పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/30

ఈ పుట ఆమోదించబడ్డది

24

వేమన

జూపెను. అప్పటి మద్రాసులోని యింగ్లీషుదొరలు ఇతని యద్భుతశక్తికి మెచ్చి చాల గౌరవించిరి. సంచారములో కడపజిల్లా రాజంపేట దగ్గర కోడూరిలో నతనితల్లి అచ్చమ్మయు, కుచ్చెర్లపాడు గ్రామములో భార్య ఆదిలక్ష్మమ్మయు మరణించిరి. ఇరువురికిని అతఁడు కట్టించిన సమాధులిప్పటికి అందుఁ గలవు. తరువాత కటార్ల పల్లెకు మరలివచ్చి వేమనసమాధిలో నజీవముగా పరుండి మూఁత వేయించుకొనెను. నల్లచెరువులోని గుడి తరువాత నతని వంశీయులగు జ్ఞాతుల కలహముచే నేర్పడిన ప్రతిబింబము.

ఈ కథ విన్నప్పడే నా సందేహము బలమయ్యెను. పుల్లారెడ్డి యుని మొదట పేరుండి తరువాత 'వేమన్న"గా ఏల మార్చుకొనవలెను? తల్లి పుస్తకములలోని మల్లమ్మగాక అచ్చమ్మ యయినది. ఇందు ప్రసిద్ధమైన బోగమువాండ్ర మాటయే లేదు.

ఈ సందేహములతోనే కటార్లపల్లెకుఁబోయి విచారింపఁగా నక్కడి ధర్మకర్త యగు చెన్నరాయఁ డనునాయన 'ఆ వేమన్న యీ వేమన్న కాదండీ! వేఱు' అని చెప్పి నా యా శలు నిరాశచేసెను! కారణమేమని యడిగితిని. తమవద్దనున్న తాటాకుల గ్రంథములో నట్లున్నయని చెప్పెను. దానిని తెప్పించి చూడఁగా నది వంగూరు సుబ్బరావుగారికి ఆంధ్ర సాహిత్య పరిషడ్గ్రంధాలయమునఁ గానవచ్చిన ద్విపద వేమనచరిత్రముగా తేలినది. అందలి యీ క్రింది వాక్యములను చెన్నరాయఁ డెత్తిచూపెను. సనకసనందనాది మునులు.

             "ఇతడు శ్రీహరిపుత్రుఁ డితఁడు పావనుఁడు
              మున్ను వేమన పరమ ముఖ్యుడైనాఁడు
              అతఁడె యితఁడని పల్కి ఆశ్చర్యమంది
              మం'త్రాక్షత్రంబుల మహిమచేఁ బట్టి
              వేమనార్యులమీఁద వెదఁ జల్లిరంత...."

ఈ గ్రంథము చాలవఱకందే చూచితిని. ఇది చరిత్రముగాదు. పురాణములలో. పురాణం, చేసినవాఁడు వ్రాసినవాఁడు కల్పించిన చిక్కులు లెక్కలేనన్ని. ఇందు నల్లచెఱువు చెన్నయ్య చెప్పిస యీ లోకపు కథలేమియు లేవు. అక్కడివారి కది పరమపవిత్రగ్రంథము గావున దాని నెరపు తెచ్చుకొని నిదానముగాఁ జూడ వీలులేమిచేతను, ఆంధ్రసాహిత్యపరిషత్తలో నున్నదిగావున తెప్పించుకొనవచ్చును. నమ్మికలేకచేతను నందలి విషయములు కొన్నిమాత్రము గుర్తుచేసికొంటిని --

శ్రీవైకుంఠములో చెన్నకెశవులును, ఆదిలక్ష్మియు వేమన్నను పిలిచి నీవు భూలోకమున నవతరింపమని చెప్పఁగా అట్లే యతఁ డవతరించెను. ఇతని తండ్రి తులగవంశపు కేశవుఁడు. తల్లి లక్ష్మమ్మ (అచ్చమ్మ), కేశవనారాయణలు కూర్మి తమ్ములు. వీరు మార్కాపురము చెన్నకేశవస్వామి భకులు. తరువాత కదిరిదగ్గఱ నుండు రేపల్లెకు వచ్చినట్లు తోఁచును. ఇదే యిప్పడు ప్రాఁతరేపల్లెపట్టణమనియు, పాతర్లపల్లెపట్టణమనియు వ్యవహరింపఁబడుచున్నది. ఈ వేమన యిక్కడనే జన్మించెను. చేమన తత్త్వబోధచేసి కటార్లపల్లెలో నుండెను.

ఇంతకన్న నెక్కువ విషయములు గ్రహింపవీలులేదయ్యెను. గ్రంథము గచ్చపొదవంటిదని మొదలే చెప్పితిని, శ్రీ కొత్తపల్లె సూర్యారావుగారు నా ప్రార్థన ప్రకారము ఆంధ్రసాహిత్యపరిషత్తులోని ప్రతిని నా కొఱకై దయయుంచి వ్రాయించి పంపిరిగాని, మూలప్రతి చాల శిథిలమై యుండుటచే వారికి వృథాప్రయాసము