పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/433

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నాదబ్రహ్మోపాసకుడై గానామృతమును విశ్వముపై నొలికించి బ్రహ్మానందమును గలుగజేసిన త్యాగరాజస్వామికి తాతగారు. ఈతడు వాదవిజయము, సర్వాంగసుందర విలాసములను నాటకములు రచించి శాహమహారాజున కంకితమిచ్చెను. ఇతడు శాహేంద్రచరిత్రమును యక్షగానముగ రచియించెను. అందలి గద్యలో

        'కండచక్కెరలీల కల్పించి రుచుల,
         గండుమీరిన యక్షగానంబు మిగుల
         గరిమను గిరిరాజకవి రచియించె'

అని చెప్పుకొని యున్నాడు. ఈతని కవిత సహజ మాధుర్యమును పొందియున్నది. ఇతని వర్ణనలు సహజములు. ఇతడు నాటకములందు హెచ్చుగా ప్రబంధపు పోకడల పోయెను. 'కొరవంజి'ని వ్రాసిన తెలుగు కవులలో నీతడే ప్రథముడుగా కన్పించుచున్నాడు. గిరిరాజకవి 'రాజమోహన కొరవంజి' యను నొక గ్రంథమును రచించి శాహమహారాజున కంకిత మొనర్చెను. ఈ గిరిరాజకవి రాజకన్యా పరిణయమను మరియొక కొరవంజిని రచియించి శాహమహారాజు మెప్పు వడసెను. శాహమహారాజు వాహ్యాళి వెడలుచుండగా జూచి రాజకన్యయొకతె ఆయనను ప్రేమించును. ఈ వృత్తాంతము నా రాజకుమారి తల్లిదండ్రులు తెలిసికొని, యామెను మహారాజున కిచ్చి వివాహము గావింతురు. ఇది యందలి ప్రధాన కథావస్తువు. గిరిరాజకవి బహు నాటకకర్త యని పేరుపొందినవాడు. కాని యితని నాటకములు మాత్రము నేడు మూడో నాలుగో కన్పించుచున్నవి. ఇతడు శాహజీ మరణానంతరము రాజ్యమునకు వచ్చిన యితని తమ్ముడగు శరభోజీ ప్రథమ రాజ్యవత్సరములలో జీవించియున్నట్లు తెలియుచున్నది. ఇతడొకానొక చోట గద్యలో 'గిరిరాజనుతలీల శరభోజిభూపాల” యని చెప్పుకొనుటయే గాక శరభోజీ భూపాలుని పేర నంకితముగా 'లీలావతీకల్యాణ' మను నాటకమును రచించెను. ఇతని కవిత రసవత్తరమైన దగుటయే గాక సహజ వర్ణనల గూడ కలిగియున్నది.

శాహజీ మహారాజు సభ నలంకరించిన కవులలో గిరిరాజకవి వెనుక పేర్కొనదగినవాడు, విజయ రాయావతంసకవి. ఇతడు తన గద్యములందు 'సలోహితగో త్రాహోబళార్యపుత్రకులపావన గిరిరాజ కవిపరానుజ' యని చెప్పికొని యుండుట వలన, నీతడు గిరిరాజకవి తమ్ముడని తెలియుచున్నది. ఇతడు తెనుగున 'అభినయ దర్పణ' మను నాట్యశాస్త్రమును రచించి ఖండోజీయను మహారాష్ట్ర సేనాని కంకితమిచ్చెను. బాలకవి యను మరియొక కవివరేణ్యుడు తాను శాహమహారాజు


సాహిత్య విమర్శ

433