పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/55

ఈ పుట ఆమోదించబడ్డది

వేమన సంసార స్థితిగతులు 49

యోగ్యులగు పతులను గన్నవారినిజూచి యిట్లు పేరాసపడెను :

       "ఆ, దనము లేని పేదతండ్రి గర్భంబున
             భాగ్యపరుషు డొకఁడు పరఁగఁ బుట్టి
             బహుళ ధనముఁ గూర్చి భద్రమార్గంబున
             పరుల కుపకరించి ప్రబలు వేమ" (2111)

వేమనకీ కాలమునకు ధనము స్వార్థముకొఱకను భావము నశించినది. జన్మ మెత్తినందులకు గతిలేని వారిని పోషించి యుపకరించుట పరమార్థమని తేల్చు కొన్నాఁడు. తన కాలమందలి స్వతంత్రులగు నిరంకుశప్రభువులు, రెడ్లు, పాళయ గాండ్రు. పరదేశీయులగు మహారాష్ట్రులు మొదలగువారు, ధనము కొఱకై

       "ఆ. పెక్కు జనుల( గొట్టి పేదల వధియించి
             డొక్క కొఱకు నూళ్ళు దొంగిలించి" (2594)

చేసిన యల్లకల్లోలమును చూచినాడు. క్షామడామరముల దాడిని కనుఁగొన్నాఁడు. నిలువ నీడలేక, కడుపునకు కడిలేక ఉన్నచోటు విడిచి యూరూరు దిరుగుచు మల మల మాఁడువారి నెందఱినో యెదుర్కొనినాఁడు. చేతనైనంత వరకు నట్టివారిని రక్షించుట తనధర్మమని తోచినది. అన్నదానమునకు మించిన దానము లేదని తేలినది

      “ఆ. ఆఁకలన్న వాని కస్నంబుఁ బెట్టిన
           హరుని కర్చితముగ నారగించు... " (209)

కనుక పేదల సేవయే పెరుమాళ్ళ సేవ. ఇ(క తనకాలమందలి ధనికులు కేవలము కుక్షింభరులై, లోభులై, పరదుఃఖదుఃఖిత్వము లేక నిర్ధయులై యుండిరి. మఱి కొందఱు, విషయపరాధీనులై దుర్వ్యయముల పాలయియుండిరి. ఇట్టివారిని జూచి

       "ఆ. ఆఁకలి గొని వచ్చెనని పరదేశికి
             పట్టెఁ డన్నమైనఁ బెట్టలేఁడు.
             లంజెదాని కొడుకు లంజల కిచ్చురా..." (210)

అని యసహ్యపడినాఁడు."ధనము వెంటరాదు ధర్మంబు సేయురో.." (2108 )

అని గొంతెత్తి యఱచి, ప్రార్ధించి, తిట్టినాఁడు. కాని వినువారు లేరైరి. వారికిచ్చినట్లు ధనము బ్రహ్మ తనకేల యియ్యఁడని కొఱవపడి

       "ఆ, విత్తమొకరి కిచ్చి వితరణగుణమును
             చిత్తమొకరి కిచ్చి చెఱచినాఁడు.
             బ్రహ్మచేత లన్ని పాడైన చేఁతలు..." (3498)

       "ఆ. ఉదధిలోని నీళ్ళు ఉప్పలుగాఁజేసె
             పసిఁడి గల్గువాని పిసినిజేసె
             బ్రహ్మదేవచేత పదడైన చేతరా.." (ఓ. లై.,13-3-39)

అని యానిర్హేతుకబ్రహ్మ కొక వషట్కారము చేసినాఁడు; కాని తనకెంత బీదఱికమైనను-

       "ఆ. అరయు "నాస్తి యనక యుడ్డు మాటాడక,
             తట్టుపడక, మదిని తన్నుకొనక,
             తనది గాదనుకొని తాఁబెట్టినది పెట్టు..." (156)

అని నిర్ణయించుకొనెను. అందును ఎంతక్షామమైసను ఎంగిలి యన్న మితరులకుఁ బెట్టిన కుక్కలై పట్టుదురని తలఁచినవాఁడు (639). కాని యిందులో నొకకష్టము.