పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/219

ఈ పుట ఆమోదించబడ్డది

అనియు 'అంతకాలం నాకు భగవంతుడు ఆయుస్సీవలెను గదా' అనియు చెప్పుచుండెడివారు. ఎట్లో శ్రీ రెడ్డిగారిప్రయత్నము వలన తాతగా రుండగనే ఋణనివర్తియైనది. కనకాభిషేకముంగూర్చి శ్రీ రెడ్డిగారి సంకల్పము నెఱవెరకమునుపే చనిపోవుదు మేమోయనియు తలంచుచుండిరి. వేసవి దినములు మేనెలలో 'నేను భగవద్గీతకు ఆంథ్రానువాదమును రచించి మా ఏనాదిరెడ్డిగారికి అంకితమిచ్చెదను' అని పలికిరి. పదిపదునైదు దినములు అదిపనిగా భగవద్గీతపై తమ భాండాగారమునందలి గ్రంథముల నన్నిటిని ఒకమాఱు చదివి 'ఇక నారంభించెదను' అనిరి. ఆదినము సాయంకాలమే జ్వరము తగిలెను కాలిమీద గోకినందున పుండేర్పడినది. జ్వరము వృద్ధియైనది అంతకు నెలదినముల నుండియు నాపెదతమ్మునికి ఉపనయనమునకు ఏర్పాటు చేసియుంటిమి. మధ్యలో తాతగారికి జ్వరమువచ్చినను దానిని నిలుపలేదు. ఉపనయనము నాడు వారికి జ్వరమువచ్చి పదునొకండు దినములు. తాతగారికి కష్టముగానుండునని మేళములు మొదలైనవాద్యములను పూర్తిగా నిలిపివేయించితిమి. ఉపనయనము కేవలము మంత్రములతోనే జరిగెను. తాతగారు నాటి ఉదయము 'ఏమిరా, చప్పుడులేదు, వాద్యములు లేవు. ఉపనయనము నిలిపివేసినారా యేమి?' అని అడిగిరి. 'లేదండి. తమకు శబ్దము కష్టముగా ఉంటుందని వాద్యాలు నిలిపినాము. మంత్రాలతోనే జరుపుతాము' అని నేను చెప్పితిని. 'ఆ. ఆ. మంచిపని' అని సంతోషించినారు.