ప్రజాకవి కాళోజీ

తెలంగాణ వేరైతే


తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?
తెలంగాణ వేరైతే
తెలుగుబాస మరుస్తారా?
తెలంగాణ వేరైతే
కిలోగ్రాము మారుతుందా?
తెలంగాణ వేరైతే
తెలివి తగ్గిపొతుందా?
తెలంగాణ వేరైతే
చెలిమి తుట్టి పడుతుందా?
తెలంగాణ వేరైతే
చెలిమి లెండిపొతాయా?

కులము తగ్గిపొతుందా
బలము సన్నగిలుతుందా
పండించి వరికర్రల
గింజ రాలనంటుందా?
రూపాయికి పైసాలు
నూరు కాకపొతాయా?
కొర్టు అమలు అధికారము
ఐ.పి.సి. మారుతుందా?
పాకాల, లఖ్నవరం
పారుదలలు ఆగుతాయా?
గండిపేటకేమైనా
గండితుటు పడుతుందా?
ప్రాజెక్టులు కట్టుకున్న
నీరు ఆగనంటుందా?
పొచంపాడు వెలసి కూడ
పొలము లెండిపొతాయా?
తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?
–కాళోజీ
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
తెలంగాణ ‘యాస’ నెపుడు యీసడించు
తెలంగాణ ‘యాస’ నెపుడు
యీసడించు భాషీయుల
‘సుహృద్భావన’ ఎంతని
వర్ణించుట సిగ్గుచేటు

వాక్యంలో మూడుపాళ్ళు
ఇంగ్లీషు వాడుకుంటు
తెలంగాణీయుల మాటలో
ఉర్దూపదం దొర్లగానే
హిహీ అని ఇగిలించెడి
సమగ్రాంధ్ర వాదులను
ఏమనవలెనో తోచదు.

‘రోడ్డని’ పలికేవారికి
సడకంటె ఎవగింపు
ఆఫీసని అఘొరిస్తూ
కచ్చేరంటే కటువు
సీరియలంటే తెలుగు
సిల్సిల అంటే ఉరుదు
సాల్టు, షుగర్, టిఫిన్ తెనుగు
షర్కర్, నాష్తంట్ కొంప మునుగు

టీ అంటే తేట తెనుగు
చా అంటే ‘తౌరక్యము’
పొయినడంటే చావు
తోలడమంటే పశువు
దొబ్బడమంటే బూతు
కడప అంటే ఊరి పేరు
త్రోవంటె తప్పు తప్పు
దోవంటేనే దారి.
బొక్కంటే ఎముక కాదు
బొక్కంటె పొక్క తెలివి

మందలిస్తె తిట్టినట్లు
చీవాట్లు పెట్టినట్లు
పరామర్శ కానేకాదు
బర్రంటె నవ్వులాట
గేదంటేనే పాలు
పెండంటె కొంప మునుగు
పేడంటేనే ఎరువు

రెండున్నర జిల్లాలదె
దండి భాష తెలుగు
తక్కినోళ్ల నోళ్ల యాస
త్రొక్కి నొక్కి పెట్టు తీర్పు
వహ్వారే! సమగ్రాంధ్ర
వాదుల ఔదార్యమ్ము
ఎంత చెప్పినా తీరదు
స్నేహము సౌహర్ద్రమ్ము

భోయి భీమన్న ఒకడు
తెనుగును రక్షించువాడు
భోయి భీమన్న ఒకడు
బెజవాడ గోపాలుని
సభ్యత నెర్గిన ఆంధ్రుడు
భోయీ భీమన్న ఒకడు
పదారణాల ఆంధ్రుడు
తెనుగు సభ్యత సంస్కృతి
ఆపాద మస్తకంబు
నోరు విప్పితే చాలు
తెనుగు తనము గుబాళించు
కట్టుబొట్టు మాట మంతి
నడక ఉనికి ఒకటేమిటి
ఎగుడు దిగుడు ఊపిరిలో
కొట్టొచ్చే తెనుగు తనము
గోపాల కీర్తనమే జీవిక

పాపము అతనికి
ఉర్డంటే మండి పడెడి
పాటి తెనుగు ఆవేశము
జౌనపదుని లేఖ లేవో
జౌఇన రహిత ప్రాయంబున
వ్రాసినాడు అంతెకాని
తెలివిన పడి, వృద్ధదశలో
కాస్మా పాలిటన్ తనము
శిఖరోహణ అనుకొని
పరిణతి దశ నందు కొనగ
తాపత్రయ పడుచున్నడు

భోయి భీమన్న ఒకడు
తెనుగును రక్షించువాడు
సమైక్యాంధ్రవాది వాడు
భీమశాస్ర్తి అని నాతో
పిలుపించు కొన్నవాడు
జానపదుని లేఖావళి
నాటి సఖుడు భీమన్న
-కాళోజి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
తెలుగు మాట్లాడవు..
తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడవు
 సంకోచపడియెదపు సంగతేమిటిరా
 అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు
 సకిలించు ఆంధ్రుడా! చావవేటి
- కాళోజీ
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
దోపిడి చేసే ప్రాంతేతరులను...

దోపిడి చేసే ప్రాంతేతరులను
దూరం దాకా తన్ని తరుముతం
ప్రాంతం వాడే దోపిడి చేస్తే
ప్రాణంతోనే పాతర వేస్తం
దోస్తుగ ఉండే వారితొ మేమును
దోస్తే చేస్తం - ప్రాణమిస్తం
ఎంతకు అంత అన్న ధోరణితో
చింతమాని బ్రతుకును సాగిస్తం
తెలంగాణమిది - తెలంగాణమిది
తీరానికి దూరాన వున్నది
ముంచే యత్నం చేస్తే తీరం
మునుగును తానే - మునుగును తప్పక
-కాళోజి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ప్రత్యేక తెలంగాణ అంటే

ప్రత్యేక తెలంగాణ అంటే
పక్కలిరగ తన్నేందుకు
ఆ.ప్ర.రా. ప్రభుత్వాన్కి
అధికారము ఎక్కడిది?

ప్రజాస్వామ్య రాజ్యాంగం
పరిపాలన గల దేశము
ప్రజా మతము ప్రకటిస్తె
పట్టి కొట్టి చంపేస్తద?
వేలు లక్షలు ప్రజలు
జేలుకేగ సిద్ధపడితే
ఏర్పట్లు చేయలేక
లాఠీచార్జి పరిపాలన?

కాడెద్దుల ధోరణిలో
కూడని పనియే లేదా?
వినిగి వేసారి జనం
హింసకాండ తలబెడితే
కేంద్రానిది బాధ్యతంత

‘ప్రెస్టేజి’ పేర హింస
ప్రభుత్వాన్కి సబబైతె
ప్రాణిధర్మ హింసకాండ
ప్రజలకు కూడా సబబే
బ్రహ్మన్న చంపు చంపు
ఏ పాటి చంవుతావో
తూటాలు ఎన్నున్నయో
పేల్చుకో, ఆబాలం గోపాలం
చంపు చంపు చంపు అనుచు
బరి రొమ్ములతో బజార్లో
తూటాలను ఎదురుతాన్రు
ఒకటో రెండో వుంచుకో
తుదకు ఆత్మహత్యకైన
అక్కరకొస్తె నీకు, లేకుంటే
ప్రాణాలతో ప్రజల చేతికే
చిక్కితే నీకున్నది కుక్కచావు
తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తా
భరతమాతాకీ జై
తెలంగాణ జిందబాద్.
–కాళోజి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
తినలేక/ తినలేక

ఒకడు కుతికెలదాక
మెక్కినోడు
మరొకడు మింగు మెతుకు
లేనోడు
ఇద్దరికీ గొంతు పెకలదు
ఇద్దరికీ ఊపిరాడదు
ఇద్దరి అవస్థకు
ఒకే కారణం -
తినలేక
–కాళోజి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
'నిర్వాకం'

నమ్ముకొని పెత్తనము ఇస్తే
నమ్మకము పోగొట్టుకొంటివి
కుప్పకావలి ఉండి కట్టలు
తప్పదీస్తివి ముద్దెరేస్తివి
సాటివాడు చేరదీస్తే
నోటినిండా మన్ను గొడ్తివి

పదవి అధికారముల బూని
పదిలముగ తల బోడి జేస్తివి
దాపునకు రానిస్తె చనువుగ
టోపి పెడితివి లాభపడితివి

అన్నవై తమ్ముళ్ల తలలను
నున్న జేస్తివి మురియబడితివి
తొత్తులను చుట్టూర జేర్చుక
పెత్తనాలు చేయబడితివి

‘పొచంపాడు’ పథకము
కూచికూచి చేసేస్తివి
‘దొంగ ముల్కి’ సనదులిచ్చి
దొరతనమ్ము వెలిగిస్తివి

తమ్ములను ఇన్నాళ్లబట్టి
వమ్మజేస్తివి తిన్నగుంటివి
ఎన్నిసార్లు మొత్తుకున్నను
అన్నవయ్యును గమ్మునుంటివి

అన్న అధికారమునకు తగిన
న్యాయబుద్దిని కోలుపోతివి
చిలిపి చేష్టలు చేసి ఇప్పుడు
చిలుక పలుకలు పలుకుచుంటివి
–కాళోజి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
నేను – నా గొడవ

నేనంటే నేడు
నా గొడవంటే నాడు
నిజమో కాదోకల రుజువు
నీవు నేనూ వాడూ
నేనంటె నేటి మనస్థితి వైనం
నెనంటె భరత పౌరుడు
నా గొడవ ఆ పౌరుని స్థితి
నేనంటే ఒక వోటరు
నా గొడవ వోటేసేవాడు
నేనంటే తిరుగుబాటు దారు
నా గొడవ మన తిరుగుబాటు
–కాళోజి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
సాగిపోవుటె బ్రతుకు...

సాగిపోవుటె బ్రతుకు
ఆగిపోవుటె చావు
సాగిపోదలచిన
ఆగరాదిచటెపుడు
ఆగిపోయిన ముందు
సాగనే లేవెపుడు
వేచియుండిన పోను
నోచుకోనే లేవు.

తొలగి తోవెవడిచ్చు
త్రోసుకొని పోవలయు.
బ్రతుకు పోరాటము
పడకు ఆరాటము.

బ్రతకదలచిన పోరు
సుతరాం తప్పదు.
చూపతలచిన జోరు
రేపనుట ఒప్పదు.
-కాళోజి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
లెక్కకు మించిన రెక్కలు ఉన్నా...

లెక్కకు మించిన రెక్కలు ఉన్నా
గులాబి పువ్వొకటేనన్నా
మన దేశం ఒక్కటే అయినా
కులమత భేదాలెన్నో? ఎన్నో?

వికసించిన పువ్వుకు రెక్కలు
విహరించే పక్షికి రెక్కలు
పతిమనిషికి వున్నవి రెక్కలు
రెక్కలు కలిపిన వుండవు చిక్కులు

రెక్కలాడినా డొక్కలు పూడవుకొందరికి
డొక్కలునిండీ రెక్కలాడవు కొందరికి
వికసించిన గులాబిరేకులు
చైతన్యపు సంకేతాలు
ఆటపొంచిన గులాబిముళ్ళు
గురిపెట్టిన తుపాకి గుళ్ళు.
 -కాళోజీ<poem>

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,