ఈ పుట ఆమోదించబడ్డది

కలువమొక్క ప్రతిచెరువులోను దొరువులోను బెరుగగలదుగాని తామరమొక్క పెరుగ జాలదు. ఇవి రెండును అందమునకు బ్రసిద్ధి కెక్కినవి. కలువల లోను, దామరల లోను తెలుపు, ఎరుపు, నలుపు భేదములచే మూడు తెగలు గలవు. కలువ కంటే దామరయే యెక్కువ యందముగా నుండును. తామరపువ్వు విష్ణునాభి యందుండి యుత్పత్తియైన దనియు, లక్ష్మికి వాసయోగ్యమయిన గృహమనియు గాధలుండుట చే దాని యందు భక్తియు గలుగుచున్నది. కలువ సాయంత్ర మందును, దామర ప్రాతఃకాలమందును వికసించుననుట కవి సమయముగాని యదార్థము గాదు. కలువ పువ్వు పెక్కు గదులు కలిగిన నొక కాయనే కాచును. తామర వుప్పులో గదులన్నియు విడిపోయి పెక్కు కాయలు కాచును. వీని రెండింటికి నిదియే ముఖ్యభేదము.

ఎఱ్ఱకలువల వువ్వులరేకులు హృదయరోగములను నరముల నీరసము బోగొట్టును. పువ్వులఱేకులు మరగబెట్టి ఱేకులను నీళ్ళను గలిపి, ఒక గుడ్డలో వేసి పిండవలెను. ఈ వచ్చిన ద్రవములో బంచదార వేసి తిరిగి సగమగువరకును మరుగబెట్టవలెను. ఇప్పుడు దానిని మందుగ బుచ్చుకొనవచ్చును.