పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/437

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఈమె తండ్రి ముత్యాలు, తల్లి పోతి. ముద్దుపళని తన కావ్య గద్యమున "శృంగార రసప్రధాన సంగీత సాహిత్య భరత శాస్త్రాది విద్యాపారంగత తిరుమల తాతాచార్య పాదారవింద చోళ సింహాసనాధ్యక్ష ప్రతాపసింహ బహుకృతానేక చామీకరాంబరాభరణ” యని చెప్పుకొని యున్నది. సంగీత సాహిత్యములు, భరత శాస్త్రమున మంచి పాండిత్య ముండుటవలననే రాజు మనసును చూరగొనగలిగినది. చూరగొనినంతనే యూరకొనక శృంగార రసప్రధానునిగా నొనర్పగలిగినది. పళని గ్రంథమున సంస్కృతాంధ్ర సాహిత్య మున్నది. రాధికాసాంత్వనమును పళని రచియించెనా, లేక గురువగు వీర రాఘవ దేశికులు రచియించెనా యను సంశయము మొదట సి.పి. బ్రౌన్ దొరవారికి కలిగినది11. పళని మహారాష్ట్ర వనితగా కన్పించుట వలన నామె వ్రాసి యుండదని వారూహపడిరి. కాని పళని తల్లిదండ్రులను బట్టి చూచినచో నామె యాంధ్రదేశ స్త్రీగనే కన్పించుచున్నది. ఆంధ్రమున కొంత భాగమును, సంస్కృత పదభూయిష్ఠముగా కొంత భాగమును రచియించి యుండుటచే సంస్కృతమున్న భాగము వీర రాఘవాచార్యులు వ్రాసెననియు, తెలుగు భాగము పళని వ్రాసి యుండుననియు దొరవారను కొనుటలో తప్పున్నట్లు కన్పింపదు. అట్లు సమర్థించుటయే సమంజసమని నా యభిప్రాయము.

పళని రాధికాసాంత్వనము సంభోగ శృంగారరస ప్రధానము. ఇందు పళని స్త్రీజన స్వాభావికమగు సిగ్గును విడనాడి శృంగారమును పచ్చిపచ్చిగా వర్ణించినది. ప్రబంధకవులును సంభోగశృంగారమును విరివిగానే వర్ణించిరి గాని దానిని శైలీకాఠిన్యము వలననో, వ్యంగ్య ప్రాధాన్యమువలననో కప్పిపుచ్చుచువచ్చిరి. 'ఈ కావ్యము మృదు పదభూయిష్ఠమై సరసంపుపల్కుల కాకరమై యున్నను, (గ్రంథకర్త్రి ) కథాంతమువరకును ఆలుమగలాటను వర్ణించుట, వివిధ గతుల విస్తరించుట మొదలగు శృంగార వర్ణనలయందే తన నెఱజాణ తనమును గనబఱచెను. ఆమె కావ్యలక్షణము లను లక్ష్యము జేయక కొంకు కొసరు లేక రసంపుబెంపును సొంపుగా గూర్పదలచి కృతిని బూతులబుంగను జేసె'నన్న సర్వసామాన్య విమర్శనమునకు గురియైనది. గాని ఈమె ఏ గౌరవ పాత్రమైన గ్రంథమును రచించెనన్న మన్నన వడసినది లేదు. కవనము రసవంతమైనది. సజాతీయము. స్త్రీ హస్తము మాత్రము కవనమున కన్పించును. శృంగార రసవర్ణనలందు తిమ్మన పెద్దనల శృంగారపు బోలికలు, పోకడలు కలవు. పళనికి సంగీత ప్రావీణ్యము కలదన్నమాట యొప్పుకొనక తప్పదు. పళని రాధికాసాంత్వనమను గ్రంథముగాక సప్తపదులు కొన్ని రచించినది. (?)12 ఇవి యరవభాషయందు గోదావరనామము ధరించిన చూడికొడుత్తనాచ్చియారు

సాహిత్య విమర్శ

437