పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/18

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాటక నామకరణం

సీజర్ ఈ నాటకంలో మూడు దృశ్యాలలో తప్ప కనిపించడనీ, అప్పుడైనా కొన్ని గర్వోర్ధత వాక్యాలు తప్ప ప్రసంగించడనీ, నాటకానికి నిజమైన నాయకుడు బ్రూటస్ కావటం వల్ల దీనికి 'మార్కస్ బ్రూటస్' అని నామకరణం చేయటం ఉచితమనీ విమర్శకులు కొందరు సూచిస్తున్నారు.

'జూలియస్ సీజర్' నాటకానికి నాయకుడు బ్రూటస్ ఐనప్పటికీ షేక్స్పియర్ ఈ నాటకానికి ఉచితంగానే నామకరణం చేసినట్లు కన్పిస్తున్నాడు. సీజర్ చరిత్రాత్మకంగా సుప్రసిద్దుడు బ్రూటస్ పేరు ప్రేక్షకలోకంలో ఎక్కువమందికి తెలియదు. ఇది చరిత్రాత్మక నాటకం. ఈ జాతి నాటకాలకు సర్వసామాన్యంగా మహారాజుల పేర్లు, చక్రవర్తుల నామాలు ఉంచటం పరిపాటి. సీజర్ ను సమ్రాట్టు గానే జనసామాన్యం భావిస్తుంటుంది. కనక సీజర్కు సంబంధించిన నాటకానికి "జూలియస్ సీజర్" అని నామకరణం చేయటమే సమంజసమని షేక్స్పియర్ భావించి ఉంటాడు. అంతే కాదు, నాటకంలో బ్రూటస్ నాయకుడుగా దృశ్యమానుడౌతున్నా, దీనికి సీజరే 'అశరీర నాయకుడు'. విద్రోహవర్గం సీజర్ వధకు పథకాలను వేసుకొంటున్నప్పుడు “మన మందరం సీజర్ తత్త్వాన్ని ఎదుర్కొందాం" అని అనటమూ, తృతీయాంక ప్రథమ దృశ్యంలోనే సీజర్ వధ జరిగిపోయినప్పటికీ, తదనంతరకథ నంతటినీ అతడి ప్రభావం నడిపించటమూ, నిరంకుశత్వంతో వ్యవహరించిన అతని భూతమూర్తి, 'మరణించినా సీజర్, నీవు బలవంతుడవే' అని ఆత్మహత్య చేసుకోబోతూ కాషియస్ చేసిన ప్రశంస మొదలైనవి 'జూలియస్ సీజర్' అని నాటకానికి నామకరణం చేయటంలో గల సామంజస్యాన్ని వెల్లడిస్తున్నవి. నిజానికి నాటక కథాచక్రపరివర్తనకు ఆధారం సీజర్ నిరంకుశత్వం. అతడు దేహంతో పాల్గొనటం అప్రధానం. నాటకాంతంలో విజయాన్ని పొందింది ఆక్టేవియస్ కాదు ఈ నిరంకుశత్వమే. అందువల్ల 'జూలియస్ సీజర్' అన్న నామం ఈ నాటకానికి తగి ఉందని చెప్పటంలో ఎట్టి విప్రతిపత్తి లేదు.

జూలియస్ సీజర్ - ఆధారాలు

జూలియస్ సీజర్ లోని కథావస్తువు సార్వజనీనమూ, సార్వకాలికమూను. సార్వదేశాలల్లో, సర్వకాలాలలో నివసించే ప్రజలకు ఇది ఒక పాఠాన్ని నేర్పుతున్నది. ఇట్టి కథావస్తువు మీదికి మహాకవి షేక్స్పియర్ దృష్టి ప్రసరించింది 'జూలియస్ 18 వావిలాల సోమయాజులు సాహిత్యం-3