ప్రథమస్కంధము - అధ్యాయము 3
అధ్యాయము - 3
సీ. మహదహంకార తన్మాత్ర సంయుక్తుఁడై, చారు షోడశ కళా సహితుఁ డగుచుఁ
బంచ మహాభూత భాసితుండై శుద్ధ, సత్త్వుఁడై సర్వాతిశాయి యగుచుఁ
జరణోరు భుజముఖ శ్రవణాక్షి నాసా శి,రములు నానా సహస్రములు వెలుఁగ
నంబర కేయూర హార కుండల కిరీ,టాదులు పెక్కు వే లమరుచుండఁ
తే.గీ. బురుష రూపంబు ధరియించి పరుఁ డనంతుఁ , డఖిల భువనైక కర్తయై యలఘు గతిని
మానితాపార జలరాశి మధ్యమునను, యోగనిద్రా విలాసియై యొప్పుచుండు. (1-60)
భగవంతుని యేకవింశత్యవతారములు
వ. అది సకలావతారములకు మొదలి గనియైన శ్రీమన్నారాయణదేవుని విరాజమానంబైన దివ్యరూపంబు. దానిం బరమయోగీంద్రులు దర్శించుదురు. అప్పరమేశ్వరు నాభీకమలంబు వలన సృష్టికర్తలలోన శ్రేష్ఠుండైన బ్రహ్మ యుదయించె. అతని యవయవ స్థానంబులయందు లోకవిస్తారంబులు గల్పింపంబడియె. మొదల నద్దేవుండు కౌమారాఖ్య సర్గంబు నాశ్రయించి బ్రాహ్మణుండై దుశ్చరంబైన బ్రహ్మచర్యంబు చరియించె. రెండవ మాఱు జగజ్జననంబు కొఱకు రసాతలగత యైన భూమి నెత్తుచు యజ్ఞేశుండై వరాహదేహంబుఁ దాల్చె. మూడవ తోయంబున నారదుండను దేవఋషియై కర్మనిర్మోచకంబైన వైష్ణవ తంత్రంబు సెప్పె. నాలవ పరి ధర్మభార్యాసర్గమునందు నరనారాయణాభిధానుండై దుష్కరంబైన తపంబు సేసె. పంచమావతారంబునం గపిలుండను సిద్ధేశుండై యాసురి యను బ్రాహ్మణునకుఁ దత్త్వసంఘ నిర్ణయంబు గల సాంఖ్యంబు నుపదేశించె. ఆఱవ శరీరంబున ననసూయాదేవియందు నత్రి మహామునికి (దత్తుండను పేర) గుమారుండై యలర్కునికిఁ బ్రహ్లాద ముఖ్యులకు నాత్మవిద్యఁ దెలిపె. ఏడవ విగ్రహంబున నాకూతియందు రుచికి జన్మించి యజ్ఞుండనఁ బ్రకాశమానుండై యమాది దేవతల తోడం గూడి స్వాయంభువ మన్వంతరంబు రక్షించె. అష్టమ మూర్తిని మేరుదేవియందు నాభికి జన్మించి యురుక్రముండనం బ్రసిద్ధుండై విద్వజ్జనులకుఁ బరమహంస మార్గంబుఁ బ్రకటించె. ఋషుల చేతం గోరంబడి తొమ్మిదవ జన్మంబునఁ బృథు చక్రవర్తియై భూమిని ధేనువుం జేసి సమస్త వస్తువులం బిదికె. చాక్షుష మన్వంతర సంప్లవంబున దశమంబైన మీనావతారంబు నొంది మహీరూపమగు నావ నెక్కించి వైవస్వత మనువు నుద్ధరించె. సముద్ర మథన కాలంబునం బదునొకొండవ మాఱు కమఠాకృతిని మందరాచలంబుం దన పృష్ఠ కర్పరంబున నేర్పరియై నిలిపె. ధన్వంతరి యను పండ్రెండవ తనువున సురాసుర మథ్యమాన క్షీర పాథోధి మధ్యభాగంబున నమృత కలశ హస్తుండై వెడలె. పదమూడవది యైన మోహినీ వేషంబున నసురుల మోహితులం జేసి సురల నమృతాహారులం గావించె. పదునాలుగవది యైన నరసింహ రూపంబునం గనకకశిపుని సంహరించె. పదియేనవది యైన కపట వామనావతారంబున బలినిఁ బద త్రయంబు యాచించి మూఁడు లోకముల నాక్రమించె. పదియాఱవది యైన భార్గవ రామాకృతినిఁ గుపిత భావంబుఁ దాల్చి బ్రాహ్మణ ద్రోహులైన రాజుల నిఱువదియొక మాఱు వధియించి భూమిని క్షత్త్రియ శూన్యంబుఁ గావించె. పదియేడవది యైన వ్యాస గాత్రంబున నల్ప మతులైన పురుషులం గరుణించి వేద వృక్షంబునకు శాఖ లేర్పఱించె. పదునెనిమిదవదైన రామాభిధానంబున దేవ కార్యార్థంబు రాజత్వంబు నొంది సముద్ర నిగ్రహాది పరాక్రమంబు లాచరించె. ఏకోనవింశతి-వింశతి తమంబులైన రామ-కృష్ణావతారంబులచే యదు వంశంబున సంభవించి విశ్వంభరా భరంబు నివారించె. కలియుగాద్యవసరంబున రాక్షస సమ్మోహనంబు కొఱకు కీకట దేశంబున జిన సుతుండై ఏకవింశతి తమంబైన బుద్ధ నామధేయంబునం దేజరిల్లు. యుగ సంధియందు వసుంధరాధీశులు చోరప్రాయులై సంచరింప విష్ణుయశుండను విప్రునికి కల్కి యను పేర నుద్భవింపం గలండని యిట్లనియె. (1-61)
మ. సరసిం బాసిన వేయి కాలువల యోజన్ విష్ణునందైన శ్రీ
కర నానా ప్రకటావతారము లసంఖ్యాతంబు లుర్వీశులున్
సురలున్ బ్రాహ్మణ సంయమీంద్రులు మహర్షుల్ విష్ణు నంశాంశముల్
హరి కృష్ణుండు బలానుజన్ముఁ డెడలే దావిష్ణుఁడౌ నేర్పడన్. (1-62)
కం. భగవంతుండగు విష్ణువు, జగముల కెవ్వేళ రాక్షసవ్యథ గలుగున్
దగ నవ్వేళల దయతో, యుగయుగమునఁ బుట్టి కాఁచు నుద్యల్లీలన్. (1-63)
ఆ.వె. అతిరహస్యమైన హరిజన్మ కథనంబు, మనుజుఁ డెవ్వఁ డేని మాపు రేపుఁ
జాల భక్తి తోడఁ జదివిన సంసార, దు:ఖరాశిఁ బాసి తొలఁగిపోవు. (1-64)
వ. వినుండు. అరూపుండై చిదాత్మకుండై పరఁగు జీవునికిఁ బరమేశ్వరు మాయా గుణంబులైన మహదాది రూపంబుల చేత నాత్మస్థానంబుగా స్థూల శరీరంబు విరచితంబైన గగనంబునందుఁ బవనాశ్రిత మేఘ సమూహంబును, గాలియందుఁ బార్థివ ధూళి ధూసరత్వంబును నే రీతి నట్లు ద్రష్ట యగు నాత్మయందు దృశ్యత్వము బుద్ధిమంతులు కానివారి చేత నారోపింపంబడు. ఈ స్థూలరూపంబున కంటె నదృష్ట గుణంబై యశ్రుతంబైన వస్తువగుటం జేసి వ్యక్తంబు గాక సూక్ష్మంబై కర చరణాదులు లేక జీవునికి నొండొక రూపము విరచితంబై యుండు. సూక్ష్ముండై జీవుని వలన నుత్‌క్రాంతి గమనాగమనంబులం బునర్జన్మంబు దోఁచు. ఎపుడీ స్థూల-సూక్ష్మ రూపంబులు రెండు నవిద్యం జేసి యాత్మకుఁ గల్పింపంబడె ననియెడి హేతువు వలన స్వరూప సమ్యగ్ జ్ఞానంబునఁ బ్రతిషేధింపఁబడు నపుడె జీవుండు బ్రహ్మ యగు. సమ్యగ్ జ్ఞానంబె దర్శనంబు. విశారదుండైన ఈశ్వరునిదై క్రీడించు నవిద్య యనంబడుచున్న మాయ యెప్పుడు విద్యారూపంబునం బరిణత యగు నప్పుడు జీవోపాధి యైన స్థూల-సూక్ష్మ రూపంబు దహించి కాష్ఠంబు లేక తేజరిల్లు వహ్ని చందంబునఁ దాన యుపరత యగు. అపుడు జీవుండు బ్రహ్మస్వరూపుండై పరమానందంబున విరాజమానుండగు. ఇట్లు తత్త్వ జ్ఞానంబు సెప్పుదురని సూతుం డిట్లనియె.(1-65)
చం. జననము లేక కర్మముల జాడలఁ బోక సమస్త చిత్త వ
ర్తనుఁడగు చక్రికిం గవు లుదార పదంబుల జన్మకర్మముల్
వినుతులు సేయుచుండుదురు వేద రహస్యములందు నెందుఁ జూ
చిన మఱి లేవు జీవునికిఁ జెప్పిన కైవడి జన్మకర్మముల్. (1-66)
మ. భువనశ్రేణి నమోఘ లీలుఁ డగుచున్ బుట్టించు రక్షించు నం
త విధిం జేయు మునుంగఁ డందు బహుభూత వ్రాతమం దాత్మ తం
త్ర విహారస్థితుఁడై షడింద్రియ సమస్త ప్రీతియున్ దవ్వులన్
దివిభంగిన్ గొనుఁ జిక్కఁ డింద్రియములన్ ద్రిప్పున్ నిబంధించుచున్. (1-67)
చం. జగదధినాథుఁ డైన హరి సంతత లీలలు నామరూపముల్
దగిలి మనోవచోగతులఁ దార్కికచాతురి యెంత గల్గినన్
మిగిలి కుతర్కవాది తగ మేరలు సేసి యెఱుంగ నేర్చునే ?
యగణిత నర్తనక్రమము నజ్ఞుఁ డెఱింగి నుతింప నోపునే ? (1-68)
ఉ. ఇంచుక మాయ లేక మది నెప్పుడు వాయని భక్తి తోడ వ
ర్తించుచు నెవ్వఁడేని హరిదివ్య పదాంబుజ గంధరాశి సే
వించు నతం డెఱుంగు నరవిందభవాదులకైన దుర్లభో
దంచితమైన యా హరి యుదార మహాద్భుత కర్మమార్గముల్. (1-69)
మ. హరిపాదద్వయభక్తి మీ వలన ని ట్లారూఢమై యుండునే ?
తిరుగంబాఱదు చిత్తవృత్తి హరిపై దీపించి మీ లోపలన్
ధరణీదేవతలార ! మీరలు మహా ధన్యుల్ సమస్తజ్ఞులున్
హరిచింతన్ మిముఁ జెంద వెన్నడును జన్మాంతర్‌వ్యథాయోగముల్. (1-70)
శ్రీమద్ భాగవత రచనాది వృత్తాంతము
సీ. పుణ్యకీర్తనుఁడైన భువనేశు చరితంబు, బ్రహ్మతుల్యంబైన భాగవతము
సకల పురాణరాజముఁ దొల్లి లోకభ్,అద్రముగఁ బుణ్యముగ మోదముగఁ బ్రీతి
భగవంతుఁడగు వ్యాస భట్టారకుఁ డొనర్చి, శుకుఁ డనియెడు తన సుతుని చేతఁ
జదివించె నింతయు సకల వేదేతిహా,సముల లోపల నెల్ల సారమైన
ఆ.వె. యీ పురాణమెల్ల నెలమి నా శుకయోగి, గంగ నడుమ వచ్చి ఘనవిరక్తి
యొదవి మునుల తోడ నుపవిష్టుఁడగు పరీ,క్షిన్నరేంద్రుఁ డడుగఁ జెప్పె వినుఁడు. (1-71)
వ. కృష్ణుండు ధర్మజ్ఞాదుల తోడం దన లోకంబునకుం జనిన పిమ్మటం గలికాల దోషాంధకారంబున నష్టదర్శనులైన జనులకు నిప్పుడీ పురాణంబు కమలబంధుని భంగి నున్నది. నాఁ డందు భూరితేజుండై కీర్తించుచున్న విప్రఋషి వలన నేఁ బఠించిన క్రమంబున నా మదికి గోచరించినంతయ వినిపించెద ననిన సూతునకు మునివరుండైన శౌనకుండిట్లనియె. (1-72)