పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/379

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ధనికులు నూతన వస్త్రాభరణాలంకరణం చేసుకొని పంచాగ శ్రవణ సమయంలో రాబొయ్యేది వేసవి గనుక, పాత్రులకు ఛత్రము, తాళవృంతము, పాదుకలు, వస్త్రాభరణాదులు దానం చేస్తారు. కొందరు సరస్వతీపూజాసమయంలోనూ, మంటపారాధన సమయంలోనూ 'పంచాంగాలు' పంచి పెట్టుతారు; పేద విద్యార్థులకు ఇతర పుస్తక దానం కూడా చేయటం కద్దు.

గ్రామాల్లో జనం ఉదయం మంగళస్నానాలు చేసి, ఆమ్రతోరణాలతో గృహద్వారాలను అలంకరించి, నూతన వస్త్రాభరణాలతో అలంకరించుకుంటారు. పురోహితుడు వచ్చి యింటింటికి తిరిగి ప్రసాదమిచ్చి వాయనాలు పుచ్చుకొని వెళు తాడు. సామాన్య ప్రజలు 'సంకులమ్మ' మొదలైన గ్రామ దేవతల దగ్గరకు 'చిందు నృత్యం' చేసుకుంటూ మంగళవాద్యాలతో వెళ్ళి వచ్చి, తృప్తిగా భోజనం చేసి సాయంకాలం దేవాలయంలోని మండపం దగ్గరికి పంచాంగ శ్రవణం కోసం చేరుతారు.
మంటపం దగ్గిర సభ ఉత్తర ముఖంగా గాని, తూర్పు ముఖంగా గానీ ఏర్పాటై ఉంటుంది. పంచాంగ శ్రవణం గణపతి పూజతో ఆరంభిస్తుంది. “గణానాం త్వాం గణపతిగ్ం హవామ హే కవిం కవీనాముప మశ్రవస్తమం, జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ స్పత, అనఃశృణ్వ న్నూతిభిః సీదసాదనమ్” (ఋగ్వే 11.28) అన్న ఋగ్వేద మంత్రంతో గణపతి పూజ ప్రారంభించినప్పుడు వేదార్థం తెలిసినవారు ఈ మంత్రంలోని 'ఈ సమస్త దేవతాంగాలకూ, అధిపతివి నీవు, నాయకుడవు, బుద్ధిమంతులలో బుద్ధిమంతుడవు, ప్రఖ్యాతులో అగ్రగణ్యుడవు, ప్రార్థనలు పూజలు యజ్ఞాలు మొదలైన సమస్త కర్మలకు నీవే రాజువు ఓ బ్రాహ్మణస్పతీ! యజ్ఞస్థానాన్ని అలంకరించు' అన్న అర్థాన్ని మననం చేసుకొని గణపతిని పరబ్రహ్మగా భావిస్తారు. తరువాత సరస్వతీ పూజ. సరస్వతి వాగధిదేవత. సృష్టికి ఆదిశబ్దం. కాలానికి సంబంధించిన సంవత్సరాదినాడు సరస్వతీపూజ ఎంతో సముచితమైంది. ఈ సరస్వతీపూజకు ముందే మంటపారాధన జరుగుతుంది. 'మంటపము' కేవలం ఖగోళము. వివిధ నక్షత్రాలనూ, గ్రహాలను, ఇంద్రాది లోకపాలకులనూ, తదితర దేవతలనూ ఇందులో ఆహ్వానించి పూజించటం ఉంటుంది. ఈ పూజాసందర్భాలలో కాలాన్ని కనుక్కోవటానికి మన పూర్వులు ఉపయోగించిన తురీయ, కపాల, షష్ఠి, జలఘటికాది యంత్రాలను కూడా పూజించేవారు.
పైన చెప్పిన మంటపారాధాన, సరస్వతీ పూజలు అయిపోయిన తరువాత పురోహితుడు తప్పుకుంటాడు. దైవజ్ఞుడు గ్రామ పెద్ద ఆహ్వానాన్ని అందుకొని వేదికను అలంకరిస్తాడు. ఆయనకు చందన చర్చ, వస్త్రాలంకరణం ఇత్యాదులు జరుగుతవి. సంస్కృతి 379