పడ్డాను. కానీ ఇటువంటి ద్వంద్వప్రకృతిని పృథఃకరించి ఈ క్రొత్తరూపాన్ని పొందిన తరువాత, ఇందులో నా అంతరాత్మ చైతన్యోపేతంగా విహరిస్తున్నది. ఈ ప్రకృతిలో ద్వంద్వస్వభావం లేదు. ఈ మూర్తిలో ఏదో ఒక ప్రకృతే విస్పష్టరూపంతో విలసిల్లుతూ ఉండటం ద్యోతకమైతున్నది. ఇంతవరకూ నేను చేస్తూ వచ్చిన తత్త్వవిచారణ క్రమమార్గాన్నే అనుసరించింది. ఎడ్వర్డు హైడ్ రూపంలో నేను ఉన్నప్పుడు నన్ను చూచిన వారు, నా అవయవనిర్మాణాన్ని బట్టి తప్పక అనుమానించి తీరుతారు. ఇందుకు కారణం ఒకటే అని నా బుద్ధికి తోస్తున్నది. అది ఏమిటంటే ఇంతవరకూ లోకంలో ఉన్న వ్యక్తులందరూ సదస్పృకృతుల మిశ్రమూర్తులై ఉండటమే. సర్వమానవజాతిలో ఎడ్వర్టు హైడ్ ఒక్కడే ఎటువంటి మాలిన్యం లేని దుఃస్వభావం గల వ్యక్తి. ఇది భిన్నసంశయం.
ఒక్క క్షణకాలం నిలువుటద్దం దగ్గర తారట్లాడాను. ఇంకా సారాంశాన్ని తేల్చే శక్తి గల రెండో ప్రయోగాన్ని చేయవలసి ఉంది. నా నిజస్వరూపం పోతుందేమో, పోతే తెల్లవారే లోపల ఇకముందు నాది కాజాలనట్టి నా ఇంట్లోనుంచి నేను వెళ్ళిపోవలసి ఉంటుందేమో చూడవలసి ఉంది. వెంటనే నా పరిశోధనానలకు వెళ్ళి మిశ్రమాన్ని తయారుచేసి త్రాగాను. మళ్ళీ రూపపరివర్తన పొందటానికి నాలో వేదన ప్రారంభమైంది. తిరిగీ నేను హెన్రీ జెకిల్ స్వభావంతో, స్వరూపంతో నేను నేనైనాను. ఆ రాత్రి నా జీవితయాత్రలో నేనొక సమద్విఖండమార్గానికి వచ్చాను. ఉదారాశయాలతో నా పరిశోధనలు సాగించి ఉన్నట్లయితే, పునీతభావాలతో సాహసాన్ని చేకొన్నట్లయితే, అంతా మరోరీతిగా జరిగి ఉండేది. ఇటువంటి రూపపరివర్తనలలో జననమరణాలవల్ల కలిగే వేదన మూలంగా నేను ఒక పెనుభూతంగా పరిణమించేవాణ్ణి కాను ఒక దివ్యమూర్తినయ్యేవాణ్ణి. నేను కనిపెట్టిన ఔషధానికి ఎటువంటి విచక్షణశక్తీ లేదు. అది దివ్యమూ కాదు పైశాచికమూ కాదు. కానీ దానికి నా 'ఉనికి' అనే కారాగార ద్వారాలను బ్రద్దలుకొట్టగల శక్తి ఉంది. అందులో ఉన్న వ్యక్తులు ఫిలిప్పీబందీలలాగా విజృంభించినవి. అప్పుడు నా సత్స్వభావం నిద్రిస్తూ ఉన్నది దుఃస్వభావం మేల్కొన్నది. అది అతివేగంగా అవకాశాన్ని పుచ్చుకొని విజృంభించటానికి సిద్ధపడి ఉంది. దానిమూలంగా ఎడ్వర్టు హైడ్ ఉద్భవించాడు. అందులో ఒకటి విస్పష్టంగా దుష్టమైంది. రెండవది పరస్పరం అసంబద్ధాలైన స్వభావద్వయానికి మిశ్రరూపం. అది వృద్ధమూర్తి హెన్రీ జెకిల్. నేను ఈ మూర్తిని కూడా సంస్కరించాలని యత్నించి నిరాశను పొందాను. అందువల్ల నా ఉద్యమం సర్వం పరిపూర్ణంగా నీచత్వం వంకకే మ్రొగ్గింది.