సంవత్సరము, ఆది ఆచారములు
"చతుర్వింశతి పర్వ త్వాం షణాభి ద్విదశీ ప్రథి |
తత్రిషష్టి శతారం వై చక్రం పాతు సదాగతి ॥ - మహాభారతమ్
చ.
"ఋతువున కొక్కరూపు సవరించి అహర్నిశలన్ తెరల్ యథో
చితముగ లేచి వ్రాలగ కుశీలవులై నటియింప ప్రాణి సం
హతి సుఖదుఃఖరంగముల నాదియు నంతములేక సాగు నీ
స్తుతిమదదృష్ట కాల నయచోదన కంజలినిత్తు నర్మిలిన్." - శ్రీ రాయప్రోలు
1
ఆంధ్రులకు చైత్రశుద్ధ పాడ్యమితో సంవత్సరాది. మన ప్రాచీనులైన ఆంధ్రులూ,
భారతీయులూ అనంతమైన కాలాన్ని ఏ నాడో భావించారు; అది పరబ్రహ్మ స్వరూపమని
సిద్ధాంతీకరించారు. సృష్టి స్థితిలయాలు కాలం వల్ల కలుగుతున్నవనీ బ్రహ్మ విష్ణు
మహేశ్వరులూ, తదితర దేవతలైన ఇంద్రాదులు కాలనియంత చేత వారి వారి
పదవులనుంచి చ్యుతులై పరమాత్మలో లీనమౌతున్నారని భారతీయుల భావన. కాలము,
దేశము, వస్తువు - ఈ మూటి చేతా పరిచ్ఛిన్నమైనది ప్రకృతి. పరమాత్మ ఈ మూటిచేతా
అపరిచ్ఛిన్నుడు. ఇది మన తత్త్వశాస్త్రజ్ఞుల నిర్ణయం.
జగత్కారణుడైన నారాయణమూర్తి హిరణ్మయ స్వరూపిగా సూర్యమండల
మధ్యవర్తియై కాలచక్రాన్ని భ్రమింప జేస్తున్నాడని మన జ్యోతిస్సిద్ధాంతుల సిద్ధాంతం.
మహత్తర మేధానిధులైన మహర్షులు బహుకాలం తపించి, చంద్ర సూర్య నక్షత్ర
గ్రహ గమనాలను పరిశీలించి, ఇతర జ్యోతిర్గణాలను దివ్యనేత్రాలతో దర్శించి,
అనంతమైన కాల స్వరూపాన్ని నిరూపించారు. కాలాన్ని పరిగణించటానికి మానాలను
ఏర్పరిచారు. ఈ భారతీయుల కాల విజ్ఞానము నేటి శాస్త్రజ్ఞులను కూడా ముగ్ధులను
జేసి జోహారులు అందుకుంటున్నది.
మన భారతీయ కాలమానానికి విస్పష్టమైన ఆద్యంతాలున్నవి. బ్రహ్మ సృష్టితో
ప్రారంభము, ప్రళయంతో అంతము. ఈ సృష్టి ప్రళయాలను కలిపి మనం కల్పమని
సంస్కృతి
361