పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/61

ఈ పుట ఆమోదించబడ్డది

హాస్యాద్యుక్తులలో చాతుర్యము, సద్య:స్ఫురణము, దయార్ద్రహృదయము - ఇవి వీరిగుణములు.

వీరికిని అన్నగారికి వివాహమైన అనతికాలములోనే వివాహమైనది. వీరిభార్యయు వీరిగుణాదికములకై వీరిని వలచి పరిణయమైనది. ఎల్లవారి దురదృష్టముచే వారు ఆకస్మికముగా మరణింపగా ఆయమ నిరంతరము తదేకచింతచే స్రుక్కి శోకదేవతయై కొంతకాలమునకు తనువు త్యజించినది.

శాస్త్రులవారు తమ్ముని మరణసమయమున చెంతలేరు. మదరాసులోనుండిరి. తమ్ముడును తానును ఏవేవో కార్యములను సాధింపవలయునని పుట్టెడు ఆసలతోనుండు సమయమున, పిడుగుదెబ్బవలె, తమ్ముడు గతించెనను వార్త, జాబు మూలమున తెలియవచ్చినది రెండు మూడుదినములు శాస్త్రులవారు అన్నాహారములు మానివేసి ఏకథారగా నేడ్చుచుండిరి; క్రమముగా దు:ఖము ఉపశమించినను వారు తమ్మునిమాత్రము మఱువలేదు.

దినములు గడచిపోయినవి.


_________