ఈ పుట ఆమోదించబడ్డది

349

మంచి తుమ్మి ఒకటి రెండడుగులు ఎత్తు పెరుగును. దీని మీద దట్టముగ రోమములు గలవు. ఇది వర్షాకాలములో పుష్పించును. దీనికిని మంచి వాసన గలదు.

పూఅల్లాతుమ్మి పలు చోట్ల పెరుగు చున్నది. దీని ఆకులు దూర దూరముగా నుండును. పువ్వులు తెలుపు, వీని తోడ పూజ చేతురు.

గరుస తుమ్మి పై రెండింతి నుండి కొంచము పుష్ప వైఖరిలో భేదించును.

కొండజాజి కొండల మీద పెరుగును. ఆకులు సన్నము. పువ్వులు గులాబి రంగుగాను మంచి వాసన గాను వుండును.

పచ్చాకు
- కచ్చూరములతో గలిపి నూనెలో వేసి కొను పచ్చాకు మొక్క ఈ కుటుంబము లోనిదే. కాని అంగళ్ళ యందు అమ్ము పచ్చాకు సాధారణము రెండు మూడు జాతుల ఆకులు కలిసి యున్నవి. పచ్చాకు మొక్కలు మన దేశములో అంతగా పెరుగుట లేదు. దీనికి రాగడి నేల గావలయును. చిన్న మొక్కలను దూర దూరముగ గోతులు దీసి పాతి, వానికి ఎండ దుగులనీయ కుండ కాపాడుదురు. అవి పెద్దవైన పిదప వానిని నరికి, పగలు ఎండలో బెట్టుచు రాత్రి మంచు దగులనీయకుండ కప్పుచుందురు.