ఈ పుట ఆమోదించబడ్డది

22

స్మృతికాలపుస్త్రీలు

అని మన్వాదు లాదేశించుటచేత రజోదర్శనమైనది మొదలు పదునాఱురాత్రులు దాటకుండ వివాహము చేయవలెనని తేలుచున్నది. ఈగ్రంథములో మున్ముందు ఇవ్వబడబోవునట్టి రజస్వలా నియమములను బట్టి మొదటి మూడు దినములలోను వివాహము చేయుటకు వీలుండదు. మిగిలిన పదమూడుదినములలో చేయవలసి యుండును. మఱియు 'వధూవరార్హతలు'అను శీర్షికగల యధ్యాయములలో తెలుపబడనున్న నారదాది ప్రోక్త వరపరీక్షా విధానమును బట్టి చూతుమేని పదునాఱు దినములలో వరుని నిశ్చయించి యాతని కీమెను దానముచేయుట కష్టమని తెలియగలదు. మఱికొంతకాల మాలస్యము కారాదాయన దానికి సామాన్య దోషము చెప్పబడలేదు. భ్రూణహత్యదోషము చెప్పబడినది. కావున నెట్లైనను పదునాఱుదినములలో తప్పక వివాహము చేయవలసి వచ్చుచున్నది. అది సాధ్యము కావలెనన్నచో రజస్వలావయస్సునకు పూర్వమే వరుని నిశ్చయించి యుంచుకొని ఋతుస్నాతయైన పిమ్మట వివాహము జరుపవలెనని నారదుని యభిప్రాయమైనట్లు తేలుచున్నది.

(3) రజస్వలా వివాహమే మంచిదని చెప్పు ధర్మశాస్త్రమొక్కటియు గానరాదు.

(4) కన్యకు వివాహమెనిమిదవయేట చేయుట మంచిదని సంవర్త సంహిత చెప్పుచున్నది.