పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/714

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విద్యాలయ ఘంటిక మ్రోగినది. కట్టలు దెగిన క్రొత్తనీరు వలె విద్యార్థులు విద్యామందిరము లోని వివిధకక్ష్యల నుండి బయటబడి నలుదెసలకు బోవుచున్నారు. మంగళుడు నూతన మిత్రునితో నతని నివాసకక్ష్య కేగి మరికొంతసేపు స్నేహముగ బ్రసంగించినాడు.

సాయం సమయమున కొందరు విద్యార్థులు చెట్లనీడలలో మరునాటి పాఠముల 'చింతన' జేయుచున్నారు. శాతకర్ణి సహపాఠుల గమనించినాడు. వారు గుంపుగ జేరి సంభాషించుకొనుచున్నారు. అందువలన దనకు బారములు లేవనునుద్దేశముతో మంగళుడు వెళ్ళిన తరువాత నతడు వెంట దెచ్చుకొనిన గుణాఢ్యుని 'బృహత్కథ' జదువుకొనుచున్నాడు. ఇంతలో మిత్రుడు ధ్వజకేతువు వచ్చినాడు. శాతకర్ణి యతనిని వేయి ప్రశ్నలడుగ వలసి యున్నది ఆరంభించినాడు. బహుకాలము సంభాషణ సాగినది. మంగళుని వలె నతడును శాతకర్ణి కాప్త మిత్రుడైనాడు.

బుద్ధిపూజకు ఘంటిక మ్రోగినది. విద్యార్థులందరును చైత్యగృహమువైపున కేగుచున్నారు. ధ్వజకేతువుతో గలసి శాతకర్ణి బుద్దపూజలో బాల్గొనినాడు. భోజనానంతరము వసతిగృహ కక్ష్యలకు వచ్చి విద్యార్థులందరును నిద్రకు సిద్ధపడినారు.

శాతకర్ణికి ప్రయాణపు బడలిక యింకను దీరలేదు. గాఢ నిద్ర తూలి వచ్చినది నిద్రవోవ నారంభించి యెంతోసేపు కాలేదు. అతని మంచము క్రిందికి బైకి లేచిపడుచున్నది. మేల్కొని యతడు నిదురమత్తులోనే మంచము క్రిందకు దూరి యొకని కాలు గట్టిగ పట్టుకొనినాడు. కాలుజాడించి యవతల వ్యక్తి తప్పించుకొని పారిపోవుచున్నాడు. అతని పాదరక్ష శిఖి చేత చిక్కినది. వెంటబడి యతనిని చీకటిలో తరిమి కొట్టినాడు.

ప్రక్కనున్న వసతిగృహ కక్ష్యలో నుండి అమితాభుడు వెక్కివెక్కి రోదించు కంఠము వినిపించినది. అతని నట్లే యెవడో నిద్రనుండి లేపినారు. అతడు భయస్థుడు. గడగడ వడకుచు గట్టిగ బోరగిలబడి ప్రక్కను గౌఁగిలించుకొని మధ్యమధ్య వెరపుచే కలవరించు చున్నాడు. ఆ దుష్కృత్య మొనర్చిన మాంజిష్ఠుడే మంచముపై నతని తిరిగి బరుండబెట్టి తన కక్ష్యకేగి శయ్యపై జేరినాడు.

నివాస గృహపాలిక అళింద మేల్కొని కాగడాతో నొక మాటు నటు నిటు తిరిగి నిశ్శబ్దముగ నుండుట గమనించినది మరల గృహమున కేగి నిద్రించినది.

'ఈ దినమునకు నీకీ శాస్త్రి చాలును. నీవిక నిద్రపొమ్ము' అని యొకకఠిన కంఠస్వరము శాతకర్ణికి వినిపించినది. కాని యతనికి గొంతసేపటి వరకు నిద్రపట్టలేదు.