పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/195

ఈ పుట ఆమోదించబడ్డది

లకై పోసియుండినరాలను రువ్వుచు 'గంధికిజై, మహమ్మదాలీ షౌకతాలీకి జై' అని భీకరముగా నఱచుచుండిరి.

ఆదినము ద్వితీయాంధ్రపండితులుగా సత్కారముబొంద వలసినవారు శ్రీ చదలవాడ సుందరరామశాస్త్రులవారు. వారు, ఈగుంపును తప్పించుకొని ఎట్లు యువరాజుగారి దర్శనమున కేగగలమను సంశయముతో, తమ ఉడుపులను మూటకట్టుకొని కొమారుని వెంటబెట్టుకొని చొక్కాయలేకయే, ఎవడో పౌరోహితునివలె మాయింటికి వచ్చిరి. తాతగారును భోజనము ముగించుకొని మోటారుకారుకై కాచుకొనియుండిరి. ఇంతలో నదియు రాగా వేషములను ధరించి బయలుదేరిరి. తంబుసెట్టివీథిచివరకు పోకమునుపే అల్లరిమూక వీరిని అడ్డినది. గుంపంతయు చేత రాలుతీసికొనిరి. ఇక రువ్వువారే. బండిలోనివారి కందఱకును మతిపోయినది. భయపడసాగిరి. తాతగారు మాత్రము భయపడక డ్రైవరును పిలిచి 'గంధికిజై అని అరవరా' అనిచెప్పిరి. వెంటనే 'గంధికి జై'అని ఆత డనెను. గుంపు వెంటనే రాలురువ్వుటమాని వీరిని పోనిచ్చినది.

మెల్లగా నీయుపద్రవమును తప్పించుకొని సెనేటుహాలు సమీపమునకు పోగా పోలీసు సార్జంటు నివారించెను. అతడు ఆజానుబాహువు, గుఱ్ఱముమీదనున్నాడు. ఒకరిమాట వినిపించుకొనుస్థితిలో లేడు. కొన్నివందల మోటారుబండ్లు నిలిచి యుండినవి. మెల్లగా తాతగారే అతనిని పిలిచి తాము యువ