ఈ పుట ఆమోదించబడ్డది

109


తేయాకు కషాయము త్రాగనేర్చితిమి. అది సువాసనగను పాలును పంచదారను గలుపుదుము గాన, రుచిగను నుండుట నిజమే. అది అప్పటికి చురుకును బుట్టించి నిద్దుర రాకుండ చేయును.


గుగ్గిలపు కుటుంబము:


గుగ్గిలపు చెట్లు మన దేశములో విరివిగానె పెరుగుచున్నవి.

ఆకులు
- లఘు పత్రములు. ఒంటరి చేరిక. అండాకారముగ నైన నిడివి చౌక పునాకారముగనైన యుండును. సమాంచలము. విషమరేఖ పత్రము. కొన, వాలము గలదు.
పుష్పమంజరి
... కొమ్మలచివరలనుండి గాని, కణుపు సందుల నుండి గాని మధ్యారంభ మంజరులగు రెమ్మగెలలు, పుష్పములు ఉపవృంతములు మిక్కిలి పొట్టివి, పువ్వులు లేత పశుపు రంగు.
పుష్పకోశము
... సంయుక్తము. గొట్టము పొట్టి. తమ్మెలు సన్నము. మొగ్గలో అల్లుకొనియుండును.
దళవలయము
... అసంయుక్తము. 5. కొంచెము బల్లెపునాకారముగ నుండును. మంచి వాసనయే గలదు. వృంతాశ్రితము.
కింజల్కములు
... ఏబది గలవు. పుప్పొడితిత్తులు రెండు గదులు. కింజల్కములు వృంతాశ్రితములు.
అండకోశము
... అండాశయము ఉచ్చము 3 గదులు గలవు. ఒక్కొక్క దాని యందు రెండేసి యండము లున్నవి. కీలము పొట్టి. కీలాగ్రములు మూడు చీలికలు, కాయ ఎండి పగులును.