పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/58

ఈ పుట ఆమోదించబడ్డది

32

వేదము వేంకటరాయశాస్త్రులవారి జీవితము


కాని వేంకటరాయశాస్త్రులవారు గట్టి అనుశాసకులని ఎఱుంగక కొందఱు విద్యార్థులు ఆవిధముగానే గదులలో ఆడుచునేయుండిరి. వారిని శాస్త్రులవారు బెత్తముతో తాడించి బెదరించిరి. ఆక్రొత్త ఉపాధ్యాయుడు లక్ష్యముచేయక కొందఱు బాలురను పెట్టుకొని ఒకగదిలో గోష్ఠి చేయుచుండెను. తమ చిత్తమువచ్చినట్లు కొందఱు బాలురు ఆడుచుండిరి. వేంకటరాయశాస్త్రులవారు ఇందఱకును తమ శాసనమెట్టిదో తెలుపగోరి బెత్తముగొని, ఆగది ప్రవేశించి, అచటనున్న వారి మొగములను చూడక కాళ్లమీద అందఱకును చిత్తమువచ్చినన్ని దెబ్బలు వాయించిరి. ఆ యుపాథ్యాయునికిని చక్కగనే దెబ్బలు తగిలినవి. ఆతడు పై యుద్యోగస్థులకు అర్జీ పెట్టుకొనెను. విచారణజరిగినది. శాస్త్రులవారు తమ సర్క్యులరును చూపి, గోపాలశాస్త్రులవారి కంటిని చూపి, వివరించిరి. ఆనాయని అర్జీనిత్రోసి వైచుటయేగాక శాస్త్రులవారిని అధికారులు కరము శ్లాఘించిరి. అదిమొదలు శాస్త్రులవారన్న విద్యార్థులకేగాక ఉపాథ్యాయులకును భయమేర్పడెను. ఆపాఠశాల బాగుపడెను.

ఈ కాలముననే శాస్త్రులవారికి వివాహమైనది మొదట దాదాపు పదునాఱు పదునేడు సంవత్సరముల ప్రాయమున ఉడాలి వారి యాడుపడుచు శ్రీ జానకమ్మగారిని పరిణయమైరి గాని ఆయమ కాపురమునకు వచ్చుటకుమునుపే చనిపోయెను. వెనుక దాదాపు ఇరువదియైదవయేట పుదూరు ద్రావిడులలో సుప్రసిద్ధులైన శ్రీ అల్లాడి సదాశివశాస్త్రులవారి కొమార్తె