పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/724

ఈ పుటను అచ్చుదిద్దలేదు

తాళపత్రములు కనుపించినవి. భయోత్పాతము కలిగినది. స్మృతిదెచ్చుకొని యన్ని దిక్కుల పరికించి చూచినాడు. మరికొన్నిభస్మరాశులు కంటబడినవి.

ఆయన కన్నులు చండ్రనిప్పులైనవి. కక్ష్యలో నిశ్శ్వాసము వినిపించు నంతటి నిశ్శబ్దము నిబిడమై యున్నది.

'నా గ్రంథము లేమైన'వని బిగ్గఱగ గయా శీర్షుడు ప్రశ్నించినాడు.

ఆయనకు 'దగ్ధమైన'వని యొక భయ కంపిత గాత్రము సమాధానమిచ్చినది.

ఏదో జ్ఞప్తికి వచ్చినట్లు కావటిపెట్టె నెత్తిజూచుకొనినాడు అందును గ్రంథజాలము లేదు.

'నా పారమిత గ్రంథమును దగ్ధమైనదా?' కోపము మిన్ను ముట్ట గంపిత స్వనముతో బ్రశ్నించినాడు.

'అవును. వాటిని నేనుదహించి నా'నని శిరమువంచి నిలువబడి శిఖిశాతకర్ణి అనినాడు.

క్రోధము నాపుకొనలేక గయాశీర్షుడు గద్దెపైనుండి దిగివచ్చి శాతకర్ణి చెంపపై గట్టిదెబ్బ కొట్టినాడు. మరుక్షణమున నది బురబుర చేతివెంట పొంగినది. ఆ ధ్వనికి కక్ష్య మార్మోగినది. ప్రతి విద్యార్థికి నా దెబ్బ యతని చెంపపై బడినట్లనిపించినది.

గయాశీర్షుని కోపము క్రమముగ జల్లారినది. ఏమియొనర్చుటకును దోచక నాయన కక్ష్యనుండి వెళ్ళిపోయినాడు.

ప్రక్కనున్న కక్ష్యలలో నాచార్య కాశ్యపుడు వినయపాఠముల జెప్పుచున్నాడు. గయా శీర్షుని గదిలో జెలరేగిన కలకలమువిని యచటికి వచ్చినాడు. విద్యార్థుల సంభాషణమువలన సమస్తమాయన కవగతమైనది.

'శిఖి, గయాశీర్షుని గ్రంథజాలమును దహించినాడన్న వార్త నాయాచార్యుడు నమ్మలేకపోయినాడు. తన విద్యార్థుల నందఱ రత్నోదధి గ్రంథాగారమున జదువుకొన వెడలుడని శాసించి గయాశీర్షుని వెదుక నారంభించినాడు.

అతడుపాధ్యాయ మందిరమున మూర్తీభవించిన దుఃఖమువలె నొక మూల గూర్చొని యున్నాడు. కాశ్యపాచార్యుడతని సమీపించి "భిన్న వదనులై యున్నారు, ఏమి జరిగినదని ప్రశ్నించినాడు.