పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/110

ఈ పుట ఆమోదించబడ్డది

విరహితులను ప్రజాతంతు విచ్ఛేదకులుగ నెంచిరి. పాశ్చాత్య లోకములందు వైజ్ఞానిక భానూదయమున కెన్ని సహస్రవర్షములకు మున్నో భారతీయులు కామకళా విజ్ఞానమున పారము ముట్టిన ద్రష్టలని చెప్పవచ్చును. ఏతద్విజ్ఞానము సమస్త జాతిని ఉత్తేజితమొనర్చి కావ్యనాటకాది సమస్తసాహిత్య విభాగములకును అంతర్విలీన జ్యోతిగా నిలచి ఔన్నత్యము నాపాదించినది.


భారతదేశమున కామకళా విజ్ఞానము బహుళముగ సృజితమైనది. కాని మన దురదృష్టకారణముగ అతిప్రాచీన కాలముననే ఉత్సన్నమైపోయినది. ఇతరములగు కళా శాస్త్రాదికములవలె దానిని అభ్యసనీయవిద్యగా ప్రాచీనులు పరిగణించి రనుటలో విప్రతిపత్తి లేదు. దేవాలయాదులలోను, శతాంగములమీదను కామకళా ప్రతిమల శిల్పులు స్థపతించుట, కారువులు చిత్రించుట ఇందుకు ప్రత్యక్ష నిదర్శనములు. ఇట్టివానిలో ఒరిస్సా దేశమునందలి కోణార్క్ అనుచోట సూర్యదేవుని రాతిరథముపైనున్న శిల్పములు సుప్రసిద్ధములు. వైదిక, జైన, బౌద్ధాది, విభేదములు లేక ఇటువంటి ప్రతిమలను చిత్రించుట, చెక్కించుట ఈ కళావశ్యకతను ద్యోతకమొనర్చు చున్నది.


భారతీయుల కామతంత్ర రచనము అనాది సిద్ధము. తదుత్పత్తిని గూర్చి మహర్షి వాత్స్యాయనుడు కొన్ని సూత్రములను చెప్పి ఉన్నాడు. వాటి సారాంశము 'ప్రజాపతి ప్రజలను సృజించి త్రివర్గ సాధనార్థము శత సహస్రాధ్యాయి గ్రంథము నొకదానిని ప్రవచించినాడు. ఈ గ్రంథము కారణముగ ధర్మ, అర్థ, కామములను మూడు ఏకదేశములు ఏర్పడినవి. అందు స్వాయంభువమనువు ధర్మమును, బృహస్పతి అర్థమును, నందికేశ్వరుడు కామమును పృథక్కరించిరి.


నందికేశ్వరుని కామశాస్త్ర గ్రంథము సహస్రాధ్యాయి. దానిని ఔద్దాలకి శ్వేత కేతువు పంచశతాధ్యాయ గ్రంథముగ సంగ్రహించినాడు. బాభ్రవ్యుడను పాంచాల దేశస్థుడు ఈ గ్రంథమును నూటయేబది అధ్యాయములలోనికి సంక్షేపించి సాధారణము, సాంప్రయోగికము, కన్యాసంప్రయుక్తకము, భార్యా, పారదారిక, వైశిక, ఔపనిషదికములు అను సప్తాధికరణములు గల గ్రంథముగ నొనర్చినాడు. ఇందలి వైశికమును పాటలీపుత్ర నగరములో గణికల ఉపయోగార్థము వారి కోరికను అనుసరించి దత్తకుడు ప్రత్యేకించి ప్రవచించినాడు. తరువాత కొంతకాలమునకు చారాయణుడు సాధారణాధికరణమును, సువర్ణనాభుడు సాంప్రయోగికమును, ____________________________________________________________________________________________________

110

వావిలాల సోమయాజులు సాహిత్యం-4