పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/159

ఈ పుట ఆమోదించబడ్డది

రెండువేలుపట్టును' అని వీరువక్కాణించిరి. 'మఱి, లే, శాస్త్రిగారి దర్శనమునకుంబోవుదము.' అని ఆయుదారులు బండి కాజ్ఞాపించిరి. ఏనాదిరెడ్డి గారు 'నేనుపోయి శాస్త్రిగారిని ముందు హెచ్చరించివచ్చెదను.' అనిరి. 'అట్లేచేయుము'అని వారు ఆనతీయగా ఆబండిలో ఏనాదిరెడ్డి గారు మాయింటికివచ్చి నన్నుంగని వృత్తాంతమువచించి, నేను ఇప్పుడేపోయి వారిని తెత్తునా, యనిరి. 'అయ్యా, నాబోంట్లు ఎందఱు వారిని నిత్యము దర్శింపరు? ఆక్షేపములేదేని నేనేవచ్చెదను. నాకుటీరమునకు వారేల రావలయును?' అంటిని. అంతట ఆబండిలోనే వారికడ కేగి సందర్శింపగా, వారు మదీయవ్యాఖ్యానముంగూర్చి నిజాభినందనముందెలిపి, ముద్రణార్థము ఏపాటియగునో అడిగిరి. "సుమారు రు. 2000 కావచ్చును' అని చెప్పితిని. అంతట రు. 1000 ల నో టొకటి ఫలసహితముగా నాకొసంగి 'మీరు మదరాసున కెప్పుడుపోయెదరు?' అని యడిగిరి. 'ఈమధ్యాహ్నపుబండిలోనే ఏగి సాయంకాలమున ఇల్లుచేరెదను' అని యుత్తరముచెప్పితిని. 'మీరు ఇల్లుసేరునప్పటికి మాకార్యస్థుడు వచ్చి మీకు రు. 1000 లు అందజేయును' అనిరి. అంతట నేను నాకృతజ్ఞతంబలికి నాడేతరలి సాయము మదరాసులో నిల్లుచేరునప్పటికి రెడ్డిగారికార్యస్థుడు పైకముతెచ్చి నాకై యెదురు సూచుచుండెను. దానింగైకొని ఆగ్రంథముద్రణమును నెఱవేర్చుకొంటిని. ఔదార్యమన నిట్లుగదాయుండవలయును."*


  • ఆముక్త - ఉపోద్ఘాతమునుండి.