ఈ పుట ఆమోదించబడ్డది

బళ్ళెరము గలదు. సాధారణముగ నండాశయము నందు మూడు గదులుండును. కొన్నిటి కాయలు ఎండు కాయలు, కొన్ని కండ కాయలు.

రేగుచెట్టు:- మన దేశము నందంతటను బెరుగు చున్నది. దీని యాకులకు మూడు పెద్ద ఈనెలు గలవు. అండాశయమున రెండు గదులు మాత్రమున్నవి. ఈ చెట్లలో రెండు మూడు రకములు గలవు. కొన్నిటి పండ్లు పెద్దవిగను, కొన్నిటివి చిన్నవిగను కొన్నింటివి కోలగను నుండును. కోలగ నున్నవే ఎక్కువ రుచిగా నుండు నందురు. ఈ చెట్టు బెరుడును చర్మములు బాగు చేయుటలోను నీలి మందు చేయుటలోను వాడుదురు. పండ్లును ఔషధములలో నుపయోగింతురు. పెద్ద చెట్ల కలపయు బెట్టెలు మొదలగు పని చేయుటకు బాగుండును.

రక్తవల్లి:- (సురలతీగె) చెట్లపై నెగ బ్రాకెడు పెద్ద తీగె. ఆకులు తీగెకు రెండు వైపులనే యుండును. అంచున రంపపు పండ్లు గలవు. పువ్వులు చిన్నవి. ఘాటుగ వాసన గలదు. దీని వేరు బెరడు ఔషధములలో వాడుదురు. కొన్ని జ్వరములకు చర్మ వ్యాధులకు, నీరసమునకు బని చేయును.