ఈ పుట ఆమోదించబడ్డది

238

ధాతుక చెట్టును పువ్వులు గూడ అందముగా ఉండుటచే తోటలయందు పెంచు చున్నారు. దీని పువ్వులను ఎండబెట్టి యొక రంగు చేసెదరు. ఆకులలో తోలు భాగు చేయు పదార్థము కలదు. కొన్నిచోట్ల ఆకులను వండుకొని తిందురు. ఈ చెట్టు నుండి జిగురు కూడ వచ్చును. దీని కలప పొయిలోకి తప్ప మరెందులకు పనికిరాదు.

చెన్నంగి:- పెద్దచెట్టు. ఇది మన దేశమందటను గలదు. దీని కలప వాసములకు, దూలములకు బండ్లు, నాగళ్ళు మొదలగు వాని నన్నింటికీని బనికివచ్చును. దీని నుండి నారయు వచ్చును. ఒక రకము పట్టు పురుగు కూడ దీని యాకులు తిని బ్రతుక గలదు.

అగంధ్రపాకు మొక్క చిన్నది. ఆకులకు తొడిమలు లేవు. కొన్ని నొప్పులను బోగొట్టుట కీయాకులను గాచి పట్టు వేసెదరు.


గుమ్మడి కుటుంబము.


గుమ్మడి పాదు తోటలలో బెట్టుచున్నారు. లంకలలో నివి విస్తారముగా బెరుగు చున్నవి.

ప్రకాండము:- తీగ. రోమములుగలవు. ఆకుల దగ్గిర మూడు నాలుగు చీలికలుగ నున్న తీగలు గలవు.