పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/441

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఇక రెండవ కవివర్యుడు 'కస్తూరి రంగకవి' ఆలూరి కుప్పనకవి తన గద్యమున 'కస్తూరి రంగ సద్గురు పాదారవింద భజనానందిత హృద్విలాస' యని చెప్పుకొనుటచే నితడతని శిష్యుడని వెల్లడియగుచున్నది. ఇతడు గొప్ప లక్షణ కవి. సర్వస్వతంత్రుడు. కుప్పనకవి రంగకవిని ప్రస్తుతించుచు,

     సీ. భారతి కేవిప్రవర్యునిజిహ్వ ని
                 త్యముగ వసించు నాస్థానవాటి
         వాణీవధూటి కెవ్వాని నున్బలుకులు
                 ధరియించునట్టి ముత్యములచాలు
         శారద కేసుధీస్వామిచేతోవీథి
                 యమరిన రత్న సింహాసనంబు
         పలుకుల వెలది కేభావజ్ఞుని గృహంబు
                 నెట్టుగా వసియించు పుట్టినిల్లు

     గీ. నలువ చెలువకు నెవ్వ డెన్న దగు పుత్రు
        డట్టి కస్తూరి రంగారు నచలధైర్యు
        నార్యమతచర్యు మద్గురువర్యు నెంచి
        ప్రణుతిగావింతు పలుమారు ప్రస్తుతింతు.

అని చెప్పియున్నాడు. రంగకవి గొప్ప లక్షణవేత్త. రంగకవి తన యానంద రంగరాట్ఛందము పీఠికలో 'జతుర్విధాంధ్ర కవితాసలక్షణ గ్రంథశోధన ధీసంయుతుడు ననియు, 'భావగర్భ పదపద్యాళి ప్రబంధానుబంధుడ' ననియు చెప్పుకొని యున్నాడు. ఇతడు లక్షణ చూడామణియను నామాంతరముగల 'ఆనందరంగరాట్ఛందమును, 'కృష్ణార్జునసంవాద' మను నైదాశ్వాసముల రసవత్కావ్యమును రచించెను. ఆ కాలమున పాండిత్యమున కస్తూరి రంగకవిని మించినవాడు లేడు. రంగకవి ఆనంద రంగరాట్ఛందమును ఫ్రెంచి గవర్నరగు డూప్లేకు ద్విభాషి (Translator) గా నుండి పుదుచ్చేరియందు నివాస మేర్పరచు కొనిన యానందరంగపిళ్లై కంకితమిచ్చెను17 . ఇతడు తన ఛందోగ్రంథము నందనేక కవులను, వారి ప్రయోగములను బేర్కొని యున్నాడు. ఇతడు సాంబనిఘంటువని పేరు వడసిన శబ్దకోశము నొకదానిని రచించెను. ఇది తాళ్లపాక వారి వేంకటేశ్వరాంధ్రము ననుకరించినట్లు కన్పించును. ఆయా పదముల కా నిఘంటువునందుగల పర్యాయ పదములనట్లే దీనియందు నుంచెను. కాని వేంకటేశ్వరాంధ్రము కన్న రంగకవి సాంబనిఘంటువు కొంత

సాహిత్య విమర్శ

441