లేదు. దీని పర్యవసానమేమిటో చూద్దామనే ఉద్దేశంతో నేనే మీకు కావలసిన సేవలు చేస్తూ ఇక్కడ ఉన్నాను” అని అన్నాను.
“సరే మంచిది” అన్నాడు అతడు. "ఇదివరకు మీరు చేసిన కొన్ని శపథాలు జ్ఞప్తి కున్నవనుకుంటాను. ఇకముందు జరగబొయ్యేదంతా మన వృత్తికి సంబంధించిన రహస్యం. ఇంతవరకు మీరు అతిసంకుచితాలైన భౌతికసిద్ధాంతాలకు మాత్రమే కట్టుబడి వ్యవహరించారు. కానీ నేను ఆత్మ నుద్ధరించుకొనే ఔషధప్రభావం ఉన్నదని చెప్పినపుడు మీరు ధిక్కరించారు. మీకంటే ఘనులైనవారిని ధిక్కరించిన మీకు, ఇదిగో ఆ ప్రభావాన్ని చూపిస్తున్నాను. చూడండి" అన్నాడు.
"ఆ గ్లాసును పెదవుల దగ్గర పెట్టుకొని అందులో ఉన్న మిశ్రమాన్నంతటినీ ఒక్క గుటకలో అతడు త్రాగేశాడు. వెంటనే ఒక పెద్ద వెర్రికేక వినిపించింది. అతడి తల తిరిగిపోతున్నది. తూలి వాలిపోతున్నాడు. బల్ల పట్టు చిక్కించుకొని పడిపోకుండా గట్టిగా పట్టుకున్నాడు. లోపలికి పీక్కుపోతున్న కళ్ళతో చూస్తూ నోరు తెరిచి నిండా గాలి పీలుస్తున్నాడు. అతన్ని గమనిస్తున్న నాకు అతనిలో ఏదో మార్పు వస్తున్నట్లు తోచింది. అతడు పెరిగి పెరిగి ఉబ్బిపోతున్నాడు. అతని ముఖమంతా హఠాత్తుగా నల్లబడిపోతున్నది. అతని శరీర లక్షణాలన్నీ కరిగి మార్పు పొందుతున్నట్లు కన్పిస్తున్నది. మరుక్షణంలో నేను అమాంతంగా కుర్చీలో నుంచి వెనక్కు గంతేసి గోడమీద పడ్డాను. ఆమహిమాన్వితుడి వల్ల కలగబోయే ప్రమాదం ఉన్నదని ఊహించి రక్షించుకోటానికి నా చేయి పైకెత్తాను. నా మనస్సు భయానక మహాసముద్రంలో మునిగిపోయింది.
“అనేక పర్యాయాలు 'ఓ ప్రభూ! ఓ ప్రభూ!' అని కేకలు పెట్టాను. అప్పుడు నా కళ్ళముందు - పాలిపోయి వణికిపోతూ, స్పృహ సగంగా తప్పిపోయి తన్ను తానే తడివి చూచుకుంటూ, మృత్యువు బారినబడి తిరిగి తన్ను పునరుద్ధరించుకొన్న వ్యక్తిలాగా - నిల్చున్నాడు హెన్రీ జెకిల్! తరువాత ఒక గంటసేపు నాతో చేసిన ప్రసంగంలో అతడు ఏమేమి చెప్పాడో కాగితం మీద పెట్టటానికి నాకేమీ జ్ఞాపకం రావటం లేదు. చూచిందేదో చూచాను విన్నదేదో విన్నాను. దానితో నా మనస్సు ఎంతో బాధపడ్డది. ఆ దృశ్యం నా కంటి ముందునుంచి తొలగిన తరువాత 'జరిగినదంతా సత్యమేనా?' అని నన్ను నేనే ప్రశ్నించుకొంటున్నాను. దానికి నేనే సమాధానమూ చెప్పలేను. నా జీవితమహావృక్షం వ్రేళ్ళతో పెల్లగిలిపోయింది. నిద్ర నన్ను విడిచిపెట్టింది. ప్రతిదినం రాత్రింబవళ్లు