ఈ పుట ఆమోదించబడ్డది

313

వంగకాయలు మనము తరచుగా ఉపయోగించు కూరలలో నొకటి. అన్య దేశమునుండి కొని తేబడినదగుటచే దీనిని పితృకార్యములందు వండరు. వంగ ఒక్కలు కొన్ని ఋతువులలోనె బాగుగ పెరుగును., కాని వాడుక యెక్కువ గల కూరగాయ అగుట వలన వేసవికాలమందును పెంచు చున్నారు. ఈ కాలపు కాయలు కొంచము కసరుగా వుండును. మెట్ట వంగలోనే పెక్కు రకములున్నవి. కొన్నిటికి ముచ్చిక మీద మొక్కల మీదను ముండ్లుండును. కొన్ని నీలపు రంగుగా నుండును. కొన్ని మెరయుచు పూర్తిగ ఆకు పచ్చగ నుండును. కొన్ని కొంచెము ఎలుపు గలిసి యుండును. కొన్ని చోట్ల వంగ విత్తనములను మళ్ళలో చల్లి చిన్న మొక్కలను తోటలలో నాటుదురు. వీనికి చేప పెంట తెలక పిండి మంచి ఎరువులు. వంగ తోటల వలన లాభము చాలనే రావచ్చును.

నీటి వంగమొక్కలను కొన్ని చోట్లనే పెంచుచున్నారు. దీని కాయలు సన్నముగను, పొడగుగను, నీలపు రంగుగను నుండును. ఈ మొక్కలును మెట్ట వంగ మొక్కలును కూడ, నీరు పోయుచు నున్నచో చాల సంవత్సరములు బ్రతుకును.