ఈ పుట ఆమోదించబడ్డది

కర్ణికార వృక్షము: దీని ఆకులు యొక్క తొడిమ పత్రముతో నంచునందు గలియక, ఆముదము, తామర యాకుల యందట్లు మధ్య గలియుచున్నది.

కోకో చెట్టు: మనము కాఫీ తేయాకు వలె గాచి త్రాగు కోకో ఈ కుటుంబపు చెట్టు యొక్క గింజలనుండి చేయుచున్నారు. కోకో చెట్లను మన దేశములో నాటి పెంఫ జూచిరి గాని విరివిరిగా బెరుగుట లేదు. మలబారు ప్రాంతముల కొన్ని కొండలమీద మాత్ర మీ చెట్లు పెరుగు చున్నవి. వీనిని 15 అడుగుల దూర దూరముగ గింజలు నాటి పెంచెదరు. 4..5 ఏండ్లకు గాపునకు వచ్చి పెక్కేండ్లు ఫలించును. కాయలు 6.....9 అంగుళముల పొడుగుగా నుండును. ఒక్కొక్క కాయలో 40 గింజలుండును. ఈ గింజలను దీసి, పులియబెట్టి పిదప నెండ బెట్టి వేయించెదరు. తరువాత వానిని బొడుము గొట్టి ఆ పొడుములో బంచదారయు కొన్ని సువానస పదార్థములను గలుపుదురు. కోకో పంట విస్తారము బెలిజియము దేశములో గలదు. అచ్చట నుండియే చాల దేశములకు ఎగుమతి యగుచున్నది. కాఫీ, తేయాకు వలె గోకోకు నిద్రబోగొట్టు గుణము లేదు. వాని వలే గాక ఇది బలము నిచ్చు నాహార పదార్థము. కాని దీనిని విశేషముగ వాడినచో మల బద్ధము కలుగుట కూడ కలదు.