గ్రంథములు, 5 చరిత్రలు, 4 మహాపురుష జీవితములు, 2 చరిత్రాత్మకమగు నవలలు. సాధ్యమైనంత వరకు ఆ యా శాస్త్రములయందు ప్రవీణతగలవారినే గ్రంథనిర్మాణమున కేర్పరచి యున్నాము. గ్రంథముల ఆకార వైచిత్ర్యములను నానాటికి వృద్ధిచేసితిమి.
మండలి గ్రంథములను చెన్నపురి యూనివర్సిటీవారును, టెక్‌స్ట్‌బుక్కు కమిటీవారును (Text Book Committee) స్కూలుబుక్కు అండు వర్ణాక్యులరు లిటరరీ సొసయిటి (School Book and Vernacular Literary Society) వారూ, లోకలు బోర్డులవారును, ఎడ్యూకేషనల్ డిపార్టుమెంటువారును అభిమానించి యథాశక్తి పోషించియున్నారు. ఏయే పుస్తకము ఎన్ని ప్రతులు, ఎన్ని సారులు ముద్రితమైనదో తెలియపరచు పట్టీని రెండవ అనుబంధములో చేర్చియున్నాము.
బుక్కు డిపో.
1910 సంవత్సర ప్రారంభమున మండలి యొక్క చందాదార్లు 2700 మందియుండి తెలుగు భాషయందలి యితర గ్రంథములు గూడ మండలి పుస్తకములతోపాటు పంపవలసినదని కోరుచు తరుచు వ్రాయుచువచ్చిరి. అందుచే విజ్ఞాన చంద్రికా బుక్కు డిపో అనుపేర నితర పుస్తకముల విక్రయమునకై నొక శాఖనేర్పరుపవలసివచ్చెను. మండలియొక్క ప్రధానోద్దేశములకు భంగముకలుగు నేమోయను భయము చేత ఈ శాఖ నంతగా నభివృద్ధిలోనికి తెచ్చుటకు యత్నింపలేదు. అయినను చందాదారులకును గ్రంథకర్త లనేకుల