాహా! చలువయంచు నభినుతింప
నింతకాలముదాఁక నే వెఱ్ఱినై యిట్టి
                          యాసవం బానక మోసపోతిఁ


గీ.

గట్టిపెట్టితి నర్హంత కష్టమతము
తిరుగుచున్నవి యివియ సూదిక్కులెల్ల
ననుచు శయనింప బుద్ధుండు నట్ల చేసె
సోలువారలఁ జూచి కాపాలికుండు.

57


క.

కలిగిరి పోయిదె మనకు నల
వెఅఁబెట్టని భృత్యు లనుచు వెలదియుఁ దానున్
గలకల నవ్వుచు నాట్యము
సలిపిరి కరడమరుతాళసహితము గాఁగన్.

58

క.

ఆడెడువారలఁ గనుఁగొని
బోడలు ప్రమదమున లేచి పోరిఁ గలపాటల్
పాడుచుఁ గాపాలికుఁ గొని
యాడుచుఁ గడు సోలిసోలి యాడెడువేళన్.

59


తపతపలాడుచుఁ బాడెడు
క్షపణకునిం జూచి బgద్ధసంయమి సిద్ధా
ధిప మధురసపానం బీ
చపలునికిం గ్రొత్తచేసి సంకటపఱిచెన్.

60


క.

అనవుడు సిద్ధుం డాజై
నునకుం దనతమ్మయిడిన నూల్కొని తెలివిన్
వినుతించెను గాపాలం
బునకున్ సరియైనమతము భువి లే దనుచున్.

61


గీ.

ప్రమదమున సౌగతుండు కాపాలిఁ జూచి
యప్రయాసంబునన కల్గు నభిమతము మ
హార్ధసిద్ధులు మోక్షంబు హస్తగతము
లీమతంబును బోలునె యేమతములు.

62


సీ.

అనవుడు సోమసిద్ధాంతుండు జైన బౌ
                          ద్ధులఁ జూచి యిది యెంతదొడ్డు మాకు
విషయసుఖంబుల విడువకుండిన మహా
                          సిద్ధు లెనిమిదియుఁ జేరు మాకు
గైవల్యపదము మాకాణాచి త్రైలోక్య
                          వశ్యవయస్తంభవాదమోహ
నాకర్షణోచ్చాటనాదిప్రాకృతమంత్ర
                          సిద్ధిలాభము యోగసిద్ధివిఘ్న


గీ.

కారి గావున గణనంబు గాదు మాకు
ననిన జైనుండు మంత్రవిద్యాబలమున

మద్య మాకర్షణము చేయుమాడ్కి సతులఁ
బరగ రప్పింప వచ్చునా గురువ! యనిన.

63


క.

గరుడోరగవిద్యాధర
సురకిన్నరయక్షరాక్షసులయంతిపురం
బురమణులనైన రప్పిం
తు రయంబున మఱియు నాపుదును దొంటియెడన్.

64


వ.

అప్పుడు క్షపణకుండు బిక్షుకునిం గాపాలికుని న్వీక్షించి యీక్షణంబు
గణితమార్గంబున నెఱింగితిని మన మిందరము మహామోహుపంపుబడి
సత్వాత్మసంభవయగు సాత్వికశ్రద్ధం జెఱపట్టుకొనిపోవం జనుదెంచినారము
వచ్చి యిచ్చట నెచ్చరిక దప్పి విచ్చలవిడి నుండుట కాదు గావునఁ
గార్యంబు విచారింపవలయు ననినఁ గాపాలికుండు దిగంబరా! యవ్వ
రాళిం బరామర్శింపుము చరాచరంబుల నెక్కడ నుండినం గ్రక్కున
మంత్రవిద్యచేతఁ బట్టి తెచ్చెద నన్న క్షపణకుండు బలపంబున గుణి
యించి చూచి కాపాలికునిం గనుగొని.

65


క.

లేదు జలంబుల వనముల
లేదు మహాపర్వతముల లే దరయంగా
నాదేవి విష్ణుభక్తికృ
తాదరయై డాఁగినది మహాత్ములమదిలోన్.

66


ఆ.

మరియుఁ గంటి నొక్కమర్మంబు ధర్ముండు
కాముఁ బాసిపోయి దీమసమున
సత్వపుత్రియైన శ్రద్ధాదురాత్మిక
యున్నచోటఁ దాను నున్నవాఁడు.

67


మ.

అనినన్ గాఢవిషాదభిన్నహృదయుండై సోమసిద్ధాంతుఁ డి
ట్లను మున్నేహరిభక్తికారణము నిత్యానందసంసిద్ధికిన్
వెనుకన్ ధర్ముఁడు శ్రద్ధయుం గలిసినన్ వేగంబె యుబ్బున్ వివే
కునకున్ వాంఛితసిద్ధి యెత్తుపడుఁ గోర్కుల్ మోహభూభర్తకున్.

68

క.

ఐనను బతికార్యము తమ
ప్రాణము వెచ్చించియైన భటునకుఁ జేయం
గా నగు ధర్మశ్రద్ధలఁ
దే నంపెద నాదుమంత్రదేవత ననినన్.

69


గీ.

శాంతి యప్పుడు తమతల్లి శ్రద్ధయన్న
యీగ డెఱిఁగినవేడ్కయు జోగి సేయు
కపటముననైన భీతియుఁ గడలుకొనఁగఁ
గరుణయును దాను హరిభక్తికడకు నేగి.

70


క.

ధర్మశ్రద్ధలఁ గని యా
మర్మంబంతయును జెప్పుమాత్రంబున జ్యో
తిర్మయనిజతేజోజిత
ధర్మచ్ఛవి సిద్ధమంత్రభైరవి కినుకన్.

71


గీ.

కవిసి ధర్ముని శ్రద్ధను గదియఁబట్టి
యెత్తుకొని యభ్రపథమున కెగయువేళ
నమ్మహాశక్తి భైరవి నంటఁ దఱిమి
వేగ వారల విడిపించె విష్ణుభక్తి.

72


క.

అంతట శ్రద్ధారమణికి
నెంతయుఁ జెలియైనమైత్రి యేతద్వృత్తం
బంతయు విని చింతానల
సంతప్త శ్రద్ధకడకుఁ జనుచో నెదుటన్.

73


క.

పడుచున్ లేచుచుఁ బులిచే
విడివడినకురంగిఁ బోలి విహ్వలురాలై
గడగడ వడఁకుచుఁ దన్నున్
బొడగనియు నెఱుంగలేనిబోటిన్ శ్రద్ధన్.

74

క.

డగ్గఱిలి మైత్రిభామిని
డగ్గుత్తిక యిడుచు నక్కటా ప్రాణసలీ
బెగ్గిలి నన్ను నెఱుంగవు
దిగ్గనె గుండెయని తన్నుఁ దెల్పినపిదపన్.

75


శా

ఏ నింకేమని చెప్పుదున్ జెలి మహాహిక్రూరనిశ్వాసయున్
నానామర్త్యకపాలకుండలియు దంష్ట్రాచంద్రరేఖాంతర
స్థానప్రోల్లలజిహ్వయున్ హుతవహజ్వాలాక్షియున్ ఘోరశై
లానూనాంగియు నైన భైరవి మహాహంకారహుంకారియై.

76


క.

పిడుగువలె వచ్చి నన్నొక
పిడకిట మరి ధర్ము నొక్కపిడికిటఁ గొని తా
నుడువీథి కెగసి మాంసము
నొడిసి వడి న్నెగయు గృధ్రియుం బలె నన్నున్.

77


గీ.

అద్దిరమ్మ యనుచు నామైత్రి మూర్చిల్ల
సేదదేర్చి శ్రద్ధ చెప్పఁదొడఁగె
నపుడు విష్ణుభక్తి యస్మదీయంబైన
యార్తరవము విని దయార్ద్ర యగుచు.

78


క.

భ్రూభంగ భయదఫాలయు
నాభీలకటాక్షవీక్షణారుణమయునై
యాభైరవి నదలింప న
భోభాగము విడిచి యదియు భూమిం ద్రెళ్ళెన్.

79


వ.

ఇటు విష్ణుభక్తిమహాప్రభావంబునఁ గాళరాత్రిదంష్ట్రాకరాళవదనగహ్వ
రంబు వెలువడి నిన్నుఁ జూడంగల్గుట పునర్జన్మం బని శ్రద్ధాసరోజనేత్ర
మైత్రిం గౌఁగిలించి తరువాతివృత్తాంతంబు చెప్పందొడంగె నట్లు నన్నును
ధర్ముని విడిపించి విష్ణుభక్తిమహాదేవి మోహుకృత్యంబున కత్యంత
కుపితచిత్త యై యద్దిరా యిద్దురాత్ముండు గద్దఱితనంబున నన్నుం గైకొనక
తిరుగుచున్నవాఁడు వీని నిర్మూలంబు గావింతునని ప్రతిజ్ఞ పలికి నన్నుం

జూచి శ్రద్ధా! నీవు రాఢాదేశంబున భాగీరథీసమీపంబునఁ జంద్రతీర్ధంబున
మీమాంసానుగతయైన మతిసతి కతన నెట్టకేలకుఁ బ్రాణంబులు పట్టుకొని
యుపనిషత్సంగంబుకొఱకుఁ దపంబు సలుపుచున్నవివేకుని కడకుం జని
యిట్లనుము. కామక్రోధాదుల గెలువ నుద్యోగంబు చేయు మట్లైన వైరా
గ్యుం డేతెంచు. నేనును సమయం బెఱింగి యమనియమప్రాణాయామాదుల
బ్రోదిచేసికొని భవదీయసైన్యసంరంభణంబు చేసెద శాంత్యాదికౌశలంబున
నుపనిషద్దేవీసంగతుండవగు నీకుంబ్రబోధచంద్రుం డుదయించుటకునై
ఋతంభరాదికదేవీసమూహంబునుం గృతసన్నాహయై యున్నయది యని
చెప్పుమని పంపిన నేనును వివేకునికడకుం జనుచున్నదాన. మైత్రీ! నీవింక
నెవ్విధంబున దినములు గడపెద వనిన శ్రద్ధాంగనా! నేనును నా తోడఁ
బుట్టువు లైనముదితాకరుణోపేక్షలం గూడుకొని మహత్ములహృదయంబుల
నుండి వివేకాభ్యుదయంబుకొఱకు గడపెద నమ్మహాత్ములు మమ్మునలువుర
మెలపెడువిధంబు వినుము.

80


క.

నను సఖునెడ నతిదుఃఖప
రునెడఁ గరుణఁ బుణ్యతత్పరునియెడ ముదితన్
జెనఁటియెడ నుపేక్షను దమ
మనమున నిల్పుదురు శాంతమతులు మహాత్ముల్.

81


క.

నలువురమును నీగతి మతి
నిలుచుమహాత్ములకు నాత్మ నిర్మల మగుఁచో
పులు గడిగినట్ల రాగా
దులసంగతిచేత మున్ను దూషిత మైనన్.

82


వ.

కావున మేము నలువురము వివేకాభ్యుదయంబునందైన వ్యాపారంబుననే
వాసరంబులు గడపెదము నీవును వివేకుని కడకుఁ జనుమని శ్రద్ధారమణిని
మైత్రికమలనేత్ర యనిపె ననిపించుకొని చక్రతీర్థంబున నున్న వివేకమహా
రాజు కడకుంజని విష్ణుభక్తి మహాదేవి యానతిచ్చినవిధంబు వినిపించిన.

83

ఉ.

కాశ్యపగోత్రసౌధవరకాంచనకుంభ! రిపుక్షమాధవా
వశ్యపరాక్రమస్ఫురణవైభవనూత్నమహేంద్ర! సంతతా
వశ్యకృపావిశేషపరివర్ధితబాంధవ! ధైర్యమందరా
దిశ్యకరప్రభావజలధీభవదుజ్జ్వలకోశమందిరా.

84


క.

పుణ్యశ్లోకకళామణి
పుణ్యస్థలహృదయకమలభూషితపుణ్యా
గణ్యాంగదదానప్రా
వీణ్యతరణ్యాత్మభవ నవీనాత్మభవా.

85


పృథ్వీవృత్తము.

ప్రధానకులభూషణా! ప్రధితజగన్నిమేషణా!
పృథివ్యమరతోషణా! రిపునృపప్రజాశోషణా!
వధశ్రుతిగవేషణాస్పదమహేశభక్తీషణా!
యథార్ధమితభాషణా! యమితగుణాగ్రభూషణా!

86

గద్యః- ఇది శ్రీమదుమామహేశ్వరవరప్రసాదలబ్ధసారస్వతాభి
నంది నందిసింగయామాత్యపుత్ర మల్లయమనీషి తల్లజమల
యమారుతాభిధాన ఘంటనాగయప్రధానతనయ సిం
గయకవిపుంగవ ప్రణీతంబైన ప్రభోధచంద్రోదయం
బను మహాకావ్యంబునందుఁ దృతీయాశ్వాసము.