పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/14

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లేని విదేశీయులు ఇతర బానిసలూ, దుష్టక్రియలు చేయటానికి స్వేచ్ఛ గల స్వతంత్రులూ ఈ జనసామాన్యవర్గంలో వారు. వీరు ధర్మాధికారులమీదా, సంరక్షకుల మీద తిరుగబడి హత్యలు చేస్తుంటారు. ధర్మానికి కట్టుబడేవారు కారు. పాంపే విజయంతో వచ్చినప్పుడు ఆయన్ను గౌరవించి ఆహ్వానించారు. అతణ్ణి చంపివచ్చిన సీజర్కు ఘనస్వాగతం చెప్పారు. సీజర్ కు హత్యచేసిన బ్రూటస్ ను 'సీజర్'ను చేద్దామనుకున్నారు. వారి నాయకులు చేకొన్న విజయం విదేశీయులమీద నైనా, స్వదేశీయులమీద నైనా వారికి ఒకటే. విషయగ్రహణశక్తి లేనివారిని, ప్రసంగ ప్రావీణ్యమున్న వక్తలు తమ వకృత్వశక్తితో కీలుబొమ్మలను చేసి ఆడిస్తుండేవాళ్ళు. వారు స్వేచ్ఛాస్వరూపాన్నే మరిచిపోయారు. జనసామాన్యవర్గస్థితి ఇలా ఉంటే ప్రభు వర్గస్థితిగతులు ఇంతకంటే అధ్వాన్నంగా ఉన్నవి. సభాభవనంలో వక్తలు ఒకరినొకరు తిట్టుకోవటం, ఒకరి ముఖాన ఒకరు ఉమ్మేసుకోవటం, ఎన్నికల సమయంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ పెద్ద మనుష్యులు వీధుల్లోకి రావటానికి వీల్లేనంతగా అల్లరులు చేస్తూ, చేయిస్తూ ఉండటం వారికి నిత్యలక్షణాలైనవి. సభాభవనంలోనే తములయుద్ధాలూ, హత్యలూ జరిగించేవాళ్ళు. ఇటువంటి రోములో ప్రజాస్వామికానికి తావెక్కడుంది? సీజరిజం (నిరంకుశత్వం) తప్ప మార్గాంతరం లేదు. రోము అటువంటి నిరంకుశుని ఆగమనం కోసం ఎదురు చూస్తున్నది.

సీజర్ తగిన అర్హతలతో ఉద్భవించాడు. ఆహారవినోదాలను కల్పిస్తే తృప్తిపడి ఎటువంటి ప్రభుత్వ విధానమైనా పట్టించుకోకుండా తమ స్వాతంత్ర్యాన్ని కోల్పోవటానికి సంసిద్ధులై ఉన్నారు రోము సామాన్య ప్రజలు. కానీ ప్రభు కుటుంబాలలోని కొందరు వ్యక్తుల హృదయాలలో కొంత వ్యక్తిగతేర్ష్యవల్ల నైతేనేం, కొంత జితించిన స్వాతంత్య్ర ప్రియత్వం వల్ల నైతేనేం సీజర్ యెడ వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతకు ఫలితమే సీజర్ వధ. సీజర్ వధాఫలితాలే ప్రజాక్రోధం, బ్రూటస్ - కాషియన్ల పలాయనం. ఫిలిప్పీ యుద్ధభూమిలో వారికి అకారణ నిరాశానిస్పృహలు, సంపూర్ణ పరాజయం, బ్రూటస్ ఆత్మహత్యతో 'సీజరిజం'కు పరిపూర్ణవిజయం, స్వాతంత్ర్యేచ్ఛకు స్వస్తి చేకూరాయి. ప్రజల రాచరిక ప్రియత్వం బయటపడ్డది. రోమక సామ్రాజ్యంలోని రాజకీయ, సాంఘికశక్తుల సంఘర్షణ అంతరించింది. ఆక్టేవియస్ సీజర్ సైనిక రాచరికాన్ని స్థాపించి రోమక మహాసామ్రాజ్యాధినేత యైనాడు.

కథాసంగ్రహం

లూపర్ కేలియో ఉత్సవదినంనాడు రోములో సామాన్యజనులైన ప్లీబన్లు, ముండా అనే ప్రదేశంలో జరిగిన యుద్ధంలో అతని ప్రబలశత్రువులైన పాంపే కుమారులమీద 14 వావిలాల సోమయాజులు సాహిత్యం-3