పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/428

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఈ వంశవృక్షము రాబర్టు సూయల్ 'List of Antiquities - Part, ii ననుసరించి యీయబడినది. (పట్టిక కోసం తరువాతి పేజీని చూడండి)

ఇది చోళసింహాసనాధ్యక్ష భోసల ప్రతాపసింహ రాజ పూర్వపుణ్య పరిపాకస్వరూప యామునాంబికా గర్భశుక్తి మౌక్తికాయమానామరసింహ మండలాధీశ్వర నామాంకితంబైన' యని యుండుటచే పై పట్టికయందు చూపబడినది తప్పుగా దోచుచున్నది.

ఏకోజీ (క్రీ.శ. 1674-1684)

ఛత్రపతి శివాజీమహారాజు తమ్ముడగు నీతడు తంజావూరు ప్రథమ మహారాష్ట్ర పరిపాలకుడు. ఇతడు తంజావూరిని క్రీ.శ. 1674లో ముట్టడించెను. ఇతడు నాయక రాజ్య విచ్ఛేదమునకై బద్ధకంకణుడైన బీజాపుర సుల్తానుచే పంపబడిన సేనా నాయకుడైనట్లు శాసన ప్రమాణములు గలవని, కురుగంటి సీతారామయ్యగారి తంజావూరి యాంధ్రనాయకుల చరిత్రలవలన దెలియుచున్నది. కాని 'ఏకోజి' తంజావూరి ఆంధ్ర నాయకులలో కడపటి వాడగు విజయ రాఘవుని ప్రేరణమున తంజాపురమును ప్రవేశించి, అతని మరణానంతరము బలవంతుడై సింహాసన మధిష్ఠించెనని శ్రీయుత జయంతి రామయ్య పంతులవారు నుడువుచున్నారు.1 తన రాజ్యకాలము నంతయు రాజ్యసుస్థాపనార్థమే వినియోగించిన యీ రాజన్యునకు సారస్వత సేవకు గాలము కరువయ్యెను. అందువలన నతని కాలమున సంస్కృత వాఙ్మయముగాని, తెలుగు వాఙ్మయముగాని, యే విధమగు పోషకత్వమును బడసినట్లు కన్పింపదు. శత్రు రాజులతో సమరములు సల్పి రాజ్యస్థాపన మొనర్చు మహారాజుల రాజ్యకాలములో వాఙ్మయ పోషణ మరుదు.

శాహజీ (క్రీ.శ. 1684-1710)

ఏకోజీ మహారాజు పరిపాలనానంతరము అతని జ్యేష్ఠపుత్రుడగు శాహజీ సింహాసనమలంకరించెను. తండ్రి రాజ్యమును సుస్థిరమొనర్చి స్వర్లోక ప్రస్థాన మొనర్చుటచే నీ రాజన్యునకు సారస్వత సేవ యొనర్చుటకు తగినంత విశ్రాంతి దొరికినది. ఇతడు దేవభాష యాంధ్రముల రెంటను అసమాన పాండిత్యము గడించిన కవి రాజన్యుడు. ఇతని యాస్థానకవి యగు విచిత్ర రాయావతంస కవి యీతనిని 'సరససాహితీ లక్షణవిభు' డని పొగడియున్నాడు. తానే తన 'విష్ణు పల్లకి సేవా ప్రబంధ’ మను నాటకమున తన్ను గూర్చి 'కవిత సంగీత తాన శ్రుతి స్వరసాధన

428

వావిలాల సోమయాజులు సాహిత్యం-4