ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియారవ ప్రకరణము

197


కడమ వారి కా గారవము లభింపదు. ఇది వారి హృదయముల నా జన్మమును దహించుచుండును. వారు స్వభావసిద్ధముగాఁ బౌరుషనంతులు. అందుచే వారు మఱింత దహింపఁబడు దురు. వారి కట్టియెడ సమయము తటస్థించినచో నేమి సంభ వించును ? రాజ్య విభాగము చేయుట కభిలషించుచుందురు. రాజ్యములోఁ బరస్పర కలహము లంకురించును. అపుడు శత్రు రాజులకు మంచి తరుణము చిక్కును.

చక్రధరుఁడు రాజవంశీకులలో నొకఁడు. అతనికి విజయ నగర సామ్రాజ్యమున వారసత్వము కలదు. కాని రామరాజు దానిని బలముచేతను, బుద్ధి చేతను, ఆక్రమించుకొ నెను. అత డేమి చేయుటకును అవకాశము చిక్కినది కాదు. అతనికి బాల్యమునుండియు రాజ్యకాంక్ష విస్తారము. కాని యతని పక్షము దుర్బలమై పోయెను. అతనికి రాజ్యసంపాదనము చేయుటకుఁ దగినంత సాయము చేయువారెవరు ? అందుచే నతఁడు చక్రవర్తియగు రామరాజిచ్చు భరణముతోఁ దృప్తి వహించుచుఁ గాలము గడుపవలసిన వాఁడాయెను. అతని కది రుచించునా ! తనకు గౌరవము లేదు. రాజ్యము లేదు.రాజ కార్య ప్రసక్తి లేదు. పరిపాలన లేదు. సామంత ప్రభువులు తన్ను సేవింపరు. రాజ్యములోఁ దనమాట నెవరును వినరు. ఇదియంతయు నతనికిఁ గష్టము గానుండెను. అయిన నతఁ డేమి చేయఁగలఁడు !