పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/77

ఈ పుట ఆమోదించబడ్డది

వేమన కాలమందలి మతధర్మముల స్థితి 71

జేరవు; దృఢకాయులుగా నుందురు; చలి, గాలి, యెండ, వాన, దేనికిఁగాని వెఱవరు; సమాధిలోఁగూర్చున్న గంటలకొలఁది బహిః ప్రపంచజ్ఞానమే లేకయుందురు; తామేదో మహానంద మనుభవించువారైనట్లు కానవచ్చి లౌకికములైన సుఖము నన్నింటిని అసహ్యముతోఁ జూతురు ; నిత్య బ్రహ్మచారులుగా నుందురు; సర్వ సందేహములను గలిగించు నిత్య కర్మములు, విగ్రహపూజలు మొదలగువానిలో పాల్గొనక, తాము బ్రహ్మస్వరూపము నెఱింగినట్లు మాటలాడుదురు ; జాతిభేదాదుల గమనింపరు ; సృష్టిస్థితిలయములను గుఱించి మనకెల్లఁగలుగు సందేహములన్నియు తీర్చుకొన్నవారివలె నుందురు ; ఏదైనను ప్రశ్నించిన మనకర్థము గాకున్నను తమకు సందేహము లేక ప్రత్యుత్తర మిత్తురు ; సామాన్యులకు లేని కొన్ని విచిత్రములగు శక్తులు సిద్ధులు గలవారని ప్రసిద్ధితో నుందురు! ఇట్టివారిని జూచినప్పడు తనకుఁ గల తత్త్వసందేహములను దీర్చుట వీరికి తప్ప తక్కినవారికి సాధ్యముగాదని నమ్మి, ఏమైనను జేసి, యెంత కష్టమైనను పడి, వారివంటి బ్రహ్మజ్ఞానమును తానును నంపాదించి యోగి గావలయునని, ఇదివఱకే యాలుబిడ్డలపై రోఁతగలిగిన వేమన్న నిర్ణయించెను.

           "ఆ. ఇహమున సుఖియింప హేమతారక విద్య
                 పరమున సుఖియింప బ్రహ్మ విద్య
                 కడమ విద్యలెల్ల కల్ల మూఢులల విద్య..." (436)

అని నిర్ణయించుకొని, యుట్టి యోగులలో ముఖ్యుఁడుగా నుండినవాఁడు గాఁబోలును, లంబికానివయోగి నాశ్రయించెను. ఇతని శ్రద్దకు సంతసించి యతఁడును నరహన్య మగు యోగవిద్య నుపదేశించెను. దానిని గూర్చి ముందు మనవి చేయుదును.