పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/21

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యను వసుచరిత్రకారుని నిరుక్తికిఁ బ్రతిష్ఠాన పురోపవనములు నిలయములై యొప్పినవి. ద్వారకానగరము నందలి పూఁదోఁటల యౌత్కృష్ట్యము ననిమిషనేత్రములఁ గని కృష్ణ సందర్శనార్థమై వేంచేయు మేఘవాహనునితో మాతలి:

చ. 10[1]తను ధరణీతటిద్విహృతి ధన్యవనావళి యింత మీరుటల్
    కనియును మేఘ మిచ్చటి కలజ్జతఁ జేరెడుఁ గాక చేరకేఁ
    గినను గొఱంత యేమి పురికిం బువుఁదేనియ సోనకాలువల్
    జనముల పైరుపంటలకుఁ జాలవె యెన్నఁటికైన నెన్నఁగన్.'

అని వర్ణించియున్నాఁడు. ఆదర్శప్రభువగు నా భగవానుని మార్గము ననుసరించియే మన ప్రాచీన రాజన్యులు వనపాలన జేసి వినుతికెక్కిరి. ఉపవనాంత లతికాశైలూషికలు పవనాహతుల తోడను శ్రుతిసుఖభ్రమరగీతముల తోడను గుసుమకోమల దంతరుచుల తోడను నాటపాటల నొప్పుచుండఁ గని ప్రమోదమగ్న మానసులైరి. అసూర్యంపశ్యలును హంసయానలు నైన ప్రమదాజన మా వనవీథుల 11[2]"వృషభగతిరగడలతో విశృంఖల విహారముల నొనర్పఁగని వారు కన్నుల కామెతలొసఁగి గర్వించిరి.

శుభాశుభములకు సుమసంబంధ మార్యోపదిష్టమార్గము. ఇష్టదైవతముల ప్రణయానురాగములఁ జూఱఁగొనిన ప్రసవముల నిచ్చి కొల్చిననాఁడే పురాతన భారతీయ భక్తుఁడు పరమానందభరితుఁడైనాఁడు. కుతపవేళ గృహవీథి కరుఁగుదెంచిన యతిథి నాహ్వానించి కాశపుష్పార్చనఁ గావింపఁ గలుగునెడ గేస్తు 'ధన్యోస్మి' యని తలంచినాడు. స్వయంవర వేళలందు పరీక్షానంతరము మరందబిందు తుందిలమ్మగు సురభిళ పుష్పమాలికచే రాకుమారి వరుని గళసీమ నలంకరించిన పిమ్మటనే యతని మందాక్షవీక్షణ మాలికాద్వితయోద్దీప్తుఁ గావించినది. పరిణయ వేళఁ బ్రసవరథములఁ బర్యటించి నవవధూవరులు వృద్ధదంపతుల శుభాశీస్సుల నందికొనిరి. మూఁగనోము పట్టిన ముగ్ధ 12[3]దూసిన నాగమల్లికల దోసిళులతో' ముత్తైదువుల మంగళాకాంక్షల నర్థించినది. ప్రసవశయ్యల శయనించి ప్రసవాసవములు సేవించిన పిమ్మటనే మదన మహాసామ్రాజ్య పట్టభద్రులై మహారాజులు నిశాసమయములఁ బ్రవర్తిల్లిరి. వారి కొల్వుకూటములఁ గళాభిజ్ఞలైన నట్టువరాండ్రు మున్ముందుఁ బుష్పాంజలులఁ బ్రరోచనఁ గావించిన పిమ్మటఁ జతుర లాస్యోల్లాసితలైరి. రాజసూయానంతరము జైత్రయాత్రాతత్పరులై శత్రుదేశములపై దండయాత్ర సాగించి రణవీథుల శాత్రవశిరః

కందుకక్రీడావినోదులై విజయమునఁ దిరిగివచ్చు రాజన్యులకుఁ బురలక్ష్మి చత్వర

  1. తను ధరణీతటిద్విహృతి - ప్రభా. ప్రద్యు. ఆ. 1, ప. 66
  2. వృషభగతి రగడ - ప్రబంధములఁ బుష్పాచయముల నీ రగడలఁ గవులు వర్ణించినారు. ఇట వృషభగతి నడకను గూడ సూచించును
  3. 'దూసిన నాగమల్లికల' - శ్రీ విశ్వనాథ 'మూగనోము' నుండి

____________________________________________________________________________________________________

మణిప్రవాళము

21