ఈ పుట ఆమోదించబడ్డది

ఆకులు:- ఒంటరి చేరిక. ప్రతి యాకు మొదట రెండు తెల్లని ముండ్లుగలవు. మిశ్రమ పత్రములు. పక్ష వైఖరి. మధ్య ఈనె యందు గ్రంధి కోశములు గలవు.

పుష్పమంజరి:- కణుపు సందులనుండి బంతలుగా పుట్టు చున్నవి. చేటికలు గలవు. మనము సాధారణముగా పుష్పమనుకున్నది నిజముగా పుష్ప మంజరి.

పుష్పకోశము:- సంయుక్తము. గొట్టము వలె నుం'డును. 5 దంతములు నీచము.

దళవలయము:- సంయుక్తము, సరాళము. 5 దంతములు గలవు. పుష్ప కోశము నంటి యుండును. పసుపు రంగు.

కింజల్కములు:- అసంఖ్యములు. కాడలు విడివిడిగా నుండును పుష్పకోశాశ్రితము.

అండకోశము:- అండాశయము. ఉచ్చము, 1 గది; కీలము గుండ్రము. కీలాగరము చిన్నది. కాయ ద్వివిదారుణ ఫలము. కొడవలి వలె వంగి యుండును. గింజకు గింజకు మధ్య కాయకు రెండు వైపుల నొక్కులు గలవు.


చిక్కుడు కుటుంబము:- మిగుల పెద్ద కుటుంబములలో నొక్కటి. మన కాహార పదార్థములగు కందులు, పెసలు, మొదలగునవి ఈ కుటుంబములోనివే. ఇందు చిన్న మొక్కలు తీగెలు, పెద్ద చెట్లు కూడ గలవు. ఆకులు మిశ్రమ పత్రములు.