ఈ పుట ఆమోదించబడ్డది

259

వాని కండ మెత్త బడుటకై మూడునాలుగు దినములొక కుప్పగా వేయుదురు. అవి నల్లబడి మెత్త బడగనే గింజలను దీసి పదునైదు దినములు కుప్పగా వేసి, ఇంకను నున్న కండను దీసి వేయుటకు , తట్టలలో వేసి కొంత సేపు కాలువలలో వేసి తరువాత ఆర బెట్టి జల్లుదురు.

తొగరు రంగు నూలు బట్టలకే పనికి వచ్చును. పట్టు బట్టలకును మిక్కిలి సన్న బట్టలకును దాని ఉపయోగింపరు. కోరా బట్టలనే దెచ్చి ఆముదము, లేని యడల ఆముదపు గింజల పొడి, చౌడు, కారము నీళ్ళలో గలిపి బట్టల నందులో కొన్ని దినములు నాన వేసెదరు. తరువాత వానిని దీసి కరక్కాయ చెక్క కషాయములోను, పిదప పటిక నీళ్ళలోను నాన బెట్టుదురు. అటు పిమ్మట నీళ్ళను కాక బెట్టుచు మరిగిన పిమ్మట తొగరు వేరు, ముక్కలుగా గోసి ఆనీళ్ళలో వేసి బట్టలను కూడ వేయుదురు. వేళ్ళ బెరుడునే వేసిన యెడల పూర్తిగ నెర్ర రంగు వచ్చును. బెరడుతో మిగిలిన భాగమును గూడ వేసిన యెడల కొంచెము పశుపు దాళువు గూడ వచ్చును. రంగునకు సన్నముగా నున్న వేళ్ళు మంచివి. చెట్టు కొట్టి వేళ్ళు తీయగనే వాని లావు సన్నముల ప్రకారము ఏర్పరచి యుంతురు. రంగ వేసెడు పలు తావులందు పలు భేదములు గలవు. కాని యిప్పుడీ రంగు వేయుటయే మానిరి.