పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/21

ఈ పుట ఆమోదించబడ్డది

ఉపోద్ఘాతము 15

అట్లైన తుదలోని వేమన్న కేమిపని ? మఱియు బందరు ప్రతి పీఠికలోని వేమన చరి త్రములో అభిరామయ్యకు రామయ్యయను పేరును గలదని చెప్పఁబడినది. అట్లైన మనకింత తల నొప్పి లేకుండ 'విశ్వకర్మ వంశ్య వినర రామ' యనియే వేమన వ్రాయవచ్చుఁ గా నుండెను గదా!

అభిరామయ్య కథ కల్ల యనుటకు వేరొక సాక్ష్యము గలదు. లంబికా శివ యోగి యను నాతఁడు, తత్త్వరహస్యము నుపదేశించెదను రేపురమ్మని కంసాలి యభిరామయ్యకుఁ జెప్పగా, దానిని రహస్యముగా(బొంచి వినుచుండిన మనవేమన్న, తన వదినెయైన రాణిగారి మూలమున మఱునాడు అభిరామయ్య నగరు విడిచి, పోలేకుండఁజేసి, తాను యోగివద్దకుఁ బోయి, అతఁడె తనకు ప్రతిగా నన్నుఁ బంపెనని చెప్పి, శివయోగిని వంచించి యతనిచే బీజాక్షర మంత్రోపదేశమును బొందెనఁట. తరువాత తాను సంపాదించినవిద్యవిలువ నెఱిఁగి, జ్ఞానియై, పశ్చాత్తాపమును బొంది, మొదలు జాగ్రత్తగా అభిరామయ్య కాళ్లు పట్టుకొని, తప్పుక్షమించెదనని బాసచేయించుకొని, తరువాత తస యపరాధమును దెలిపెను. అతడు పాపము, మొదలే క్షమించి నాఁడుగదా! అతని దయకు కృతజ్ఞతను జూపుట ధర్మమే కాని యచే బీజాక్షరోపదేశమును తానే యతనికేల చేయలేదు? పాపము దానికై యాతఁ డెన్నినాళ్ళు ఆ బైరాగి శివయోగిసేవచేసెను? పోనిండు; అభిరామయ్యవలె శివయోగి గూడ వంచి, తుఁడే కదా ! తనకు ప్రధాన గురువగు నతని కింతమాత్రము కృతజ్ఞత చూపవలదా ? వేమన పద్యములలో నా పేరే లేదే ; మఱియు పై యభిరామయ్య కథలోని యీ పద్యము చూడుఁడు

      " తే, దేహశక్తియు లేనట్ట దీనునకును
             చక్కగా బోధ చేసెడి చతురుఁడుగను
             నిక్కముగ విశ్వకర్మ తా నీటుమెఱయ
             రామయూఖను విలసిల్లె రహిని వేమ " (2072)

వేమన్న 'దేహశక్తి లేని దీనుఁడుగా" నుండెనా ? అట్లయిన నట్టి క్షయ రోగావస్థ మందులతోఁ దీఱునుగాని బోధనలతోఁ దీఱునా ? మఱియు రామన్న వేమన్నకు చేసిన బోధయేమి ? పాప మతఁ డేబోధ బాధలు నెఱుఁగఁడే ! క్షమించుటయే బోధయా? ఈ పద్యములు కృత్రిమములనుట కింతచాలును. ఈ ప్రతియందుఁగల విశ్వకర్మ పేరిట యసంఖ్య పద్యములను, 'కంసలికిని మించు కడజాతి లేదయా" యని యన్ని వ్రాఁత ప్రతులందును అచ్చు ప్రతులందును ఉండఁగా 'ఘనజాతి లేదయా' యని తిద్దియుండుటను (3094) జూచితిమేని, సంపాదకుల సుత్తి దెబ్బలు, ఆకురాయి కోఁతలు, వేమన్న చాల తిన్నాఁడని స్పష్టముగా గానవచ్చును. అది యట్లుండె.

పైఁ జెప్పిన పద్యములు పాటలుఁ గాక 'వేమన వాక్యము' లని కొంత కొంత అక్కడక్కడ పద్యపు నడకగల వచనములు కొన్ని యున్నవి. వాక్యమనఁగా పెక్కు చిన్న వాక్యములగుంపు. ఇట్టివి ఆఱు వాక్యములున్నవి. ప్రతిదాని తుదను, 'విశ్వదాభి రామ' మకుటము గలదు. ఇందలి ముఖ్య విషయములు యోగ సాంఖ్య తత్త్వములు. ఇట్టి వచన రచనలు కన్నడమున బసవేశ్వరుఁ డుపక్రమించెను. గా(బోలు. అతని తరువాత కన్నడ శైవులు తెలుఁగు శైవులును, వారివలె తెలుగు వైష్ణవులును ఇట్టి వచనములు పెక్కులు వ్రాసిరి. శివయోగి శిష్యుడైన వేమన్నయు నట్లే వ్రాసి యుండుట యనుభవముగాదు. కాని యిప్పటి వాక్యములు వేమన.