ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐదవ ప్రకరణము


ఒక వీర పురుషుఁడు

కృష్ణకు నుత్తరమున విశాలమైన యొక మహారణ్యము గలదు. అది గోల్కొండ రాజ్యములో నున్నది. అది నీరంధ్ర తరుప్రకరకల్పిత గాఢాంధకారమై, భయంకరముగఁ దోచు చుండెను. ఎచటఁజూచినను భీకరారణ్య మృగసందోహములే కానవచ్చు చుండెను. అతి భయంకరములగు హర్యకుముల గర్జి తములును,దుర్వార పరాక్రమసమేతములగు శార్దూలముల భీకర నిస్వనంబులును, మత్తకరీంద్ర ప్రకరకృతములగు ఘీంకారము లును గలిసి యీవనము నలంక రించుచుండెను. .. ఇంకను సాయంకాలము కాలేదు. ఆ భీకరారణ్యమున నొక ప్రక్క నొక బాటగలదు. ఆ బాటయంత విశాలమైనదిగాక యిరుకుగా నుండెను. ఆ బాట నొక బాటసారి పోవుచుండెను. అతని మొగ మత్యంత మనోహర మైనది. ప్రఫుల్ల పద్మమైనను సంపూర్ణ శర చ్చంద్రుడై నను. ఆ మొగమునకు సాటి కాదు. ఆ మొగమన్య దుర్లభముగు పరాక్రమ పౌరుషములను దోఁపించుచుండెను. అతని మేను బంగారు కాదు గాని దానికిని బంగారునకును 'నిజ ముగా భేదము లేదు..