పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/59

ఈ పుట ఆమోదించబడ్డది

శేషమ్మగారిని వివాహమైరి శాస్త్రులవారి వివాహము నెల్లూరు జిల్లాలో నాయుడుపేటకు తూర్పున పుదూరునకు సమీపమున నుండు చిల్లమూరుగ్రామమున శ్రీ సదాశివయ్యగారి స్వగృహమున జరిగినది.

వెనుక కొంతకాలమునకు శాస్త్రులవారు బి.ఏ. చదువ వలయునని, తమ యుద్యోగమందు తమ సోదరులు వేంకటసుబ్బయ్యగారిని ఉంచి, మదరాసునకు వచ్చిరి. బి.ఏ. చదువుటకు శాస్త్రులవారికి తీరికలేకపోయినది. ఇతరవిద్యావ్యాసంగములు ఎక్కుడయినవి. ఐదాఱు పర్యాయములు పరీక్షకు పైకము కట్టియు చదువు చాలదని పరీక్షకు పోలేదు. తదేక దీక్షతో సంస్కృతాంధ్రగ్రంథములను చదువుచుండిరి. ఇట్లుండగా ముత్యాలపేటలోని ఆంగ్లోవర్నాక్యులర్ మిడిల్ స్కూలునకు ప్రథానోపాథ్యాయులైరి. నలువదిరూప్యములు జీతము. అందు కుటుంబ వ్యయమున కయినది పోను మిగిలినదానినంతయు కలకత్తా బొంబాయి మొదలైన ప్రదేశముల నుండి సంస్కృత గ్రంథములను తెప్పించుచు చదువుచుండిరి. ఆదినములలో నచ్చైన గ్రంథములలోను ప్రచారమందున్న తాళపత్ర గ్రంథములలోను చదువక విడిచినదియు చదివి మఱచినదియులేదు. ముఖ్యముగా సాంఖ్య, యోగ, వేదాంత, వ్యక్తావ్యక్తగణిత గ్రంథములు విశేషముగా చదివిరి. బాల్యములో 'నాకు సులువుగరానిది గణితము' అని వారేచెప్పియున్నను గొప్పగణితశాస్త్రజ్ఞులని వారి నాటివిద్యార్థులు చెప్పుదురు.