ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

1913 వ సం|| ఏప్రేలు నెల 26 వ తారీఖున వేసవి సెలవులంగడపుటకై స్వగ్రామమగు నంగలూరునకేగి గ్రంథమేదే నొకఁడు వ్రాయ నిశ్చయించి కథకై హిందూదేశచరిత్రము పఠింపఁదొడఁగితి. విజయనగర సామ్రాజ్యనాశము నాకెంతయు ననుకూలించునని తోఁచుటయు దానిం గైకొంటి. గ్రంథమును విజ్ఞానచంద్రికామండలివారి పోటీపరీక్షకుఁ బంపవలయునని యూహజనించుటయు, అత్యంత త్వరితగతి మేనెల 1-వ తారీఖునఁ బ్రారంభించి 26 వ తారీఖున (అనఁగా 26 దినములలో) ముగించితి. మండలివారి పరీక్షయుఁ బ్రోత్సాహమును లేక యున్న నింతత్వరలో ఈ నవలను రచించి యాంధ్ర పాఠకలోకమున కొసంగఁబూనియుండు వాఁడఁగాను. కాన మండలివారికిం గృతజ్ఞుఁడ.

ఇట్లు స్వల్పకాలములో వ్రాసినదగుటచేతను, సంస్కరణమునకైనఁ దగినయవకాశము లేకుండుటచేతను, ఇందుదొరలినదోషములను లేశమేని దిద్దకయే పరీక్షకులకుఁ బంపవలసిన వాఁడనయితి. దానింజేసి పరీక్షకులకుఁ జాల శ్రమ కల్గించితి. అయినను. బ్రయాసతోవిమర్శించి నవలకువన్నెఁదెచ్చిన పరీక్షకులకు వందనములు.