పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/70

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్తోత్రపాఠము

స్తోత్రపాఠము నొక విజ్ఞాని వన్యమృగముతోఁ బోల్చినాఁడు. నిత్య పరిచయము కలిగినపుడు డెంతటి క్రూరసత్వమైనను దాని క్రౌర్యమును గోల్పోయి కనుపించును. సహజ క్రౌర్యముగల జంతువుల నలవాటు చేసికొనుట యందును నేర్పు గోచరించును. మహర్షుల యాశ్రమ వీథులందు సహజ శత్రుత్వము గల వన సత్త్వములు పరస్పర సఖ్యముతో సంచరించుట కా మహనీయుల యనంత ప్రతిభావిశేషమే కారణము. మహాకవు లెపుడు ఋష్యాశ్రమముల దర్శించినను “గండూయనము సేయు కరటి శుండాదండ పుష్కరమ్మున సింహపోతకమ్ము" ఇత్యాది మనోజ్ఞ ప్రకృతి చిత్రణములు వారికిఁ బొడకట్టుట లీ కారణముననే.

స్తోత్రపాఠము శ్రోతకుఁ బ్రప్రథమమున నెట్టి మహాభయంకర మృగముగ గోచరించినను గాలక్రమమున దానితోఁ బరిచయము వృద్ధియగు కొలఁదిని నొకవిధమగు ప్రేమాభిమానములు వెల్లివిరియుట తటస్థించును. అవి యభూత కల్పనలుగఁ గాక సుసత్యస్వరూపములై నిరూపితము లగుచుండును.

స్తుతి పాఠముల విన నలవడిన శ్రవస్సులు సత్యములైన సప్రియ వాక్యముల వినలేవు. ఇట్టియెడ సత్యవ్రతులకు స్థానము లేకపోవుటయే కాక యట్టి సత్యము లసత్యములనియు నిరూపితము లగును. అందువలనే "అప్రియస్యచ పథ్యస్య శ్రోతా వక్తాచ దుర్లభా” అను నార్యోక్తి జన్మించినది. సత్యము! 'పదుగురాడు మాట పాటియై ధరఁ జెల్లు నొక్కఁడాడు మాట యెక్క దెందు.'

‘ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కా మాటలాడి యన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుకఁ దిరుగువాఁడు ధన్యుఁ' డని యొక సుమతి సెలవిచ్చినాఁడు. లోకమున జనసామాన్యము సర్వసాధారణముగ నీ నీతి మార్గమునే యనుసరించు చున్నది. ఆ కారణము వలననే లోకము విశేషముగ స్తుతిపాఠమునకుఁ జెవి యొగ్గుట సంభవించుచున్నది.

అయిన నొక యంశము సుసత్యము. స్తోత్రపాఠమొనర్పఁ బూనుకొనిన ప్రతివ్యక్తికిని దీని తత్త్వము తెలియుననుకొనుట భ్రమ. స్తోత్రపాఠమొక కళ! అసామాన్యమైన కళ!! ఉక్తివిశేషోద్భూత మగు కళ!! ____________________________________________________________________________________________________

70

వావిలాల సోమయాజులు సాహిత్యం-4